తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఇప్పుడు శవాలతో మాట్లాడించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు గుర్తుందా..
ఒడిషాలో భార్య శవాన్ని భుజాలపై వేసుకుని పదమూడు కిలోమీటర్లు నడిచిన రైతు మాఝీ విషాదగాధ? అతనికి బెహ్రెయిన్ రాజు నిన్న ఎనిమిది లక్షల ఎనభై ఏడువేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాడు. విచిత్రం ఏమంటే, పరాయిదేశాల ‘‘రాజులు’’ స్పందిస్తున్నారు. కాని స్వదేశీ ప్రజాతంత్ర ప్రభుత్వాలు, పాలకులు, తక్కువగా స్పందిస్తున్నారు. ఇది గుర్తించాల్సిన అంశం. ఇక్కడే ఏదో మతలబులాంటి మెలిక ఒకటి భయపెడుతున్నది.
స్వభావంలో ప్రభుత్వాలన్నీ ఒకటే. ఆచరణలో పాలకులందరి తీరు ఒకటే. దేశ ప్రధాని సోషల్ మీడియాలో పేద ప్రజలకు ‘హెల్ప్ ఇన్ ఇండియా’ అని సందేశం ఇస్తే బాగుండు అనిపిస్తుంది. ‘హెల్త్ ఫర్ ఆల్’, ‘డిగ్నిటీ ఫర్ డెడ్’ అనే ఆలోచనలు రాష్ట్ధ్రానేతలకు వస్తే ఎంత బాగుంటుంది? పొరుగు రాష్ట్రాల పాలకులు స్పదించినా బాగుండేది. కొందరు సాదాసీదా మనుషులు మాత్రమే స్పందిస్తున్నారు. ప్రభుత్వాలు మిన్నకుంటున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వాలు విధిగా ధర్మంగా స్పందించేవి. కాని వాటికి ఇప్పుడు ఏమైంది? ఏమో. తెలియదు. కాని ఏదో స్తబ్దత వైరస్ ఆవరించింది. మంచి మందు ఏదైనా కనిపెట్టవలసి ఉంది. ఈ జబ్బు జికా, డెంగ్యూ, గున్యా, జబ్బులకన్నా, ఆ వైరస్ కన్నా ప్రమాదకరం. వాటిని ఏదోరూపంలో అరికట్టగలం. అవి ఎక్కువగా సీజనల్ రోగాలు. కాని ఇప్పుడు పాలకులనీ, అధికార యంత్రాంగాలనీ పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక జబ్బులకి మందూ మలామా జాడ ఏమాత్రం కానరావడంలేదు. ఇది విచిత్రం అని అనుకుంకున్నారు కొందరు. కాని ఇలాంటి అత్యాధునిక విషాదం ప్రపంచీకరణ తెచ్చిపెట్టిన పుణ్యం. ఆధునిక ప్రపంచీకరణకు పాతకాలపు పునాది వత్తాసు ఉంది. మనం కష్టపడి నిర్మించుకున్న దేశం, రాష్ట్ర, ప్రభుత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్నింటిలో ఈ గతకాలపు వెసులుబాటు తోడ్పాటు ఉంది. దాన్ని ఖండించకుండా బయటి శత్రు నీడని ఒక్కదానినే నరికేసే సిద్ధాంతం దేశీయ దోపిడీని గుర్తించదు. ఇది ఒకరకం ప్రమాదకర ఉన్మాదం. ఇప్పుడు శత్రువు పరాయివాడు ఎంతమాత్రం కాదు. మనలోని వాడే. మనం కట్టుకున్న గూడులోని పుల్లలా అల్లుకొని కనుపించే పక్కవాడే. ఈపుల్ల అంతిమ లక్ష్యం గూడుని పగతో చెదరగొట్టడమే. మనం ఏమనుకుంటున్నాం. గూడు చెదరడానికి వీచిన తపాను తప్పు అని. కొట్టిన గాలివానది తప్పు అని. కాని అది సరికాదు.
కొత్తకొత్త రూపాలలో అర్థం చేసుకోలేని, గుర్తుపట్టని రీతుల్లో ‘చావు’ దాపురిస్తున్నది. చచ్చిన ప్రతిజీవి చావు, ఒక కొత్త పాఠం నేర్పుతున్నది. దానిని గుర్తించలేని పార్టీలు, నిర్మాణాలు, ఇంకా దేనికోసమో వెదుకుతున్నాయి. గతం శిలాక్షరాల అమలుకోసం దీనంగా ఎదురు చూస్తున్నది. సరికొత్త ప్రపంచం దాడిని అంచనా వేయలేక చదికిల పడ్డాయి.
మొన్న ఏమైందో తెలుసా?
ఒరిస్సాలోని జ్వర పీడిత అయిన భార్యని వాగులు, వంకలు, దాటించి నడిచిన రామగుడ వాస్తవ్యుడు అర్జున్ కురిసిక దీనగాథ విన్నారా? అతని భార్య ముప్పైఏళ్ల రూయమణి వారం రోజులుగా ప్రాణాంతక జ్వరంతో బాధపడుతున్నది. ఏం చేయాలో తోచలేదు. వైద్య సహాయం అందుతుందని చూశాడా వెర్రిబాగులోడు. వైద్యసహాయం కోసం 108, 102 వాహనాలుకోసం ఫోను చేస్తూ పోయాడు. ఎలాంటి స్పందన లేదు. చివరకు చేసేది లేక సొంత ఊరు నుండి నాలుగు కిలోమీటర్లున్న సమితి గ్రామానికి ఎత్తుకొని వెళ్లాడు. ఆ వూరికి రహదారి లేదు. ప్రయాణ సౌకర్యాలు లేవు. అక్కడ ప్రజాస్వామ్యయుతంగా అన్ని రకాల ఎన్నికలు సజావుగా జరుగుతుంటాయి. వాటి ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి. స్థానిక సంస్థలు పనిచేస్తుంటాయి. ఐనా మనుషులు చస్తుంటారు. శవాలను మోసుకుంటూ పోవాలి. చావడానికి సిద్ధంగా ఉన్న రోగులను మోస్తూ ఆసుపత్రికి తీసుకుపోవాలి. అప్పుడప్పుడు వెయ్యికొక ఇలాంటి సంఘటన ఎవరూ చదవని వార్త అవుతుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా హల్ చల్ చేస్తుంది. మళ్లీ కొత్త సంఘటన. పాతది విస్మరణ. ఇంతకీ రూయామణి ఏమైంది? ఆస్పత్రిలో ఆమె పరిస్థితి ఏమిటి? ఆస్పత్రిలో మందులున్నాయా? ఉంటే, వాటిని రోగికి ఇచ్చారా? అక్కడ వైద్యుడు అందుబాటులో ఉన్నాడా? లేక వార్డుబోయే మందులు రాశాడా? ఆస్పత్రి సిబ్బంది చేతులు తడపకపోతే రోగికి మంచం బదులు వరండా నేలే గతయిందా? ఏమైంది? మనకు ఆలోచించే సమయం లేదు. పోనీ. ఎక్కడకు పోతాం?
గ్రామీణ ప్రాంతాలనుండి కదులుదాం. పోయి చూద్దాం ఓసారి దేశ రాజధాని నగరం ఢిల్లీకి. రాగలరా మీరు..
ఇప్పటి దాకా అనారోగ్యాలు, మరణాలు, శవాల్ని మోసుకుపోయే మనుషుల బాధలు మాత్రమే చూశాం. ఇప్పుడు ఇళ్లు చేరని శవాల విషాద గాధలు చూద్దాం.
తూర్పు ఢిల్లీలోని కార్కార్‌దూమా ప్రాంతంలో టీకొట్టు నడిపే ఛోట్‌లాల్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతని భార్య అంజూ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నది. చేసేది లేక హెగ్డేవార్ దావఖానలో చేర్చాడు. అక్కడ ఆమె మరణించింది. శవాన్ని తీసుకొని బాధతో ఇంటికి వచ్చాడు. అప్పుడు రాత్రి పది గంటలవుతోంది. ఇంటిలోకి శవాన్ని తీసుకురావద్దని ఇంటి యజమాని బబ్లు కరాఖండిగా చెప్పాడు. లాల్‌కి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ పెద్ద ఇంటిలో అద్దెకు ఉంటున్న ఇతరులు కూడా ఏమీ ఉలకలేదు. పలకలేదు. శవాన్ని ఉదయం దాక ఎక్కడ ఉంచాలో తెలియదు. అద్పుడు ఇంటి యజమాని రెండువేల రూపాయలిచ్చి ఒక ఏసి అంబులెన్స్‌లో శవాన్ని ఉంచమని చెప్పాడు. భార్య శవంతో పాటు భర్త రాత్రంతా అంబులెన్స్‌పై ఢిల్లీ రోడ్లమ్మట తిరిగారు. కొంత సేపటికి అలసిపోయి క్రాస్ రివర్‌మాల్‌వద్ద అంబులెన్స్ ఆపుకున్నారు. అంబులెన్స్ ఇక్కడే ఉండడం గమనించిన పోలీసులు ఏదో మతలబు ఉందని వాకబు చేశారు. శవాన్ని చూసి కంగుతిన్నారు. లాల్ చెప్పింది విని, ఇంటి యజమానికి ఫోను చేసి నిజమేనని నిర్ధారించుకున్నారు. ఏదైనా కేసు అవుతుందేమోనని అప్పుడు ఇంటి జమాని అర్థరాత్రి ఇంటివద్దకు రమ్మని చెప్పాడు. ఉదయం ఏదో ఓలాగా అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇక్కడ రెండు ప్రశ్నలు ఉదయిస్తాయి. లక్షలాది జనం నగరాలకి తరలి వస్తున్నారు. విచక్షణా రహితంగా పెరిగిపోతున్న నగరాలలో పేద ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కావాలో, నగరాలు ఎలా ఉండాలో చర్చించే మంత్రిత్వశాఖలు, మున్సిపల్ శాఖలు ఇలాంటి సాదాసీదా మనుషుల సమస్యలు పట్టించుకుంటాయా?
మనషులు బతికి ఉన్నప్పుడు తిండితిప్పలు, నీరు నిప్పు అందించి ప్రభుత్వాలు, ఆలోచించని వ్యవస్థలు, మరణిస్తున్న మనుషుల గురించి శవాల చివరి క్రియల గురించి ఆలోచించగలవా? రోజూ వందలాది మంది చస్తుంటారు. అందరి గురించి ఎలా ఆలోచించగలం అనే ఒకమూర్ఖపు మాట ప్రతి అధికారి, ప్రతి నాయకుడు అంటుంటాడు. అదేరా బాబూ! నీవు ఆలోచించాల్సింది అని పౌర సమాజం అనలేకపోయింది.
బతికిన మనుషుల హక్కుల గురించి, అందులో ఆర్థిక హక్కులు, స్వేచ్ఛ గరించి మాత్రమే ఆలోచించే ప్రజాసంఘాలు బతికే హక్కు గురించి, మరణించిన శవాల హక్కుల గురించి మాట్లాడలేవు. సంఘాలు తమ రాజకీయ వ్యవస్థల చేతుల్లో, వారికోసమే ఏర్పడడం వల్ల, ఎక్కువగా వారికోసమే పనిచేస్తాయి. నోరులేని మనుషుల కోసం మాట్లాడవు. మాట్లాతామని వెళ్లినా, ఎంతవరకు? అన్న ప్రశ్నకు సమాధానం అస్పష్టం.
అంబులెన్స్‌లోని శవం తప్పక కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. నేను అద్దెకున్నప్పుడు మరణిస్తే నా ఇంటిలోకి నేను ఎందుకు రాకూడదు? నావాళ్లు వచ్చి నన్ను చూసేదాక నేనెందుకు ఢిల్లీ రోడ్లమీద అర్థరాత్రి తిరగాలి? ఇల్లు కట్టేప్పుడు, ఇల్లు అద్దెకిచ్చేప్పుడు లేని ఆంక్షలు ఆ తరువాత ఎందుకు? మనిషి పుట్టేప్పుడు ఎలా పుడతాతో తెలీదు. ఎక్కడ ఎలా పుడతాడో కాని ఎలాంటి అంత్యక్రియలు జరగాలో ఊహించగలడు. అందుకు భిన్నంగా చివరి క్రియలు బంధువులందరి సమక్షంలో, జరగాలని అందరి మానవుల ఆకాంక్ష. అందుకు భిన్నంగా ఇంట్లోకి తీసుకుపోకుండా, మంచంపైనుండి కిందవేసి పాప పంకిలమైనట్లు శరీరాన్ని శవంలా చూస్తూ దాన్ని అసహ్యించుకోవడం అమానవీయం. బబ్లూ శవానికి మాటలు వస్తే ఇంకేమి అడుగుతుందో ఆలోచించాలి.
ఇప్పుడు నగరంలో మరణిస్తే బతికిన మనుషులకి చావు మూడే పరిస్థితి రాకూడదు. ఒక మనిషి పల్లెటూరిలో మరణిస్తే మేదరి పాడెకడతాడు. కుమ్మరి కొత్త కుండ ఇస్తాడు, కాటికాపరి శ్మశానం పనులు చూస్తాడు. ఇట్లా చాలామంది మనుషుల సహకారం లభిస్తుంది. నగరంలో అదేమీ ఉండదు. మరణించి శోకంలో ఉన్నవాడిని, అదను దొరికిందని దోపిడి చేసే మనుషుల మధ్య ఎలాంటి ఆపన్నహస్తం అందకపోవడం శోచనీయం. మానవతకు అవమానం.
మరణించిన మనుషుల చివరి కోర్కెలు కాకున్నా, అంత్యక్రియలైనా సజావుగా జరిగిపోతాయనే ఆశ్వాసన కలిగించగలగాలి. పౌరసమాజం, ప్రభుత్వం రెండూ కలసి ఈ విషయంలో ఆలోచించాలి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు పేదవి. అవి నిత్యం అప్పుకూడు కోసం పాకులాడతాయి. మానవ ధర్మ నిర్వహణలో పౌరులు సంపన్నులు. విశాల హృదయులు కాబట్టి పౌర సమాజం ఈ విషయంలో ముందుకు రావాలి.
మనిషి చివరి ఘడియలు, మానవ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి గాను పథకం వేయాలి.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242