క్రీడాభూమి

మనోస్థైర్యం పెరిగింది: రైనా

  • 05/02/2012

మెల్బోర్న్, ఫిబ్రవరి 4: రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో లభించిన ఘన విజయంతో భారత జట్టులో మనోస్థైర్యం పెరిగిందని టీమిండియా బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అన్నాడు. ఇప్పటి వరకు పరాజయ భారంతో కుంగిపోయిన తమ జట్టుకు రెండో ట్వంటీ-20 మ్యాచ్ విజయం అందించిన నూతనోత్తేజాన్ని ఆదివారం ప్రారంభమయ్యే ముక్కోణపు వనే్డ సిరీస్‌లోనూ కొనసాగిస్తామని ఆయన చెప్పాడు. శ్రీలంక కూడా పాల్గొంటున్న ఈ ముక్కోణపు వనే్డ సిరీస్ ఆదివారం ఇక్కడ భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. రెండో ట్వంటీ-20 మ్యాచ్ విజయంతో తమ జట్టులోని ప్రతి ఆటగాడిలోనూ ఆత్మస్థైర్యం పెరిగిందని, దీన్ని మున్ముందు కొనసాగించాలని గట్టిగా కోరుకుంటున్నారని రైనా తెలిపాడు. సచిన్ తెండూల్కర్, జహీర్ ఖాన్ వంటి సీనియర్లు తమ జట్టులో ఉన్నారని, గత నెలన్నర నుంచి వీరు ఆస్ట్రేలియాలో ఉన్నారని, ఇది తమ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో టీమిండియా విజయానికి ఫీల్డింగ్‌లో చురుకుదనం ఎంతో దోహదపడింది. భారత యువ ఫీల్డర్లలో రైనా ఒకరు. మైదానంలో విశ్వాసం అనేది కీలక పాత్ర పోషిస్తుందని రైనా పేర్కొన్నాడు. ‘ప్రతి ఒక్క బాల్ నీవైపే వస్తుందని అనుకోవాలి. అప్పుడు మాత్రమే కుడి, ఎడమల డైవ్ చేయగలం. అద్భుతమైన క్యాచ్‌లు పట్టగలం. నా విషయానికి వస్తే ఇదే కీలకం’ అని రైనా అన్నాడు. ‘పెద్ద మైదానంలో ఫీల్డింగ్ చేయడం ఒక సవాలు వంటిది. గత ఏడెనిమిదేళ్లుగా నేను ఫీల్డింగ్ బాగా చేస్తున్నాను’ అని రైనా పేర్కొన్నాడు.
=============
మాదే ఫేవరెట్ జట్టు : క్లార్క్
మెల్బోర్న్, ఫిబ్రవరి 4: ముక్కోణపు వనే్డ సిరీస్ సాధించే ఫేవరైట్ జట్టుగా తాము బరిలోకి దిగుతున్నామని భావిస్తున్నట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ శనివారం ఇక్కడ అన్నాడు. అయితే ప్రపంచ చాంపియన్లు అయిన భారత జట్టును ఆదివారం ఇక్కడ జరిగే ప్రారంభ మ్యాచ్‌లో ఓడించాలంటే తాము ఉత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఈ సిరీస్‌లో శ్రీలంక మూడో జట్టుగా ఆడుతోంది. ఇటీవలి ప్రపంచ కప్‌లలో ఫైనల్స్ ఆడిన భారత్, శ్రీలంక జట్లను ఓడించాలంటే తాము అత్యంత ఉత్తమ స్థాయిలో ఆడాల్సి ఉంటుందని క్లార్క్ చెప్పాడు. అయితే ప్రపంచంలో తమదే నంబర్ వన్ వనే్డ టీమ్ అని, అందువల్ల ఈ సిరీస్‌లో తమ జట్టే ఫేవరైట్ అని తాను భావిస్తున్నానని క్లార్క్ అన్నాడు. టెస్టు సిరీస్‌ను 0-4 తేడాతో ఆస్ట్రేలియాకు చేజార్చుకున్న టీమిండియా రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో మాత్రం ఆసీస్‌పై విజయం సాధించింది. ఈ ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత్ ప్రదర్శించిన ఆటతీరును క్లార్క్ ప్రశంసించాడు. ‘్భరత్ ఎంతో ఉత్తమ జట్టు. రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డింగ్.. క్రికెట్‌లో ఫీల్డింగ్ ఎలా చేయాల్సిన అవసరముందో చెప్పేలా ఉంది. మా గేమ్‌లో ఫీల్డింగ్ కీలక పాత్ర పోషించింది. వారు ఎలా ఫీల్డింగ్ చేశారని నేను ఆశ్చర్యపోలేదు. వారు ఉత్తమ ఆటతీరును ప్రదర్శించారు. ఆ జట్టులో నిజంగా మంచి అథ్లెట్లు ఉన్నారు’ అని క్లార్క్ అన్నాడు.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading