తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

మూలలు కాదు, మూలాలలోకి చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరిది రాత సాహిత్యం. నోటి సాహిత్యం అందరిది. చాలామందికి అందనిది పుస్తక సాహిత్యం. అలవోకగా అందేదే ప్రజాసాహిత్యం. పుస్తకం హస్త్భూషణం. వౌఖిక పాఠం మస్తకభూషణం. చేతికందడం ముఖ్యమా, బుద్ధికి చేరడం అభిలషణీయమా.. ఆలోచించాలి. క్షేత్ర పర్యటన కోసం సూర్యాపేట, నకిరేకల్లు ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు పలస వెంకటేశ్వర్లు తారసపడ్డాడు. అతను సేకరించిన జానపద సాహిత్యం చూశాక కలిగిన భావాలు ఇవి. వాటిని ఈ వారం మీ ముందుంచుతున్నాను.
గొప్ప కవిత్వం చదివి రాజులు తలలూపేవారు. కవి తన జన్మ ధన్యమైందని ఎగిరి గంతేసేవాడు. ఇంటికెళ్లి తృప్తిగా నిద్రపోయేవాడు. జానపద కవిత్వం విని ఒక సమాజానికి సమాజమే ఆనంద తరంగమయ్యేది. రాత్రంతా జాగారం చేసి, వేకువనే పొలం పనుల్లోకి, శ్రమ క్షేత్రాలకు ఉత్సాహంగా పరుగులు తీసేవారు. ఇది సృజనాత్మక సామూహిక జనరంజక కవిత్వం. ఆస్థాన కవులు మరిన్ని సర్కస్‌ఫీట్లతో కవిత్వానికి శృంగార కైపులు అద్దేవారు. ఇది కావ్య కవిత్వం. సమూహమై, అందరి ఆకాంక్ష కవిత్వమై, శ్రమలోంచి కొత్త బాణీలు సృష్టించి, దానికి శరీర కదలికల సంగీతం అద్ది, ఉత్పత్తితోపాటే ఆనందాన్ని పంచేది జనకవిత్వం. అక్కడ రాజాస్థానం మాత్రమే పులకించేది. ఇక్కడ ప్రకృతి సమస్తం అలరించేది.
భాష, సంస్కృతి, శాస్త్రం సహజంగా వ్యాపించిన కేంద్రం నుండి దానిని వికృతిగా మార్చడమే దోపిడీ తెలివి. నిజానికి అది తెలివిమాలినతనం. అలాగే ఆటపాటల కవిత్వాన్ని ఆమడదూరం పరాయికరించి వాడు తన పేరుతో అక్షరబద్ధం చేస్తాడు. ధ్వనిబద్ధం చేసిన జానపదులు గాన తరంగాలను గ్రామ గ్రామాలలో వీనుల విందు చేస్తారు. పరవశత్వపు పసందుగా మారుస్తారు. వీరికి ఊరూ పేరూ ఉండదు. గుర్తింపు సమస్య లేదు. అంతా సామూహికం. ఆట (ప్రదర్శనలు) పాట (అనేక రకాల పాటలు, వీరగాథలు వంటివి), మాట (జాతీయాలు, సామెతలు, భాషారూపాలు వంటివి) అన్నీ సమభాగాస్వామ్యంలోంచి, ప్రజాతంత్ర భావనలోంచి, అందరు కలిసి మూకుమ్మడిగా సృష్టిస్తారు. వీరంతా శ్రమజీవివర్గాలకు, ఉత్పత్తి సంస్కృతికి, సామూహిక జీవన విధానానికి చెందినవారే. వీరి సాహిత్యం, కళలు, సంస్కృతి ఎంతో విశిష్టమైనవి. కాని ఏ సామూహికత వీటి బలమో, దానినే బలహీనతని చేసి వాటిని తమకు అనుగుణంగా పాలితవర్గం నిత్యం ఉపయోగించుకుంటుంది. ఈ జానపద సాహిత్య కళాసాగరాన్ని నిరంతరం దోచుకునిపోవడం ఒక పథకం ప్రకారం జరిగిపోతున్నది. శ్రమ దోపిడీతో లాభార్జన చేసిన ధనికులను నేరస్తులుగా చెప్పలేకపోయాం. అలాగే ప్రజల సాహిత్యాల్ని దొంగిలించి, తమదిగా చెప్పుకునే పాఠ్యచోరు (ఔ్ఘ్ఘజఒఆ)లుగా రుజువు ఛేయలేకపోయాం. ఇది ఈనాటికీ నడుస్తున్న చోర, నేర చరిత్ర. కేవలం పాటనే కాదు, అనేక యక్షగాన వీధి భాగోత జానపద నాటక శైలుల్ని స్వీకరించి, తమ నూతన ప్రయోగాలుగా లిఖిత కవులు సొంతం చేసుకున్నారు. రకరకాల బాణీలను, భావాలను మాత్రమే కాదు, సంగీత దరువులను సైతం వ్యక్తుల సంగీత సృష్టిగా మార్చుకున్నారు. అంటే ప్రజల సామూహిక సృజన శక్తిని వ్యక్తిగత సృజనగా చెప్పుకున్నారు. సృజన రంగంలో పనిచేసే ప్రగతిశీల శక్తులు ఈ విషయాన్ని బట్టబయలు చేయడంలో విఫలమయ్యాయి. ఆయా సంస్థల మేనిఫెస్టోలో ఇలాంటి విషయాలు భాగం కాలేకపోయాయి. రాజకీయంగా ఆర్థిక దోపిడీ జరిగే విధానాన్ని సిద్ధాంతాల ఆధారంగా ప్రజలకు అవగతం అయ్యేలా విప్పి చెప్పలేకపోవడం ఒక లోటే. వర్గపోరాట నాయకత్వంలో ఉన్నత కుల వర్గాల వారే ఎక్కువ. అందువల్ల ఈ విషయాలను విశదీకరించేప్పుడు తమ కుల వర్గాల పాత్ర కూడా తేటతెల్లం అవుతుందని భావించారు. అలా వివరించి చెప్పడం సున్నితమైన విషయం అని భావించారు. అందువల్ల అలాంటివి తెలియజేయవలసిన ప్రయత్నాలు ఏవీ ప్రణాళికాబద్ధంగా జరగలేదు. మొదటి తరం ప్రజలకు ఎలాంటి సమాచారం ఏదీ అందింపబడలేదు. అదే కారణం వల్ల సారస్వత సాంస్కృతిక రంగాలలో సైతం శిష్టవర్గాల నాయకులే అధికం. కాబట్టి ప్రజల భాష, మాండలికం, సంస్కృతులకు భూస్వామ్య సంస్కృతి పేరు పెట్టి దానిలోని మంచి అంశాల (్భతిక, పాదార్థిక, హేతువు వంటి వాటిని)ను కూడ నిరాకరించారు. ఇది ప్రగతిశీల నాయకత్వంలో దాగిన వర్గకుల మనస్తత్వం. దీనివల్ల చాలా నష్టం జరిగింది.
పండిత వర్గాలవారు వందేళ్ళ కింద బ్రాహ్మణ, ఉన్నత వర్గాల స్ర్తిల పాటలను మాత్రమే ఎక్కువగా సేకరించారు. నందివాడ చలపతిరావు మూడు సంపుటాలలో ఉన్నత వర్గాల స్ర్తిల పాటలు, శ్రీహరి ఆదిశేషువు జానపద, పౌరాణిక పాటలు, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి రామాయణ పాటలు, టేకుమళ్ల వారి ఉపరితల జానపద గేయాలు ఇందుకు ఉదాహరణ. కోస్తాలో అతి శూద్రుడైన నేదునూరి గంగాధరం, తెలంగాణలో బి.రామరాజు వంటివారు శ్రమజీవుల, కింది వర్గాల వారికి చెందిన జానపద విజ్ఞానాన్ని తవ్వి తీశారు. ఆ తరువాత అట్టడుగు వర్గాలవారే ఈ రంగంలో కొంత విలక్షణ సేకరణ, పరిశోధనలు చేపట్టారు.
నిజానికి జానపద విజ్ఞానం సేకరణ అసంపూర్ణమే. అజ్ఞాతమైన రంగాలు ఇంకా కొన్ని ఉన్నాయి. వెలుగు చూడని కోణాలలో దృష్టి పెట్టవలసే ఉంది. ముఖ్యంగా భౌగోళికంగా దూరంగా ఉన్న ప్రాంతాలలో గల అంశాలపైకి పరిశోధకుల దృష్టి పోలేదు. అట్టడుగు కులాలకు చెందిన వారి వద్ద దాగి వున్న గానం, సంగీతం, వివిధ రకాల పాఠ్యాల వంటివాటి సేకరణ పూర్తిగా జరగలేదు. ఆదివాసీ ప్రాంతంలో సజీవంగా వున్న తెలుగు జానపద విజ్ఞానం తలుపులు చాలానే తెరువవలసి ఉంది. ఈ రంగాలలో ముఖ్యంగా స్ర్తిలకు సంబంధించిన విజ్ఞానం, ఆచారం, సంప్రదాయం, నమ్మకాలు, పునరుత్పత్తి భావనలు, ప్రాచీన భాషావిశేషాలు, బాణీలను నమోదు చేయవలసి ఉంది. కాగా చాలా పరిశోధనలు జానపద విజ్ఞాన క్షేత్రాల మూలాలకి వెళ్ళలేదు. సమాజం ఉపరితలంలో కానవచ్చే కళారూపాలు, గేయాలను, కొన్ని కథనాలను మాత్రమే సేకరిస్తున్నారు. జానపద సమాజంలో గల నమ్మకాలు, విశ్వాసాలు, క్రతు కర్మ కాండల అంతఃసూత్రాన్ని పట్టుకోగలిగినపుడే ఈ ఉపరితల పాఠ్యాలు, ప్రదర్శనలను పూర్తిగా అర్థం చేసుకోగలం.
ఒక కథ, పాట, బాణీ ఎందుకు వేలాది ఏళ్లుగా స్థిరంగా నిలవగలిగాయి. ఎందుకు ప్రజల ఆదరాభిమానాన్ని పొందగలిగాయి. వీటికి కారణాలు ఏమిటి అనే కోణం లోంచి జానపద పరిశోధనలు జరగాలి. అప్పుడు మాత్రమే జానపద ప్రజా సారస్వత కళా సౌందర్య విలువలు కొన్ని తెలియవస్తాయి. ప్రజలు ఆర్థికంగా పేదవారే కావచ్చు. వారు నిరంతరం శ్రమ దోపిడీకి గురికావచ్చు. కాని వారి జీవితం ఎంతో కళాత్మకంగా వుంటుంది. తమ చుట్టూ వున్న ప్రాకృతిక పదార్థాలతో అందమైన వస్తువుల్ని, అలంకరణలను చేస్తారు. చేతివృత్తుల ఉత్పత్తులను పరిశీలిస్తే ఈ కళాత్మకత విశదంగా తెలియవస్తుంది.
వందలాది చీరల డిజైన్లు, రంగులు, రంగుల సమ్మేళనం అబ్బురపరుస్తాయి. వీటికి పాశ్చాత్య చిత్రకారులే తల వంచి సాల్యూట్ చేస్తారు. బంగారు ఆభరణాల డిజైన్లు, శరీరానికి, అవయవాల పొందికకు, స్ర్తి పురుషులకు, పిల్లలకు అనుగుణంగా, ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఈ పొందికలో మెరుగుదిద్దిన పనితనం బంగారం విలువ కన్నా ఎంతో మిన్న. ఇత్తడి తదితర లోహాలతో చేసే పరికరాలు, వాడుక వస్తువులు, విగ్రహాల నమూనాలు, వివిధ అలంకరణలలో వారి సృజనాత్మక ఔన్నత్యం గోచరిస్తుంది. వెదురు, ఈత, తాటి, ఆకు, తోలు, గుడ్డతో తయారుచేసే అలంకరణ సామగ్రి, ఉత్పత్తిలో వినియోగించే వస్తువుల కళా విలువలు ఆశ్చర్యం కలిగించక మానవు. శిలలను తొలిచి చెక్కిన శిల్పాలు, విగ్రహాలు, రాతి చెక్కడాలు, నిర్మించిన కట్టడాలు ఈ నాటికీ మనలను ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. ముఖ్యంగా జానపద శైలి, చిత్రకళ మానవ కళాత్మక మేధస్సుకు అద్దం పడతాయి. వారు తయారుచేసిన ప్రాచీన డిజైన్ల నమూనాలను శిష్టవర్గాలు కాపీ చేసి వారి శక్తియుక్తుల్ని పక్కన ప డేశాయి. కాలక్రమంలో ఏది మొదలు, ఏది వెనక అనే గీటురాయితో ఎవరు ఎవరిని అనుకరించారో తేల్చి చెప్పిన రోజు సామాన్య ప్రజల సౌందర్య దృష్టిలోని పరమార్థం అవగతం అవుతుంది. రాజుల, స్థానిక పాలకుల సౌందర్య దోపిడీకి ఈ వర్గాలవారు గురయిన విధానం తెలుసుకోలేకపోవడం విషాదం. ఈ కళాకారులను కులాలు, ఉపకులాలుగా విభజించి, వారిని తొక్కిపెట్టి, వారితో కళాత్మక వెట్టి చాకిరి చేయించుకోవడం భూస్వామ్య, రాచరిక సమాజాల్లో మామూలు విషయం. ఈ కళాబృందాల జానపద సాహిత్యం సంస్కృతిని పరిశోధించడమే పరిశోధకుల ప్రధాన కర్తవ్యం కావాలి. అప్పుడే ప్రజల పాత్రని అర్థం చేసు కోగలం. వారికి గౌరవ మర్యాదలను ఇవ్వగలం.

-జయధీర్ తిరుమలరావు jayadhirtr@gmail.com సెల్ : 9951942242