రుచి

చింతపండుని ‘విచారఫలం’ అని ఒక కవి చమత్కరించాడు. మనకి ఈ చింత ఎక్కడిది...? ప్రపంచం అంతా దీన్ని టామరిండ్ అని పిలుస్తారు. ‘టామర్ ఎ హింద్’ అంటే, భారతదేశపు పుల్ల ఖర్జూరం అని! ఉత్తర భారతదేశంలో ఇలీ, అలీ పేర్లు ఎక్కువగా ప్రసిద్ధి. సంస్కృతంలో చించాఫలం లేక తింత్రిణీ అంటారు. వివిధ ద్రావిడ భాషల్లో చింత, చింతం, ఇంతం, సింత, హిత్త, ఇత్తర, ఈత లాంటి పేర్లున్నాయని ‘డిఇడిఆర్ 2529’ చెప్తోంది. ద్రవిడియన్ ఎటిమాలజీ అనే మరో నిఘంటువు మూల దక్షిణ ద్రావిడ భాషలో ‘సింత్’, మూల తెలుగు భాషలో ‘చింత్’, తెలుగు వ్యావహారికంలో ‘చింత’ పదాలు ఏర్పడ్డాయని పేర్కొంది. మూల గోండీ భాషలో సిత్-అ, సిత్త, హిత్త, ఈత లాంటి పదాలు ఏర్పడ్డాయి. దీన్ని బట్టి, ఇంగ్లీషులో టామరిండ్, తెలుగులో చింత. ఈ రెండు పేర్లకు ‘ఈత’ నిశజూజ్ఘశ జ్ఘూఆళ ఔ్ఘౄ ఆళళ అనే పేరు మూలమని భావించవచ్చు. 16వ శతాబ్ది తరువాతే అమెరికన్ ఖండానికి చింతచెట్టు తెలిసింది. మెక్సికోలో దీన్ని ‘పల్పరిండో’ అంటారు. ఔషధ తయారీ పరిశ్రమలలో దీని వాడకం ఎక్కువ. చింతచిగురు, చింతపూలు, చింతపండు ఈ మూడింటికీ నొప్పులనూ, వాపులనూ తగ్గించే గుణం ఉందని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. బెణికిన చోట చింతపండు పట్టు వేయటం మనకు తెలుసు. నొప్పి, వాపులను తగ్గించే ఆయింట్‌మెంట్‌ల తయారీలో వీటిని వాడుతున్నారు. గోంగూర పచ్చడి, పెసరపప్పు, చింతపండు పులుసు.. ఇవి తెలుగువారి ఇష్టదైవాలు. ఈ మూడింటికీ ఆఫ్రికా ఖండమే మూలం.
చింతచిగురు చవకగా దొరుకుతుంది. చింతపండు ప్రత్యామ్నాయం చింతచిగురే! శరీరానికి ఇనుము వంటబట్టేలా చేయటానికీ, రక్త్ధాతు వృద్ధికీ, కాలేయాన్ని శక్తిమంతం చేయటానికీ చింతచిగురును మించిన ఔషధం లేదు. చిన్న కుండ లేదా ముంతలో రెండు గ్లాసుల నీళ్ళు పోసి, అందులో చింత చిగురు ఎండించి దంచిన పొడిని ఒక చెంచాడు కలిపి, తుప్పుపట్టని కొత్త ఇనుప మేకు అందులో వేసి నీళ్లు సగం మరిగేవరకూ కాచి, వడగట్టి తాగితే రక్తహీనత, లివర్ వ్యాధులూ, కామెర్లూ త్వరగా తగ్గుతాయి. ఎదిగే పిల్లలకు, యుక్తవయసు ఆడపిల్లలకు, మెనోపాజ్ వచ్చిన స్ర్తిలకూ, వృద్ధులకూ ఇది గొప్ప ఔషధం. పిలిఫ్పైన్స్‌లో దీన్ని మలేరియా తగ్గటానికి తాగిస్తారు. ఈజిప్ట్‌లో వేసవి పానీయంగా తాగుతారు. పోషకాలను చూస్తే, చింతపండు, చింతకాయలకన్నా చింత చిగురు ఎక్కువ ప్రయోజకారి. చింతపండులో ప్రొటీన్లు 3.10 గ్రాములుంటే, చింతచిగురులో 5.8 గ్రాములు ఉన్నాయి. అపకారం చేసే తార్తారిక్ యాసిడ్ చింతపండులో ఉన్నంతగా చింతచిగురులో ఉండదు. గ్లూకోజ్, ప్రక్టోజు లాంటి పంచదార పదార్థాలు చింతపండులో 30-40 శాతం ఉన్నాయి. రకరకాలపళ్ళు షుగర్ వ్యాధిని ఎలా పెంచుతాయో చింతపండు కూడా పెంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ మీద చింతపండు ప్రభావం గురించి 2005లో కెనడా విశ్వవిద్యాలయం పరిశోధకులు పరిశీలన చేసి, 2 శాతం చింతపండు మాత్రమే తినేవారిలో కొలెస్ట్రాల్ తగ్గగా, 8 శాతం తినేవారిలో పెరిగిందని కనుగొన్నారు. అల్సర్లు, కీళ్లవాతం, ఎలర్జీ వ్యాధుల్లో చింతపండు అపకారమే చేస్తుంది. ‘వామనకాయలు’ అంటే, లేత చింతకాయలు పైత్యం చేస్తాయి. వాత, కఫ వ్యాధుల్ని ఉబ్బసాన్ని పెంచుతాయి.
అన్నమయ్య ఒక కీర్తనలో ‘చింతకాయ కజ్జం’ అనే పదం ప్రయోగించాడు. తీపి బూందీని ‘పూసకజ్జెం’ అంటారు. ఈ కజ్జెం చింతపండుతో చేస్తే తినడానికి పనికిరాదు కదా.. అలా వాడకానికి పనికిరానిదాన్ని చింతకాయ కజ్జం అన్నాడు అన్నమయ్య. చింతపువ్వంత, చింతాకంత అంటూ చిన్నవాటిని పోలుస్తుంటాం. ‘చింతకు ముడుగు తరి’, ‘చింతెలుగు’ అనే పదాలకు చీకటి పడబోయేముందు సన్నని సందె వెలుగు అర్థం. చింతకాయల్ని దంచి ఊరగాయ పెట్టేప్పుడు గింజలు ఏరేస్తారు. వాటిని నీళ్ళలో వేసి మరిగిస్తే చిక్కని పుల్లని ‘చింతంబలి’, ‘చింతగంజి’, ‘చింతసరి’ తయారవుతుంది. ఉప్పూ కారం తాలింపు పెట్టుకొని అన్నంలో తింటే రుచికరమే గాక జీర్ణశక్తిని పెంచుతుంది. పండిన చింతకాయ పెంకుని ‘చింతగుల్ల’ అంటారు. సీలింగ్ ఫ్యాను తగిలించటానికి పైన శ్లాబుకు గానీ దూలానికిగానీ తగిలించే కొక్కేన్ని చింతకాయ అంటారు. ‘చింతకొండి’ అంటే ఇనప ఊచ, ఆగ్రహం ప్రదర్శించాడనటానికి కళ్లలో చింత నిప్పులు కురిపించాడంటాం. చింతకర్రని పొయ్యిలో పెడితే ఎర్రని నిప్పులు వస్తాయి. చాలాసేపు ఆ వేడి నిలబడి ఉంటుంది. ఆ బూడిదను నీళ్ళలో కలిపి వడకట్టి ఆ నీటిని ఒక రాత్రంతా నిలవ బెడతారు. తెల్లవారేసరికి అడుగున తెల్లటి ముద్ద పేరుకొంటుంది. దాన్ని ‘చించాక్షారం’ అని పిలుస్తారు. ఇది పేగుపూతను, జీర్ణకోశ వ్యాధుల్నీ తగ్గించటంలో గొప్ప ఔషధంగా పనిచేస్తుంది.
ఇప్పటి పిల్లలకు ‘చింతబరికె’ అంటే తెలియదు. ఒకప్పుడు స్కూలు మాస్టర్ల దగ్గర చింతకొమ్మే బెత్తం! అదే పాఠాలు చెప్పేది. కాబట్టి, నాణ్యమైన చదువులు వచ్చేవి. చింతచెట్టుమీద బ్రహ్మరాక్షసి ఉంటుందనే నమ్మకం మనకే కాదు, ఆఫ్రికన్లకూ ఉన్నదట! అతిగా తింటే చింతపండే పెద్ద బ్రహ్మరాక్షసి.
Comments
ms (not verified)
Tue, 02/21/2012 - 10:21
Permalink
good aricle
Add new comment