తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ప్రజలను కలిపే సాహిత్యం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది కవులు తమ సంస్థ రాజకీయ దృక్పథం లేదా ఆ పంథాకి అనుగుణంగా మాత్రమే రాస్తారు. అది తప్పుకాదు. కాని ఆ సాహిత్యమే మొత్తం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తుందని అనుకోవడం ఆలోచన సరికాదు. ఒకే తాత్విక భూమికతో పనిచేసే రాజకీయ పార్టీల దృక్పథాలు, పంథాలు మాత్రం అనేకం. వాటిలో సాధారణ భావజాలం, పనివిధానం, సామాజిక వాస్తవికతలు, సమస్యలు, మూలకారణాల అవగాహన ఒకటే. అలా అయినప్పుడు వామపక్ష, విప్లవ నిర్మాణాల మధ్య వైవిధ్యతలు మాత్రమే ఉండాలి. కాని విరుద్ధ భావనలు, శత్రుపూరిత వైరుధ్యాలు ఎందుకు? వాటివల్ల ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా?
సామాజిక ఆర్థిక రంగాలలో పార్టీల ప్రాధాన్యతలు వేరు. వాటిని సాధించడంలో మాత్రం అన్ని సంస్థలకు, పార్టీలకు ప్రజా ఉద్యమమే గీటురాయి. ఆ ఉద్యమాలకి వత్తాసుగా రాయబడిన సాహిత్యం మాత్రం అందరికీ ఉపయోగపడుతుంది. పడాలి కూడా. ఆ సాహిత్య లక్షణాలు కూడా దాదాపు ఒకేరకంగా ఉంటాయి. ఉదాహణకి పాటలు, కళారూపాలు తీసుకుందాం. జానపద బాణీలు తీసుకొని పాటలు రాసేవారు కొందరు. కొత్త పల్లవులు గ్రహించి, రాసి పాడే విధానం మరికొందరిది. కళారూపాలలో పాట పాడే విధానం, సంగీతం, దరువులు, ప్రదర్శన, నృత్యం వంటివి దాదాపుగా కొద్ది తేడాలతో ఒకేతీరుగా ఉంటుంది. అంతిమంగా శ్రోతలు, ప్రేక్షకులను చేరడమే ప్రధాన లక్ష్యం. దాన్ని సాధించడమే సాంస్కృతిక బృందాల పరమార్థం. ఆ విధంగా రాయడమే కవుల కర్తవ్యం. ఈ విధానం దాదాపు ఇదే రీతిలో గత డెబ్బై ఏళ్ల నుండి సాహిత్య సాంస్కృతిక రంగంలో నడుస్తున్నది.
సాంస్కృతిక రంగం యొక్క ప్రాథమిక సూత్రాలు దాదాపుగా ఒకేరీతిగా ఉంటాయి. ఆయా దశలలో, కార్యక్రమాలలో, ఇతివృత్తంలో కొంత మార్పు ఉంటుందేమోగాని సృజనాత్మకతలో, ప్రక్రియలలో వాటి రచనలో, ప్రచార ప్రసార విధానాలు దాదాపు ఒక్కటే. వివిధ పార్టీ, గ్రూపు సాహిత్య కళా రంగాలలో వెలువడిన గేయ సాహిత్యం చాలావరకు చాలా వామపక్ష, విప్లవ పార్టీలకు ఉపయోగపడతాయి. కాని, చాలాకాలంగా ఒక సంస్థకి చెందిన పాటలు మరొకరికి అంటరానివే. ఒక సాంస్కృతిక సంస్థకు చెందిన కళారూపాలు మరొకరు తాకరు. అంతేకాదు ఏ కోశాన వాటి ప్రసక్తి కూడా తీసుకురారు. సమాజంలో, ప్రజలలో గొప్ప సంచలనం సృష్టించిన గేయం, కళారూపం ఈ పరిధుల్లో పనికి రానిదే. అట్లని వాటిలో ఇతర పార్టీలవారు ఉపయోగించుకోలేని విషయాలు ఉన్నాయని కాదు. అది అంతే.
ప్రజలకోసం రాయబడిన సాహిత్యం అందరికి చెందాలి. దానిపై హక్కు ప్రజలకే ఉండాలి అని చెప్పే సంస్థలు, ఎందుకోగాని వీటిని ప్రజల అవసరాలకోసం వాడుకోవడానికి సిద్ధంగా లేరు. అందువల్ల వివిధ సారూప్య, భాగస్వామ్య సంస్థల మధ్య అడ్డగీతలు, నిలువుగీతల దూరాల గోడలు అడ్డుగా నిలిచాయి. అందుకే ఆధిపత్య మత కుల వర్గ మనువాద సమాజపు సామాజికపువిలువల ప్రతిబింబంగానే దీనిని భావించాలి. అంతేకాదు. దాని ప్రభావానికి తలొగ్గడంగానే చెప్పుకోవాలి. ఏ సమాజపు అవలక్షణాల నుండి ప్రజలను విముక్తం చేయాలని చూస్తున్నామో వాటిని కొనసాగించడమే అనిపిస్తుంది. కులాల మధ్య గల హెచ్చుతగ్గులు తెలియకుండానే ఆ విలువలను మరోరూపంలో ఆచరణలో పెట్టడంగానే భావించాలి. అంటే మనుషుల, కులాల మధ్య గల అంతరం, అస్పృశ్యత, సంస్థలలో కూడా అంటుకుందా అనిపిస్తుంది.
ఇంతకూ చెప్పొచ్చేదేమంటే, ఆయా సంస్థల నాయకుల, నాయకత్వ ప్రణాళికలూ, మేనిఫెస్టో రూపకల్పనలు, కార్యక్రమాలు చేపట్టడాలు...వీటన్నింటిని రూపొందించే క్రమంలో మనకి తెలిసో, తెలియకుండానో యధాతథ సామాజిక చట్రాన్ని నిర్మాణాలలోకి దింపేస్తున్నాం. దీనివల్ల అటు ప్రజలలో పూర్తిగా విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నాం. ప్రజలలో మమేకమై కలసిపోలేకపోయాం. బూర్జువా పార్టీలవలె చీలికలు లేకుండా అఖండంగా నిలబడలేకపోతున్నాం. కాంగ్రెస్, బిజెపి వంటి జాతీయ పార్టీలలో చిన్నచిన్న చీలికలు కుదుపులు కనుపించినా అవి పెద్దగా ప్రజలపై ప్రభావం చూపవు కాని, వామపక్ష, విప్లవ పార్టీలలో చీలికలు శత్రుపూరిత వైఖరి తీసుకుంటాయి. అంతేకాదు, ప్రజలని కూడా చీలికవైపు దారిమళ్లిస్తాయి. అంతకుముందు ఐక్యంగా ఉన్న ప్రజల మధ్య పార్టీలలో కొనసాగే అనైక్య భావాలు పెరిగిపోతాయి. పట్టుమని పది మండలాలలో కాలు మోపలేని కొన్ని పార్టీలు సైతం పైకి అత్యంత గంభీరంగా ప్రజాసంఘాలు ఏర్పాటు చేసుకుంటాయ. పత్రికల వార్తల స్థాయలో సభలు నిర్వహించి తమ అస్తిత్వాన్ని ప్రకటిస్తాయి. ఇలా ఎందువల్ల జరుగుతోంది?
ఈ ధోరణి వల్ల ప్రజలలో సహజంగా ఉన్న మానవ, వృత్తి, వర్గ, సాంస్కృతిక సంబంధాలు చీలికలు పేలికలవుతున్నాయి. నిజానికి అట్టడుగు శ్రామిక వర్గాలలో ప్రజల ఐక్యతకోసం ఒంటరిగా, సమిష్టిగా కృషి చేయాల్సిన పార్టీలు ఆ పని చేయలేకపోవడమే కాదు, అందుకు భిన్నంగా ప్రజల్లో అనైక్యతా బీజాలు వేస్తున్నాయి. ఈ ధోరణుల వల్లే ఒక సంస్థకి చెందిన కవి గాయకుల గీతాలను మరో సంస్థ పక్కన పడేస్తుంది. నిషేధిస్తుంది. ఈ మాట కోపంగా తోస్తుంది కొందరికి. మరికొందరికి బాధ కలిగిస్తుంది. ఇది వామపక్షాల పట్ల విమర్శ కాదు. ఇది వామపక్ష, విప్లవ సానుభూతిపరుల ఆక్రోశం, ఆవేదన.
ఇకనుండి ఒక సంస్థ పాటలు మరోసంస్థ స్వీకరించాలి. ఈ కవి గాయకులు ప్రజలందరికీ చెందాలి. ఉమ్మడి సాంస్కృతిక సైన్యం భావన ఆచరణలో సాధ్యం కావాలి. రెండు, మూడు-ఆపై అన్ని సంస్థలు ఈ మిషన్‌లో భాగం కావాలి. అప్పుడు కామన్ మినిమం సాహిత్య సాంస్కృతిక రంగం నిర్మించబడుతుంది. ఈ సామూహిక సైన్యం చూపే ప్రభావం మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పునాది రాజకీయ, ప్రజా శత్రువులపై యుద్ధ ప్రకటనగా మారుతుంది. శత్రువు బలవంతులవుతున్న కొద్దీ ప్రజా సాంస్కృతిక సంస్థలు అంత దగ్గరవుతాయి. వాటిని నడిపే రాజకీయ నిర్మాణాలలో సైతం ఉమ్మడి అవగాహన పెరుగుతుంది. ఉమ్మడి కార్యాచరణ ప్రజా శత్రువులను, బలీయ రాజకీయ వర్గాలను బలహీన పరచగలుగుతాయి. సాహిత్యం, సాంస్కృతిక రంగం ఐక్య రాజకీయ సంఘటనకి దారి తీయగలదేమో ఆలోచిద్దాం. దానిని ఆచరణలో సాధ్యం చేయడానికి ముందుకు కదలాలి.
అదిగో, అలాంటి ఉమ్మడి పాటలు, కళారూపాల గురించి ఆలోచిస్తే మొదటి విడతలోనే అనేకమంది కవుల రచనలు కళ్లముందు కదలాడుతుంటాయి. అలాంటి వారిలో బండి సత్తెన్న ఒకరు. అతని సాహిత్యంలో కచ్చితంగా ప్రజల ఉమ్మడి సమస్యలున్నాయి. పార్టీ పంథాకి సంబంధించి ఆయా దశలలో ఇతర ప్రజా సంఘాలలో కలసి పనిచేసే క్రమంలో రాసిన పాటలూ ఉంటాయి. ఇలాంటి కోవకు చెందిన ప్రజాకవులు, కళాకారులు యాభైశాతం విశాల జన జీవితాలకు సంబంధించిన రచనలు చేశారు. చేయాలి కూడా. మిగతా సగం అవసరమైతే పార్టీ లైనుకి అవసరపడే పాటలు రాసి పాడుకున్నా ఫరవాలేదు.
ఇవ్వాళ వర్గం యొక్క స్వరూపం విస్పష్టంగా లేదు. భౌతికంగా వర్గ స్వరూపం ఇతమిత్థంగా చెప్పలేని పరిస్థితి. శ్రామిక వర్గ భావనకి వ్యతిరేకమైన భావనలు ఆ వర్గంలోని వారే కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇటీవలి ధోరణి. పేదలను కడుపేదలుగా మార్చి వారి జీవన ఆకాంక్షని సైతం దెబ్బతీసే నవీన పరిస్థితులు ఆవరించుకున్నాయి. మధ్యతరగతి ఆర్థిక స్థితికన్నా, కన్యూమరిజం వల్ల, ఆ తరగతిలో చాలామంది చేరిపోయారు. ఎవరు ఏ వర్గం కిందకి తేలుతారో స్పష్టంగా చెప్పడం కొంత కష్టమైంది. అర్థంకాకపోవడం కొంత క్లిష్టతకు దారితీస్తోంది. కాబట్టి ప్రజా దృక్పథం, రాటుదేలి ప్రజా వ్యతిరేకంగా విధానాల రూపకర్తలు, పెత్తందారులకు వ్యతిరేక అనేక కోణాలనుంచి పోరాటాలను ముమ్మరం చేయవలసి ఉంది.
ఈ అవసరాలను కవి గుర్తించాలి. కళాకారుడు కళనే లక్ష్యంగా ఎక్కుపెట్టాలి. రంగారెడ్డి జిల్లాలో నివసించే అలాంటి కవి,కళాకారుడు బండి సత్తెన్న తన సాహిత్య ప్రయాణంలో సృజించిన అనేక రచనలు ప్రజారాశులకు ఉపయోగపడతాయి. తన ‘జనపథం’కు ముందుమాట చదువుతుంటే ఒక కొత్త లోకంలోకి ప్రవేశించిన అనుభూతి కలిగింది. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి ఓవైపు చదువుతూ, మరోవైపు తన కుటుంబం, కులం, తన చుట్టూ మోహరించి ఉన్న జానపద కళారూపాలను అధ్యయనం చేశాడు. పుస్తకాల చదువువల్ల బతకడానికి కండక్టర్ ఉద్యోగం వచ్చింది. జీవితాన్ని చదవడం వల్ల కవి,కళాకారుడు అనే బాధ్యత మీద పడింది. ప్రాథమిక దశలో ఎవరి మార్గదర్శకత్వం లేకుండానే తనకై తానే గురువై సొంతంగా పాటలు, కళారూపాలు రాయడం ప్రారంభించాడు. ఆ తరువాత తను విన్న గద్దర్ పాట, కొని చదివిన గద్దర్ పుస్తకం తనను చాలా ప్రభావితం చేశాయ. అప్రత్యక్ష గురువులుగా అమ్మమ్మ రాములమ్మ, తల్లి పోశమ్మ, తన అక్క జంగమ్మ, శారద కథాగాయని కంబాలపల్లి జంగమ్మ ప్రత్యక్ష కళాగురువులు. వారి నుండి నేర్చుకున్న విద్యని తిరిగి సమాజపరం చేశాడు సత్తెన్న. అలాంటి సత్తెన్నల సాహిత్యం కావాలిప్పుడు.