ఉత్తరాయనం

సినిమాలలో, టీవీలలో వాడే భాష పట్ల రచయితలు అప్రమత్తంగా వుండకపోవడం దురదృష్టకరం. యాంకర్లు తెలుగు, ఆంగ్లం, హిందీలోని పదాలను కలిపేసి ఒక కొత్త రకం భాషను ప్రయోగిస్తున్నారు. ఇక సినిమాలలో వాడే తెలుగు భాష నాణ్యత నానాటికీ తీసికట్టుగా వుంటోంది. హాస్యం పేరిట బూతు పదాలను నిర్లజ్జగా వాడేస్తున్నారు. తేనెకన్నా తీయనైన మన అద్భుత తెలుగు భాష యొక్క సౌందర్య పరిమళాలు ప్రపంచం నలుమూలలా వ్యాపించి విదేశీయులు సైతం మన భాషను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుండగా తెలుగు వారమై వుండి ఇతర భాషలలో కలగాపులగం చేసి భాషా సంకరానికి పాల్పడడం ఎంత అవివేకం? తెలుగు భాషకు నేటి తరం రచయితలు పట్టిస్తున్న దుర్గతిని చూసి మాతృభాషా ప్రేమికులుగా ఎంతో ఆవేదన కలుగుతోంది. తెలుగు భాషయొక్క సొగసులను కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై వుంది.
- ఎం.కనకదుర్గ, విశాఖపట్నం
ఉపాథి హామీ పథకం నిరుపయోగం
ఉపాధి హామీ పథకం నిజంగా దేశ ప్రజలు వ్యవసాయ కూలీలకు, నిరుద్యోగులకు ఉపాధి హామీ పథకం ఉపయోగపడటం లేదు. వ్యవసాయ కూలీ రేట్లు పెరగడం, ఈ పథకం వల్ల వ్యవసాయ పనులు నిలిచిపోయ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ, నిరుద్యోగ యువతకు, రైతులకు, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి, పరిశ్రమలు స్థాపించటం ద్వారానే ఉపాధి లభిస్తుంది. గ్రామీణ పారిశ్రామీకరణ ద్వారానే యువతకు ఉపాధి లభిస్తుంది.
- ఎ.ప్రకాష్, మిరుదొడ్డి
సంక్షేమ హాస్టళ్ళలో అవకతవకలు
కొంతకాలం క్రితం ఎసిబి జరిపిన దాడుల్లో రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్ళలో పెద్దఎత్తున అవకతవకలు, అవినీతి కుంభకోణం జరిగినట్లు వార్తలు వచ్చాయి. వెనుకబడిన కులాలవారి సంక్షేమంకోసం ప్రభుత్వం నెలకొల్పిన హాస్టళ్లు అక్రమార్కుల పాలిట కల్పతరువులా మారాయి. విద్యార్థులచేత వ్యక్తిగత పనులు చేయించుకోవడం, లైంగిక వేధింపులకు పాల్పడడం, అత్యంత నాసిరకం భోజనం సప్లయి చేయడం వంటివి యధేచ్ఛగా సాగుతున్నాయి. విద్యార్థులకు అందాల్సిన దుస్తులు, దుప్పట్లు ఇతర సంక్షేమ అంశాలు కేవలం ఇచ్చినట్లుగా కాగితాలపై చూపిస్తున్నారు. ప్రభుత్వం సిబిఐచేత మొత్తం హాస్టళ్ల నిర్వహణపై సమగ్ర దర్యాప్తు జరిపించి అక్రమార్కులను కఠినంగా శిక్షించాలి.
- సి.ప్రతాప్, సూర్యాపేట
మొఖాసా వారసులకు న్యాయం!
శ్రీకాకుళం జిల్లాలో త్వరలో ప్రారంభమవుతున్న భూభారతి సమగ్ర సర్వేలో జిల్లాలోగల అన్నిరకాల మొఖాసా(యినాం) భూముల్ని సమగ్ర సర్వేచేసి, ఆక్రమణదారులవద్ద వందలాది ఎకరాల భూమిని నిర్ధారించి, మొఖాసా వారసులకు రావాల్సిన వాటాని రెవెన్యూ అధికారులు మొఖాసా వారసులకి అందివ్వాలి. పాలకొండ మండలం పణుకువల్స గ్రామంలో ఉన్న భూములన్నీ మొఖాసావే. రెవెన్యూ అధికారులు చొరవ చూపి గతంలోగల 1968, 1969నాటి రికార్డులతో సరిపోల్చి, మొఖాసా వారసులకు రావాల్సిన భూమిని అందజేయాలి. మండల, డివిజన్, జిల్లా రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి, వారసులకు న్యాయం చేయాల్సి ఉంది. మిగిలిన భూమిని నిరుపేద గిరిజనులకు పట్టాలివ్వాలి.
- బి.రమేష్‌బాబు, పాలకొండ
చాలని కరువు భత్యం
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలల్లో కరువు భత్యం డి.ఎ. పెంచుతూ వస్తోంది. రోజురోజుకు మార్కెట్ ధరలు విపరీతంగా పెరగటం రూపాయి విలువ పడిపోవటంవల్ల సామాన్య ప్రజలకు దడ పుట్టిస్తోంది. అందుకు విపరీతంగా పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని, ఈ సంవత్సరం జనవరి నెల నుంచి ఇస్తున్న డి.ఏ.ను కనీసం 10 శాతానికి పెంచితే అందరికీ కొంత మేలు కలుగుతుంది.
- మహమ్మద్ యూసుఫ్, కాజీపేట
Add new comment