మెయన్ ఫీచర్

ప్రతిపక్షాల స్వీయ హననం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఇంకా రుజువులు కావాలని కోరుతున్నవారు ఎవరైనా ఉన్నారా అనేది అనుమానమే. ఒకవేళ ఉండి ఉంటే అవి ఈ నెల 9వ తేదీన మరొకమారు లభించాయి. వరంగల్, ఖమ్మం, మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల ఫలితాల రూపంలో. అందుకు సంబంధించిన గణాంకాలను వేర్వేరు కోణాలలో చూసి రకరకాల విశే్లషణలు వెలువడుతున్నాయి. వాటన్నింటిని సారాంశరూపంలో చెప్పేందుకు బహుశా ఇవి సరిపోతాయి. మూడు చోట్ల కలిపి మొత్తం స్థానాల సంఖ్య 128. వాటిలో టిఆర్‌ఎస్ గెలిచినవి 98. వరంగల్‌లో గెలిచిన తమ తిరుగుబాటు అభ్యర్థులు 8 మందిని కూడ కలిపితే 106. మొత్తం స్థానాలు 128లో ఈ 106ను తీసివేయగా మిగిలినవి 22. వాటిల్లో కాంగ్రెస్‌కు 14, సిపిఎంకు 3, సిపిఐకి 2, వైసిపికి 2, భాజపాకు 1, టిడిపికి 0 సీట్లు లభించాయ.
2014 మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగి ఇంచుమించు రెండు సంవత్సరాలు గడిచాయి. 2019 ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలున్నాయి. కాని చివరి సవత్సరాన్ని ‘ఎన్నికల సంవత్సరం’గా పరిగణిస్తుంటారు కనుక నికరంగా మిగిలింది రెండేళ్ల కిందనే లెక్క. ఆవిధంగా చూసినప్పుడు సగకాలం గడిచిపోయింది. 9వ తేదీన ఈ ఫలితాలను గమనించిన ఢిల్లీకి చెందిన ఒక సుప్రసిద్ధ ఇంగ్లీష్ బిజెన్ దినపత్రిక పొలిటికల్ ఎడిటర్, ‘‘మీ ప్రతిపక్షాలకు 2019 కోసం ఏమైనా ఆశ ఉన్నదా?’’ అని ప్రశ్ని స్తే, జవాబు ఏమివ్వాలో తెలియలేదు. ఆ ఎడిటర్ అదే ప్రశ్నను ప్రతిపక్షాల నాయకులకు వేసినట్లయితే ఏమి చెప్పగలరో?
అది తెలియదు కాని, ఫలితాలపై అదే రోజున, మరునాటి ఉదయం టీవీ ఛానళ్లలో చర్చ జరిగినప్పుడు గాని, పత్రికలవారికి ఇచ్చిన స్పందనలో గాని వారు చేసిన వ్యాఖ్యలను గమనించినప్పుడు, తమకు పరిస్థితి ఇప్పటికీ అర్థం కావడంలేదు సరికదా రానున్న కాలంలోనైనా అవుతుందనేది సందేహాస్పదంగా తోస్తున్నది. అన్ని పార్టీలకు నాయకులున్నారు. కాని వారిలో ఏ ఒక్కరు కూడా తమ పార్టీకి సవ్యమైన విధంగా నాయకత్వం వహిస్తున్న నమ్మకం కలగడం లేదు. పరిస్థితి వారికి ఆకళింపు అవుతున్నట్లుగాని, చేయవలసింది ఏమిటో ఏవిధంగానో అంతుబడుతున్న జాడలు లేవు. వారంతా చదువుకున్నవారు, అనుభవజ్ఞులు. కాని ఆ చదువులు, అనుభవాలను ఎవరూ సద్వినియోగం చేసుకుంటున్న సూచనలు కనిపించవు. ప్రతిపక్షాల వారంతా రాజకీయాల్లో జయాపజయాలు సహజమని గత 20 మాసాల్లో ఓడిన ప్రతిసారీ అంటున్నారు. అందుకు గతం నుంచి అనేక ఉదాహరణలను పేర్కొంటున్నారు. అదంతా నిజమే. టిఆర్‌ఎస్ ఇప్పుడు వరుసగా గెలుస్తున్నంత మాత్రాన శాశ్వతంగా అదే జరగకపోవచ్చు. కాని ఈ మాటను వారు దైవాధీన స్థితిగా చూసి అటువంటి ‘సుదినం’ కోసం ప్రార్థనలు చేస్తున్నారా లేక తమ వైపునుంచి ప్రయత్నాలు కూడా ఏమైనా చేస్తున్నారా అన్నది ప్రశ్న.
జయాపజయాలు సహజమన్న మాట 2014 మే నుంచి వినవస్తున్నది. ఆ తర్వాత ఉప ఎన్నికలు, ఇతర ఎన్నికలు అనేకం జరిగాయి. వాటిలో ఓటర్లు పట్టణాల వారు, గ్రామీణులు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ఆవిధంగా సార్వత్రిక ఎన్నికల అనంతరం కూడా 20 నెలల కాలంలో జరిగిన పలు ఎన్నికలలో వేర్వేరు వర్గాలు, ప్రాంతాల ప్రజలు, ప్రతినిధులు ఎన్నికలలో పాల్గొంటూనే వస్తున్నారు. ప్రభుత్వ పాలనపై, అధికార పక్షం తీరుపై, ఒక వ్యక్తిగా కె. చంద్రశేఖర్ రావుపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. ఇవన్నీ చెబుతూ వస్తున్నదేమిటో వేరుగా పేర్కొననక్కరలేదు. సర్వసాధారణంగా సార్వత్రిక ఎన్నికలలో ఏ ఫలితం వచ్చినా కొంతకాలం గడిచేసరికి వ్యతిరేక ఓటు మొదలవుతుంది. ఒక వర్గంలో కాకపోతే మరొక వర్గంలో. ఒక ప్రాంతంలో కానట్లయితే మరొక ప్రాంతంలో. ఇది చాలా సహజంగా జరిగేది. కాని అటువంటిది ఏ కోణం నుంచి కూడా లేకపోవడమన్నది అసాధారణ స్థితి. చివరకు అంతటి మహానాయకుడు నెహ్రూ సైతం 1952 నాటి మొదటి ఎన్నికల తర్వాత 1957లో రెండవ ఎన్నికలు వచ్చేసరికే కేరళ, ఒరిస్సా, బిహార్, యుపి, పశ్చిమ బెంగాల్‌లలో ఎదురు దెబ్బలు తిన్నారు. అంతమాత్రాన ఆయన స్థాయి తగ్గలేదన్నది వేరే విషయం. అదే పద్ధతిలో, పైన అనుకున్నట్లు టిఆర్‌ఎస్ విజయాలు శాశ్వతం కాకపోవచ్చుగాక. కాని, పరాజయాలనుంచి పరాజితులు ఏమైనా నేర్చుకుంటున్నారా అన్నది ప్రశ్న. కాని తెలంగాణ ప్రతిపక్షాలు, 2014 నుంచి మొదలుకొని ఇప్పటివరకు ‘జయాపజయాలు శాశ్వతం కా’దనే దైవాధీనపు మెట్టవేదాంతాలు చెప్పడం మినహా, ఏదైనా నేర్చుకున్నట్లుగాని, ఆ ప్రకారం వ్యవహరిస్తున్నట్లుగాని ఆవగింజంతైనా కనిపించదు. ఈ విషయం ప్రజలకు బాగా ఆర్థమైనట్లుంది. అందుకే పదేపదే అధికార పక్షానికి మరింత అనుకూలంగా, ప్రతిపక్షాలకు మరింత వ్యతిరేకంగా తీర్పు చెబుతున్నారు. ఒక్కొక్క ఎన్నికల సీట్లు, ఓట్లను పోల్చి చూసినప్పుడు ఇది కనిపిస్తుంది.
ఇదంతా చివరకు ఎక్కడకు చేరింది? 2014 ఫలితాలు ఎట్లున్నా 2019 నాటికి తిరిగి అధికారానికి రాగలమని, లేదా ప్రత్యామ్నాయంగా ఎదగుతామని కాంగ్రెస్, టిడిపి, బిజెపి, వామపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి. వీటిలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈ 9వ తేదీనాటి ఫలితాలలో 128 స్థానాలలో కేవలం 14 గెలిచింది. ఇటీవల జరిగిన నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో చిత్తుగా ఓడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో 150 స్థానాలకు బదులు తెచ్చుకున్నది రెండే రెండు. వరంగల్ లోక్‌సభలో ధరావతు అయినా దక్కలేదు. తెలంగాణలో చిరకాలం ఆధిపత్యం నెరపిన తెలుగుదేశం పార్టీ, 2019లో అధికారం తిరిగి తనదేనని తరచు ప్రకటిస్తుంటుంది. వారికి ఈ మూడు చోట్ల కలిపి వచ్చిన సీట్లు ఒక్కటైనా లేదు. నారాయణ్ ఖేలో ధరావతు మిగల్లేదు. గ్రేటర్‌లో గెలిచింది ఒకే ఒక వార్డు. 2014లో గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలలో ఈ వ్యాసం రాసే సమయానికి మిగలనున్నది సాంకేతికంగా ముగ్గురు, నికరంగా ఒక్కరు! తెలంగాణ ఎర్పాటును గట్టిగా బలపరచామన్న ధీమా ఉన్న భాజపా సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఐదు సీట్లకు పరిమితమై నీరసపడినా, రానున్న కాలం తమదేనని నమ్మింది. టిడిపితో పొత్తు ఉపకరిస్తుందని, ఆ పార్టీ బలహీన పడితే దాని బలమంతా తనకు సంక్రమించగలదని లెక్కేసింది. తాను కూడా బలపడేందుకు కృషి చేయగలనని ప్రకటించింది. కాని ఈ 9వ తేదీ నాటి ఫలితాలలో మూడు చోట్ల కలిపి గెలిచింది ఒక్క స్థానం. తమకు మొత్తం రాష్ట్రంలోనే అన్నింటికి మించి బలమైన కేంద్రమనుకున్న గ్రేటర్‌లో కేవలం నాలుగు వార్డులు! వరంగల్ లోక్‌సభలో టిడిపి మద్దతు ఉండి కూడా ధరావతు గల్లంతు!
ఇక కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం ఒక్కొక్క సీటు మాత్రమే గెలిచినా, కొన్ని కారణాలను చెప్పుకొని ఇక తామే ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించగలమని అంచనాలు వేసుకున్నారు. ఒకప్పటి రైతాంగ సాయుధ పోరాటం వారసత్వం తమకుందని, తెలంగాణ వెనకబడింది కావడంతో పాటు ఇక్కడి జనాభాలో 80 శాతం మంది బలహీన వర్గాల వారైనందువల్ల అది తమకు అనుకూలమని, ఇంతకాలం విడివిడిగా ఉండిన వామపక్షాల వారమంతా ఒకే వేదికపైకి వచ్చి ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం సాగించగలమని, ఆ విధంగా ప్రత్యామ్నాయంగా రపొందగలమని విశే్లషించుకున్నారు. కాని ఈ మూడు చోట్ల కనీసం కలిసి పోటీ చేయలేకపోయారు. ఇరువురు కలిసి గెలిచినవి ఐదు సీట్లు! రాష్ట్రంలో నల్లగొండ, ఖమ్మం తమ ‘ఎర్రకోటల’న్న చరిత్ర ఉండగా, ఖమ్మం నగరాన్ని చిరకాలం పాటు పాలించి కూడా, ఇప్పుడు తమ కోటను తామే కూలగొట్టుకున్నారు. గ్రేటర్‌లో మరికొందరిని కలుపుకొన్నా, వరంగల్ లోక్‌సభలో ప్రజా సంఘాలన్నీ తమ వెంట ఉన్నాయని చెప్పుకున్నా, సాధించిన ఫలితాల గురించి చెప్పుకునేందుకు మొహం చాటేయవలసి వచ్చింది.
దీనంతటి సారాంశమేమంటే, 2014 ఓటమి తర్వాత నుంచి మొదలుకొని 2019 వైపు తిరిగి పుంజుకుంటూ వెళ్లడానకి బదులు, మొత్తం అన్ని ప్రతిపక్షాల పరిస్థితి నానాటికి తీసికట్టు అన్నట్టుగా మారుతున్నది. వీరికి ఈ ఇరవై రెండు నెలల్లో ఏదీ అర్థం కానందునే ఇటువంటి పరిస్థితి వచ్చింది గనుక, ఇప్పటికి కూడా ఏదీ అర్థం కానట్లే కనిపిస్తున్నందున, 2019కి ముందు ఇంకా మిగిలివున్న కాలంలో వారి రాజకీయం ఎట్లా పరిణమించవచ్చునో ఎవరి ఊహాగానాలు వారు చేయవచ్చు. దీని నుంచి తరుణోపాయం లేదనికాదు. తప్పకుండా ఉంది. అది ఇప్పటికైనా పరిస్థితిని సవ్యంగా అర్థం చేసుకొని సవ్యంగా ప్రవర్తించడం. విశేషమేమంటే ఆ మంత్రాన్ని వారికి తమ ప్రత్యర్థి కెసిఆర్ స్వయం గా చెబుతూ వస్తున్నారు. ‘‘నెగెటివ్ కాదు, పాజిటివ్‌గా వ్యవహరిచం’’డని!
ఇది మామూలుగా కనిపించే ఒక చిన్నమాట. కాని చాలా అర్థవంతమైనదని విజ్ఞులు, అనుభవజ్ఞులు ఎవరైనా చెబుతారు. కాని తెలంగాణ ప్రతిపక్షాలు అన్నింటికి లోపించిది ఇదే. ప్రతిపక్ష పార్టీలకు, రాజకీయ అతురత వల్ల ఆ విజ్ఞత మసకబారిందేమో తెలియదు. కాని రాజకీయ పార్టీలతో సంబంధం లేని మేధావులు కొందరు సైతం అదేవిధంగా వ్యవహరించడం గమనించదగ్గది. విమర్శలు చేసి తీరవలసిందే. కాని పార్టీలైనా, మేధావులైనా వాటిని సహేతుకంగా, పాజిటివ్‌గా చేసినట్లయితే ప్రజలు హర్షిస్తారు. ఎందుకంటే స్వయంగా ప్రజలు కూడా విమర్శిస్తుంటారు. ఆపని సహేతుకంగా, పాజిటివ్‌గా చేస్తారు. ప్రజలలో నెగెటివిజం ఉండదు. వారికి జీవితం నెగెటివిజాన్ని నేర్పదు. కనుక ప్రతిపక్షాలు, మేధావులు నెగెటివ్‌గా వ్యవహరిస్తే ఆమోదించలేరు. ప్రతిపక్షాలకు రాజకీయమైన స్టేక్స్ ఉంటాయి. అందుకు తగినట్లు వారికి కొంతకాలం అధికారపు అతురతలు ఎక్కువై ఓపికలు తగ్గుతున్నాయి. చదువులు, అనుభవాలు కొరగానివి అవుతున్నాయి. అటువంటి స్థితిలో నెగెటివిజం పుట్టుకు వస్తుంది. కాని మేధావులు కూడా ఇదే లోపాలనికి గురికావడం సమాజానికి మేలు చేసేది కాదు. అటువంటి వ్యవహరం వల్ల ప్రజలకు నాయకుల పట్ల గురి పోయినట్లే, మేధావుల పట్ల గౌరవ విశ్వాసాలు తగ్గుతాయి.
తెలంగాణలో ప్రతిపక్షాల రాజకీయ స్థితి క్రమంగానే కాక వేగంగా బలహీన పడటానికి గల కారణం వాటి నెగెటివ్ వ్యవహరణ ఒక్కటే కాదు. అంతకన్నా ముఖ్యమైనది ఒకటుంది. అది టిఆర్‌ఎస్ ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలలోని అన్ని వర్గాలను తనవైపు ఆకర్షించుకనేందుకు యత్నించడం. ఆ కార్యక్రమాలు నిజంగానే వారిని ఆకర్షిస్తున్నాయి. తొలుత ఒక దశలో కొంత ఒడిదుడుకులు ఉండినా వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆవిధంగా గ్రామీణులు, పట్టణ వాసులు, వ్యాపార-పారిశ్రామిక వర్గాలవారు, ఉద్యోగులు, ఉద్యోగార్థులు, మహిళలు, ఆకర్షితులవుతున్నారు. వ్యతిరేకతలు తగ్గుతున్నాయి. జరగవలసినవి ఇప్పటికీ అనేకం ఉన్నాయి. అవి కూడా చేసే లక్షణమే ప్రభుత్వం వద్ద కనిపిస్తున్నది. ఇది జరిగిన కొద్దీ అధికారపక్షం బలపడి ప్రతిపక్షాలు బలహీన పడతాయని వేరే చెప్పనక్కరలేదు. ప్రతిపక్షాలకు అసలైన ప్రమాదం ఉంది. అందుకు అదనంగా వారు తమ నెగెటివిజంతో ఆ ప్రమాదాన్ని మరింత పెంచుకుంటున్నారు. కనునే ఫలితాలు రెండేళ్ల తర్వాత ఈ విధంగా ఉంటున్నాయి.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)