తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

మెరిసిపోతోంది రైలుమాత అంగాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరుకు వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ ప్లాట్‌ఫామ్ పైకి వస్తోంది. నాకళ్లముందు బోగీలు కాదు, వాణిజ్య ప్రకటనల వరస వెళుతున్నట్లుగా ఉంది. మొన్న సికిందరాబాద్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్ చూసినప్పటి నుండి మనసు వికారంగా మారింది. ఎదో తెలియని ఆవేదన గూడుకట్టుకుంది.
రైలు ప్రయాణాలంటే చిన్నతనం నుండి పనసు ఎగిరి గంతేస్తుంది. ఎందుకో మొదటిసారి మనసు చివుక్కుమంది. నేను నిజంగా బోగీలోకి పోతున్నానా. లేక బహుళ పెట్టుబడి మార్కెట్ సంస్కృతిలోకి నా మనసూ, శరీరం నెట్టబడుతోందా?
ఆలోచిస్తూ చేసేదేమీ లేక రైలు ఎక్కాను. ఒక్కసారి చుట్టుపక్కల శబ్దాల హోరు. మా బోగీ పక్కనే టీవీలో వ్యాపార ప్రకటనల జోరు. ప్రయాణికులందరూ చెవిటివాళ్లన్న చందాన అతి పెద్దగా శబ్దప్రచారం. ఒకదాని తరువాత మరొక ప్రకటన. ఈ ఏడాది పదివేలకోట్లు వ్యాపార ప్రకటనలు సంపాదించాలని టార్గెట్‌గా పెట్టుకోవడానికి మానసికంగా సంసిద్ధమైంది రైల్వేశాఖ. అందుకే రైల్వేల శరీరాంగాల ఖాళీల కోసం నివేదికల వేట ప్రారంభించింది. కాదేదీ కవితకనర్హం అన్నట్లు, లేదేదీ ప్రకటనలకనర్హం అని ఈ మధ్య రైల్వే నమ్మిక. బోగీలు, గూడ్సు వేగన్లు, స్టేషన్లు, రైలు టిక్కెట్లు..ఇది అర్హం కాదనేవారు ఎవ్వరూ లేరు. సురేశ్‌ప్రభుగారు రైల్వే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుండి రైట్స్ అనే సంస్థని ప్రకటనల స్థలం ఎక్కడెక్కడ, ఎంతెంత ఉందో లెక్కతీసి చెప్పాలని, దాని ద్వారా రైల్వేకి ఎంత డబ్బు సమకూరుతుందో వివరించాలని ఆజ్ఞాపించారు. రైల్వేశాఖ సిబ్బంది పనిచేయమని అంటే బాధ. ప్రయాణికులకు వసతులు ఏం కావాలో తెలుసుకోండని అంటే చిరాకు. డబ్బు అంశం ఏదైనా ఎవరికైనా వ్యామోహమే. ఈ స్థల విక్రయ నివేదిక పని మాత్రం చురుగ్గా, పట్టాలు లేకున్నా యమస్పీడుగా నడిచింది. సరి కొత్త లాభాల ఖాతాల ద్వారాలు తెరచుకొన్నాయి. రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం సూపర్ ఫాస్ట్ రైళ్ల ప్రకటనలు వేరుగా, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల టారిఫ్ వేరుగా, వేగన్ల ప్రకటనలు వేరువేరుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్య ప్రకటనలు మూడు రకాలుగా విభజించాలని తీర్మానించారు. వాటివల్ల రకరకాల కంపెనీలను సులభంగా ఆకర్షించవచ్చని భావించారు. బ్రాండెడ్ రైళ్ల పథకం. బ్రాండెడ్ స్టేషన్ పథకం, గూడ్సు వాగన్ ప్రాయోజిత పథకం అని మూడు విభాగాలుగా విడగొట్టి అంగడిలో పెట్టారు. ఇకముందు పట్టాలపై తప్ప అన్ని ఖాళీ స్థలాలు ప్రకటన బోర్డులుగా మారే అవకాశం కేంద్రం పరిశీలనలో ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కదిలే ప్రకటనల ప్రభావం మొదలైంది.
దేశం మొత్తంమీద 26 రాజధాని, 20 శతాబ్ది, 32 దురంతో ప్రీమియం రైళ్లు నడుస్తున్నాయి. ఈ బోగీల వల్ల 780 కోట్ల రూపాయలు సంపాదించాలని రైల్వే ఆరాటం. ఈ ప్రకటనలను ప్రత్యక్షంగా, అతిదగ్గరగా వేలాది మంది వీక్షకులు చూస్తారు. ఎనభై లక్షలమంది ప్రతిరోజూ వీటిని ఏదో ఓ రూపంలో, ఎక్కడో ఓచోట వీక్షిస్తారు. మరో 500 ఎక్స్‌ప్రెస్/సూపర్‌ఫాస్ట్ రైళ్లు, రోజు రెండువేల పాసింజరు రైళ్లు, వేయి లోకల్ రైళ్లు, లక్ష గూడ్సు వేగన్లు వాణిజ్య ప్రకటనల కోసం వేచి ఉన్నాయని రైల్వే వర్గాల భోగట్టా. వీటికి సరైన దేశ విదేశీ బహుళ పెట్టుబడి కంపెనీలను వెతకడమే తరువాయి. మనుషుల మనసులపై నిశ్శబ్దంగా ప్రకటనల చర్య మొదలవుతుంది.
వార్తా పత్రికలు, టీవీ, రేడియో, బేనర్లు, వంటి వాటిపై ఇచ్చే ప్రకటనల కన్నా భిన్నమైన స్వభావం కలిగిన ప్రకటనలు రైల్వే ఆస్తులపై కనుపిస్తాయ. అలాంటి వాటిని ఇచ్చే కంపెనీల కోసం చకోరాల్లా వేచి చూస్తున్నారు. ఆ కంపెనీలు లాభాల బాట పట్టాలని రైల్వే ఆకాంక్షిస్తున్నది. ‘శుభ్‌యాత్ర’ అని ప్రతి టికెట్ పై రాసినట్టుగా, కంపెనీల ప్రకటనలకోసం కూడా రైల్వే ఆదరపూర్వక స్వాగతం పలుకుతోంది. వాణిజ్య ప్రకటనల పాలసి రూపొందించి పూలు పసుపుకుంకుమల హారతి పట్టి నిలుచుంది. గృహావరణం బయట బహిరంగ స్థలాల ప్రకటనలలో రైల్వేది అతిపెద్ద వాటా.
ఐతే దానిని ఉపయోగించుకోవద్దని, ఎవరూ అనరు. కాని ఆ ప్రకటనల వల్ల ప్రజలలోకి ఎలాంటి సందేశం, పోతుందనేది ఆలోచనీయం. రైల్వే ఆస్తులపై ప్రకటనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేయడం లక్ష్యంగా పనిచేసే రైల్వే ప్రకటన కర్తల సందేశాలను కూడా సున్నితంగా, జాగ్రత్తగా చేరవేయాల్సిన బాధ్యత కూడా దానిదే. కదిలే రైళ్లపై కదిలే ప్రకటనలు చాలా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే ఇవి భారతదేశంలోని ఓ మూలనుంచి మరో మూల వరకు ప్రయాణిస్తాయి. రైల్వే భారత ప్రభుత్వపు విభాగం. అది సర్కారులో విడదీయరాని శాఖ. అంటే, అది కేంద్ర ప్రభుత్వానికి సంకేతం. అటువంటి రైల్వేపై కనబడిన ప్రకటన ప్రభుత్వ ఆమోదం ఉన్నట్లేనని జనం విశ్వసించే ప్రమాదం ఉంది. ఒక ప్రభుత్వ విభాగం తన స్థలంలో ఇచ్చే ప్రకటనను చూసి ప్రభుత్వ ప్రకటనే అని భావించే వీలుంది. లేదా ఆ ప్రకటనకు అధికారికత సంక్రమించే పరిస్థితి లేకపోలేదు.
ఈ ప్రభావం మొత్తం రైలుని ఒక కంపెనీ తన పేరుతో గుర్తించినప్పుడు మరీ ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఢిల్లీ, జైపూర్‌ల మధ్య నడిచే బ్లూ బిలియన్ ఎక్స్‌ప్రెస్‌కి 3పెప్సీ2కోలా కంపెనీ ప్రకటనలతో మొత్తం రైలును ముంచేసింది. బెంగళూరు-నాగర్‌కోయిల్, బెంగళూరు-చెన్నై, బెంగళూరు-హుబ్లి రైళ్లను 3కుర్‌కురే2 ఎక్స్‌ప్రెస్‌లని పిలిచారు. నిజానికి 3కుర్‌కురే2 చిప్స్ వంటి చిరుతిండి. కరకరలాడడానికి ప్లాస్టిక్ వంటి పదార్థం దానిలో ఉపయోగిస్తున్నారని కొన్ని పత్రికలలో వార్తలు వచ్చాయ. అలాంటి హానికరమైన పదార్ధం పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తిని ఆనారోగ్య గ్రస్తులు అయ్యే వీలుంది. ఈ విషయాన్ని ప్రజారోగ్య అంశంగా సీరియస్‌గా తీసుకోవాలి. ఆ రైలులో వీటిని తప్ప వేరే వాటిని అమ్మకపోతే పరిస్థితి ఏమిటి? దీనిని బలవంతంగా అంటగట్టడమే అవుతుంది. అలాగే పెప్సీ, కోకాకోలా వంటి పానీయాలలో క్రిమినాశక పదార్థం ఉన్నట్టుగా ఉద్యమాలు నడిచాయి. వాటి వాడకం కూడా గణనీయంగా తగ్గింది. అలాంటి విదేశీ పానీయాల ప్రకటనలు ఇబ్బడి ముబ్బడిగా, (సెమి) అధికారికంగా (?) ఇస్తే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? ప్రభుత్వానికి అంటే రైల్వేలకు, ప్రకటనలకి సంబంధం లేదని దాని పక్కనే మరో ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. ఏడాదికి ఇరవై ఐదు లక్షలు చెల్లించి ఏర్‌టెల్, మాక్స్ న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ వరస ప్రకటనల కోసం ఐదు రైళ్లను గుత్తకు తీసుకున్నారు. వినియోగదారుల నుండి కనబడని చార్జీలు వేస్తున్న మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలలో ఏర్‌టెల్ ఒకటని, కాల్ డ్రాప్ చేయడంలో సిద్ధహస్తులని దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. అలాంటి కంపెనీలలో అదొకటి అంటారు. ప్రధాని మోదీ కూడా ఈ విషయంలోకంపెనీలను హెచ్చరించారు. అటువంటి ఏర్‌టెల్ కంపెనీ భారతీయ రైళ్లపై అత్యంత ప్రభావితం చేసే ప్రకటనలు వేసుకోవడం నైతికత దృష్ట్యా ప్రశ్ననీయం. ఎల్‌ఐసీ వంటి ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రోత్సహించని ప్రభుత్వం విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలను ఈ విధంగా ప్రోత్సహించడం వెనుక ఏదో పెద్ద కారణం ఉండి ఉంటుందనిపిస్తుంది. అది కేవలం డబ్బులకోసమేనా?
రైల్వేలు తమ రైళ్లకు సరికొత్త వినైల్ పంచరంగులు అమరుతున్నాయని చంకలు గుద్దుకుంటుండటం చూస్తుంటే అన్నం గినె్నని నేలకి కొట్టి గులాబి రంగు పీచు మిఠాయిని తిని త్రేన్చిన పిల్లవాడిలా కనుపిస్తున్నది. కేవలం బోగీలపైనే కాదు, బోగీల లోపల పోస్టర్లు, టేబుల్‌పై కవర్లు, కరపత్రాలు, చివరకు టాయ్‌లెట్లు వంటి వాటిపై కూడా ప్రకటనలే ప్రకటనలు! అంటే ఒకరకంగా ప్రయాణీకుల మెదడులో ప్రకటన అచ్చుగుద్దుకునేట్లు ఉక్కిరిబిక్కిరి చేస్తారు. లేదా వారి మనసు సంఘర్షణ పడేలా చేస్తారు. అంతేకాని సుఖ ప్రయాణం చేసిన తృప్తి ఏకోశానా ఉండదు. పైగా మాక్స్ ఇన్సూరెన్స్ కంపెనీ రైల్లో వారి ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వచ్చి సామదాన భేద దండోపాయాలు ప్రయోగించి ప్రయాణికులతో బలవంతంగా ఇన్సూరెన్స్ కట్టిస్తారు. ఆ తరువాత జీవితాంతం అలా డబ్బు కడుతూ పోవాలి. లేదా మధ్యలో ఆపేయాలి. ఏది చేసినా నష్టం ప్రయాణీకులకే. భారతీయ రైల్వేలో ప్రయాణించిన పాపానికి విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బు సమర్పించుకోవాలి. అంటే ప్రకటన వెనుక ఇంత బహిరంగ దోపిడి, మోసం దాగి ఉండే వీలుంది.
రైల్వేల వల్ల ప్రకటన కర్తలకు, లాభం ఏమంటే ఎప్పుడూ ప్రయాణికులు మారుతూ ఉంటారు. వీరి మోసం, కుట్ర, బలవంతపు పాలసీల మాయలు వంటివి అందరికీ తెలియకపోయే అవకాశం ఎక్కువ. అందుకే రైలుకు ఒక కోటి రూపాయలు అదనంగా వెచ్చించి, బోగీలలో అదనపు వసతులు కల్పిస్తారట. కార్పెట్లు, కృత్రిమ రసాయన సుగంధాలు అదనపు ఆకర్షణ. నిజానికి ఇవన్నీ అందరు ప్రయాణికుల ఒంటికి సరిపోవు. వీటివల్ల అస్వస్థతకు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. అరవైనాలుగు వేల మైళ్లు నడిచే పదకొండువేల రైళ్లలో ఇరవైఐదువేల ఫీట్ల స్థలంలో ఇచ్చే ప్రకటనల వల్ల ఎంత ధనం రైల్వేకి వస్తుదో తెలియదు. కాని, ప్రయాణికుల మెదళ్లు మాత్రం అదనపు భారంతో సతమతం కాకతప్పదు. తమకు ఇష్టంలేని ప్రకటనల ఈసడింపు మొత్తం ప్రభుత్వపై పడక తప్పదు. స్టేషన్లలోని లక్షలాది ఖాళీ ప్రదేశాలు, వేలాది విడియో స్క్రీన్లు, స్క్రోలర్స్, కోట్లాది టిక్కెట్లపై కూడా ప్రకటనలు ప్రారంభం అయ్యే వీలుంది. ఇవన్నీ ప్రపంచీకరణలో భాగంగా వాస్తవాలే.
మొన్ననే విజయవాడ కేంద్రంగా అగ్రిగోల్డ్ , అగ్రి..వంటి పేరుతో సంస్థల ప్రకటనలు రాష్టవ్య్రాప్తంగా రైళ్లలో చూసి డబ్బులు కట్టి వేలాది మంది మునిగారు. హైకోర్టు జోక్యం చేసుకున్నా ఇంకా పూర్తి న్యాయం జరగలేదు. ఇదంతా తలుచుకుంటే ఒకసారి ఒళ్లు జల్లుమంటుంది.
నేను దిగాల్సిన స్టేషన్ వచ్చేస్తోంది. ఆలోచనలను, సామానును సర్దుకొని ప్రకటనలపై యుద్ధం ప్రకటించే ఆలోచనతో రైలు దిగాను.