క్రీడాభూమి

తెలుగు వారియర్స్ విజయపరంపర

  • 05/02/2012

విశాఖపట్నం , ఫిబ్రవరి 4: ఈ ఏడాది సిసిఎల్ టి-20 మ్యాచ్‌లలో ఆదినుంచి ప్రతిభ కనబరుస్తూ, విజయాన్ని కైవసం చేసుకుంటూ వస్తున్న తెలుగు వారియర్స్ విశాఖలోనూ అదే జోరు కొనసాగించింది. ఇప్పటికే ఈ లీగ్ మ్యాచ్‌లో సెమీస్‌కు చేరిన తెలుగు వారియర్స్ విశాఖలోనూ విజయాన్ని కైవసం చేసుకుని, తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. చెన్నై రైనోస్‌తో శనివారం స్థానిక ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో జరిగిన టి-20 మ్యాచ్‌లో చెన్నై రైనోస్‌తో హోరాహోరీగా తలపడిన తెలుగు వారియర్స్ చివరకు ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. మ్యాచ్ ఆద్యంతం అద్భుతంగా ఆడిన ఆదర్శ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో చరణ్ తేజ, ఆదర్శ్ అత్యంత ప్రతిభ కనబరిచారు. టాస్ గెలిచిన చెన్నై రైనోస్ బ్యాటింగ్ ఎంచుకుంది. రఘు వేసిన మొదటి ఓవర్‌లో మొదటి బంతికే జీవా డక్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన విక్రాంత్ ధాటిగా ఆడి 18 బంతుల్లో ఐదు బౌండరీలు, రెండు సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు. తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన విష్ణు చెలరేగి ఆడి 46 బంతుల్లో ఐదు బౌండరీలు, రెండు సిక్సర్లు కొట్టి, 54 పరుగులు సాధించి స్కోరును అనూహ్యంగా పెంచాడు. శాంతును 22 పరుగులు సాధించాడు. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై రైనోస్ ఐదు వికెట్లు నష్టానికి 150 పరుగులు సాధించింది.
151 పరుగుల భారీ లక్ష్యంతో బరికిలో దిగిన తెలుగు వారియర్స్ మొదట తడబడుతూ ఆడినా, చివరకు లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. విశ్వ 17 పరుగులకు, తరుణ్ కేవలం రెండు పరుగులకు రన్ అవుట్ కావడంతో ప్రేక్షకుల్లో నిరాశ చోటు చేసుకుంది. 10 ఓవర్ల వరకూ తెలుగు వారియర్స్ పెద్దగా పరుగులు సాధించలేకపోయింది. ఆ తరువాత బరిలో ఉన్న చరణ్ తేజ, ఆదర్శ్ అద్భుత ప్రతిభ కబరిచారు. వీరిద్దరు 80 బంతుల్లో 111 పరుగుల భాగస్వామ్యంతో జట్టు విజయానికి కృషి చేశారు. చరణ్ తేజ నాలుగు బౌండరీలు, మూడు సిక్సర్లతో 53 పరుగలు సాధించాడు. ఇంకా ఏడు బంతులు మిగిలున్న సమయంలో కేవలం ఒక్క పరుగు చేస్తే, తెలుగు వారియర్స్ విజయాన్ని కైవసం చేసుకుంటుంది. అప్పటి వరకూ అజేయంగా ఆడిన చరణ్ తేజ ఈసమయంలో ఔట్ కావడం ప్రేక్షకులకు నిరాశ మిగిల్చింది. చరణ్‌కు సరిజోడుగా ఆడిన ఆదర్శ్ 61 పరుగులు సాధించాడు. 80 బంతుల్లో 111 పరుగుల పార్ట్నర్ షిప్, బహుశా సిసిఎల్ మ్యాచ్‌ల్లో సరికొత్త రికార్డు కాబోతోంది. (చిత్రం) మ్యాచ్‌ను తిలకిస్తున్న తెలుగు వారియర్స్ కెప్టెన్ వెంకటేష్
చెమటోడ్చి గెలిచిన కేరళ స్ట్రైకర్స్
బెంగాల్ టైగర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్ అనూహ్య విజయాన్ని కైవసం చేసుకుంది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో కేరళ స్ట్రైకర్స్ బెంగాల్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచిన బెంగాల్ టైగర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కేరళ టాప్ ఆర్డర్ బాట్స్‌మెన్స్ బాగా ఆడి స్కోరును ముందుకు తీసుకువెళ్లారు. టాప్ ఆర్డర్‌లో రాజీవ్ పిళ్లై ఏడు బౌండరీలు, రెండు సిక్సర్లతో 49 బంతుల్లో 59 పరుగులు సాధించాడు. కళాభవన్ 21, వివేక్ గోపన్ 21 పరుగులు సాధించారు. అయితే ఆ తరువాత వచ్చిన వారంతా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 149 పరుగులు సాధించింది. శాండికి రెండు వికెట్లు, సౌగత్, రాబిన్, టాబున్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగల్ టైగర్స్ కాస్త తడబడుతూ ఆడారు. ఇందులో జిసు ఐదు బౌండరీలు, ఐదు సిక్సర్లతో 69 పరుగులు చేసినప్పటికీ, మిగిలిన ఆటగాళ్లు అంతగా రాణించలేకపోయారు. శాండి 28, సౌగత్ 15, జాయ్ 13 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టారు. ఆఖరి ఓవర్‌కు 10 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన దశలో కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడంతో ఒక్క పరుగు తేడాతో బెంగాల్ టైగర్స్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading