తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

కొత్తపొద్దు కోసం ‘అరుణోదయ’ కదలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూస్వామ్య రాచరిక సంస్కృతి కన్నా భిన్నమైనది ప్రజాసంస్కృతి. ఈ సంస్కృతి నిరంతరం సృజనశీలమైనది. ఉత్పత్తి శ్రమ, శారీరక శ్రమ రెంటి ద్వారా సృష్టింపబడే ఫలితాంశంతోపాటే ప్రజాసంస్కృతి రూ పొందుతుంది. అప్పుడప్పుడు పరికరాలతో చేసే పని (మోట, ఏతాం, రోలు, విసురురాయ వంటివి) లోంచి తీరొక్క రాగం వెలువడుతుంది. ఇక్కడ రాగం ఒంటరి కాదు. సామూహిక జన్యువు. రాగంలో శబ్దం మిళితం అయి ఉంటుంది. ఈ శబ్దాలకు అక్షరాలు ఆ తరువాత సంకేతాలైనాయి. అక్షరాలు లిపిబద్దం అవుతాయి. అంటే శబ్దంలో పదం మిళితం అయి ఉంటుంది. రాగాలలో శ్రమ విధానాన్ని అనుసరించి వచ్చిన పదాలు, శ్రమలో పాల్గొన్న వారినీ, వాటిని వినే శ్రోతలను అవి అలరిస్తాయి. ఒక్కో రాగం ఒక గొప్ప ప్రకృతి వ్యక్తీకరణ. అది చైతన్యం. దానికి నోటి సాహిత్యంతో విడదీయరాని సంబంధం ఉంటుంది. ఇక్కడ ప్రాథమిక దశలో ఏది రాగం, సంగీతం, సాహిత్యం అని విడదీయలేం.
బరువులు మోయడంలో హ, స శబ్దాలు వస్తాయి. బరువు ఎత్తేప్పుడు హ, హ్హ అంటు ఎత్తుతారు. దింపేప్పుడు స్, స్స్, హ అంటూ దింపుతారు. ఇది మానవ శరీర నిర్మాణంలో భాగం. ఈ శారీరక కదలిక, ఉచ్ఛ్వాస నిశ్వాసాలే హైస్సోగా మారింది. ఈ రెండు పద ధ్వనుల మధ్య పని విరామాన్నిబట్టి పదాలు చేరతాయి. ఆ పదాల స్వరూపం, ఉచ్ఛారణ ఆ సమూహానికి విశదంగా అర్థం అవుతాయి. ఆ భాష, పదం, అలాంటి ఆ సమూహానిదే. అది వారి సొంతం. ఎవరికీ అనుకరణ కాదు. పోటీ కాదు.
అలాంటి పదాలే పాట పాఠ్యంగా కానవస్తుంది. ఇందులో గొప్ప కవిత్వం అంటూ ఉండదు. కాని గొప్ప శ్రమశక్తితో మిసమిసలాడుతూ ఉంటుంది. ఈ శక్తే పాటకు జీవప్రాణం. అనేక పాటలకు మూలాధారం అదే. ఇలా పురుడుపోసుకున్న శ్రమ రాగ గీతాలు సందర్భం, శ్రోతవర్గం మారినప్పుడల్లా విరామగీతాలై తద్వ్యతిరేకం కూడా అవుతాయి. ఈ విధానానే్న పరాయికరణ అంటాం. అసలు మూల పాటలను కాకుండా ఇలాంటి పైపై పాటలను ప్రగతిశీల కవులు తీసుకుని తిరగరాస్తారు. కాని మూలాధారపు పాటలను తీసుకోలేక పోయారు.
ప్రజాప్రతిఘటన తలెత్తినప్పుడల్లా ప్రజాసంస్కృతి ఆయుధంగా రూపాంతరం చెందుతుంది. ఆయా శ్రమజీవుల చేతుల్లో, గుండెల్లో, మేధస్సుల్లో, సమూహంలో వివిధ రూపాలలో ఆయుధమై వారికి దన్నుగా నిలుస్తుంది. వారే ఇలాంటి వివిధ రూపాల సాంస్కృతికాయుధాలను సృష్టించగల నిపుణులు. వారే వాటిని సరిగ్గా ఎక్కుపెట్టగల ధీరులు. వాటిని సృష్టించిన వర్గాలవారికే వాటిని మార్చడం తెలుసు. ఎంత శ్రామికవర్గ సిద్ధాంతవాదులైనా వాటిలో భాగం కాలేరేమో. అందులో భాగం అయినవారే, ఆ సాంస్కృతిక భాష, వ్యాకరణం తెలిసినవారే వాటిని శత్రువుపై ఎక్కుపెట్టి వెనుదిరగని ఆయుధాలుగా మార్చగలరు. గట్టుమీద కూర్చుని మాట్లాడే కల్పిత బృందాలు వారికి మద్దతుగా నిలబడగలవు. వారికితోడు అని భావించగలరు. కాని ఆ సంస్కృతి నిర్మాతలలో ఒకరిగా భాగస్వాములు కాలేరు. అందువల్ల పూర్తిగా వారికి దానిపై ‘పట్టు’ లభించదు. చూపువల్ల లభించిన చిన్న ఆసరాని పట్టు అని భావిస్తారు. దీనిని మొత్తంపై అధీనం ఉన్నట్లుగా భావించడం వల్ల డెబ్బై ఏళ్ళుగా కొంత అన్యాయం జరిగింది. అసలైన లోతులని కాకుండా పైపై పరిచయాన్ని జ్ఞానంగా భావించాం- అందువల్ల చాలా విశిష్టమైన ఎన్నో శక్తులను స్వీకరించలేకపోయాం. మనలో దానిని, దానిలో మనం పూర్తిగా విలీనం కాలేకపోయాం. అందుకే సంపూర్ణ ప్రజాకేంద్రక సాంస్కృతిక నిర్మాణం రూపొందలేకపోయింది. ఎందుకు అలా జరిగింది అన్నది ప్రశ్న.
శ్రమ సంస్కృతిలో భాగం కావడం అంటే- శ్రామిక వర్గం, కుల అణచివేతల జమిలి దోపిడీకి గురవుతున్న వారిలో భాగం కావడం. కాని సాంస్కృతిక రంగంలో పనిచేసే వారిలో ఎంతమంది అలాంటి అనుభవాన్ని పొందారన్నది ప్రశ్న. అలాంటి ప్రజల జీవితంలో గెస్టు ఆర్టిస్టుగా ఉన్నవారు, బాధల అనుభవ మంటపాల కూలిన బరువుల మధ్య భాగం కాలేకపోవడం గమనించాలి. అలాంటి చాలా కొద్దిమంది, ఆయా చిన్నచిన్న దశలలో మంచి ఫలితాలు సాధించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఐతే వారు ఏవేవో కారణాల వల్ల అందులోంచి బయటకు రాగానే వారిలోని సృజన సృష్టిశక్తి తగ్గిపోవడం జరిగింది. నిస్సత్తువకి గురయ్యారు.
శ్రమ సంస్కృతిలోనే నిలిచి ఉన్నవారు సృష్టించిన ప్రతిఘటన పోరాటాలలోని సాంస్కృతిక శక్తియుక్తులు అమోఘం. ప్రజలలోంచి ప్రజల మధ్య, వారి తరఫున నిలవడం ఒక అంతర్లీన విధానం. ప్రజలలోకి వెళ్ళడానికి అనేకరకాల ప్రయత్నాలు చేసి దరిని మాత్రమే తాకడంవల్ల సిద్ధించిన శక్తివేరు. ఈ రెండు రకాల ప్రజాసాంస్కృతిక రంగాలు అవసరమే. ఐతే ఒకటి మైనస్ మరొకటి మిగిలితే సరికాదు. ఈ రెండు రంగాలనుండి ప్రాణవాయువుని స్వీకరించడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతాయి. అందుకు ప్రత్యేకమైన సంస్థలు ఉంటాయి. కొన్ని ఉండీ లేనివి. లేకుండానే ఉన్నట్లుగా అనుబంధ జాబితాలో మాత్రమే కనుపించేవి కొన్ని.
మరికొన్ని చురుగ్గా కాగితాలకే పరిమితం అవుతాయి. వాస్తవానికి అవి జనక్షేత్రాలలో కాకుండా వివిధ వేదికలపై మాత్రమే కానవస్తాయి. అవసరానుగుణమైన కాలాలలో మాత్రమే వాటికి ప్రాణంపోసి కాపాడుకుంటారు. ఆ సంస్థలు ఇతర యంత్రాంగాన్ని కూడా కదలిస్తాయి. నిజానికి భావాలను మార్చడంలో, విప్లవీకరించడంలో సాంస్కృతిక సంస్థల పాత్ర గొప్పది. అవి లేకుండా భారతీయ వ్యవస్థను కేవలం ఆయుధాలతో మార్చలేం. రాచరిక, భూస్వామ్య, పెట్టుబడిదారీ దోపిడీ సంస్కృతిని, పలాయన సంస్కృతి అంతం కాకుండా కొత్త సంస్కృతికి, పాదులు పడలేవన్నది అందరికీ తెలిసిన సత్యం. ఐతే ఎలా, ఎప్పుడు అన్నదే ప్రధానమైన ప్రశ్న.
ఈనెల 23, 24 తేదీలలో 42వ వార్షికోత్సవం సందర్భంగా జరిగే సభలు హైదరాబాదులో మరోసారి ప్రజల పక్షంగా అంకితం కాబోతున్నవి. ఈ సందర్భంగా సాంస్కృతిక రంగంలోని అపసవ్య ధోరణులను ఎదుర్కొంటూ ఆరోగ్యకరమైన సాంస్కృతిక రంగ నిర్మాణం గురించి ఆలోచనలు చేయడానికి నడుం బిగించింది. ఆనాడు 1940 ప్రాంతంలో ఏర్పడిన ప్రజానాట్య మండలి కన్నా మరింత లోతుగా రాశి, వాసిలో ప్రజల చేరువగా పోవాలన్న లక్ష్యం ప్రకటించుకున్నందుకు అరుణోదయని అభినందించవలసిందే. ‘ప్రజలు చరిత్ర నిర్మాతలు’- అనే విషయాన్ని మాటల్లో కాకుండా, చేతలలో చూపిస్తూ, ప్రజలే సాంస్కృతిక రంగ సృష్టికర్తలు అనే దిశగా వారి ప్రయాణం కొరసాగాలని ఆకాంక్ష. ఉద్యమాలు చేసేది నాయకులు. వారి కింద పనిచేసే కళాకారులు పైవర్గాలవారు. రచయితలు, రచయితల సంఘాల నాయకులు పై కులాల వారే ఎక్కువ. ఈ వాస్తవికతకు భిన్నంగా శ్రామిక కుల వర్గాలకు చెందిన నేలవాసీ శక్తులతో చిన్నా, పెద్దా గాన కళా ప్రవాహాలతో అరుణోదయ బృందం ముందుకుపోతున్నది. జన క్షేత్రం బరిలో నిలిచి ఉంది.
మార్కెట్ సంస్కృతి వెనక దాగిన సామ్రాజ్యవాద శక్తులను, భూస్వామ్య సంస్కృతి వెనక దాగిన జాతీయ పెట్టుబడి ముసుగులో దాగిన భూస్వామ్య శక్తులను, వారి మత కుల పెత్తందారీ ఆధిపత్య దోపిడీని ఎదిరించవలసి ఉంది. వీరి దేశీయ ఆధిపత్యాలను అన్నింటిని ప్రతిఘటించడం, ఉద్యమించడం వల్లే దోపిడీని అరికట్టగలం. ఈ పని ఒకవంక కొనసాగాలి. మరో వంక రాజకీయ ఐక్యత, సైద్ధాంతిక నవ్యకోణాల మధింపు జరగాలి. ఈ క్రమంలో ప్రగతిశీల సాంస్కృతిక రంగ ఐక్యత సాధించడానికి ఆలోచనలు పాదుకొలుపుతూ పోవాలి. ప్రస్తుతం అరుణోదయ ముందు ఈ కర్తవ్యాలు సవాళ్ళై నిలిచాయి. ఆలిండియా అనే టాగ్‌తో ఎన్నో సంస్థలు వెలువడ్డాయి. అవి నిర్దిష్ట జన క్షేత్రాలలో సాధించింది చాలా తక్కువ. చాలా వరకూ ప్రతిఘటన కోసమే ఏర్పడ్డాయ తప్ప విస్తృత స్థాయలో ఏర్పడలేక పోవడం గమనించాలి. లోగడే నేతలుగా ఉన్నవారిని మరో నేతగా అలాంటి సంస్థలలో నిలపడం వల్ల లాభం లేదు. యువశక్తికి పగ్గాలు అప్పగించి వాసిలో గొప్ప ఫలితాలను సాధించగలగాలి. అందుకు ఒక కొత్త ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆ దిశగా భారతదేశంలోని సాంస్కృతిక రంగం పురోగమనం చెందాలి. వివిధ రాష్ట్రాలనుండి ఈ రంగంలో పనిచేసే ప్రగతిశీల సంస్థలు, వ్యక్తులు, నిర్మాణాల బాధ్యులతో చర్చించి అధ్యయన పత్రం రూపొందించాలి. అందుకు ఈ మహాసభలు పునాది వేయాలని కోరక తప్పదు. చాలా కాలంగా భారతదేశంలో ఒక మహిళ ఆధ్వర్యంలో నడిచే మహిళా సాంస్కృతిక రంగ నిర్మాణం అరుణోదయ ఒకటేనేమో. ఏది ఏమైనా పురుష ప్రధానంగా ఉన్న ప్రజానుకూల సాంస్కృతిక రంగంలో మహిళల ప్రాధాన్యత పెరగాలి. కులాధిపత్యాలు, మతాధిక్యతలు, పురుషాధిక్యతలు తగ్గిపోవాలంటే స్ర్తిల అధీనంలోకి సాంస్కృతిక రంగం రావాలి. దానిలో ప్రగతి సాధించాల్సిన అవసరం ఉంది. ప్రజలలోనుండి, శ్రమ క్షేత్రాల నుండి సాంస్కృతిక రంగంలోకి మహిళలను నింపగలిగిననాడు ఒక కొత్త వరవడికి నాంది పలుకుతుంది. ఇవి ఆలోచనలు మాత్రమే. ఆచరణలోకి తొంగిచూడ్డం కోసమే ఈ నాలుగు మాటలు. *

-జయధీర్ తిరుమలరావు jayadhirtr@gmail.com సెల్ : 9951942242