రాష్ట్ర వార్తలు

టిటిడి ఆలయాల పరిరక్షణకు చర్యలు

  • 23/02/2012

తిరుపతి, ఫిబ్రవరి 22: ధూప, దీప, నైవేద్యాలతో ఆలయ గోడలు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున, అందుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టిటిడి యాజమాన్యానికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చామని భారత పురావస్తు శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ మణి తెలిపారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై సూచనల కోసం పురావస్తుశాఖ అధికారులను టిటిడి ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఆహ్వానించిన విషయం విదితమే. ఈ మేరకు మంగళవారం తిరుమల చేరుకున్న అధికారుల బృందం ముందుగా శ్రీవారి ఆలయాన్ని సందర్శించింది. బుధవారం శ్రీనివాసమంగాపురం ఆలయాన్ని పరిశీలించిన అనంతరం తనను కలసిన విలేఖరులతో పురావస్తు శాఖ డైరెక్టర్ మణి మాట్లాడుతూ తిరుమల, తిరుపతి, శ్రీనివాసమంగాపురంలోని ఆలయాల అభివృద్ధి అంశాలకు సంబంధించి టిటిడి యాజమాన్యం 38 అంశాలతో కూడుకున్న ప్రతిపాదనలు తమ ముందు ఉంచిందన్నారు. ఇందుకు సంబంధించి తాము మరింత లోతుగా అధ్యయనం చేసి పై అధికారులతో చర్చించిన అనంతరం టిటిడికి తగిన సూచనలు ఇస్తామన్నారు. శ్రీనివాసమంగాపురంలో మ్యూజియం ఏర్పాటు చేయాలని కూడా టిటిడి యోచించిందని, అయితే ఇక్కడున్న స్థల విస్తీర్ణం సరిపోదని భావిస్తున్నామన్నారు. అందుకే ప్రస్తుతం తిరుమలలో ఉన్న మ్యూజియంతో పాటు మరో మ్యూజియం అక్కడే ఏర్పాటు చేస్తే బాగుంటుందని టిటిడి అధికారులకు చెప్పామన్నారు. శతాబ్దాల క్రితం నిర్మించిన ఆలయాల సంరక్షణకు టిటిడి తమవంతు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పూర్వం రాజులు హిందూ ఆలయాలను పరిరక్షిస్తూ వచ్చారన్నారు. ప్రస్తుతం ఆ బాధ్యత టిటిడి భుజస్కందాలపై ఉందన్నారు. అప్పటి రాజుల కాలంలో రాజులు టిటిడికి అప్పగించిన ఆభరణాలతో పాటు ఎలాంటి వస్తువులైనా భద్రపరచాల్సిన బాధ్యత టిటిడిదేనన్నారు. రాజులు వాడిన పురాతన వస్తువులను కూడా మ్యూజియం ఏర్పాటు చేసి ప్రజల ప్రదర్శనకు ఉంచాలని ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు సూచించామన్నారు. ఇలాఉంటే శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో టిటిడి చేపట్టదలిచిన అభివృద్ధి కార్యక్రమాలపై ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం బుధవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో పురావస్తు శాఖాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన తనను కలసిన విలేఖరులతో మాట్లాడుతూ కల్యాణ వేంకటేశ్వరుని ఆలయంలో ఇటీవల పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు టిటిడి యోచిస్తోందన్నారు. అయితే ఈ ఆలయం పురావస్తు శాఖ పరిధిలో ఉండడంతో ఆ శాఖాధికారులను కూడా పిలిపించి తాము చేయదలిచిన అభివృద్ధి కార్యక్రమాలను 38 అంశాలతో జాబితాగా రూపొందించి నివేదిక సమర్పించామన్నారు.ఇటీవల కొన్ని కొత్త నిబంధనలు రూపొందించిన నేపథ్యంలో అన్ని అంశాలను స్థానిక అధికారులు పరిష్కరించడానికి సాధ్యం కాదని ఇఓ అన్నారు. ఈ కారణంగా పలు అంశాలు జాతీయస్థాయి అధికారులు దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతి మేరకు దశల వారీగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. చరిత్రకారులను తాము ఆహ్వానించామన్నారు.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading