కళ

రంగస్థల నటుడు నిరంతరాభ్యాసంలో మునిగి, అప్పటికప్పుడు ప్రయోగాత్మక ప్రతిభను కనబరిచే సత్తాను కలిగివుండాలి. వినయశీలి, ప్రకృతిని ఆరాధించే తత్వం, సమాజాన్ని ప్రేమించే నైజం... ఇవన్నీ ఆ నటునికి అదనపు బలాలు. వీటి సాయంతోనే నటుడు తన నటనా చాతుర్యంతో నాటిక/నాటకంలోని సందేశాన్ని, అందులోని నూతన శక్తిని సమాజంలోకి నీళ్ళలా వొంపగలడు. కళా ప్రయోజనాన్ని ఆస్వాదించగలడు... ఉన్నతస్థానాలకు బాటలు పరుచుకోగలడు. అటువంటి వారిలో విశాఖపట్నంకు చెందిన పివి రమణమూర్తి ఒకరు. పదేళ్ళ వయస్సులోనే రంగస్థల మెట్లు ఎక్కిన ఈయన అందివచ్చిన అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నాడు. పుణ్యదంపతులు ఈశ్వరమ్మ, శేషారావుకు జన్మించారు. తన ఇంటి దగ్గరలో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మసోత్సవాల్లో భాగంగా ఆ కార్యక్రమం ప్రారంభంలో గణపతి స్తుతి కోసం రమణమూర్తి పాల్గొన్నారు..అదేమొతలుగా రంగస్థలం వైపుగా అడుగులు వేశారు. చక్రవర్తి అనే కళాకారుడు రమణమూర్తిని భుజం తట్టి, ప్రోత్సహించారు. ఆయన ఆశయాలనే ఈయనకు ప్రేరణగా నిలిచాయి. స్నేహితులు వేసే రిహార్సల్స్‌కు వెళ్ళి, చూసేవారు. మూర్తి మొదటి గురువు కవి ప్రసాద్. ఈయన దర్శకత్వంలో పెద్ద బాలశిక్ష, దర్పణం, మంచం మీద మనిషి, తపస్సు తదితర నాటికలు వేశారు. ఇంకా కృష్ణచైతన్య దర్శకత్వంలో నేను చదువుకుంటాను, సత్యానంద్ దర్శకత్వంలో రైలుబండి, బొమ్మలాట, గంగిరెద్దులాట, వెంకటేశ్వరరావు దర్శకత్వంలో శ్రీకాంత కృష్ణమాచార్య(పద్యనాటకం), మరో సాంఘిక నాటకాల్లోని పాత్రలు అలవోకగా పోషించి, కళాభిమానులు ఆశీస్సులు అందుకున్నారు. కొంతకాలం మీగడ మల్లికార్జునరావు దగ్గర పద్యనాటకాల్లో శిక్షణ తీసుకున్నారు. ఇప్పటి వరకు 200 వరకు నాటకాల్లోని నటించిన రమణమూర్తి, వీధి నాటికలను విడిచిపెట్టలేదు.
నవరస థియేటర్ ఆర్ట్స్ అసోసియేషన్‌ను 2007 సొంతంగా స్థాపించిన రమణమూర్తి నిర్లక్ష్యం అనే నాటకాన్ని రచించారు. అదే ఏడాది ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో ఈ నాటిక ప్రదర్శనకు ఎంపికయి, పలువురి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆకలి కేక, మానుషులు కావాలి, మానవత్వమా ఎక్కడున్నావు?, మేలుకో, చైతన్యం వంటి నాటకాలను రాసి, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. నాటక రంగం మరింతగా విస్తృతపరచడంలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసి, స్టీల్‌ప్లాంట్, ఎపిఎస్‌ఇబి(టాన్స్‌కో), బిఎస్‌ఎన్‌ఎల్, షిప్‌యార్డ్ సంస్థలోని కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు.
నాటకాల్లోనే కాకుండా బుల్లితెర, సినిమాల్లోను రమణమూర్తికి ప్రవేశముంది. గుడుగుడు గుంచం, పూర్ణిమాలాంటి టీవీ సీరియల్‌ల్లోనూ సింధూరం, సముద్రం, శ్రీ ఆంజనేయం, చందమామ, ఒక్కడు, బి.రమణ దర్శకత్వంలో గౌరి, ఆది కేరాఫ్ ఎబిఎన్ కాలేజీ, యాక్సిడెంట్ తదితర చిత్రాల్లో నటించి, దర్శకత్వ శాఖల్లో కూడా పనిచేశారు. హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన టాన్స్‌ఫర్మేషన్ అనే లఘు చిత్రంలో ప్రధాన భూమిక పోషించి, ప్రముఖ సినీనటుడు, రచయిత తణికెళ్ళ భరణి, ఎంవి రఘ నుంచి ప్రశంసలు అందుకున్నారు. కర్నాటకలోని జరిగిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సంస్థ నిర్వహించిన వర్క్‌షాప్- తనలోని ప్రతిభను మరింత తీర్చిదిద్దిందని తనను కలిసిన ‘కళ’తో రమణమూర్తి చెప్పారు. 2010 నంది నాటక ఉత్సవాల్లో ఉచ్చు నాటిక ఎంపిక కావడం, 2011లో బాలల విభాగంలో నేను సైతం అనే బాలల నాటికకు పురస్కారం, అలాగే ఇటీవల గుంటూరులో నిర్వహించిన ఉత్సవాల్లో బాలల విభాగంలో స్పెషల్ జ్యూరీ, బెస్ట్ సెట్, ఉత్తమ మేకప్‌కు మూడు నంది పురస్కారాలు వచ్చి, తన బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు. వర్ధమాన కళాకారులకు ఏకాగ్రత, సమయపాలన, ఆసక్తి, కష్టపడే తత్వం వంటి అంశాలు ప్రధానంగా అలవడినప్పుడే రాణించగలరని మూర్తి తెలిపారు.
Add new comment