క్రీడాభూమి

జట్టు ఎంపికలోనూ ఎవరికి వారే!

  • 23/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విధ్వంసకర బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెవాగ్‌కు మధ్య విభేదాలు మరింత ముదిరాయా? కామనె్వల్త్ బ్యాంక్ ట్రై సిరీస్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌కు ముందు భారత తుది జట్టు ఎంపిక విషయమై ధోనీ-సెవాగ్ పరస్పరం విభేదించుకున్నట్టు వార్తలు ధృవీకరిస్తున్నాయి. దీంతో గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న బహిరంగ యుద్ధం కొత్త మలుపు తీసుకున్నట్టు కనిపిస్తోంది. శ్రీలంకతో మంగళవారం మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు భారత తుది జట్టులో ఎవరెవరు ఉండాలన్న దానిపై ధోనీ, సెవాగ్ వేర్వేరు జాబితాలను రూపొందించినట్టు తెలుస్తోంది. తుది జట్టులో యువ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మకు చోటు కల్పించాలని ధోనీ కోరగా, ముగ్గురు సీనియర్ ఆటగాళ్లను బరిలోకి దింపాలని సెవాగ్ ఆకాంక్షించినట్టు సమాచారం.
ఇదిలావుంటే, ధోనీ-సెవాగ్ మధ్య విభేదాలు నెలకొన్నట్టు వస్తున్న వార్తలతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) దిగ్భ్రాంతి చెందింది. ఆటగాళ్ల మధ్య విభేదాలేమైనా ఉంటే వాటిని డ్రెస్సింగ్ రూమ్‌లోనే పరిష్కరించుకోవాలని బోర్డు కోరినట్టు బిసిసిఐ వర్గాలు తెలిపాయి. గతంలో సీనియర్ ఆటగాళ్లెవరూ ఇలా వ్యవహరించలేదని, ఆటగాళ్ల మధ్య విభేదాలు నెలకొన్నట్టు వస్తున్న వార్తలు బోర్డును కలవరానికి గురిచేస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
సీనియర్ ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో నిదానంగా వ్యవహరిస్తున్నారని, దీంతో ప్రత్యర్థి జట్టుకు అదనంగా మరో 20 పరుగుల వరకూ సమర్పించుకోవలసి వస్తోందని, అందువల్లనే ‘రొటేషన్’ పద్ధతిలో సీనియర్ ఆటగాళ్లను పక్కన పెడుతున్నామని ఇంతకుముందు ధోనీ చేసిన వ్యాఖ్యలపై సెవాగ్ మంగళవారం మ్యాచ్ ముగిసిన అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తాను డైవింగ్ క్యాచ్‌ను అందుకుని శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్ధనేను పెవిలియన్‌కు పంపిన విషయాన్ని సెవాగ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘నేను పట్టిన ఈ క్యాచ్‌ను మీరు చూశారా? గత పదేళ్లుగా మేము జట్టులో కొనసాగుతున్నాం. మా ఫీల్డింగ్‌లో ఎలాంటి మార్పులేదు. ఈ విషయమై మీరేమైనా అడగదల్చుకుంటే ధోనీనే అడగండి. 2015లో ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించేందుకే ‘రొటేషన్’ విధానాన్ని అమలుచేస్తున్నట్టు ధోనీ మాతో చెప్పాడు. అంతే తప్ప ఫీల్డింగ్ సరిగా లేనందువల్లే సీనియర్ ఆటగాళ్లను పక్కన పెడుతున్నట్టు ధోనీ ఎన్నడూ మాతో చెప్పలేదు’ అని సెవాగ్ వివరించాడు. (చిత్రం) ధోనీ-సెవాగ్ (ఫైల్ ఫొటో)

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading