తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

అద్దె సరుకవుతున్న దేశాలు అద్దెగర్భాల్ని అరికడ్తాయా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక సరళీకరణ, ప్రపంచ బ్యాంకు విధానాలు,
ప్రపంచీకరణలో తమకు తెలియకుండానే చాలా దేశాలు, కనబడని సంకెళ్లలో బందీ అయిపోతున్నాయి. మరో మాటలో చెప్పాలంటే అవి బానిసలవలె తయారవుతున్నాయి. అగ్రరాజ్యాలకు దాసోహం అంటున్నాయ. పైకి సార్వభౌమత్వం ఉన్నట్టే కనిపించినా అంతర్లీనంగా తాకట్టులో కూరుకుపోతున్నాయి. ప్రైవేటు రంగం బిగి కౌగిట్లోకి దేశం జారిపోయింది. ఇప్పడు ప్రభుత్వాలు కేవలం ఆయా శక్తులకు ఊడిగం చేసే పరిస్థితికి నెట్టివేయబడ్డాయి.
ఇప్పుడు దేశాలు అద్దె సరుకయ్యాయి. దేహాలు కాంట్రాక్టు లయ్యాయ. అలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అద్దె గర్భాల (సరోగసీ)పై ఆంక్షలు విధించ బూనడంలో ఔచిత్యం ఉందా. సరోగసి బిల్-2016 ముసాయిదాకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా మెడికల్ మాఫియాకి అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావన. కానీ సాధ్యాసాధ్యాల గురించి చాలా విషయాలు చర్చించాల్సి ఉంది. చట్టం ఐతే తేగలం. కానీ దానిని ఆచరణలో పాటించగలమా అనేది ప్రశ్న. సభ్య దేశాలలో, సమాజాలలో ఇలాంటి చట్టాలు మేము తెచ్చాం అని చెప్పుకోవడం కోసం పనికివస్తాయేమోగానీ వాటిని అరికట్టగలమా అనేది ముఖ్యమైన ప్రశ్న.
వరకట్నం తీసుకోవడం నేరం. భిక్షాటన నిషేధం. విద్య పిల్లల హక్కు. ఇలాంటి చట్టాలు కోకోల్లలు. కార్లలో రంగు అద్దాలు వాడరాదు. మరి ఇప్పుడేమైంది. నాలుగురోజులు హడావిడి చేసి చిన్నకార్ల వాళ్లని హడలగొట్టడం ఆనవాయితీ. ఏ చట్టం చేసినా దానివల్ల కిందివర్గాల ప్రజలని భయభ్రాంతుల్ని చేసి వారినుండి ఫైనులు వసూలు చేయడానికే పనికివస్తుంది. డబ్బున్న వర్గాలు వరకట్నం ఇచ్చారని, పుచ్చుకున్నారని ఒక వార్త ఎక్కడైనా చదివారా. వరకట్నం తీసుకున్న వాడు గాడిద అని ఓ చానల్ నినాదం. ఊళ్లలో జరిగే పెళ్లిళ్లలో పెట్టుపోతలలో చిన్న చిన్న సాంప్రదాయక కానుకలు కోరి కొసరితే డబ్బులు నొక్కడానికి దానికి వరకట్నం పేరుపెట్టి పోలీసులు కేసులు పెడతారు. డబ్బున్నవారు డబ్బులతో వెనువెంటనే కేసు కాకుండా చూసుకుంటారు. ఈ పరిస్థితుల్లో మరో చట్టం తేవడంవల్ల ఏం జరగబోతున్నదో విజ్ఞులు ఆలోచించాలి.
భారతదేశం వంటి అభివృద్ధి చెందే ప్రయత్నంలో వున్న కొన్ని దేశాలను ‘ప్రపంచ ఊయల దేశం’ (క్రెడిల్ ఆఫ్ వరల్డ్) అని ముద్దుగా పిలుచుకుంటారు. ఎందుకంటే సంతానం కోసం పిల్లలు లేనివారు మన దేశానికి వచ్చి గర్భాలను అద్దెకు తీసుకుని పోతారు. ఈ పద్ధతి గత కొన్ని దశాబ్దాలునుండి కొనసాగుతున్నది. పిల్లలను ప్రసవానంతరం కొనుక్కునిపోయే తల్లులూ పెరుగుతున్నారు. అమ్ముకునే అమ్మలూ పెరిగారు. చాలాసార్లు ఎన్నో సమస్యలు ఎదురై కొన్ని ఈ వార్తలు పత్రికలకు ఎక్కుతున్నాయి.
మొన్న మెదక్ జిల్లాలో సంగారెడ్డికి పది కిలోమీటర్ల దూరంలో అలనాటి ప్రాచీన మహాపట్టణం కొండపూర్ ఉంది. అక్కడ ఉన్న ప్రదర్శనశాల చూడ్డానికి ఫ్రెంచి పరిశోధకుడు డేనియల్ నేజర్స్, అతని సతీమణి జెనిత్‌తో కలిసి వెళ్లాం. దారి మధ్యలో ఓ ఊళ్లో ఆగాం. అక్కడ టీ తాగుతూ జరిపిన పిచ్చాపాటి భేటి జరిగింది. అందులో వారు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయ. అమెరికానుండి వచ్చిన భార్యాభర్తలు, హైదరాబాద్‌లోని ఓ దవాఖానాలో పనిచేసే డాక్టర్ సహాయంతో ఇక్కడకు వచ్చారు. పక్క ఊరి లోని బంజారా భార్యాభర్తలతో అద్దెగర్భం ఒప్పందం కుదుర్చుకున్నారు. డబ్బులకోసం భర్త అందుకు సంతోషంతో అంగీకరించాడు.
తన అనారోగ్యం తనకే తెలుసుకాబట్టి భార్య అందుకు ఒప్పుకోలేదు. తర్జన భర్జనల తదనంతరం ఆమె తన ఇద్దరు పిల్లల అనారోగ్యం బాగు చేయించడానికోసం ఆ డబ్బు ఖర్చుపెట్టాలనే షరతులతో అంగీకరించింది. ఇద్దరు పిల్లలను బతికించుకోవడంకోసం ఓ శిశువుని కోల్పోవడానికి సిద్ధపడింది. అడ్వాన్సు అందిన మొత్తంలోంచి పెద్ద మొత్తం తాగుడికి ఖర్చు చేసాడు. పైగా మంచి పౌష్టికాహారం పెట్టడానికి ఇచ్చిన డబ్బులో చాలావరకు తన జల్సాలకు ఖర్చు చేసాడు. హైదరాబాదు నుండి నెలకోసారి వచ్చి చూసి వెళ్లే డాక్టర్‌కి ఈ విషయం భర్తముందు ఎలా చెప్పగలదు. ఏడు నెల్లకే పిల్లని కని ఆమె చనిపోయింది. కులం వారి దెప్పిపోట్లు భరించలేక భర్త హైదరాబాద్ వెళ్లిపొయ్యాడు. ముసలి తాత నానమ్మల దగ్గర చిక్కిపోయి, స్కూలు చదువులు లేక, తిరిగే ఆ ఇద్దరు పిల్లల్ని చూపారు గ్రామస్తులు. మధ్యవర్తులు అంత్యక్రియలకు కూడా డబ్బులు ఇప్పించకుండా పుట్టిన బిడ్డను తెల్లవాళ్ల చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నారు. గర్భ సంచులు ఊరు వాడా పేరు ని పిల్లల రూపంలో రోబొట్లను పుట్టించే ఫ్యాక్టరీలు అయ్యాయి. ఉత్పత్తి సదా సరుకుగా మారుతుంది. సరుకుకి రేటు వుంటుంది. దానిని కొనేవాళ్లున్నంత కాలం అమ్ముకునే వారుంటారు. అమ్మేవారు నేరస్తులవుతారు. డబ్బుపెట్టి కొనే ధనికులు పెద్ద మనుషులు. ఈ తప్పుడు విలువల సిద్ధాంతాన్ని మార్చాలి. డబ్బు సులభంగా సంపాదించడానికి పురుషుడు తన సంతానాన్ని కనే గర్భంలో మరొకరి వీర్యం, అండం వేస్తే శిశువుని కనాలి. పురుషుడికి తల్లి మాతృత్వ భావన మరో బాధతో చేసిన వెయ్యేళ్లకి కూడా అర్ధం కాదు. కానీ ఆ తల్లి మూలుగులలో నిక్షిప్తమైన ఆత్మీయ బంధం తాలూకు స్పర్శని కోల్పోతున్నాననే భావన ఏ స్ర్తికి కలగకూడనిది.
ఫ్లోరోసిస్ నీళ్లు తాగి వంకర టింకర పిల్లలు పుట్టవద్దని మెదక్ జిల్లాకి బతకడానికి ఆ బంజారా కుటుంబం అన్నీ వదులుకుని వచ్చింది. కాని ఇక్కడ పుట్టిన తమ పిల్లల్ని అమ్మడానికైనా సిద్ధపడే భర్తల్ని చూసింది. అందుకే ఇతరులకోసం తన గర్భాన్ని తొమ్మిది నెలలు అద్దెకు ఇవ్వడానికి ఖరారునామా రాసి దానిపై సంతకం చేసింది. కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయి ఎదుగుబొదుగు లేని బతుకులు ఈడుస్తూ కడుపునిండా తిండి లేకపోయినా హాయిగానే ఉన్నారు. కాని అద్దె గర్భం వారి కుటుంబంలో ప్రవేశించాక వారి బతుకులు సర్వనాశనం అయ్యాయి. ఐదేళ్ల కింద చట్టం లేకపోవడంవల్ల వారికి న్యాయం జరగలేదని అనుకుందాం. కాని మెదక్ జిల్లాలో డాక్టర్లు డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రతి పునరుత్పత్తి శక్తి కలిగిన స్ర్తి గర్భసంచిని బలవంతపు ఆపరేషన్ చేసి తీసివేసిన ఒక్క దవాఖానపై, ఒక్క వైద్యుడిపై కేసు వేసారా? ఈ విషయం కళ్ళారా చూసిన ఆ బంజారా యువతి భర్త ప్రోద్బలంపై గర్భాన్ని అద్దెకిచ్చింది. చట్టం వచ్చినా ఈ మారుమూల పల్లె ప్రాంతంలో అది అమలు అవుతుందా. డబ్బున్న తెల్ల పెట్టుబడులకోసం ఎర్ర తివాచీలు పరిచి పరిచి జబ్బలు పులిసిపోతున్నా ఈపాలకులు తమ ప్రయత్నాలకు తామే మురిసిపోతున్నారు. సింగపూర్‌లను సృష్టిస్తామంటున్నారు. అమరావతి సింగపూర్‌కి క్లోనింగ్ జరుపుతారట. ఒక్కో కంపెనీ సిఇఓని బతిమాలి బామాలి ఏవో మందులు తాయిలాలు ఇస్తామని చెప్పి ఎంవోయులు సిద్ధం చేస్తున్నారు. ఎవరి కోసం ఇదంతా? ఏ ఫోటోలకోసం?
ఏడాదికి కనీసం ఇరవై ఐదు వేల గర్భాలు అద్దెకు తీసుకోబడుతున్నాయ. సంతాన సాఫల్య కేంద్రాల ముసుగులో వైద్యరంగంలో మాఫియా ప్రవేశించింది. దాని విశృంఖలతకి అడ్డుకట్ట వేయకపోతే అదిప్రబలి ప్రబలి సమాజం అంతా పిల్లల్ని అమ్ముకునే అంగడిగా మారుతుందేమో అని భయం వేసింది. గత ఏడాది కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్టు రూఢీగా తెలుస్తోంది. అందుకే పోయిన వారం కేంద్రం బిల్లుకి ఆమోదం తెలిపింది.
2008లో అప్పటి యుపిఎ ప్రభుత్వం ఈ బిల్లు గురించి ఆలోచనలు ప్రారంభించింది. 2014లో ప్రవేశపెట్టిన ఈ ముసాయిదా బిల్లుని కొందరు వ్యతిరేకించారు. అద్దెగర్భం వ్యాపారంగా ఎంచుకున్న వ్యాపార వర్గం ప్రభుత్వ రంగాన్ని ప్రభావితం చేసే పరిస్థితికి చేరింది. రాబోయే పార్లమెంటు సమావేశాలలో సరోగసీ బిల్-2016కు చట్టరూపం కలిగిస్తే కేంద్ర రాష్ట్రాల స్థాయిలలో సరోగసి రెగ్యులేటరీ అథారిటీలు ఏర్పడతాయి. కానీ వీటికి పూర్తి స్థాయి అధికారాలు సంక్రమింపచేస్తారా లేదా అనేది మరో ప్రశ్న. దేశంలో అమాయక మహిళలనుండి అండాలను కొనుగోలు చేసి దొంగచాటున గర్భాలు దాల్చి శిశువుల్ని కనే పరిస్థితి పూర్తిగా కనుమరుగు అవుతుందా?
ఐదేళ్లు పిల్లలు లేకపోతే దగ్గరి బంధువుల దగ్గర అద్దెగర్భాలను అంగీకరిస్తే అది తప్పుదారికి దగ్గరి దారి అవుతుందా. తమ కోసం అని చెప్పి వీళ్లు విదేశీయులకి అంటగట్టరని నమ్మకం ఉందా? ఈ బిల్లు సరోగసికి ఎంత వ్యతిరేకమో అంతే ప్రతికూలం. దీని చుట్టు పెట్టుబడి, లాభం, వైద్యం, ఆరోగ్యం, నైతిక విషయాలు అనేకం అల్లుకుపోయ ఉన్నాయి. లాభాల కోసం ఏ పనైనా చేసే వ్యాపారవేత్తలు ఉన్నంతకాలం ఇలాంటి చట్టాలు కాగితాల మీద జాగ్రత్తగా ఉంటాయి. చట్టరూపం పొందిన క్షణం నుండి నల్లబజారుసరుకు అవుతుంది. దళారీ వ్యవస్థ స్థిరీకృతం, వ్యవస్థీకృతం అవుతుంది. అప్పుడు డబ్బున్న శక్తులు తప్పించుకుంటాయి. పేదలకు శిక్షలు, జైళ్లు. చట్టం అప్పుడప్పుడు నేనున్నానంటుంది. అలా అన్నప్పుడల్లా నేరం చేయని వాళ్లు కొంతమంది దోషులు కాక తప్పదు.
అద్దెగర్భం చట్టాన్ని పురుష భావజాలం, దృక్పథంతో చూడడంవల్ల బాధితురాలైన స్ర్తి దోషిగా మారే ప్రమాదం ఉంది. దళారీ, వైద్యుడు, కొనుగోలుదారు, భర్త, పోలీసు, వకీలు అందరూ పురుషులే. అద్దెగర్భాన్ని నేర కారణంగా చూసి స్ర్తి జాతిని అవమానించే పరిస్థితి ఏర్పడకుండా చూడాలి.
ప్రపంచంలో ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారు. పెద్ద మనసుతో వారిని ఆధికారికంగా దత్తత తీసుకునే చట్టాలను సరళతరం చేయాలి. అలాంటి అనాధ పిల్లలను పెంచి పెద్దచేసే పెద్ద మనసు పెరగాలని దేశాధ్యక్షులు అందరూ కలిసి చెప్పగలగాలి. కొత్త చట్టాలు రూపొందించడం సులభం. ఆచరించడం ఈ దేశంలో చాలా కష్టం.