తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ప్రజాకవి మరణం వెనుక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాయపరిచే వాస్తవాలతో కాలగమనం. ఐదురోజుల వ్యవధిలో రెండు మరణాలు.
మొన్న 21వ తేదీన నూటనలభయ్యేళ్ల కింద జన్మించి, అరవైఏళ్ల కింద మరణించిన గొప్ప కవి, నాటకకర్త చందాల కేశవదాసుపై సభలు జరిపి పునర్జన్మించే యత్నం చేశాం.
ఆ తెల్లారే ఒక ప్రజాకవి, తెలుగుపాటకు చిరునామాగా ఉన్న గూడ అంజయ్య ఆవలితీరం దాటాడు. సమాజంలోని పేరుకుపోయిన రుగ్మతలకు చికిత్స చేసీచేసీ బలహీన పడి అనారోగ్యంతో ఇక చావే మేలని తెలిసితెలిసి పోయాడు. నిమ్స్ నుండి వచ్చిన తెల్లారే.
మెదక్ జిల్లా తోగుట మండలం పరిసర ప్రాంతాలలోని పధ్నాలుగు గ్రామాల్లో వేములగాట్ ఒకటి. ముక్కారు పంటలు పండే పధ్నాలుగు ఊళ్ల నీ, వూరి పొలాల్ని మానవ కళేబరాలతో ముంచి కట్టే మల్లన్న సాగర్ ముంపుగ్రామం అయిన వేములగాట్‌లో చాలా రోజుల నిరసనదీక్ష చేసి మొన్న రాత్రంతా కుమిలిపోయి, కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్న అరవైఏళ్ల సత్తవ్వ తీవ్ర నిరాశకు గురై గుండె ఆగి మరణించింది.
ఒకటి సహజమరణం. రెండోది ప్రభుత్వ హింసవల్ల సంభవించిన బలవంతపు మరణం.
గూడ అంజయ్యతో ముప్పై ఐదేళ్ల అనుబంధం. పోయిన నెలలో ‘తెలంగాణ రచయిల వేదిక’ తరపున రచయితలతో కలసి మల్లన్నసాగర్ ముంపు గ్రామాల పర్యటనలో చూసిన ఆ తల్లివదనం.
ఈ రెండు ఘటనలు ఈ వారం నన్ను అమాంతం ఆవరించిపోయాయి. పైగా ఈ రెండు చావులలో దేనిమీద ఈవారం ముచ్చట చెబుతావో చూస్తాం అనే పైకి కనబడని, వినబడని సవాలు.
మూడు రోజుల ముందు మరణించిన గూడ అంజయ్య గురించి రాశాక, వచ్చేవారం సత్తెవ్వ తల్లి విషాదం గురించి మాట్లాడక తప్పదని నిర్ణయించుకున్నాక గాని కలం ముందు కదలలేదు.
ఊరువాడలను ఏకం చేసిన అంజన్న అరవైరెండేళ్ల కిందట ఆదిలాబాదు జిల్లా, దండేపల్లి మండలంలో అట్టడుగు దళిత కుటుంబంలో జన్మించాడు. అంరానివాడుగానే ఆఖరి బెంచీలో కూచుని చదువుకున్నాడు. ఒంటరిగానే జీవన పోరాటం చేశాడు. ఆదిలాబాదు, హైదరాబాదుల్లో చదువుతూ విప్లవోద్యమంతో పరిచయం అయ్యాక ప్రజల కళాశాలలో చేరి విప్లవ గీతాలు రాయడం ఆరంభించాడు. నూనూగు మీసాల వయసులో రాసిన మొదటి పాట హిట్టయ్యింది. ‘‘ఊరిడిసి నే బోదునా/ఉరిపెట్టుకొని సత్తునా’’ అనే పల్లవి ప్రజల పాటలకు వరవడి దిద్దింది. ఆనాటి దీన జనావళి బతుకులకి అద్దం పట్టింది. 1971 సభలో రాసిన పాట 1974 ప్రాంతంలో హైదరాబాదులో జరిగిన పిడిఎస్‌యు సభలో పాడినప్పుడు ఎంతో ప్రజాదరణ పొందింది. అది రాష్టవ్య్రాపిత ఉద్యమ గేయాల పట్టికలో అవలీలగా చేరిపోయింది.
ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే నల్లగొండ జిల్లాలో జరిగే రైతుకూలీ సంఘం మహాసభలో వినిపించిన ‘‘ఊరు మనదిరా..వాడ మనదిరా..’’ అనే పాట రైతాంగం హృదయాలను ఆలింగనం చేసుకున్నది. అనతికాలంలోనే రాష్టమ్రంతటా మారుమోగింది. రైతాంగం ఇరుసుగా పోరాడే పార్టీలు, ఉద్యమాలు, గాయకులు ఈ పాట పాడక తప్పలేదు. ఇంత సులభంగా, చిన్నిచిన్ని పదాలతో, పాడడానికి అమితమైన సులభశైలి కలిగిన పాట మరోటి కనిపించలేదు. ఊరు-దళిత వాడలు రెండూ మనవే, అసలు దొర ఎవరు, దొరతనం ఏమిటి అని ప్రజల గొంతుకలోంచి వెలువడిన ప్రశ్నగా పాట ఉరుకుల పరుగుల ధ్వనులతో ప్రచారం అయ్యింది. ఆ తరువాత అంజయ్య రాసిన పాటలు కూడా అంజయ్యవి కావు! అవి ప్రజలవే! రెండు దశాబ్దాల తరువాత ఒక సినిమా నిర్మాత కవి ఎవరో తెలియకనో, పాట రచయితని గుర్తించ నిరాకరించో, ‘ఊరు మనదిరా’ పాటని వక్రీకరించి వాడుకున్నారు. అప్పుడు అంజయ్యకు మొదటిసారిగా తన పాటలు తనవనే స్పృహ వచ్చింది. అది తన పాట అని, దాన్ని వక్రీకరించడం, సబబు కాదని ప్రకటన ఇచ్చాడు.
అలా ఎందుకు జరిగిందంటే-
ప్రజలకోసం, ఉద్యమాలకోసం రాసిన పాటని ప్రజలు కొద్దిగా మార్చుకొని, కలుపుకుని తమవిగానే భావిస్తారు. ఆ పాటలు వారి జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. వాటి రచయిత ఎవరు అని వాళ్లు చూడలేదు. ఎవరు పాడుకుంటున్నారో కవి పట్టించుకోలేదు. విప్లవోద్యమంలో పనిచేస్తున్న పార్టీలు, గ్రూపులు ఇలాంటి జనం పాటలను తమ వేదికలపై దశాబ్దాల తరబడి పాడుకున్నారు. ఏనాడూ ఎవరూ ఎలాంటి అడ్డు చెప్పలేదు. చండ్ర పుల్లారెడ్డి వర్గం అరుణోదయ, పీపుల్స్‌వార్ పార్టీ, జననాట్యమండలి, ప్రజానాట్య మండలులు ఈ పాటలను తమకు నచ్చిన రీతిలో పాడుకున్నారు. ఇదొక గొప్ప సాహిత్య విషయం. రాజకీయ ఎత్తుగడలతో స్పర్ధలు పెరిగి, హత్యలు కొనసాగినా ‘సాహిత్యం’ విషయంలో ఇచ్చిపుచ్చుకునే పద్ధతి అమలు అయ్యింది. అంజయ్య పాటలు గద్దర్ పాపులర్ చేశారు. ప్రజా ఉద్యమంలో వీటిని భాగం చేశారు. ఊరు మనదనే ఆ ఒక్కపాట పదహారు భారతీయ భాషల్లోకి అనువాదమైంది. దేశానికంతా తెలిసిన అతికొద్ది పాటల్లో అది ఒకటి.
అందుకే అంజయ్య ఇలా అన్నాడు-‘ప్రజల్నించి సేకరించిన జీవితాలు ఈ పాటల రూపంలో మళ్లీ ప్రజల్లోకి వెళ్లాయి. కళలకు, సాహిత్యానికి ఇంతకన్నా గొప్ప ప్రయోజనం ఏమి వుంటుంది?’ అందుకే రెండు దశాబ్దాల వరకు తన మానాన తానున్నాడు. అట్లని ఏనాడూ గమ్మున ఉండలేదు. బడబాలనం కుతకుతలాడుతూనే ఉంటుంది కదా.
1974లో ‘డిప్లొమా ఇన్ ఫార్మసీ’లో చేరాడు. కాని 1975-76లలో ఎమర్జెన్సీలో పోలీసులు వెంటబడి గాలించి పట్టుకున్నారు. విప్లవోద్యమాన్ని ప్రజల చెంతకు చేర్చడానికి అతడి పాటలు ప్రవాహంలో జలాంతర్గాములుగా పనిచేశాయి కాబట్టి అతడిని బయట ఉండకుండా పట్టుకున్నారు. ముషీరాబాద్ జైల్లో ఏడాది జైలు జీవితం గడిపి బయటకు వచ్చాడు. పార్టీలోని కొందరు వేసిన కొన్ని అభాండాలకి అతను బాధపడ్డాడు. మళ్లీ బతుకు గాడిలో పడ్డాడు.ఆపిన డిప్లొమా చదువు కొనసాగించి పూర్తి చేశాడు.
1982లో‘రంగుల కల’ చిత్రానికి గాను బి. నరసింగరావు కోరిక మేరకు ‘్భద్రం కొడుకో నా కొడుకో కొమురన్న/ జర పైలం కొడుకో నా కొడుకో కొమురన్న’’ అనే పాట రాశాడు. ఆ పాటని గద్దర్ పాడాడు. ఆ పాన సినీగీతాల సాహిత్యంలో సంచలన విజయం. అలా చిత్ర రంగానికి పరిచయమయ్యాడు. పద్ధెనిమిది ప్రగతిశీల సినిమాలకి గీత రచయితగా పనిచేశాడు. 1971-72లలో ఏర్పడిన అరుణోదయ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకుల్లో అంజయ్య ఒకరు. ఆ సంస్థకి తన పాటలను అంకితం చేశాడు. తరువాత 1992లో బి.ఎస్. రాములు తదితరులతో కలసి ‘దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్య వేదిక (దరకమే) ఆవిర్భవించింది. దీని వ్యవస్థాపకుల్లో అంజయ్య ఒకరు. ఆ తరువాత అటు సీమాంధ్రలోను, తెలంగాణలోను దరకమే కార్యక్రమాలు అస్తిత్వోద్యమ చైతన్యంతో ముందుకు పరుగెట్టాయ. 2003లో ‘పాట కవుల వేదిక’ని ఏర్పాటు చేశాడు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో ఆయన రాసిన పాటలు ఊరూరా ప్రచారం పొందాయి. ‘్ధం ధాం’ కార్యక్రమ నిర్మాతలలో ఆయన ఒకరు. ‘పొలిమేర’ (నవల), సినిమా పాటలు, దళిత కథలు, బయోడేటా-ఇంటర్వ్యూలు-ఉత్తరాలు, గూడ అంజయ్య పాటలు పుస్తకాలుగా అచ్చయ్యాయి.
గూడ అంజయ్య జీవితం అంతా ఒడుదుడుకులమయం. ముగ్గురు అమ్మాయిలు. చాలీచాలని జీతం. ఖర్చులు పెరిగినంతగా రాబడి లేదు. సినీకవి అయినా హంగులూ, ఆర్భాటాలకు ఆమడ దూరం. అధికారానికి దూరంగా ఉంటూ ప్రజల పక్షం వహించాడు. అదే ఆయన పాటల ప్రాణస్వభావం. అతను రాసిన అన్ని రకాల రచనా ప్రక్రియలు ఇందుకు తార్కాణం. సాహిత్య, సాంస్కృతిక సంస్థలలో హాయిగా తిని కూర్చోగలిగే పై సామాజిక కుల వర్గాలవారు ప్రజాకవులను తరచూ పెట్టే బాధలకు వారు అక్కడ ఇమడలేకపోవడం వాస్తవం. రాస్తే-ఉద్యమంలో లేవు కదా అన్నారు. బయట ఉండి రాస్తే ప్రయోజనం ఏమిటని అనేవారు. ఉద్యమంలో ఉంటే తమ చెప్పుచేతల్లో ఉండాలని ఆంక్షలు విధించేవారు. సైద్ధాంతిక అవగాహన పేరుతో లేని తప్పులు వెదికి నానా రకాల వ్యధకు గురి చేసేవారు. ఈ ధోరణి పెచ్చుపెరిగి పోయంది. వీరిని ఆపగలిగేవారు లేకపోవడం వల్ల, విసిగి వేసారి చాలామంది ఉద్యమాలకు దూరంగా జరిగారు. ఈ దూరం భౌతికమే. కాని, దానిని మానసిక దూరంగా భావింపజేసి వారిని ఉద్యమాలకే దూరం చేశారు. ఈ విమర్శకులు ఎన్ని తప్పిదాలు చేసినా, ఆత్మ విమర్శలు చేసుకున్నట్లు కనిపించినా ప్రజా విప్లవ కవులపై దాడి వంటి విమర్శలను ఏనాడూ ఆపలేదు. ఇణకా కొనసాగించడం బాధాకరం. అలాంటి బాధితులలో అంజయ్య ఒకరు. ఉద్యమం దీర్ఘకాలికం. ఒక్కో దశలో కొంతమంది తమ సేవలను అందిస్తారు. కొంతమంది కొంతకాలం పనిచేస్తారు. వారికీ కుటుంబం, పిల్లలు, కనీస అవసరాలు ఉంటాయనే కనీస ఇంగితం లేని చల్లకదలని విమర్శక వర్గం అంజయ్య మరణం పట్ల పట్టీ పట్టనట్టు ఉన్నారు. ఒక్క ప్రకటన కూడా ఇవ్వకపోవడం పై విషయాన్ని ధ్రువీకరిస్తున్నది. ఇలాంటి మనువాద విమర్శకులు పరోక్షంగా ఉద్యమాలకే వెన్నుపోటు పొడిచారన్నది వాస్తవం. ఐతే గూడ అంజయ్య లాంటి వాళ్ల పాటలు ప్రజల్లో ఇంకా సజీవంగా ఉన్నాయి. మనుషులు ఉంటారు, పోతారు. అక్షరాలు, స్వరాలు నిరంతరాలు. ప్రతి దశలో అవి పునర్జీవిస్తుంటాయి. ఊరు మనదిరా వాడ మనదిరా పాట ఊరు, వాడలు ఉన్నంతకాలం నిలచిపోతుంది. విమర్శకాగ్రేసరులు మాత్రం తత్కాలం. ఉద్యమ విస్తృతికి, వ్యాప్తికి, జ్వలనకీ గూడ అంజయ్యలే స్ఫూర్తి ప్రదాతలు.
చివరిమాట : ఆస్ప త్రిలో చావుబతుకుల్లో ఉన్నప్పుడు కేసీఆర్‌ని చూడాలని ఉందన్నాడు. ఎందుకన్నాడో తెలియదు. కాని అతని చివరి కోరిక కొత్త రాష్ట్రంలో కవి అయన సిఎం కోరిక నెరవేర్చలేదు. అది అంజయ్యకు కలసి వచ్చిన అదృష్టమా?