మెరుపు

మెరుపు - తెలంగాణ : అమ్మ ఫొటొనైత! - కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవిత్రను పరీక్షించి తన గదిలోకి వెళ్లిన డాక్టర్ శశికాంత్ కళాధర్‌ని పిలిచాడు.
‘వస్తున్నా సార్’ అంటూ పవిత్ర బెడ్ వద్దనున్న కళాధర్ డాక్టర్‌గారి గదిలోకి వెళ్లాడు.
‘దర్వాజ పెట్టిరా...’ ఆ మాట కళాధర్ చెవిలో చెప్పినంత మెల్లగా వినిపించింది.
సడి చప్పుడు కాకుండా మెల్లగా దర్వాజ పెట్టివచ్చి డాక్టర్ గారికి దగ్గరగా జరిగి కూర్చున్నాడు కళాధర్.
‘చూడు కళాధర్.. పిండం ఎదకు ఎక్కింది. తల్లిని-పాపను కాపాడడం సాధ్యం కాకపోవచ్చు.. తల్లి కావాల్నో.. పాప కావాల్నో.. నీవే నిర్ణయించుకో.. అదీకాక, ఇద్దరికీ ప్రమాదం జరిగినా జరుగవచ్చు. దీనికి నువ్వు ఒప్పుకుంటూనే ఆపరేషన్ చేస్తాను. లేదంటే హైదరాబాద్‌కు రిఫర్ చేస్తాను.’ ఆమాట వినగానే కళాధర్ కళ్లు జలపాతమయ్యాయి. ఎంత ఆపుకుందామన్నా ఆపలేక బోరున విలపించాడు.
‘పాపకంటే నాకు పవిత్రనే ముఖ్యంసార్. నా భార్యకు ఏమికాకుండా చూడుసార్’ అంటూ కాళ్లపై పడ్డాడు. ‘లే.. లే.. కాళ్లు మొక్కుడు వద్దయ్యా.. మేము చేసేది చేస్తాం. పైన దేవుడున్నాడు. ఆ దేవుడిని నమ్ముకో. వైద్యోనారాయణ హరి’ అంటారు. ‘మాకు మీరే దైవం సార్’ మళ్లీ ఏడవసాగాడు.
‘ఏమండీ.. డాక్టరు గారిని రమ్మనమండి.. నాకు ఆయాసం ఎక్కువైతుంది..’ పవిత్ర అంటుండగానే డాక్టర్ శశికాంత్, కళాధర్ ఆమె బెడ్ వద్దకు వెళ్లారు.
పవిత్ర బాగా ఆయాస పడుతోంది. ‘డాక్టర్‌గారు... మీరు ఇప్పటి వరకు మా ఆయనకు చెప్పిందంతా విన్నాను. నాప్రాణం కన్నా నా పాప ప్రాణమే ముఖ్యం. సంతానం కొరకు నేను వెళ్లని దవాఖాన లేదు. 20ఏళ్లకు నా కడుపు పండింది. నేను బ్రతికి అమ్మ అని పిలిపించుకోకున్న, నేను చనిపోయాక నా ఫోటో చూసైన నా పాప మా అమ్మ అంటే అదే చాలు. నా ప్రాణం పోయినా సరే... నా బిడ్డను కాపాడండి డాక్టరుగారు..’ ఆయాసపడుతూనే ఏడ్చింది పవిత్ర.
‘ఏడ్వకమ్మా.. నీకేమికాదు..’ అననైతే అన్నాడు కానీ.. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని పవిత్ర మాతృత్వ మమకారానికి డాక్టరు కళ్లు కూడా చెమ్మగిల్లాయి. కళాధర్ కళ్ల ధారలకైతే తెరిపేలేదు.
నర్సులు వచ్చి ఆపరేషను ఏర్పాట్లు చేస్తున్నారు. పవిత్రను తనివి తీరా చూసుకున్నాడు, చేతితో కూడా తడుముకున్నాడు కళాధర్. నిమిషాలు గంటలైతున్నాయి.. ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టరుగాని, నర్సులు బయటకు రావడం లేదు. పవిత్రకు ఏమైతుందోనని గుండెను అరచేతిలో పెట్టుకుని కూర్చున్నాడు కళాధర్.
ఇంతలో డాక్టర్‌గారు బయటకు రానే వచ్చారు. వస్తూనే ‘కంగ్రాట్స్ కళాధర్.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు..’ అని చెప్పగానే కళాధర్ ఆనందానికి అవధుల్లేవు.
డాక్టర్‌గారికి థ్యాంక్స్ చెపుతూ పవిత్ర దగ్గరకు పరుగున వెళ్లి పవిత్రను, పాపను తడిమి చూసుకుంటుంటే కళ్లల్లో నీళ్లు నిండాయి.
‘ఇంకెందుకండి దుఖం... నీ పవిత్ర నీ దగ్గరకే వచ్చిందిగా..’ భర్త ఆనందబాష్పాలను తన కొంగుతో తుడిచి, పైటను పాపపై కప్పి బిడియంగా పులకిస్తూ స్తన్యం పాప నోటి కందించి ఆనంద పారవశ్యంతో మునిగిపోయింది పవిత్ర.

- ఎ.రాజవౌళి
తడ్కపల్లి, మెదక్ జిల్లా
ఫోన్ : 9848592331

మానవత్వం

సాయంత్రం ఆరవుతోంది. టవర్‌సర్కిల్ కెళ్లాను కూరగాయలు కొందామని ఇంతలో దీనంగా ఒంటి మీద ఒక చిన్న నిక్కర్ మాత్రమే వేసుకొని, అది జారివోతుంటే పైకి జరుపుకొంటూ ఒక ఆరేళ్ల పిల్లగాడు, ఇంకో చేతిలో మూడేళ్ల పాపను పట్టుకొని నడిపిస్తూ బెలూన్, బెలూన్ అని అమ్మడం చూశాను. వాడిని దగ్గరికి పిలిచి ‘ఏరా! బాబు ఎందుకు బెలూన్లు అమ్ముకుతన్నావురా? ఈ పిల్లెవర్రా’ అని అడిగాను.
‘సారూ ఇది మా చెల్లె. మా అయ్య చిన్నప్పుడే సచ్చిపోయిండు. మా అమ్మకి ఏదో రోగమచ్చి మంచాలనే ఉన్నది సారూ. నేను ఈ బెలూన్లమ్మే అచ్చిన పైసల్లోని మా సెల్లె, నేను మా అమ్మ బతుకుతున్నం సారూ. ఒక బెలూను కొనండి సారు’ అన్నాడు.
‘ఎందుకురా ఈ కట్టం నీకు నిన్ను, మీ చెల్లెను ఏదైనా హాస్టళ్లో చేర్పిస్తాను. ఆడ మీరిద్దరు సదువుకోవచ్చునని’ చెప్పాను.
కానీ దానికి వాడు ఒప్పుకోలేదు.
‘నేను పెద్ద ఆఫీసర్‌కి ఫోనే్జసి చెప్త-నిన్ను వాళ్లు తీసుకపోయి హాస్టళ్ల జేర్చుకుంటారనే’ చెప్పాను.
వెంటనే..వద్దు సారూ నీ కాళ్లు మొక్కుతా మా అమ్మ ప్రాణం అసలే బాగా లేదు. అమ్మ ఇంకో వారమో పది రోజులో బతుకుద్దంట. అప్పటిదాకా మా అమ్మతో ఉండి ఆమెను సూసుకుంట సారూ దండంబెడ్త సారూ’ అని బతిమిలాడాడు.
వాడికి తల్లి మీదున్న ప్రేమను జూసి సరేలే ఇంకో నాలుగు రోజులైతే ఆ పిల్లలు ఎలాగు తల్లి ప్రేమను దూరమవుతారు కదా! అప్పటివరకైనా వాళ్లు కలిసి బతకనిద్దాం అనుకొన్నాను. డబ్బులిస్తానంటే తీసుకోలేదు. బెలూనిచ్చి డబ్బులు తీసుకున్నాడు.
నాలుగు రోజులకొకసారి మార్కెట్‌కి వెళ్లినపుడల్లా వాడొచ్చి నాతో మాట్లాడేది.
ఒక రోజు మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు కొని వాడికోసం గంటసేపు ఎదుర్చూసినా వాడు రాలేదు.
తెల్లవారి మళ్లీ సాయంత్రం వాడికొరకే మార్కెట్‌కెళ్లాను. వాడు రాలేదు. అలా వరుసగా నాలుగు రోజులు మార్కెట్‌కెళ్లాను. వాడు రాలేదు.
ఇక నా బిజీ పనుల్లో పడి వాడిని మరిచిపోయాను. ఒక రోజు ఆఫీస్ నుండి వస్తూ ఆపిల్స్ కొందామని ఆగాను.
ఇంతలో ఒక కారొచ్చి అక్కడ ఆగింది. అందులో నుండి ఖరీదైన డ్రెస్సు వేసుకున్న బాబు కిందకి దిగాడు. అతడు నన్ను చూడగానే ‘సార్ బాగున్నారా?’ అంటూ నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు.
వాడిని చూడగానే నేను షాక్ తిన్నాను. వాడు మార్కెట్లో బెలూన్లు అమ్మెడి పిల్లగాడు.
‘ఏరా బాబు నువ్వేంటి ఇలా కారులో’అన్నాను.
వాడు ‘సార్ మా అమ్మ సచ్చిపోయింది. రోడ్డుమీద మా అమ్మ శవం మీద పడి మేమేడుస్తుంటే కారులో ఉన్న ఈ సారు చూసి మా అమ్మకు అంత్యక్రియలు చేయించి నన్ను, మా చెల్లెను తీసుకెళ్లి పెంచుకుంటున్నారు’అని చెప్పాడు. అంతలోనే కారులో ఉన్న వ్యక్తితో ‘నాన్న నేను అప్పుడప్పుడు చెప్తుంటానే ఈ సారే’ అని చెప్పాడు.
వెంటనే అతడు కారులోంచి దిగి ‘నువ్వెళ్లి కారులో కూర్చోరానాన్నా నేనే అంకుల్‌తో మాట్లాడివస్తాను’ అని వాడిని పంపించేశాడు.
‘అన్నీ ఉన్న వాళ్లే ఎన్నో రగాల కష్టాలనుభవిస్తున్నారు. పాపం రోడ్‌పైన ఏడుస్తున్న పిల్లల్ని చూడగానే చాలా బాధేసింది. అందుకే తీసుకెళ్లి మా ఆవిడతో చెప్పి ఇద్దరం అనుకొని వీళ్లను పెంచుకుంటున్నాము. బుడ్బుకి లోటు లేదు. నా ఇద్దరు పిల్లలతో పాటు వీళ్లు కూడా పెరుగుతారు’ అన్నాడు.
మానవత్వమా! నీకు జోహార్లు అనుకుంటూ అక్కడి నుండి ఆనంద బాష్పాలతో ఇంటివైపు అడుగులేశాడు.

- సత్యాజి వాణి
కరీంనగర్, సెల్.నం.9000282872

తెలంగాణ జీవన దృశ్యం... ‘రెండు దోసిళ్ల కాలం’!

పేజీలు: 168, వెల : 100/-
ప్రతులకు: ఎస్.హరగోపాల్
భువనగిరి, నల్లగొండ జిల్లా
సెల్.నం.9949498698

తెలంగాణ పలుకుబడులకు పెద్దపీట వేస్తూ.. తెలంగాణ ప్రాంత ప్రజల జీవన దృశ్యాలతో కవి శ్రీ రామోజు హరగోపాల్ ‘రెండు దోసిళ్ల కాలం’ కవితా సంపుటిని వెలువరించి..తమ ప్రతిభను చాటుకున్నారు. గత నాలుగు దశాబ్ధాలుగా కవిత్వాన్ని సేద్యం చేస్తున్న ఆయన లోగడ ‘మట్టిపొత్తిళ్లు’, ‘మూలకం’ కవితా సంపుటులను ప్రకటించారు. ఇప్పుడు మూడో గ్రంథంగా ‘రెండు దోసిళ్ల కాలం’ మన ముందుకొచ్చింది. వందకు పైగా కవితలతో ముస్తాబైన ఈ కావ్యంలో..కవి హరగోపాల్ గారికి తెలంగాణ భాగ పట్ల, సంస్కృతి పట్ల, ఆచార వ్యవహారాల పట్ల ఉన్న మక్కువను మనం ఇట్టే పసిగట్టవచ్చు..వస్తు ఎంపికలో వైవిధ్యముంది. అభివ్యక్తిలో నవ్యత ఉంది. ఆయన పల్లెటూరి మనుషుల మాటలు మాటలు విప్పినా..మానవ సంబంధాల గురించి చెప్పినా..ప్రకృతిని కవిత్వంలో బంధించినా..ఆయన పదబంధాల్లో ఓ రకమైన సున్నితత్వం..కొంత అమాయకత్వం..మరికొంత అనుభవ జ్ఞానం ప్రతిబింభిస్తుంది. గ్రామీణ భారత చిత్రణలో ఆయన నేర్పరి అని నిరూపించే విధంగా ఈ గ్రంథంలో ఆయన రచన కొనసాగింది. ఆయన కవిత్వంలోని పంక్తులు మట్టివాసనలు గుబాళిస్తాయి. రైతు పాదాల నుండి వెలువడే స్వేదాల సుగంధాలతో అలరిస్తాయి..నాగలి సాళ్లల్ల తలలెత్తిన మొలక నవ్వులతో మనల్ని మురిపిస్తాయి.
ఆయన కవిత్వంలోని పాదాలు పొలంలో నాట్లేసిన చేతుల్ల నారుపాపాయిలతో పాటు..వుయ్యాలలూపే అమ్మల పాటలు వినిపిస్తాయి. నీళ్లు నిప్పులై, కన్నీళ్లు నిప్పు గుండాలై రైతు బతుకుని ఎడారి చేయక ముందే..కొంచెం మొగులు వాన కురవనీ అంటూ వేడుకుంటాయి..
ఆయన కవిత్వంలో..కంటి కొసల నుండి..చూపులొక దిక్కు, కన్నీళ్లొక దిక్కు రాలిపోయినంక..కురిసి వెలిసిన మొగులు దిగులు కనిపిస్తుంది.
ప్రేమ వ్యాపారం కాదనీ..ఎప్పటికీ మూర్ఖులకు ప్రేమ చిక్కదనీ..ప్రేమంటే మనిషి అనీ..ప్రేమంటే మానవత్వమనీ ఆయన కవిత్వం తేల్చి చెబుతుంది.
‘పచ్చని ప్రేమ’ కవితలో..‘కెరమెరి’ అడివిని అందంగా ఆవిష్కరించారు. లోలోపలికి పయనిస్తున్నకొద్దీ..ఎంత వెలుగు..చేయిపట్టుకుని..తనలోనికి తోలుకపోతున్నదామె..వేన వేల బాహువులతో పచ్చని సొగసు..పచ్చని ప్రేమ అంటూ అడవి సొబగులను చిత్రించారు.
మనుషులతో ముడిపడ్డ మనిషి..వౌనంతో బతుకేనా?..కొమ్మల మీద రెమ్మలై చిగురించే ఆశలతో..అంతంత గుట్టల మీదికైనా..ఇంతింత లోతుల వొద్దులకైనా నడిచి పోవాల్సిందేననీ..ఎక్కడో అక్కడ ఓ చెలిమె ప్రేమతో దాహం తీరుస్తుందనీ..ఏదో చెట్టు పండ్లిచ్చి కడుపునింపుతుందనీ..మనుషులూ అంతేనని తాత్వికంగా ఎరుక చెప్పారు.
‘చిగుళ్లతో సమావేశం’ కవిత కవితాత్మకంగా మలచబడింది. ఇదేమిటి ఒక్కమాట మాట్లాడదు..మాటలన్నీ శబ్ధ పత్రాలు రాలిన మోడులై పోయాయనీ..మాటలన్నీ అర్థాలు మరిచి పోయిన బాటసారులై పోయాయనీ..మాటలన్నీ మనుషులను గుర్తించని రోబోలై పోయినాయని ‘వరదగూడు’ కవితలో వాపోయారు.
వేల యేండ్లుగా మన పూర్వులు మనం నేర్చుకోవడానికే..తమ బతుకు చిత్రాలను పడిగ రాళ్ల మీద దాచి పెట్టిండ్రు.. తమ తీపి గురుతులకే రాతి గూళ్లు కట్టుకున్నారు. మన కోసం మన పూర్వులు కట్టిన సద్దిమూట నిన్నటి కథ..మనం ఎదుగుతున్నామో, అహాలతో ఎగిరి పోతున్నామో అది నేటి కథ అంటూ ‘మట్టిపొరలల్ల’ కవితలో చక్కగా ఆవిష్కరించారు.
బండి గిర్రలకు పట్టాలు ఎక్కించినట్టు..మనసుగ్గూడ అరిగిపోని ఉక్కు చుట్టులేవో చుట్టాలని ‘తంపి’ కవితలో సూచించారు.
మనసు తెరిచి మాటలు నింపి నిరాశలను కాల్చెయ్యి.. గట్టి స్నేహాలను చుట్టుకో, మోహాలు రాలిపోతూనే వుంటాయి..జీవితకాలం నిలిచి పోయే మమతలు అంటి వుండనీ అంటూ హితవు పలికారు.
చెరువుపై అద్భుతమైన కవిత రాశారు..కురిసిన వానను దోసిట్ల పట్టి దాచి పట్టేదని చెరువును అభివర్ణించారు.
నీళ్ల రంగుల చీరకట్టుకున్న నిండు ముత్తయిదువ చెరువు అనీ..కలువలో, తామర పూలో సిగలో పెట్టుకునే కావ్యకన్యగా చెరువును కవి మన ముందుంచారు.
చెరువంటే పల్లెల జానపద గీతాల సంబురమనీ, చెరువుంటే పల్లెలకు ముక్కారు పంటల జాతర అని చక్కని ముగింపునిచ్చారు.
లోపల ఎంత గోలవున్నా..అక్షరాలు నిశ్శబ్ధంగానే ప్రవహిస్తాయనీ..జవాబులు జవాబులే కాని జవాబులుగా ఉండవని ‘సిరిపదం’ కవితలో తేల్చి చెప్పారు.
అసంపూర్ణమైన సమస్తతత్వాలు, తర్కాలను వదిలేయమని సలహా ఇచ్చారు. మానవత్వంతోనే మనసు నింపుకొమ్మని సూచించారు. పరిసరాల వేదనల్ని చిమ్మేసి.. ఏ ఆకలి లేని లోకాన్ని ఆవిష్కరించాలని కాంక్షించిన తీరుబాగుంది.
‘అన్నీ యాదికొస్తయి’ కవితలో గత స్మృతులను చక్కగా నెమరేసుకున్నారు.
మనిషిని మనిషిగా చూసి..మనిషితో మనిషిగా బతకడం రాని వాళ్లు మనుషుల మనుకుంటే ఎట్లా? అని ‘మేనిఫెస్టో’ కవితలో ప్రశ్నించారు.
‘జై తెలంగాణమా’ కవితలో వలస పాలనలో పడ్డ గోసలను ఏకరువు పెట్టారు. ‘కొత్త తెలంగాణ’ కవితలో కోటి రతనాల వీణ కాదు కొత్త ప్రజాకోటి తెలంగాణై నిలవాలని ఆకాంక్షించారు.
అరవై ఏళ్ల గుండె సలుపుడు ఇప్పటికన్న తీరాలనీ..ఈ నేల దోపిడి ఇగనన్న ఆగాలని ఓ కవితలో అభిలషించారు.
‘తెలంగాణకే జై’ కవితలో..తెలంగాణ ఆవిర్భావం తర్వాత గల పరిస్థితులను దృశ్యమానం చేసిన తీరు బాగుంది.
ఎంతయాస్ట..ఎంత వలపోత..ఎంత బాధ..ఎన్ని ఉద్యమాలు..ఎంత తండ్లాట..ఎనే్నండ్ల గోస..ఇవ్వాళ ఉపసమ్మతి లెక్కుందని వ్యాఖ్యానించారు.
తాంబాలంల గునుగు, తంగడి పూల బతుకమ్మ..్ఫక్కున నవ్విన బోనంలా ఉందని అభివర్ణించారు.
ఇలా..గాఢంగా కవిత్వాన్ని పండించడంతో కవి సఫలీకృతులైనారు. తాను ఎంచుకున్న ప్రతి కవితా వస్తువుకు చక్కనైన పద బంధాలను జోడించి పాఠకులను మెప్పించారు. తెలంగాణ మట్టి బతుకులను హృద్యంగా చిత్రించారు. తెలంగాణ గ్రామీణ భారతాన్ని అందంగా ఆవిష్కరించారు. వేదనలు లేని స్వర్గాన్ని శ్వాసిద్దామన్న ఆయన పిలుపు నిజమవ్వాలని కోరుకుందాం..

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

మనోగీతికలు

ఎన్నో జన్మల బంధం!
పందిట్లో మూడు ముళ్ల పెళ్లి
ఆనందాల ఆకాశ హరివిల్లు
ఒక ప్రాణం రెండు దేహాలు..
మనసా కర్మేణా, వాదా,
ధర్మానుగతమైన గృహస్థాశ్రమం
ఓ మహత్తర సంస్కారం!
సంసార రథానికి రెండు చక్రాలు
సమంగా నడిస్తే ముందుకే
ఏ ఒక్కటి తగ్గినా..ఆగినా
సుడిగుండాల సునామీలే సుమా!
పరస్పర స్నేహం అవగాహన
కర్తవ్య పాలన త్యాగగుణాలు
శాశ్వత ఆనందానికి సన్మార్గాలు!
సహజీవనం సహధర్మం
దంపతులకు ప్రముఖంగా ప్రాథమికం
స్వతంత్రులే ఇరువురు కానీ..
స్వేచ్ఛాచారానికి పరతంత్రులు కారు!
సముద్రంలా లోతైనా లోటులేని సంసారం..
శరీరం ఆత్మల అనుసంధానం, మనస్సు,
ఆలుమగల అనురాగానికి తరతరాల బంధం!
ఎన్నో జన్మల బంధం!!

- ఆచార్య కడారు వీరారెడ్డి
, సెల్.నం.7893366363

అమ్మ
సృష్టికి మూలం అవ్యాజమైన మాతృప్రేమ
మధుర పరిమళం లాంటిది మాతృప్రేమ
అనిర్వచనీయమైన ఆనందానుభూతిని ఇచ్చేదీ మాతృప్రేమ
ప్రేమకు నిలువెత్తు ప్రతిరూపం అమ్మ
అవధుల్లేని ప్రేమను పంచేది అమ్మ
తాను కరిగిపోతూ లోకానికి
వెలుగునిస్తుంది కొవ్వొత్తి
చితికిపోతూ చితికిపోతూ కూడా
బిడ్డల మేలు కోరుతుంది అమ్మ
అమ్మ లేకుండా
ఈ సృష్టినే ఊహించుకోలేం
మన ప్రతి ఒక్కరి బలం, బలహీనత అమ్మే
అమ్మ లేకపోతే మనము లేము
అమ్మ లేకపోతే ఈ సృష్టి లేదు
పెదవి పలికే మాటల్లో తీయని మాటే అమ్మ
ఎన్నిసార్లు పిలిచినా
జీవితాంతం సేవ చేసినా
నీ రుణం తీర్చుకోలేవమ్మా
అందుకే అన్నారు మహనీయులు
అమ్మ పాదాల కింద స్వర్గమున్నదని.

- మహమ్మద్ వహీదుద్దీన్
సిద్దిపేట, సెల్: 9985747684

ప్రేమ!
రెండక్షరాల పదం అయితేనేం?
అది విశ్వమంతా ఆవరించి ఉంది!
హృదయంలోనా?
మస్తిష్కమందా?
కనుచూపులోనా?
కరస్పర్శలోనా?
ఆత్మీయత లోనా?
అనురాగం లోనా?
చెలిమి లోనా?
బలిమిలోనా?
కలిమిలోనా?
లేమిలోనా? అన్న..
సందేహం వలదు!
అది ఉన్నచోట..
కళ్లలో వెలుగులు!
మోములో జిలుగులు!
లేనిచోట..కన్నీటి జల్లులు!
అది కలవర పెడితేనేం?
కలిపి వుంచుతుంది?
కనులకు కనిపించకుంటే నేం?
హృదిలో పన్నీటి జల్లులు చల్లుతుంది!
కళ కళలాడించేది అదే!
కన్నీరొలికించేదీ అదే!!

- చెన్నమనేని ప్రేమసాగర్ రావు
కరీంనగర్, సెల్.నం.9912118554

శ్రీకారం

అమ్మ చేతి గోరుముద్దలు
నాన్న తెచ్చే తాయిలాలు
ఆరగిస్తూ ఆనందించే
బాలలం, భావి భారత పౌరులం
అమ్మా నాన్నల కలలపంటై
రుణం తీర్చే సిరులపంటై
ఓర్పుతో మేం నేర్పుతాం
అమ్మా నాన్నకు చదువు
మా అమ్మానాన్నకు చదువు
కొండంత నాన్న కష్టం
కడుపునింపె అమ్మ ఇష్టం
కలిమి లేముల వెలుగు నీడలే
మా చదువుకు బాటలైతే
ఆ దారికి తల్లిదండ్రుల
చేరవేసే రహదారులం
హలం పట్టి పొలం దున్ని
కలుపు పట్టి పొలం దున్ని
కలుపు తీసే చేతితోనే
బీడి చుట్టి బుట్టలల్లి
తాపి పట్టే వేళ్లతోనే
కలం పట్టి వెన్నుతట్టి
మేధస్సుకు పదునుపెట్టి
చదువుకంటే ఓటు విలువ
చదువు వల్లె బ్రతుకు విలువ
మంచి చెడుల మానవతల
తేల్చి చెప్పే అక్షరాస్యత
పదును ఎంతో తెలియజెప్పి
ప్రగతి వైపు నడిచి చూపి
విద్యలేని వాడు
వింత పశువుకంటె హీనమంటు
విద్యవల్లె నడక నడత
మారుతుందని రుజువు చేస్తు
వేలిముద్రల సంస్కృతికి
చరమగీత మాలపిస్తూ...
(ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారి
‘అమ్మానాన్నకు చదువు’ కార్యక్రమానికి స్ఫూర్తిగా..)

- ఎల్.గాయత్రి
కాగజ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9949431849

నేనూ... మనిషినే!

నాలుగు పాదాలతో కాదు
రెండు కాళ్ళతో నడుస్తాను
కనులు తలపైకెక్కి
నిలువుగా ఉంటాను
నడవటం నాకు నామోషీ
మోటార్లపైనే నా పరుగులు
వూరికే... నేనెందకుంటాను
చెవి కోసిన మేకలా
హారన్లు మ్రోగిస్తాను
రోడ్లపై తుపుక్కున
తట్టెడు ‘ఉమ్మి’ జల్లుతాను
మోటారును అడ్డగోలుగా ఉరికిస్తాను
అడ్డంగా నిలుపుతాను
అందరినీ చికాకు పెడతాను
వీధి దీపాలు వేయటమే తెలుసు
అర్పటం నావంతు కాదు
నా ఇంటినుండి కుళ్ళూ పొల్లు
రోడ్డుపైనే ఎగజిమ్ముతాను
నీటి వృథా నా హక్కు
పరిజ్ఞానంతో పనేంటి...?
అన్ని విషయాలపై వాదిస్తుంటాను
అంతరిక్షపు విషయాలూ
కొట్టిన పిండి నాకు
పిసరంత తెలిస్తే...
పెద్దమనిషిలా ఫోజు కొడతాను
మేధావినై చర్చకు దిగుతాను
(అవ)లక్షణాలన్నీ పుట్టుకతో వచ్చినవి కావు
నడమంతరపు మిడిమిడి జ్ఞానం
దాబు దర్పం జూపి
గౌరవం కొనుక్కుంటాను
అవసరమైతే లాక్కుంటాను
కించిత్తు ఆత్మవిమర్శ లేనివాడను
వేలెత్తి చూపటంలో మొనగాడను
నేనూ...మనిషినే!

- రంగినేని మన్మోహన్
మహబూబ్‌నగర్,
సెల్: 9059594747

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ఎస్.ఎస్.గుట్ట, ప్రభుత్వ ఆసుపత్రి వెనుక, మహబూబ్‌నగర్ - 509 001. merupumbn@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com