తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

అమ్మకానికి రామప్పలు, ఎర్రకోటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతికైనా, దేశానికైనా కంటికి కనబడని సాంస్కృతిక రూపాలు చాలా ఉంటాయి. సంగీతం, భాష, వౌఖిక సాహిత్యం, నమ్మకాలు, విశ్వాసాలు, క్రతుకర్మకాండలు వంటివి ఒకవైపు, కనబడే సాంస్కృతిక రూపాలు మరోవైపు దేశ ఔన్నత్యానికి ప్రతిరూపాలుగా ఉంటాయి. వీటిలో చారిత్రక కట్టడాలు, నిర్మాణాలు, గుడులు, శిల్పసంపద, చిత్రలేఖనం వంటివి ముఖ్యమైనవి. ఈ రెండు రకాల సాంస్కృతిక వారసత్వం- ఆకాశం ఉన్నంతకాలం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం, భూమి నిలిచినంతకాలం నిలిచి ఉండాలని ప్రజలు కోరుకుంటారు.
నిజానికి ఆదిమ మానవ విజ్ఞానంలో భాగంగా ఆనాడు సృష్టింపబడిన కట్టడాలు, నిర్మాణాలు ఎంతో విలువైనవి. ఇవి జాతి, దేశ నాగరికతలకు అద్దం పడతాయి. వీటిని కేవలం మత విద్వేషం తప్ప ఏదీ వ్యతిరేకించదు.. క్షీణింపచేయదు.. విధ్వంసానికి పూనుకోదు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలుగా నిలచిన నిర్మాణాలు ఎంతో అపురూపమైనవి. తక్కిన ప్రపంచ దేశాలతో పోటీపడి తమ చరిత్రతో విస్మయానికి గురిచేశాయి. అద్భుత కట్టడాలుగా పేరు నమోదు చేసుకున్నాయి. అలాంటి కట్టడాలు ఎవరి సహాయం లేకుండా వేలాది ఏళ్ళనుండి ఇప్పటి దాకా నిలిచాయి. ప్రకృతి వైపరీత్యాల నుండి, అనేకానేక మానవ తప్పిదాల నుండి తట్టుకుని నిలిచాయి. అలాంటి కట్టడాలలో వివిధ మతాలకు చెందిన ఆలయాలు ఉన్నాయి. వివిధ రాజ వంశాలకు చెందిన కోటలు ఉన్నాయి. దేశ విదేశీ మతాలకు సంబంధించిన మత, మతాతీత నిర్మాణాలూ ఉన్నాయి. చరిత్ర తెలియని కాలం నుండి మూడు నాలుగు వందల ఏళ్ళ కింద నిర్మించబడిన బహు సుందరమైన, విలక్షణ కట్టడాలు అనేకం.
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ ప్రాంతానికి చెందిన కట్టడాలు ఆ ప్రాంత ప్రజలు తమ వారసత్వ సంపదగా భావించారు. కాని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దొంగలు, స్మగ్లర్ల బారి నుండి వాటిని కాపాడడం కోసం రూపొందించిన చట్టాలను ఇపుడు ఖాతరు చేయడం లేదు. పైగా ప్రజల దగ్గర నుండి వసూలు చేసిన పన్నులలో కొంత భాగం వీటి పరిరక్షణ కోసం కేటాయించవలసి ఉండగా ఆ విషయం విస్మరించడం జరిగింది. ఆయా పురావస్తు, అభిలేఖాగార, పురావ్రాతప్రతుల, ఆలయ పరిరక్షణ శాఖలకి సంబంధించిన ఉద్యోగుల జీతభత్యాలు తప్ప ఎలాంటి పరిరక్షణ పనులకు దమ్మిడీ కూడా కేటాయించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో సులభంగా ఊహించవచ్చు. ఈ విషయాల పట్ల పౌర సమాజం స్పందించని పరిస్థితి ఏర్పడడం మరింత భయం గొలిపే విషయం.
అడవులు, జలాశయాలు, చారిత్రక తటాకాలను కూడా శతాబ్దాలుగా ఏ విధంగానూ పట్టించుకోకపోవడం సహజమైంది. ఒకవేళ ప్రభుత్వం పట్టించుకున్నదంటే వాటికి ఒక్కసారిగా వందల వేల కోట్ల రూపాయలతో మాత్రమే పట్టించుకోవడం కూడా భయహేతువే అవుతున్న ది. ఎందుకంటే ప్రజలు కట్టిన పన్నుల సొమ్ము ప్రభుత్వాలు తమ సోకులకు వెచ్చించి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు, బ్యాంకుల నుండి అప్పుతెచ్చి కాంట్రాక్టర్లకి ప్రయోజనం చేకూర్చుతున్నది.
పురావస్తు నిర్మాణాల ను కాపాడేందుకు ఉన్న శాఖలు, పోలీసు, రెవెన్యూ వంటి శాఖల సహకారంతో పురాసంపదని పరిరక్షించాలి. లోగడ ఈ సంప్రదాయం ఉండేది. కాని అలాంటి ప్రయత్నం ఏదీ ఈమధ్యకాలంలో జరగలేదు. దానివల్ల ఈమధ్య ప్రాచీన సంపదను ఎత్తుకుపోయే దొంగలను, నాశనం చేసే నేరస్థులను, వాటిని ఆక్రమించే భూబకాసురులను శిక్షించిన దాఖలాలు లేవు. పైగా ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయన్నది వాస్తవం.
ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేబట్టిన చర్యల మూలంగా మొత్తం ప్రాచీన పురావస్తు సంపద ప్రైవేటు వ్యక్తుల, సంస్థల చేతుల్లోకి పోతున్నది. భారతీయత, జాతీయత, దేశీయత అని ఘనంగా చెప్పుకునే భాజపా పాలనా కాలంలో ఈ విధానానికి తెరతీయడం విచిత్రం. కొన్ని జంతువులు తమ పిల్లల్ని తామే స్వాహా చేస్తాయి. అలాగే పురావస్తు సంపదను కాపాడవలసిన ప్ర భుత్వం తన బాధ్యతల నుండి తప్పుకోవడం, ధనరక్కసుల చేతుల్లో పెట్టడం విచిత్రాలకెల్లా విచిత్రం. భారతీయ తత్వానికి పురా సంపద బలమైన తార్కాణం. దానిని ఈ రోజున ఒక రకంగా అమ్మకానికి పెట్టారు. రేపు అందులో విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తారు. ఎల్లుండి వారు ఈ సంపదకు పరిరక్షకులు కాదు.. సొంతదారులవుతారు. అంటే వాటి అమ్మకందారులు అవుతారు. డబ్బుతో కొవ్వెక్కినట్టయితే- పెట్టుబడికి లాభాలు రావాలి. లాభాలు తీయాలంటే మార్కెట్ చేయాలి. అంటే చరిత్రని, కట్టడాల నిర్మాణాలను- భారతదేశ వైభవ చిహ్నాలను ఖండఖండాలుగా చేసి ‘పర్యాటక ఆకర్షణ’గా మార్చాలి. ఆకర్షణ ఎప్పుడూ పవిత్రతకి విరుద్ధమే. తెలంగాణ రాష్ట్రంలో రామప్ప, వరంగల్ కోట, చార్మినార్, గోల్కొండ కోట వంటి వందలాది పురాతన నిర్మాణాలను ‘అడాప్ట్ ఎ హెరిటేజ్ ప్రాజెక్ట్’ కింద ‘ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ వారు గుర్తించిన మహానిర్మాణాలను కేంద్ర సాంస్కృతిక శాఖ వారు ‘మాన్యుమెంట్ మిత్రల’కి కట్టుబెట్టారు.
ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘మీకు ఏ చారిత్రక కట్టడం కావాలి. ఏటా ఇన్ని రూపాయల చొప్పున చెల్లిస్తే దానిని లీజుకు ఇస్తాం. దాని ద్వారా మీరు లాభాలు పొందండి. వచ్చిన లాభాలతో కొంతపాటి అభివృద్ధి చేయండి.’ అన్నది ఆ ప్రకటన సారాంశం. అభివృద్ధి అనే మాటకి అర్థం లేదు. దేనిని ఎలా అభివృద్ధి చేస్తారు? కట్టడాల మధ్య ఆధునిక విశ్రాంతి మందిరం (హోటల్స్) లేదా వినోద మందిరాలు కట్టడం కూడా అభివృద్ధే కదా? అపుడు పురాతత్వ నియమ నిబంధనలు ఏమి అవుతాయి. వాటిని పాటించడానికి ఏ శాఖ పర్యవేక్షిస్తుంది.
ప్రతి ఏటా మువ్వనె్నల జెండా ఎగరేసే ఢిల్లీలోని ఎర్రకోటపై ఇకపై జాతీయ పతాకం ఎగరేయాలంటే ‘దాల్మియా భారత్’ అనే పెట్టుబడుల సంస్థ అనుమతి తీసుకోవాలి. ఈ సంస్థ కేవలం ఏడాదికి ఐదు కోట్లు చెల్లిస్తుంది. విచిత్రం ఏమంటే కేవలం ప్రవేశ టిక్కెట్ల వల్ల అంత మొత్తం వసూలు అవుతున్నది. దానిని అలా ఉంచినా ఎలాంటి నష్టం లేదు. దాని నిర్వహణ, అభివృద్ధి ఇపుడు ప్రభుత్వం చేతినుండి ప్రైవేటు సంస్థలకి ధారాదత్తం చేయబడింది. కేవలం ఏడాదికి ఐదు కోట్లు! దానిమీద ఆ సంస్థ వారు రేపు వందల కోట్ల లాభం తీస్తారు. లాభాల కోసం ఎర్రకోట రాళ్ళని అమ్మకానికి పెట్టడని చెప్పగలమా? అన్ని శాఖలూ కుమ్మక్కయి వారి చేతికి అప్పగించాక అడిగే నైతిక హక్కు ఇక ప్రభుత్వానికి ఉండదు. ఇది నిజంగా వందల బోఫోర్సు, వాటర్‌గేట్‌ల లాంటి అక్రమం. పట్టపగలు, కళ్ళముందు ఎన్నో రాష్ట్రాలలోని భారతీయ వారసత్వ సంపదని ఒకరకంగా చెప్పాలంటే కుదువబెట్టారు. మరో మాటలో- కడుపుకాలిన భాషలో చెప్పాలంటే అమ్మకానికి పెట్టారు. కొన్నాళ్లకి లాభాలు వచ్చే ఆలయాలను సైతం టాటా, బిర్లా, అంబానీ, దాల్మియా, వేదాంత కంపెనీలకు అప్పజెప్పరని గ్యారంటీ లేదు. పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడగా- పాలకులు తమకు కావలసిన సంస్థలకే కట్టబెట్టారనే ప్రచారం జరుగుతోంది. మంత్రులు అవినీతికి పాల్పడడం లేదు. కాని విధానాలే అవినీతిమయం. ప్రజల గోళ్ళూడదీసే వైనం. ఇది మొత్తం జాతి వ్యతిరేక, సం స్కృతి వ్యతిరేక, మత వ్యతిరేక చర్య.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేపట్టిన పథకం ఇది. ప్రజల వ్యతిరేకతని కూడగట్టుకుంది. కర్ణాటకలో ఓటమి చవిచూడడంతో ఓటర్లపై ఈ పథకం ప్రభావం కూడా ఉందనిపిస్తోంది. విచిత్రం ఏమంటే- ఆరెస్సెస్ పెద్దలు, విశ్వహిందూ పరిషత్ నాయకులు, బిజెపిలోని అగ్రశ్రేణి నాయకులు ఎవరూ దీని గురించి మాట్లాడకపోవడం! ఈ దేశ చరిత్రకి కళంకం తెచ్చే చర్యపట్ల ప్రజలు స్పందించవలసినంతగా స్పందించకపోవడం బాధాకరం.
రేపు జాతరలు, ఉత్సవాలు, అడవులూ, జీవ వైవిధ్య ప్రాంతాలను కూడా ప్రైవేటీకరించడానికి ఇది ముందస్తు చర్య కాబోలు. జాతీయ పవిత్ర భావజాలంతో కూడుకున్న ప్రభుత్వం నిర్వాకం ఇది. మరోసారి ఈ విషయాన్ని సమీక్షించుకోవాలన్నదే దేశ ప్రజల డిమాండ్.
*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242