కొంచెం ఇష్టం కొంచెం కష్టం

తాళం వేస్తారు జాగ్రత్త

  • 09/02/2012

తాళం అనే పదానికి చాలానే వున్నాయి అర్థాలు. అందులో ఒకటి సంగీతంలోని తాళం. అదీ పూర్తిగా పర్సనల్ వ్యవహారం. పాడేవాళ్ళు ఎవరి తాళం వాళ్ళే వేసుకుంటారు. కాబట్టి వాళ్ళవల్ల ఎవరికీ ఏమీ ఇబ్బంది వుండదు. మన పక్కింట్లో పిల్ల మరీ కర్ణకఠోరంగా పాడేస్తున్నా చెవిలో దూదో ఇయర్ ఫోనో పెట్టేసుకుని ఆ ఆపదనుంచే గట్టెక్కవచ్చు.
రెండో రకం తాళాలతోనే తలకాయనొప్పి, డేంజరు. ఈ తాళాలు వేసినా కష్టమే, తీసినా కష్టమే. ఏదైనా మనకే బోలెడంత నష్టం.
అదివరకు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసి అదీ తిన్నగా వేసామా లేదో అని ఒకటికి పదిసార్లు లాగి చూసి దేవుడా మేము తిరిగొచ్చేదాకా మా ఇంటి భారం నీదే. ఎవరూ మా ఇంటి తాళం తియ్యకుండా కాపాడు అని మనసారా ప్రార్థించి అప్పుడు బయటికి వెళ్ళేవాళ్ళం. ఓసారి రోడ్డెక్కాక ఇక ఇంటి తాళం విషయం మర్చిపోయేవాళ్ళం.
ఇప్పుడలా కాదు. రోడ్డెక్కాక కూడా తాళ భయం వెంటాడుతూనే వుంటుంది. ఇంటికి తిరిగొచ్చేలోగా ఎవరు ఎప్పుడు ఎక్కడ తాళం వేసేస్తారో అని గుండె పీచు పీచుమంటూనే వుంటుంది. ఫలాని చోటుకి వెళ్తున్నాం. ఇంత డబ్బు పట్టుకెళ్తున్నాం. ఓ ఎక్కీ తొక్కి అని ధీమాగా అనుకునేందుకు లేదు.
తాళాలకోసం విధిగా కొంత మనీ విడిగా వుంచుకోవాలి. కొండొకచో రెండు మూడు తాళాల కోసం కూడా సొమ్ము జాగర్త చేసుకుని రోడ్డెక్కాలి. లేకపోతే మన గతి అధోగతే. అందులోనూ ఈ తాళాలదంతా అయోమయం వ్యవహారం. తాళం పడొచ్చు, పడకపోవచ్చు. మన అదృష్టంమీద ఆధారపడుంటుంది.
ఏవిటీ తాళం సుత్తి మాకు. అర్థం కావడంలేదు అనుకుంటున్నారా? ఆసచర్యం?? ఆసచర్యం!!!
మీరుండేది హైదేరాబాడులోనేనా??? మీకు కారుందా?? మరదే!! ఆ కారు తాళం గురించే నేను చెప్తోంది. అబ్బా!! మన కారుకి మనం వేసే తాళం గురించి కాదు. మనం తాళం వేసి వెళ్ళాక పోలీసులొచ్చి కారుకి వేస్తారూ.. ఆ తాళం గురించి చెప్తున్నా. ఈమధ్య ఎడాపెడా వేసేస్తున్నారు తాళాలు.
మన సమాజాన్ని బాగు చెయ్యాలని మన ప్రభుత్వం వారు ఎనె్నన్నో పన్లు చేస్తూ వుంటారు. ప్రజల పట్ల ముఖ్యంగా కామన్ మాన్ పట్ల వారికెంతోప్రేమ.. ఏ పని మొదలుపెట్టినా కామన్ మాన్ సుఖం కోసమే. మరది ఏం ఖర్మమో అయ్యవారిని చెయ్యబోయి కోతిని చేసినట్టూ తయారవుతుంది ప్రతీ పని.. అన్నీ అంతే.. హెల్మెట్ రూలు.. డ్రైవ్ చేస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదనే రూలు.. ఆటోలో ఎక్కువమంది పిల్లల్ని ఎక్కించకూడదనే రూలు అన్నీ వున్నాయి. కాపోతే ఎవరూ పాటించరు. అలా పాటించనివారిని పట్టుకుని శిక్షించే అధికారం ప్రభుత్వానికి వుంది. అలాగే ఏక్షన్ తీసుకుంటారు కూడాను. ఏ మాటకామాటే చెప్పుకోవాలి మరి. ఆ మాత్రం కఠినంగా వ్యవహరించాల్సిందే.
కాకపోతే అదంతా బొత్తిగా గాలివాటంగా తయారైపోతోంది. తప్పుచేసినవాళ్ళందర్నీ దండించడం ఉత్తమైన పద్ధతి. అందర్నీ వదిలేయడం మధ్యమం. కొందర్ని పట్టుకుని మరికొందర్ని వదిలేయడం వుంది చూశారూ అదీ అధమం. తప్పుచేసినవారిని వదిలేసి తప్పుచెయ్యని వారిని పట్టుకోడం అధమాధమం. మన ఖర్మకాలి ఎప్పుడూ ఆ చివరి రెండు పద్ధతులూనే నడుస్తాయి.
ప్రస్తుతం వాహనాలకి తాళాలు వేసే ట్రెండు జోరుగా నడుస్తోంది. అప్పుడెప్పుడో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఓపెన్ చేసిన కొత్తల్లో మొదటిసారి అక్కడ చూసాను కారు తాళం. భలేగా వుంది అనుకున్నా. అడ్డదిడ్డంగా వాహనం పార్క్ చేసేవారికి ఈ తాళం ఓ గనుపాఠం అనుకున్నా. ఆ తర్వాత ట్రాఫిక్ వారు నగరంలో కూడా తాళం వెయ్యడం మొదలుపెట్టారు... శభాష్ మన నగరంలో ట్రాఫిక్‌కి ఈ మాత్రం తాళభయం ఉండాల్సిందే అని సరదాపడిపోయా. ఏం లాభం? మళ్ళీ గుడ్డేటు వ్యవహారం. ఏ రూలు ప్రకారం తాళం వేస్తున్నారో వాళ్ళకీ తెలీదు.. మనకి ముందే తెలీదు. వేసేస్తారు అంతే. మనం ఎంత మొత్తుకున్నా వినరు. తాళం వేసేశాం తన్నుకు చావండి అంటారు. ఈ నేరానికి జరిమానా కూడా భారీగానే వేస్తారు. ఒకసారి తాళం వేస్తే అయిదొందలు సమర్పించుకోవాలి.
అయిదొందలంటే మాటలా.. మధ్యతరగతివాళ్ళం.. పెట్రోలికి పెట్టినంత తాళాలకి ఎక్కడ పెడతాం?
ఈమధ్య ఈ వేడుకలోనైన అందరూ కలిస్తే తాళాల గోలే. ఇదే ప్రస్తుతం బర్నింగ్ టాపిక్.
మొన్న ఓ పార్టీకి వెళ్తే అక్కడ ఇదే గొడవ. ‘‘రోడ్డు పక్కన కారు ఆపాం. మా ఆయన ఏటియంకి వెళ్ళారు. పోలీసొచ్చి తాళంవేసేసాడు.
రోడ్డుపక్కనే ఆపాం కదా అన్నా వినడు. ఇది నో పార్కింగ్ ఏరియా అన్నాడు. అలా అని బోర్డులేదుగా మాకెలాతెలుస్తుంది? అని మొత్తుకున్నా.
బోర్డు కేబుల్స్ కోసం గుంటలు తీసేవాళ్ళు తీసేస్తుంటారు. బోర్డున్నా లేకపోయినా యిది నో పార్కింగ్ ఏరియానే అంటాడు మొండిగా. చివరికి అయిదొందలు సమర్పించి వచ్చాం అని తన బాధ వెళ్లబోసుకుంది ఒకావిడ.
మీరింకా నయం. ఈ హోటల్‌కి వాలెట్ పార్కింగ్ వుంది కదా! బయట కార్లు చాలా వున్నాయి ఇక్కడాపండి. మేము లోపల పార్క్ చేస్తాం అంటే కారాపాను. హోటలు వాళ్ళొచ్చేలోపలే పోలీసులొచ్చి తాళం వేసేసారు. హోటలు వాళ్ళు నేను కూడా బతిమాలాం. వినలేదు. ఫైను కట్టి వస్తున్నా అన్నాడు ఇంకొకాయన.
ఏమోనండీ మరి నేనెప్పుడూ ఇక్కడ పార్కింగ్ ఉందా లేదా అని చూడను. నాక్కావాల్సిన దగ్గర అపుతా. ఒక్కోసారి యూ టర్న్‌కి ఆపోజిట్‌గా ఆపుతా అన్నాడు బోలెడంత బంగారం ధరించి భారీగా ఉన్నాయన.
అలా ఆపితే పెద్ద బళ్ళు టర్న్‌తీసుకోవడం ఇబ్బంది కదా అన్నాం. ఏమో నేను అదంతా ఆలోచించను అన్నాడు. నీ కారుకి తాళంవెయ్యలేదా ఎప్పుడూ అంటే అబ్బే తాళమా పాడా గౌరవంగా దణ్ణాలు పెడతారు అన్నాడు. అదేలే మరి నీ అవతారం పైగా తెల్ల డ్రెస్సు. నిన్ను చూస్తే కామన్ మాన్‌లాగా కనిపించవు. అందుకే నీకు మినహాయింపు అనుకున్నా మనసులో. పైకి మాత్రం మీది మంచి యోగజాతకం అనేసాం అందరం.
ఇంతలో ఓ ముప్ఫై అయిదు ఏళ్ళ కుర్రాడు వచ్చాడు. ఈమధ్యనే అమెరికా నించి వచ్చాడట. ఫర్ గుడ్- ఇదెక్కడి అన్యాయం అండీ.
దార్లో ఓ షాపుముందు ఆగాను. కారు ఇక్కడ పార్క్ చేయొచ్చా అని అక్కడున్న ఒకతన్ని అడిగాను. చేసుకో అన్నాడు. చేసాను. లోపలకెళ్ళొచ్చేసరికి లాక్ చేసేసి ఫైన్ కట్టమన్నారు. అదేవిటి నేను అడిగే పార్క్ చేసాను అంటే ఎవరో ఏట్లో రామనాథం పార్క్ చెయ్యమంటే నువ్వు చేసేయడమేనా? కట్టు ఫైన్ అన్నాడు. కట్టేసాను. కారు స్టార్ట్ చేసి కాస్తదూరం వచ్చేసరికి పోలీసు వాన్ కనిపిస్తే ఆగి కారు దిగి నాకు జరిగిన అన్యాయం వాళ్ళతో చెప్పాను. వాళ్ళు ఏమీ చెప్పకుండా తలాడించి వెళ్ళిపోయారు. నేను కారు దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ లాక్‌చేసి వుంది అని లబోదిబోమన్నాడు పాపం. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీలాగా వుంది ఈ ఆఫరు అనుకున్నాం.
వున్న తలనొప్పులు చాలవన్నట్టు ఈ కారు తాళం వొకటీ. ఏం చేస్తాం?? ఇంట్లోంచి బయలుదేరేముందు దేవుడా బయటికి వెళ్తున్నాం. మా కారుకి తాళం వెయ్యకుండా కాపాడు అని దణ్ణం పెట్టుకుని మరీ బయలుదేరదాం. ఇక ఆయన దయ, మన అదృష్టం.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading