తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

అంచుల మధ్య చెంచుల బతుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వస్తువు, ఇతివృత్తాన్ని బట్టి పాఠకులు ఎవరో నిర్ణయం అవుతుంది. రాయబడిన పుస్తకం వల్ల ఆవిష్కరణ సభ ఎలా ఎక్కడ జరగాలో కూడా నిర్ణయం అవుతోంది. అలాంటి కార్యక్రమం మహబూబ్ నగర్‌లోని నల్లమల దగ్గర గల మన్ననూరులో 9 డిసెంబర్‌న ఒక పుస్తకం విడుదల సభ జరిగింది. దాని గురించే ఈవారం ముచ్చట్లు.
‘మరణం అంచున’ అనే పుస్తకాన్ని వర్దెల్లి మురళి అనే పాత్రికేయుడు రాశాడు. 2001లో బీఈడీ చదువుకోసం తెలకపల్లి వెళ్లాడు. అప్పుడే చెంచుగూడేలకు వెళ్లడం తటస్థించింది. అది మొదలు ఈనాటి దాకా వారిని అతడు మరిచిపోలేదు. వెళ్లినప్పుడల్లా వారితో మాట్లాడిన విషయాలు నోట్స్ రాసుకున్నాడు. ఆ కాగితాలతో ఓ పుస్తకం రాస్తానని ఏనాడూ అనుకోలేదు. ఒకసారి అక్కడకు వెళ్లి వారితో గడిపిన ఆ కొద్ది సమయంలో వారితో ఆత్మీయానుబంధం ఏర్పడింది. వారి జీవనశైలి, కడగండ్లు చూసి చలించనివారు తక్కువ. అలాంటి వారిలో వెంకన్న ఒకడు. ఐతే వెంకన్న చాలా మందికన్నా ఈవిషయంలో ప్రత్యేకమైనవాడు. ఎందుకంటే ఆ తరువాత కూడా వారి స్నేహం కోసం పరితపించాడు. మొదటిసారి వెళ్లినప్పుడు పరిచయమైన అప్పాపురం పెద్ద తోకల గురవయ్య, ఆ తరువాతి పర్యటనలో పరిచయమైన రాంపూర్ పెంట నివాసి పెద్ద లింగయ్య తదితరుల జ్ఞాపకాలు వెంకన్నను వదలిపెట్టలేదు.
పెద్ద లింగయ్య ఫోటోని తన పుస్తకానికి ముఖచిత్రంగా వేసుకుని చూసుకుంటున్నాడు. కాని లింగయ్య జ్ఞాపకం అత్యంత విషాదం. అతని గుడిసెని వల్లకాడుగా పేర్కొన్నాడు రచయిత. ఆయన కుటుంబానికీ, శ్మశానానికీ మధ్య బాట పడిందని రాస్తాడు ఓచోట. 2010లో లింగయ్య అత్త విరేచనాలతో చచ్చిపోయింది. లింగయ్య చిన్నబిడ్డ లింగమ్మ నాలుగో తరగతి చదువుతూ విరేచనాలతో మరణించింది. అంతకు ముందు కొంతకాలం క్రితం పెద్దబిడ్డ భర్త పోయాడు. మలలమ్మ చెంచు కోనలో జనన మరణాల జాబితా ఉండదు. పులుల లెక్క మాదిరే స్పష్టం కాదు. లింగయ్య కుటుంబంలో ఇప్పుడు ఎందరున్నారు. అసలు ఉన్నారా అని దిగులు కలుగుతుంది. అప్పాపూర్ కొండ కోనలలోని గురుకుల పాఠశాల వంటమనిషి చిగుర్ల ఎల్లయ్య రచయిత గైడ్. ఆయన, ఫరహబాదు వ్యూపాయింట్ దగ్గర పనిచేసే తోకల మల్లయ్య ఇద్దరూ ఇప్పుడు జ్ఞాపకాలయ్యారు. ఎల్లయ్య రోడ్డు ప్రమాదంలో మరణించాడు. లింగయ్య గుడుంబా తాగి కడుపులో మంటలేచి వేకుజామున చచ్చిపోయాడు. వీరి అకాల ఆకస్మిక అసందర్భ చావులు రచయితని ‘మరణం అంచున’ రాయించింది.
ఇప్పుడు చెంచు జాతిని మొత్తం నామరూపాలు లేకుండా చేయడానికి ఎక్కడెక్కడో, ఎవరెవరో పావులు కదుపుతున్నారు. అడవితల్లి ఒడి నుండి గిరాటేసి, సిమెంట్ రోడ్ల మీద శవాల గుట్టలు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు.
తాగడానికి నీరు, తినడానికి తిండి, రోగానికి మందులు, చలికి దుప్పటి లేకుండా బతుకుతున్న వాళ్లని వాళ్ల ఆవాసాల నుండి తరిమికొట్టడానికి మనం చేసే కుట్రలు ఇన్నని కావు. ఈ నేపథ్యం మనసులో ఉంది కాబట్టే పుస్తకం పేరు అలా పెట్టాడు.
పులుల పేర, ఖనిజాల పేర, వజ్రాల తవ్వకాల పేర చెంచులను తరిమికొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు ఎంత గుంభనంగా జరుగుతున్నాయంటే ఎవరికీ ఏమీ అర్థం కావడంలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో వెంకన్న మాత్రం చెంచుల వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకు పోవడం కోసం నిర్ణయించుకున్నాడు. దానికి తన పుస్తకం విడుదల అనే మిషని ఎంచుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో అనితరసాధ్యంగా కృషి చేసినవాడు, ఇప్పుడు నీటిపారుదల శాఖా మాత్యులుగా ఉన్న టి. హరీశ్ రావు వెంకన్నకు మిత్రులు. ఈ పరిచయాన్ని ఒక మంచిపనికి వినియోగించాలని భావించాడు.
మన్ననూరు అటవీ ప్రాంతంలో ఓసారి ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు చేశాక మంత్రిగారు రాలేకపోయారు. హైదరాబాదులో ఆవిష్కరణ చేద్దామని ఎంతమంది ఎంత నచ్చ చెప్పినా వినలేదు. తిరిగి మూడు నెలల తర్వాత అక్కడ అదే మంత్రిని రావించి ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశాడు.
ఆకాశహార్మ్యాలు, సచివాలయ కార్యాలయాలు, నియోజకవర్గాల జంజాటనలు, మంత్రిత్వ శాఖా హద్దుల పద్దుల మధ్య సంచరించే రాజకీయ నాయకులకి వారికి చెంచులు ఓ లెక్కలోకి రారు. పుస్తకం విడుదల అతిచిన్న కారణం. మన్ననూరు చెంచు అటవీ ప్రాంతం ప్రాణాపాయం అని నిఘావర్గాలు అంటాయ. అన్నింటిని ఆవలపెట్టి చెంచులకోసం ఓ మంత్రీ, తదితర నాయకగణం, చెంచు ఆదివాసీ మిత్రులు ఆ సభకి తరలి వచ్చారు.
చెంచుల ముంగిట్లోకి వచ్చి వాళ్ల మధ్య కూర్చుండి వాళ్ల సమస్యలు వినడానికి గుండె దిటవు కావాలి. సభాముఖంగా వాళ్ల సవాళ్లని ఎదుర్కోవాలి. ప్రభుత్వానికీ, దాని పాలసీకి, వ్యక్తిగతంగా ప్రజాప్రతినిధులకి అసౌకర్యం కలిగించవచ్చు. కలిగించింది కూడా. ఐనా ఇచ్చిన మాట మీద నిలబడి అక్కడకు రావడం చాలామందికి నచ్చిన విషయం. సభలో తోకల ఈశ్వరమ్మ మాట్లాడిన మూడు మాటల్లో-రాజకీయ నాయకులు వస్తారు, మాట్లాడతారు, వెళ్లిపోతారు. వాళ్ల హామీలు ఏమయ్యాయో ఒక్కసారి కూడా ఆలోచించరని ముఖంమీదే అన్నది. విసురుగా ఉన్న మాటే చెప్పేసి వేదిక దిగిపోయంది.
నిజానికి ప్రభుత్వం పెట్టిన ఖర్చుతో చెంచు కోనలు బంగారురోడ్లతో, వెండి ఇళ్లతో, వజ్రాలు పొదిగిన బోరింగుల మధ్య ప్రకాశించాలి. వివిధ శాఖల ద్వారా అంత డబ్బు ఖర్చు అయింది. కానీ ప్రపంచంలో అత్యంత పేదగా, వసతులు లేని బతుకులు వారివని అన్నాను. పుస్తక సమీక్ష చేయమంటే చెంచు బాధల చిట్టాని విప్పాను. రెండు మైళ్లు నడిచి బిందెడు నీళ్లు తెచ్చుకోవాలి. ఒక్క అప్పాపురం ప్రాంతంలో ముప్పై బోరింగులు వేసారు. ఒక్కటి కూడా పని చేయవిప్పుడు. కరెంటు లేదు. సోలార్ మిషన్లు పనిచేయవు. టీవీలు లేవు. అంధకారపు బతుకులవి. ఏ అభివృద్ధి అక్కడ కానరాదు. కాగితాల కట్టలపై అంతా అభివృద్ధే అని చెప్పినప్పుడు సభికులు చప్పట్లు కొట్టాలా వద్దా అన్న ఆలోచనలో పడిపోయారు. విషాద విస్మయాలు అల్లుకుపోయాయ.
వారికి పంట తీయడం రాదు. పంటవేస్తే అవి పక్షులకీ, అడవి పందులకే. నీళ్లు లేవు. అడవి ఉండీ వానరాదు. భూమి తల్లి రొమ్ము పాల చెలిమలు ఎండిపోయాయి. అడవి జంతువులకీ నీళ్లు గతిలేవు. పక్షులు, జంతువులు, పులులు, కోతులు, పాములతో సహా అక్కడ బతకలేని పరిస్థితిలో వలస వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్క చెంచుతప్ప. అనాది తమ ఆవాసాన్ని వదిలితే అడవి తల్లి ఒంటరి అవుతుందని వాళ్ల భావన. తమ చివరి ప్రాణాలు అక్కడే వదలడానికే సంసిద్ధత.
ఏం చేద్దాం?
ఓసారి చెంచుగూడేల్లో పర్యటించినప్పుడు కుమ్మని పెంటలో నిద్రరాని అర్ధరాత్రి మొండ్లి అంజన్న లేచి వెంకన్నా! ఈ బతుకుల్ని చూడ్డానికి హరీశన్న ఇక్కడికి ఎన్నడైనా వస్తడంటవా అని ప్రశ్నించాడు. ఆ మాట విన్నాక ఇక రాత్రంతా వెంకన్నకు నిద్రపట్టలేదు. అతడిని తీసుకురావాలంటే ఏం చేయాలి? రాసుకున్న నోటుబుక్కులు చేతికి తగిలాయి. చెంచులపై పుస్తకం రాయడానికి అదీ కారణం అన్నాడు వెంకన్న. మరో కారణం మెదక్ జిల్లా. పాపన్నపేట మండలంలోని కుర్తివాడలో వడగళ్ల వానవల్ల తడిసి ముద్దయిన ధాన్యం క్రితం రోజు ఖమ్మం మార్కెట్ యార్డులో వడగళ్ల వానలో వేల క్వింటాళ్ల ధాన్యం నీట మునిగింది. ఆ రైతుల విషాదం చూసి ముందు ముద్దలా కూర్చున్న రైతుని చూసాడు. తెలంగాణలో తడిసిన ధాన్యానికి క్వింటాలుకి ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సిందే అని అప్పటికప్పుడు సిఎంతో ఒప్పించాడట హరీష్. అందుకే, ఏది ఏమైనా నల్లమలకి ఆయనే రావాలని నిర్ణయించుకున్నాడట వెంకన్న. ఇదే విషయం సభాముఖంగా చెప్పాడు రచయిత. కొన్ని అనుమానాలు పోయాయి. మరికొన్ని పెరిగాయి.
నిజంగా హరీష్ చెంచుల భాగుకోసం ఏమైనా చేస్తాడా? ఓ రెండు హామీలైనా ఇవ్వగలడా? ఇదీ సభలో కూర్చున్నవారి ఆలోచన.
సూర్యుడు నల్లమలలో తన ప్రతాపం చూపించి చీకటిలోకి అడుగులు వేస్తున్నాడు. ఐనా ఎవరూ తొందర పడడంలేదు. సభ జరిగిపోతున్నది.
ఎన్నికలకోడ్ చెంచులకి శాపమైంది. అందువల్ల మంత్రిగారు స్పష్టంగా ఏ హామీ ఇవ్వలేకపోయారు. కానీ సమస్య అర్ధమైంది. అత్యవసరమైన కొన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. తాను చెంచుల పక్షమేనని తెలియజేశాడు. అసెంబ్లీలో చర్చించి వారికి కావాల్సినవి సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. ఒక కమిటీ వేసి వారిని ఆదుకోవడానికి పథకం వేస్తామని హామీ ఇచ్చారు.
చెంచులపై పుస్తకం సుమారు పదివేల మందిచెంచుల మధ్య విడుదల అయింది. రేపు ఏమవుతుందో వేచి చూడ్డం మిగిలిపోయింది.
ఆరోజు ఉదయం మేం వందలాదిమంది చెంచు బంధువుల మధ్య బి.డి.శర్మ సంస్మరణ సభ జరుపుకున్నాం. నినాదాలు ఇచ్చాం. చెంచులను, అడవిని కాపాడ్డానికి శపథం తీసుకున్నాం. తెల్లారి మలలమ్మ కోనకెళ్లి దుప్పట్లు పంచాం. చెంచుపిల్లలకు అందంగా కుట్టించిన కొత్త రెడీమేడ్ దుస్తులు పంచాం. బైరాపూర్ చెరువులో పూసిన తెల్లతామర పూల్లా మెరిసిన వారి వదనాలలో చిరునవ్వుల్ని చూశాం. ఆ చెరువు పక్కనే వున్న అమరవీరులు పోతుల సుదర్శన్‌రెడ్డి, ఆయన సహచరి అరుణ సమాధుల ముందు వినమ్రంగా తలవంచాం. వారి ఆశయాలు, ఆచరణలో నల్లమల ఆనాడు బతికి బట్టకట్టింది. చెంచు ప్రజలకు మంచి జరగడానికి కొన్ని తాత్కాలిక చర్యలు, దీర్ఘకాలిక యోజనాలు రెండు అవసరమే. ఒకదానికొకటి పోటీపడి ముందుకు సాగాలి. ఎవరు ఏం చేసినా అది ఎంతోకొంత మంచికి దారి తీయాలి.
చెంచుల్ని బతికించడానికి నూలుపోగు కూడా అవసరమే. మన కరచాలనాలు కొన్ని వాళ్లకు ఆశ్వాసాలుగా ఉంటాయ. ముందు వారి గుండె దిటవు పెంచేందుకు కొన్ని చర్యలు అవసరమని పిస్తోంది.

తొవ్వముచ్చట్లు జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242 jayadhirtr@gmail.com