తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

సమాజం ఆత్మే శాస్ర్తియత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెంటికి చెడిన రేవడి కథలా ఉంది మన పిల్లల పరిస్థితి. వడిలో బడిలో ఇంటిలో సమాజంలో వాళ్ళు రెండోశ్రేణి పౌరులే. సమాజంలోని అన్నిరకాల అవాంఛనీయ అంశాలు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో వారి మీద ఆగకుండా పడుతున్నాయ.
సంపన్న వర్గాల పిల్లలకు ఓ రోజు కాకుంటే మరో రోజు డబ్బుతో, మనుషులతో వారికి కావలసినవి, లోపించినవి సమకూరుస్తున్నారు. సంపదలో పుట్టి డబ్బుతో పెరిగేవాడు సంపదనే కోరుతాడు. అతడి మనోధర్మాలు అన్నీ ఆ దిశగానే ఎదుగుతాయి. వారికి డబ్బు తప్ప మరే యావ ఉండదు. ఇంట్లో ప్రతి గదిలో డబ్బు లెక్కలు మోగుతుంటే మానవ సంగీత స్వరాలు ఎలా వినిపిస్తాయి? టీవీ కూడా డాబూదర్పమై ,అత్యాధునిక మోడలై దర్శనమిస్తుంది. పాఠశాల పది మంది కలిసి చదువుకునే ప్రదేశం కాదు. తనలాంటి కొద్దిమందికే ప్రవేశం ఉన్న ఏసీ తరగతి గది, ఏసీ బస్సు, కారు అతడి చదువుకన్నా ముఖ్యమై శాసిస్తాయ. సహజమైన కలుపుగోలుతనం పరిమితులకు లోబడి కుంగిపోతుంది. దాని స్థానే వ్యక్తిగత అహంభావం పెచ్చుపెరిగిపోతుంది. పిల్లవాడు సహజంగా ఎదగడానికి ఎన్నో అవాంతరాలు అడ్డొచ్చే గడ్డుకాలం. పాంచ భౌతిక శక్తులని ఆట స్థలంగా చేసుకోవలసిన పసితనం కృత్రిమ గాలీ, వెలుతురు, మట్టీ, నేల, వేడి, నీరూ అతడి శరీరాన్ని మలినపరుస్తున్నాయి. జీవితం అస్వాభావికమవుతున్నది. సహజ మానవ స్వభావం, పంచేంద్రియాల పరిపక్వత కుంటుపడుతున్నది. ఆటలాడడానికి శరీరం తొట్రుపడుతున్నది. కాళ్ళు నేలమీద నడవలేకపోతున్నాయ. అవి పాకుతున్నాయి. ఆట బంతులు పిల్లలకు బాంబుల్లా కనిపిస్తున్నాయ. చేతులతో పట్టుకోవడానికి భయపడుతున్నారు. నలుగురు కలసి ఆడే ఆటలంటే ఇప్పుడది దృశ్యమే. చేతిలో రిమోట్‌తో గ్రహాంతర వాసులతో యుద్ధం రాక్షస బల్లులు హతం. నిజంగా కనుపించిన పిచుకనో, తుమ్మెదనో చూసి భయ విహ్వలత. శరీరాలకి అవయవాలుంటాయి. కాని ఈనాటి చాలామంది పిల్లలకు ఒకే ఒక అవయవం. అది ఊబ శరీరం.
పొలంలో దొరికే పంట, ధాన్యం, కూరగాయలు తినడం నామోషి. దాని పేరుతో తయారుచేసిన కృత్రిమ ఆహారం, పదార్థాలు తినడం ఫేషన్.
నాగరికత ముసిరిన కొద్దీ మనిషి శారీరకంగా బలహీనుడవుతున్నాడు. తిండి, రోగం అనే రెండు లక్షణాలకే పరిమితం అవుతోంది కాయం. తల్లి పాలు శిశువుల పెదాలు దాటి కడుపుకి చేరడం గగనం. అమ్మ వడి అనురాగాల తడిమడి. కాని ఆమె ఓ చేత్తో రిమోట్. మరో చేత్తో సెల్‌ఫోన్ అయ్యింది. పిల్లవాడి కేరింతలను సైతం గమనించని తమకం. తల్లి చూసే పెద్దల చానళ్ళను పిల్లలు తనివిదీరా వీక్షిస్తున్నారు. ఇప్పుడు ఇలా పిల్ల వీక్షకుల సంఖ్య దేశమంతా విశాలంగా ఆవరించింది. కడుపులో ఉన్నప్పుడే ఆ గమ్మత్తంతా వినీ వినీ, అంతరింద్రియాలతో చూసీ చూసీ అసలు ‘చూపు’ పోగొట్టుకున్నాడు.
‘మనసు’మాటున ‘తెర’ని దించుకున్నాడు. భాష అంటే చానెళ్ళ మోతే. లాలి పాటల వయసులో ఇప్పుడతని బెల్లీ డాన్స్ ఊపు. తల్లులిప్పుడు పిల్లల్ని కనడం లేదు. సిజేరియన్ కోత కంటున్నది. ఆమె ‘ప్రసవం’ మరిచి శరీరాన్ని ‘ప్రహసనం’గా మార్చుకుంది.
ఈ నేపథ్యంలో-
మన విద్యావిధానం బాల్యాన్ని చిలుక పలుకులుగా మార్చింది. జ్ఞానం మేధస్సులో కాదు. ‘చిప్’లో ఉంటుందని చెప్పాం. ఏసీ పాఠశాలలు ఓవైపు. పాఠశాలలు లేని గిరిజన గూడేలొక వైపు. పేదరికపు జాలి చదువుల మర్మం తెలియక అప్పులుచేసి కానె్వంట్‌లను బలిపిస్తున్న తల్లిదండ్రులొకవైపు.
పిల్లల మేధస్సు ఇప్పుడు అశాస్ర్తియ భావాల లాండ్‌మైన్. దైవాన్నైనా కాదు సైతాన్‌నే పూజిస్తున్నాడు. పలు రంగాలలో పరాధీనుడై తనని చూసి తానే జడుసుకుంటున్నాడు. హేతువుని మరిచి తీతువుని జ్ఞానం అనుకుంటున్నాడు. స్వర్గం ఏదంటే అమెరికా అని కుండబద్దలు చేస్తున్నాడు. నరకం ఎక్కడ అంటే అది ఇండియానే అని ప్రకటిస్తున్నాడు. స్వర్గారోహణ పర్వమే అమెరికా విదేశీయానం అని పిల్లల భావన. అందుకోసమే మన జన్మ. విద్య. సెలబస్. అన్నీ.
చదువు ప్రశ్నించడం నేర్పించవద్దు. ఆలోచించడం ఆరోగ్యకరం కాదు. తలెత్తి చూడ్డం సరికాదు. అమెరికా స్వర్గంలో ఇవన్నీ నిషిద్ధం. చదువు బానిస గుణం నేర్పాలి. మనిషి విశ్వాసాలు, అనురాగాలు అన్నీ ఎదగడానికి పనికిరాని సాధనాలని పిల్లలు తెలుసుకునేలా చేస్తున్నాం.
కాబట్టి అహేతుకంగా ఆలోచించాలి. సహేతుక ఆలోచనలు దరిరానివ్వవద్దు. అశాస్ర్తియ భావాలను ఏ రూపంలోనూ విద్యావ్యవస్థ అరికట్టడం లేదు. రెండుతరాల కింద అలాంటి వాతావరణం లేదు కాబట్టే పోరాటాల తరం వచ్చింది. ఆత్మగౌరవ ఉద్యమాలు తామర తంపరలైనాయి. వ్యవస్థని కళ్ళారా ఉన్నది ఉన్నట్లు చూస్తే పిల్లలు సహించరు ఆలోచిస్తారు. ప్రశ్నిస్తారు. వారికెందుకు ఆ బాధ. తల్లిదండ్రులుగా, ఉత్తమోపాధ్యాయులుగా వారికి కనబడని వాటినే కనుపించేట్లు చేద్దాం. వినబడే వాటికి ఫిల్టర్ వేసి వినీవిననట్లు వినిపిద్దాం. సహజాతాలను తుంచి వేయడం వారి భవిష్యత్తుకు మంచిది. అవి ఉంటే బాధలకు లోనవుతారు. జీవితం క్లిష్టమవుతుంది. అందుకే ఎందుకా వాస్తవాల ఎక్స్‌పోజర్?
అలాంటి పిల్లల తరం ఎదిగి వస్తున్న తరుణం ఇది.
దీనిని ఎక్కడో ఓ దగ్గర ఆపాలి. అడ్డుకట్టవేయాలి. రచయితలు, పాత్రికేయులు, కళాకారులు చేయవలసిన పని ఇది. మంత్రాలకు చింతకాయలు రాలవని చదువుకోనమ్మ కూడా చెబుతుంది. యజ్ఞాలవల్ల లోక కళ్యాణం జరగదని కొందరు ప్రజలు అంటారు మరి. నిజానికి త్యాగాలవల్ల దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. వీరుల బలిదానాలవల్ల ఈ నేల పునీతమైంది. విప్లవ వీరులకన్న పురిటిగడ్డ ఇది. నిన్నగాక మొన్న ఏర్పడిన తెలంగాణ కూడా వేయి మంది అమరవీరుల త్యాగాల పునాదిపైనే జెండాగా ఎగిరింది. కాని ఇవ్వాళ ఏమంటున్నారు పెద్దలు. యాగం చేస్తానని ఆనాడు మొక్కుకున్నందుకే వచ్చిందని అధినాయకులు అంటున్నారు. త్యాగ ఫలాలు ఆస్వాదిస్తూనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు .ఈ విషయాన్ని అక్షరాలు ప్రశ్నించడం లేదు. మానని గాయాలు ఇంకా సలపరం పెడుతుంటే యాగాల బూది రాసి తగ్గిస్తానంటే ఎలా?
మొన్న 13 డిసెంబర్ నాడు మహబూబ్‌నగర్‌లోని వనపర్తి పట్టణంలో ‘‘తెలంగాణ సైన్స్ వేదిక’’ రాష్టస్థ్రాయి టాలెంట్ టెస్ట్ ఏర్పాటుచేసి విజేతలకు బహుమతులు ఇచ్చి, నాలుగు మాటలు మాట్లాడమని ఆ సంస్థ అధ్యక్షుడు మిత్రులు ఆచార్య వి.కృష్ణ అడిగితే వెళ్ళాను.
ఈ సందర్భం పురస్కరించుకుని పిల్లలకు ఏదో చెప్పాలని సిద్ధమైపోయాను. సభకి ముందు పిల్లలలో ఎవరైనా వచ్చి మాట్లాడమని అధ్యక్షులు సత్తార్‌గారు అడిగారు. డా.మురళీధర్, డా.వీర య్య వత్తాసు పలికారు.
ఖమ్మంనుండి వచ్చిన విద్యార్థి ఇ.నరేశ్ మాట్లాడుతూ, సైన్స్ అంటే నాకు ప్రేమ. సైనే్స దేశాన్ని ముందుకు నడిపిస్తున్నది. రాజకీయ నాయకులు కాదు. మీ ప్రజా సైన్స్ వేదికలో నాకు పనిచేయాలని ఉంది అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. నిజానికి అలాంటి పిల్లలను సంస్థలో చేర్చుకోగలమా? నిజామాబాదు నుండి వచ్చిన ఆర్యన్ అనే పిల్లవాడు సైన్స్‌పై మాట్లాడి మంత్రముగ్ధులను చేశాడు. మూఢ నమ్మకాలను సమాధి చేస్తేనే దేశ ప్రగతి అన్నాడు. మరి యాగాలను ఏంచేయాలో సభికులు ఆలోచించాలని చెప్పాడు. మహబూబ్‌నగర్‌కి చెందిన నవ్యశ్రీ మాట్లాడుతూ శాస్ర్తియ ఆలోచనలే సైన్స్‌కీ, ప్రతి ఆవిష్కరణకీ మూలం అని చెప్పింది.
ఏది ఏమైనా సైన్స్ భావాలను పెంచి పోషించడానికి, వ్యాప్తిచేయడానికి సిలబసేతర కార్యక్రమాలు నిర్వహించాలి. సమ్మర్ క్యాంపుల పేరుతో అశ్లీల నృత్యాలు నేర్పే బదులు సైన్స్ సమ్మర్ క్యాంపులను ఏర్పాటుచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నిజానికి రచయితలు పిల్లల పేర వారికి ప్రత్యక్షంగా పనికివచ్చే పుస్తకాలు రాయడం లేదు. ఇప్పుడు దృశ్య శబ్ద మాధ్యమాలలో సీడీలు చేసి అందించవలసి ఉంది. ఆట, ఆలోచన, మేధోభివృద్ధి చట్రంలోకి వారిని తేవడం ముఖ్యం. ప్రభుత్వాలు ఆ పని చేసే పరిస్థితి రానురాను తగ్గుతోంది. అందుకే అమ్మ వడి, ఆట స్థలం, నలుగురు కలిసే కార్యక్రమం వారిని మనుషులను తీర్చిదిద్దాలి. ఆ పని మనం వెంటనే ప్రారంభించాలి. ప్రభుత్వాల, పాలకుల అశాస్ర్తియ భావాలను అప్పుడే ఆపగలం.

జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242 jayadhirtr@gmail.com