తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఒక ప్రయాణం- వంద పుస్తకాల అనుభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈవారం రోజులు హిమాలయ సానువులు, హిమనదీనదాల తీరాలలో ప్రయాణాలు. ఈ అనుభవాలే ఈ వారం ముచ్చట్లు.
జాతీయ రాతప్రతుల సంస్థలో సదస్సులో పత్ర సమర్పణ చేసి హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన ధర్మశాలకి వెళ్లాం. 34లైబ్రరీ ఆఫ్ టిబెటన్ వర్క్స్ అండ్ ఆర్కైవ్స్22 సందర్శించాలని నిర్వాహకుల కోర్కె ప్రకారం దాన్ని చూసి, దాని సంచాలకులు లోక్‌దోర్ గారితో రెండు పర్యాయాలు భేటీ అయ్యాం.
దేశంకాని దేశంలోకి కాందిశీలులుగా వచ్చి మనదేశంలో జీవిస్తున్న టిబెటన్లు అక్కడ తమ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. తమ అనధికార పార్లమెంటుని కూడా ఏర్పాటు చేసుకున్నారు. చైనాని ఎదిరించి భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రా జిల్లాలోని భగ్సు అనే ధర్మశాల పట్టణానికి వచ్చారు. ఇది జిల్లాకేంద్రం. సుప్రసిద్ధ మత గురువైన దలైలామా నివాసం అక్కడే. బౌద్ధ ఆలయం, టిబెట్ ప్రవాస ప్రభుత్వం వారి కేంద్ర టిబెటన్ పరిపాలన విభాగం (సిటిఎ) అన్నీ ఇక్కడే ఉన్నాయి. మొదట 1959లో ముస్సోరిలో ఉండి ఆ తరువాత 1960 మేలో ధర్మశాల పైభాగంలో ఉన్న మెక్‌లోడ్‌గంజ్‌కి దలైలామా మకాం మార్చారు. ఇది ఒకప్పటి బ్రిటిష్ వారి వేసవి విడిది. 1905లో సంభవించిన భూకంపం వల్ల ఈ విడిదిని తరువాత ముస్సోరి పట్టణానికి మార్చారు.
ధర్మశాలలో ఇప్పటికీ బౌద్ధహిందూ మతాలు పక్కపక్కనే చెట్టపట్టాలేసుకొని జీవిస్తాయి. దేవదారు వృక్షాల పచ్చదనం, వాటివేళ్ల కింద ఫెర్న్ మొక్కల పత్రహరితం లాగా, సూర్యకాంతిలో అవి రెండూ మెరుస్తుంటాయి ఎప్పుడూ. అంతులేని పర్వతశ్రేణి. ఆకాశం తాకే ఎత్తు, మబ్బుల కిరీటాలు తొడిగిన పర్వతాలు. అది ఒకనాడు దేవనగరే. కాని ఇప్పుడు ఆ మాట దానికి నప్పడంలేదు.
ఆనాటి సంచారులు, యాత్రికులు అక్కడి పవిత్రతని కాపాడారు. కాని ఈ నాటి టూరిస్టులు మిగిలి ఉన్న ప్రాచీన ప్రాకృతిక సౌరభాలని విషతుల్యం చేస్తున్నారు. ప్రభుత్వాలు తాము అధికారంలో నిలదొక్కుకోవడానికే తమ శక్తి సామర్ధ్యాలను ధారపోస్తున్నాయి. పరిపాలనని తమ ప్రభుత్వ అధికార వ్యవస్థని చెప్పుచేతల్లో పెట్టుకుని కానిపనులు మాత్రమే చేస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకుని తప్పుడు విధానాలని వ్యతిరేకించే అధికారులు ఉండేవారు. కాని ఇప్పుడు స్వార్థంకోసం రాజకీయ నాయకుల చేతిలో అధికారులు కీలుబొమ్మలయ్యారు. తత్ఫలితంగా దేశం ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొంటున్నది. వాటిలో పర్యావరణ ప్రమాదం ఒకటి. శీతల పవనాలు ఏవీ వీచకుండా అంతా సూర్యతాపమే అక్కడ రాజ్యం ఏలుతోంది.
నదులవెంట, పర్వతాల చరియలలో ప్రయాణించిన రెండువందల యాభై కిలోమీటర్ల మేర హైదరాబాదు వేసవి మండుటెండల్ని తలపించాయి.
మనదగ్గర మైదానం మాదిరి పరుచుకొని ఉంటుంది. కాబట్టి ఎండ అంతటా పడుతుంది. ఇక్కడ మాత్రం కొండలమీద పడిన ఎండ వేడి శరీరాలపై సూదులలాగా గుచ్చుకుంటుంది. ఇది ఒకరకంగా పోలీసు టార్చర్‌లా అనిపిస్తుందని ఒక మిత్రుని భావన. ప్లాస్టిక్ వాడకూడదని జీవోలున్నాయి. కాని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ టూరిస్ట్ హోటళ్లలో కూడా వాటిని పాటించరు. కాని పర్వతానికి, పర్వతానికి మధ్య గల చిన్న ఊళ్లల్లో రోడ్డుమీద పళ్లు అమ్ముకునే ముసలవ్వలు మాత్రం దినపత్రికల కాగితాలతో ఇంట్లో చేసిన పొట్లంతో పళ్లు ఇస్తారు. కాని పర్వతాల మీద విచక్షణా రహితంగా పెరిగిన పట్టణాలలో ప్లాస్టిక్ చెత్త గుట్టలు గుట్టలుగా పెరిగిపోయి కనిపించింది. లోయలో పారే జీవనదిలో ఈ చెత్తా చెదారం కలిసిపోవడం గుండెని కలచివేసింది. వ్యాపార సంస్కృతి మితిమీరి పెరగడానికి ప్రభుత్వాల పాలసీలే కారణం అని అనిపించకమానదు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారగణం వ్యాపారుల వద్ద లంచాలు తిని చూసీ చూడనట్లు నటించడం దేశవ్యాప్తంగా సోకిన వైరస్.
మేం మా ప్రయాణంలో ఆనందించిన అంశాలు చాలా తక్కువ. వేదనకు గురైనదే ఎక్కువ. రోడ్లు వేసే నెపంతో కొండ చరియలలో వందల కిలోమీటర్ల దూరంలో తవ్వకాలు. అందువల్ల అనేకచోట్ల గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్‌లు. రోడ్ల నాణ్యతలో లోపాల కారణంగా అనేక గుంటలు. అంటే ఓ వంద కిలోమీటర్ల దూరం గుంతల రోడ్డమ్మట ఎక్కుదిగుళ్లతో ప్రయాణం. ఒళ్లంతా హూనం. ఈ అనుభవానికి ఉత్తర దక్షిణ భారతదేశాలు ఒక్కటే అనిపించింది. ఇది ఇరుప్రాంతాల్లో సమానమైన జాతీయ భావన అది అని అనిపించింది. ప్రతి చిన్న ఊరిలో, ఊరినిండా కార్లు , కారు సర్వీసింగ్ సెంటర్లు. సహజంగానే కాలుష్యం. ఆకారణంగా ప్రకృతిమీద దాని ప్రభావం. మంచుకొండల్లో, వర్షపు ప్రయాణంలో ఏసి లేకుండా చక్రాలు ముందుకు నడవలేదు. మెక్‌లోడ్‌గంజ్‌లో, మనాలిలోని ఎతె్తైన పర్వతంపై గల గెస్ట్‌హౌజ్‌లో రాత్రంతా ఫ్యాన్లు తిరక్కుండా పడుకోలేకపోవడం, తట్టుకోలేకపోయాం. నిజానికి మేం టూరిస్టులం కాదు. పురా రాతప్రతుల పరిశోధనకోసం వచ్చినవాళ్లం. మాకే ఇంత నిరాశ ఎదురైతే కేవలం చల్లని విడిదిలో బసచేయాలనే కోరికతో ఇబ్బడిముబ్బడిగా డబ్బు ఖర్చు చేసిన వచ్చినవారికి ఎంత కష్టంగా ఉండాలో తెల్లారి టీ సమయపు సంభాషణల్లో తెలిసింది. రాత్రి ఏడున్నర దాటినా వెలుతురు కానవస్తూనే ఉంటుంది. పశ్చిమాద్రివేపు పర్వతాల కొసలు లేనిచోట. తెల్లారి వేకువ సమయంలో లోయల నిండా,పర్వతాల శిరస్సులపైనా మంచు మేఘాలు. నాకైతే అవి చల్లదనాన్ని కోల్పోయిన మబ్బుతునకల్లా కనుపించాయి.
రెండోసారి లైబ్రరీ డైరెక్టర్‌తో సమావేశం అయినప్పుడు ఎన్నో పరిశోధనాంశాలపై చర్చించాం. ఆ లైబ్రరీలో వయసుపైబడిన వారితో చేసిన ఇంటర్వ్యూలను లైబ్రరీ ఆఫ్ ఓరల్ హిస్టరీస్ పేర ఒక పెద్ద విభాగం ఏర్పాటు చేశారు. నిజానికి ఇలాంటి విభాగం మన విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయవలసి ఉండింది. కాని వాటి ఏర్పాటులో మనం ఎంతో వెనకబడి ఉన్నాం. వారిది దేశంకాని దేశం. జాతి కాదు...అది ఒక జాతి. దేశం లేక పోయినా ప్రవాసంలో ఒక దేశం నిర్మించుకున్నారు టిబెటన్లు. వారు కాందిశీకులే. కాని స్థిర పౌరసత్వం గల పౌరులకన్నా ఎంతో దృఢంగా తమకోసం తాము నిలబడి ఉన్నారు. వారిది ఒక బలమైన జాతీయ భావన. జాతీయ భావనకి దేశం అవసరం లేదని మాకు అర్థమైంది. జాతీయత కేవలం దేశం వల్ల సిద్ధించదు. ఆత్మీయ అనురాగ అవసరాల రీత్యా అది ఏర్పడుతుందని అనిపిస్తోంది. బౌద్ధ మతాచారాలను పాటించేవారు ఇంకా ఆ మతాన్ని అన్ని రంగాలలోకి ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారు. నేను టిబెటెన్‌ని, నేను బౌద్ధుడిని అని భావించడమే ఒక జాతి భావన. ఈ భావనలో కులం, గోత్రం, అంటరానితనం, పేదరికం ఏదీ లేదు. ప్రపంచంలోనే అతి పెద్ద దేశం, శక్తివంతమైన ఖండం వంటి చైనాతో ఢీకొని తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటూ ప్రపంచ ప్రజల ఆదరాభిమానాల్ని, గౌరవాన్ని పొందుతున్న టిబెటన్ల నుండి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది.
జూలై ఆరోతేదీన దలైలామ పుట్టిన రోజు వేడుకల్లో అక్కడ ఉన్నందుకు ఒక మధుర భావన ఆవరించింది. బ్రహ్మచర్యం పాటించే బౌద్ధ యువకుల అధ్యయనం, అభ్యాసం,దీక్ష ఎంతో ఆకట్టుకుంది. భౌతిక సుఖాలను త్యజించి, సామూహిక జీవనం సాగిస్తూ, నైతిక విలువలను పెంపొందించే ఇలాంటి సమాజం భారతదేశంలో ఎక్కడైనా ఉన్నదా అని అనిపిస్తుంది. సమాజంకోం అని చెప్పుకునే సిద్ధాంత వాద రాజకీయాలలో ఉండే అతిపెద్ద తలలు వ్యక్తివాదంలో మునిగి, వారి వదనాలలో గూడు కట్టుకున్న వారి అహంకారం చూస్తే ఈ యువకుల జీవనకాంతి ఎంతో గొప్పదనిపించింది. వారితో మా సంభాషణ జరిపిన ప్రతిసారి మమ్మల్ని మేం తరచి చూసుకునే అవకాశం కలిగింది.
అప్పుడు మా ప్రయాణంలో ఒక ప్రదేశంలో ఇద్దరు తెలుగు వీరుల స్మరణ మమ్మల్ని ఉత్తేజపరచింది. రెండేళ్ల కింద 2014, జూన్ 8న బియాస్ నది జలప్రమాదం గుర్తుకువచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో శీలనామి గ్రామ పరిధిలోని తలవుట్ ప్రదేశంలో బియాస్ నది ఒక్కసారి ఉప్పొంగింది. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నుంచి అకస్మాత్తుగా నీరు విడుదల చేశారు. విడదుల చేసేముందు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. అందువల్ల హైదరాబాద్‌లోని విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు 24 మంది జలసమాధి అయ్యారు.
ఐదుగురు విద్యార్థులను రక్షించిన ముప్పిడి కిరణ్‌కుమార్, మంథా ఆశయ్య అనే విద్యార్థులు నదిలో మునిగిన వారిని రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అలసిపోయ ఆదే నదికి ఆహుతి అయ్యారు. వారిని అక్కడి ప్రజలు వీరులుగా గుర్తుంచుకున్నారు. కాని మనం వారిని మరచిపోయాం. మా ప్రయాణంలో ఆ స్థలం ఒక విషాద సంకేతం. స్నేహితులకోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాన్ని మాటల ద్వారా గుర్తు చేసిన బెషందారి అనే ముసలి స్ర్తి 3మాతో ఇలా అన్నది4‘‘వాళ్లు మీ బిడ్డలురా నాన్నా’’ అన్న మాటలు ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయ.
వెళ్లే రోజు మరోసారి డైరెక్టర్ లోక్‌దోర్ గారి ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లాం. వారు సేకరించిన వౌఖిక కథనాలను టిబెట్ భాష నుండి హిందీలోకి, హిందీ నుండి తెలుగులోకి అనువాదం చేయడం గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి పని చేయడంలో మేం ఎదుర్కొన్న సాధక బాధకాలు, అనుభవాలను పంచుకున్నాం. హైదరాబాదు విశ్వవిద్యాలయం మరియు వారి సంస్థ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటే బాగుంటుందని అనుకున్నాం. ఈకాలంలో బౌద్ధం ఎందుకు వ్యాప్తి చెందుతున్నదో, చాలా మతాలు ఇంకా సంకుచిత పరిధిలోకి ఎందుకు నెట్టివేయబడుతున్నాయే..అన్న ఆలోచనలు చేస్తూ తిరుగు ప్రయాణం అయ్యాం.