తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

నిర్వాసితులపై సర్కారీ ప్రచారపు దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు రాష్ట్రాల్లో పరిపాలన నడిచినా, నత్తలా సాగినా, సాగకపోయినా ‘అభివృద్ధి’ మాత్రం పరుగులు తీస్తున్నది. ఓసారి అటు ఓమాటు ఇటు, అభివృద్ధి తక్కెడ ఎక్కువ తక్కువలు రెండు వేపులా సమంగా.
ఇక్కడే కాదు, దేశం మొత్తం మీద అభివృద్ధి మంత్రం వీస్తున్నది. పాలకులు దానిమీద తమ ప్రాణాలు నిలుపుకుంటున్నారు. అదేపనిగా దాని నామ స్మరణం. దానినే రామనామంలా పఠిస్తున్నారు.
వెనకట తపోభంగం కలిగిస్తే ఒక శాపం విధించేవారు. అట్లాగే ఇప్పుడు పాలకులు అభివృద్ధిని ప్రశ్నిస్తే అనేక శాపనార్థాలు పెడుతున్నారు. అంతటితో ఆగిపోతే సరిపోదని తమ పెంపుడు జంతువులతో భయభ్రాంతులను చేస్తున్నారు. మరోవైపు, ప్రతిపక్షం లేకుండా సమూల నిర్మూలనా పథకాన్ని ప్రజలకోసమే రచిస్తున్నారు. పరిపాలనా కాలాన్ని అందుకనే వినియోగిస్తున్నారు. నినాద ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. అనే్నసి నినాదాలు సృష్టించే సృజనశక్తి ప్రభుత్వాలకు ఉన్నందుకు అభినందించలేక పోవడం క్షమార్హం కాదు. ఒక్క అభివృద్ధి అనే మాటని ఎనె్నన్ని రంగాలలో, ఎనె్నన్ని కోణాలలోనో చూపగలిగే శక్తి సంపన్నత పాలనా యంత్రాంగం కలిగి ఉన్నందుకు ఆయా రాష్ట్రాల ప్రజలు సంతోషించాలి. అభివృద్ధిలోంచి ప్రజలను మైనస్ చేసి ప్రైవేటు శక్తులకే పరిమితం చేసినందుకు సహజంగానే కొంతమంది బాధపడతారు. పడనీయండి. ఎలాగూ వారు బాధపడక తప్పదు. ఎవరైనా ఏం చేస్తారు? ప్రభుత్వాన్ని కూలదోయడానికి వారికి ఎలాగూ సాధ్యంకాదు. ప్రజలు బేలగా ఏడ్చినప్పుడు ఓ బిస్కత్తు పడేయాలి. అది ఏం బిస్కత్తని మాత్రమే మేధావులు చర్చిస్తుంటారు. ఒక్క బిస్కత్తు చాలదని బల్లగుద్ది చెబుతారు. ఎన్ని బల్లలని గుద్దగలరు. సాయంకాలం వరకు చేతులు పులిసిపోతాయి కదా. అసలు వీరు మాట్లాడే తీరు, విషయం ప్రజలకు ఎలాగూ అర్థం కాదు. వారు ప్రజలను ఏనాడూ ఒక శక్తిగా గుర్తించరు. గుర్తించినా వారితో వారి గుడిసెముందు కలిసి సంభాషించలేదు. అందుకే ప్రజలు కూడా వారిని పెద్దగా ఖాతరు చేయరు. చేసినట్లు కనిపిస్తారు. కాని లోలోన చేయరు. ఎన్నికలప్పుడు వీరి అభిప్రాయాలను పట్టించుకోరు. ఉద్యమాలలో మేధావులే భీకరంగా తెలివిగా, అసహనంతో పాత రోకటి పాటలు పాడుతుంటారు. ఈ విషయం ప్రజలకన్నా పాలకులకి ఎక్కువ తెలుసు.
నేను, నావర్గం, నాకులం అనే బూర్జువా భావన లాగే, నేను, నాపార్టీ, నా గ్రూపు అనే పరిధిలోనే మేధావులు తమకు తామే గిరిగీసుకోవడం ఈనాటి శాపం. ప్రజల సాధారణ సమస్యను సైతం నేను, నాపార్టీ, నా గ్రూపు అనే సంకుచిత పరిథి కిందకు దిగజార్చే పరిస్థితి కూడా నిరంతరం అభివృద్ధి చెందుతోంది. అశేష ప్రజల అభివృద్ధి పేరున కొద్దిమందే లబ్దిదారులుగా మారుతున్నారు. ఒక సమస్యపై తుదికంటా మేధావులు ఉద్యమించరు. పలు సమస్యలపై పలు రకాలుగా గళమెత్తి అసలు సమస్యని జటిలం చేస్తుంటారు. అలా ప్రజలకు అర్థం కాకుండా, చేయగలిగిన సత్తా కలిగిన మేధావుల సంఖ్య పెరుగుతున్నది. ప్రజలతో వారి లింకు తరిగిపోతున్నది. అందుకే మేధావి వర్గం భావన వేరు. ప్రజాభిప్రాయం, అవసరం వేరయ్యింది. ప్రజలు తమకై తాము తమ సమస్యలపై చైతన్యవంతులై ఉద్యమించారో అక్కడ విజయం ఆవరిస్తున్నది. కేవలం మేధావి వర్గం, ప్రగతిశీల వర్గం- నేను, నా పార్టీ, నా సంఘం, నా గ్రూపు అనే దృక్పథంతో పనిచేస్తున్నారో అక్కడ యధాతథ పరిస్థితి కొనసాగుతున్నది. మేధావులకు కొంత పాపులారిటీ లభించి మేధావిగా గుర్తింపు రావడానికి ఎక్కువ అవకాశం పెరుగుతున్నది. అంతే. అదే పదివేలుగా భావించి, ఈ విధానం బాగున్నదని నిర్ణయించుకొని, ఈ పద్ధతినే పట్టుకొని విడవకుండా తగులుకున్నారు.
అభివృద్ధి నమూనా మారాలనే సాధారణీకరించిన భావనని పలుమార్లు, పలు రీతులలో అలాఅలా వ్యక్తం చేస్తుంటారు వీరు. దానికి ఎలాంటి ప్రత్యామ్నాయం నిర్దిష్టంగా చూపరు. అలా చూపడానికి నిరంతర అధ్యయనం, అవగాహన ముఖ్యం. దానికి చాలా శ్రమ అవసరం. సమయం కూడా చాలానే పడుతుంది. అంత సమయం కేటాయించడం కుదరదు. ఆ సమయంలో మరెన్నో పత్రికా ప్రకటనలు, సభలు సమావేశాల్లో వీరావేశ ఉపన్యాసాలు ఇవ్వొచ్చు. తిరిగి అవి పత్రికల్లో వార్తలై, ఫోటోలై ఇంత పేరు తెస్తాయి. దాంతో మేధావి ఇగో చల్లబడుతుంది. మరో సమస్య తలెత్తే వరకు హేపీ.
రొటీన్ మేధావుల తీరు, నమూనా చాలా మందికి నచ్చుతుంది. ఒకే అంశం పట్ల నిరంతరం పోరాటం చేయడం అనవసరం. తత్కాలం ఒక ప్రెస్‌మీట్ పెట్టినా చాలు. దానికి ఎలాంటి కొనసాగింపు లేకపోయినా అడిగే నాథుడు ఎవడూ ఉండడు. అందుకే తామరతంపరగా సంస్థలు కొత్తగా పుడతాయి. గిడతాయి. అవి అలా చెలామణి అయి, కానట్లు ఉంటాయి. ఇలాంటి సంస్థల నిర్వాహకులు పైన పేర్కొన్న మేధావులను పిలిచి మాట్లాడిస్తారు. పుణ్యం పురుషార్థం కలసి వస్తుంది. ఆత్మతృప్తి మిగిలిపోతుంది. పరనింద బారి నుంచి తప్పించుకోవచ్చు. చూశారా. మేం కూడా స్పందించాం అని లోకానికి చెప్పవచ్చు. పైగా సోష ల్ మీడియాలో ఇంచక్కా ఫోటోలతో హల్‌చల్ చేయవచ్చు.
ఇప్పుడు, ఎన్నడూ లేని విధంగా కొత్త సర్కారీ మేధావులు సంపాదకీయ పేజీలకు వేలాడుతున్నారు. కేవలం అభివృద్ధిని ప్రభుత్వం దృక్కోణంలోంచి మాత్రమే ఎత్తి చూపే విపరీత పరిస్థితి కొత్త రాష్ట్రాలలో గణనీయంగా పెరిగింది. పచ్చకళ్లకు అంతా పచ్చగానే కనుపించినట్లు ఈ సర్కారీ వ్యాసకర్తలకు ప్రతి అభివృద్ధి కార్యక్రమం లోక కళ్యాణమే. భూ నిర్వాసితుల, ఆవేదన, ఆందోళన, ముంపునకు గురయ్యే బతుకు రోదనలో సైతం లోక కళ్యాణం గోచరిస్తున్నది. నిజానికి రిడిజైన్‌లన్నీ ప్రస్తుత పాలక వర్గాల ప్రయోజనాలే.
పంట పండే రైతు భూములను బలవంతంగా కొనుగోలు చేస్తుంటే అలా చేయవద్దని కొరే రైతులు అభివృద్ధి నిరోధకులట. అది నిజం అని అన్న ప్రతి మనిషి ఒక నేరస్థుడేనట. ప్రజలకు వ్యతిరేకంగా ఒక గ్రూపుని, ఒక సంస్థని ఏర్పాటు చేసి ఊరు ఖాళీ చేసే ప్రజల పక్కలో బల్లేలు మొలిపిస్తున్నారు. పట్టుబట్టి రైతుల సంతకాలు పెట్టించే పనికి పూనుకున్నారు. ఖాళీ పత్రం మీద సర్వ హక్కులు మీవే అన్న చందాన సంతకాలు సేకరిస్తున్నారు. ఉద్యమం అనుభవం అంతా ప్రజల మధ్య చీలికలు తేవడానికే ఉపయోగపడుతోంది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణలో భూములు కోల్పోయే రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కొత్తగా భూసేకరణ కోసం ఇచ్చిన జి.వొ.నెం.123 ప్రకారం రైతులకు ఇష్టం లేకుండా ఆ భూమిని సేకరించడం తగదని హైకోర్టు స్పష్టం చేసింది. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల్ని ఇక్కట్లకు గురి చేయవద్దని మహబూబ్ నగర్ జిల్లా అధికారులను ఆదేశించింది. భూములు కోల్పోయేవారు కారుకొండ గ్రామం రైతులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించడం ఒక మలుపు.
ఈ తీర్పు వెలువడిన తెల్లారినుండి మెదక్ జిల్లాలో పధ్నాలుగు పచ్చని ఊళ్లని ఏబై టీఎంసీల రిజర్వాయర్‌గా మార్చడానికి వ్యతిరేకిస్తున్న ప్రజలపై ప్రభుత్వం దాడి ముమ్మరం చేసింది. ఈ వారం రోజుల్లో చాలా దినపత్రికల్లో ప్రభుత్వం ఎలా వార్తలు రావాలని కోరుకుందో అలాగే వేశాయి. పేజీలనిండా అధికార ప్రతినిధుల స్వరమే. ఆందోళన చేసే రైతుల పక్షం వార్తలు మూలలకు నెట్టివేయబడ్డాయి. చాలా వార్తలకు అతీగతీ లేదు. సంపాదకీయం పేజీ వార్తలలో చాలా వరకు సర్కారు ప్రకటనలే.
ఇది ఒక విచిత్రం. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రజలను విస్మరించి ప్రభుత్వం పక్షాన పత్రికలు చాలా వరకు మేనేజ్ కాబడడం పత్రికా స్వేచ్ఛ నుదిటిపై చెరగని దిష్టి చుక్క.
ముఖ్యమంత్రి వింగ్‌లో గల సిఎం పిఆర్‌వో ఉద్యోగులు, నీటి పారుదల శాఖ మంత్రి పేషీ ఉద్యోగులు ఈ విషయం గురించి రాసిన, రాయించిన వ్యాసాలతో పత్రికలు తరించిపోయాయి. ఇంతలో ఇంతటి మార్పు వచ్చిందెలా అని తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గోబెల్స్ ప్రచారం అనే నానుడి ఒకటుంది. ఆ స్థాయి నుండి ప్రచారం అభివృద్ధి చెంది ఇలాంటి కొత్త ధోరణికి తెరతీసింది. విచిత్రం ఏమంటే ఈమధ్య మొదటిసారి హైకోర్టు ప్రజల గోడు విన్నది. ఇష్టారాజ్యంగా తీసిన, ప్రభుత్వ జీవోని ప్రశ్నించింది. కాని ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా మళ్లీ కోర్టుకు వెళుతుంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని బెంచ్ బలంతో కొట్టిపారేయకపోదని ప్రజలు భయపడిపోతున్నారు. చూద్దాం. న్యాయం గెలుస్తుందా? అధికారం గెలుస్తుందా?