తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఇది ఒక మాయ! మాయ అనగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్ల రద్దు వల్ల మూడు వారాలుగా ఎటూ పోలేని పరిస్థితి. విమానంలో వెళ్ళడం సులభం. ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్ తీసుకోవచ్చు. పెద్ద నగరాలకి కూడా ఆన్‌లైన్‌లో బస్ టిక్కెట్ దొరుకుతుంది. కాని ఏభై, వంద కిలోమీటర్ల దూరం బస్సులో ప్రయాణించాలంటేనే కష్టం.. బస్టాండుకు పోవాలన్నా, బస్సెక్కాలన్నా, నీళ్ళ సీసా కొనాలన్నా చిల్లర కావాలి. తివిరి ఇసుకనందు తైలంబు తీయవచ్చునేమో గాని, బ్యాంకుల్లోంచి చిల్లర తీ యలేం. చిల్లర మాలక్ష్మి కంటికి కానరావడం లేదు. ఇప్పుడు లక్ష్మి కంటికి కనుపించదు. అదృశ్యమై అంకెల్లోనే కనుపించాలట అదీ మొబైల్ ఫోనుల్లోనే. పూజగదిలో లక్ష్మీదేవి ఫొటోలకి ఇక ప్రాసంగికత తగ్గిపోతుంది. ఫోను తెరమీద ఆమె బొమ్మని చూస్తారేమో. ఓ చేత్తో కాసులు, మరో చేత్తో బంగారం కురిపించే లక్ష్మీదేవి ఫొటోలో ఇకముందు మొబైల్, కంప్యూటర్‌లు చిత్రిస్తారు.
విమానాల రద్దీ తగ్గలేదు. రాజధాని రైళ్ళలో ప్రయాణాలు తగ్గలేదు. ఆటోలు, షేరింగ్ ఆటోలు, బస్సులలో ప్రయాణికులు మాత్రం తగ్గిపోయారు. రోగాలు తగ్గలేదు. రోగుల సంఖ్య రోజురోజుకీ గణనీయంగా తగ్గిపోతున్నది. లేనివాళ్లకు గుండెపోటు వచ్చి క్యూలో హరీమంటున్నారు. పాడెమీద వేయాల్సిన పైసలకు దిక్కులేక శవాలు రోదిస్తున్నాయి. చిల్లర లేక శవయాత్రలో చల్లాల్సిన పేలాలు ముక్కిపోతున్నాయి. ప్రజలు ఇప్పుడు కడు పేదలవుతున్నారు. డబ్బున్నవాళ్ళు కూడా చిల్లర డబ్బులేక పేదలయ్యారు. అంటే ఈ దేశం ఇప్పుడు పేదదిగా తయారైంది. నాలుగు చిన్న డబ్బుల కోసం చాంతాడు క్యూలయ్యారు. ఎక్కడ చూసినా ‘డబ్బులేదు’ బోర్డులే. సామాన్య మానవుల ఇళ్ళలో దైన్యం నెలకొంది. రేపు ఏమవుతుందోనని కాదు- ఇప్పుడు ఏంచేయాలని! ఎవరి ముఖాల్లోనూ కళ లేదు. కళవెళ పడిన బ్యాంకులు వౌనాన్ని ఆశ్రయించాయి. చిల్లర కోసం పరుగెత్తి పరుగెత్తి పరువు కూడా పోగొట్టుకుని చిన్నపిల్లలకి పాలు, పాలపొడి డబ్బాలు, మందులు కొనాలన్న ఆరాటం.
పత్రికలు చాలావరకు తమ కళ్లకు కనుపించే మధ్యతరగతి మనుషుల్నే చూసి, వారితోనే మాట్లాడి, వారి స్వరాలనే వింటాయి. వినిపిస్తాయి. అదే పేచీ. మన ఆడిటర్లు, ద్రవ్య నిపుణులు పన్నులు కట్టేవారి సాదక బాధకాల గురించే మాట్లాడగలరు. పోలీసులు తనిఖీలో పెద్దనోట్లనే (పాతవీ కొత్తవీ) పట్టుకుంటారు. ఆ పెద్ద కార్లలోని బడాబాబులు ఒక్క ఫోనుతో అదంతా తెల్లడబ్బు అని సర్ట్ఫికెట్ ఇప్పించుకుని తమ దందాని మరింత భయం లేకుండా, మరింత వేగంగా చేసుకుంటూ పోతారు. గత రోజు కష్టపడి సంపాదించిన ఐదొందల నోటు చెల్లదని విన్నప్పుడు నోరెళ్ళబెట్టిన వాడి నోరు ఇంకా అలాగే ఉంది. ఆ నోటు చెల్లాలంటే వాడు పెట్రోల్ బంక్‌లో పెట్రోలు పోయించుకోవాలి. ఆ నోట్లు చెల్లాలంటే ఇల్లు లేనివాడు ఇంటి పన్ను కట్టవచ్చు. బాలకార్మికులుగా ఉన్న వాడి సంతానం ప్రైవేటు స్కూళ్ళలో ఫీజులుగా చెల్లించవచ్చు. బ్యాంకు అకౌంటు లేని వాళ్ళు బ్యాంకులో జమచేసుకోవచ్చు. కాని రోడ్డువార బడ్డీకొట్టుపై టిఫిన్ తినలేడు. పెద్దనోటు పామై సన్నజీవి కప్పను మింగివేస్తున్నది. సన్నకారు రైతు కూరగాయలు అమ్ముకోవడానికి ఏ ఆన్‌లైన్ ఉరితాడూ కానరావడం లేదు. ఎక్కువగా నష్టపోతున్నవారు ఇలాంటి బక్కపలచని నిత్య శ్రామికులే. మన పత్రికలకి అలాంటి మానవీయ కోణం ఇంకా, ఇప్పుడైనా అబ్బితే బాగుండు. ఏదో కలరా వచ్చినట్లు దేశవ్యాప్తంగా చావులు. వార్తలు కాని వార్తలవి. ముళ్ళకంచెల కీవల సర్జికల్ దాడులవి. బతుకు పోరాటం చేసే చెమట మనుషులపై దాడుల్లా ఉంది.
ఇద్దరు అధినేతల స్వరాల్ని బట్టి నోట్ల తీవ్రత వార్తలు. వారి హంగుదారుల పత్రికా ప్రకటనలు అంతా ఒక నోటాటకం. ముగింపు ఎప్పుడో తెలియని భయ సంగ్రామం. ఇది కనబడని యుద్ధం. నిజాయితీగా పన్నులు చెల్లించేవాడే బాధితుడు. అబద్ధాల, కాలాదందా పెద్దన్నలు మాత్రం సేఫ్‌సైడ్. వారిలో ఒక్కడంటే ఒక్కడు బాధితుడు లేడు. నల్లవ్యాపారం, కల్తీదందాలు చేసే లక్షలాది మంది సినిమాల్లో బలహీనుల కష్టాలు చూసి అయ్యోపాపం అన్న చందాన సానుభూతి స్రావం. ఒక్క పెద్దచేప పడని వల డిజైన్ చేసి చిన్న చేపల గిలగిలల కోసమే ఈ తతంగం అని అనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం ఒక హామీ బాకీ ఉంది. ఇది గమనించనివారు నోళ్ళు కుట్టేసుకుని మాట్లాడవలసిన సమయ సందర్భాల్లో, స్థలాలలో వౌనముద్ర. ప్రతి వారానికి ఓ రౌద్ర ప్రకటన. ఇన్ని ప్రకటనల సారాంశం ఇప్పటివరకు అర్థమైందేమిటంటే- బడుగువర్గాల వారు ఓపిక పట్టాలి, కష్టాలు పడాలి. కన్నీళ్ళకు స్థానం లేదు. అది మీ కర్మ. నిజానికి ఉన్నవాడి గుండె మరింత ప్రశాంతంగా ఉంది. లండన్‌లో విజయ్ మాల్యాల మందు విందు పొందుల విలాసాలు, పార్టీలు పెరిగాయి. అప్పులు ఇచ్చిన బ్యాంకులు వారి పద్దులు కొట్టివేయడానికి ఇదే సమయం కావలసి వచ్చిందా? అలాంటివారు ఇంకా ఎందరెందరో. వారందరికీ ఎర్ర తివాచీలు, ఎర్ర ఆసనాలు. అత్యున్నత ద్రవ్యసంస్థలు జోహుకుం అంటున్నాయ.
ఓ పెళ్ళికి మొన్న షామీర్‌పేట వెళ్ళాను. ఒక రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొట్టిన మనిషి కనబడడం లేదు. శరీరం రక్తం ముద్ద. పెద్ద వాహనం యజమాని ఎవరూ (ప్రమాదానికి కారణమైనవాడు కూడా) ఆస్పత్రికి తీసుకుపోతామనలేదు. అందరూ జేబులు తడుముకున్నారు. చిన్న పైసల కోసం. ఆటోవాడికి ఇవ్వడం కోసం. పాపం వాళ్ళు పేదలు. రహదారి నిండా ట్రాఫిక్ జాం. ఓ ఆటోవాడు మానవతా దృక్పథంతో ఆస్పత్రికి తీసుకుని పోతానన్నాడు. నా జేబులో ఉన్న ఏభై నోటు అతనికి తీసి ఇచ్చాను. మిగతావాళ్ళ జేబులు పేదవి. వాళ్ళవద్ద ఐదేసి పదేసి కార్డులు ఉన్నాయి. ఒక్కరంటే ఒక్కపైసా ఇవ్వలేదు. ఆ ప్రాంతంలో ఎటిఎంలు లేవు. అక్కడ ఉన్న ముసలవ్వలు, రోడ్డుపక్క కంకులు కాల్చే ఎండిన డొక్కలు.. తమవద్ద ఉన్న పైసలు ఆటోవాడి చేతిలో పెట్టారు. డబ్బుండి పేదలైన ధనికులు- ‘వెధవలు.. రోడ్డుమీద ఎలా ప్రయాణించాలో తెలియదు..’ అని తిట్టుకుంటూ తమ వాహనాల్లోకి దూరారు. ప్రమాదానికి గురైనవాడి పిడికిట్లో రక్తంతో తడిసిన ఐదొందల నోటు. కారు ముందు చక్రానికి అంటిన నెత్తురు ఎర్రగా మెరుస్తుండగా ముందుకు పరుగుతీసింది. ఆస్పత్రిలో చిల్లర నోట్లు లేనిదే చేర్చుకుంటారా? అలా వేచి ఉంటూ బాధతో ప్రాణాలు విడవాల్సిందేనా? నోట్ల రద్దు ప్రణాళిక ఇవేమీ ఆలోచించలేదు. అలా మనుషులు ప్రాణాలు విడవడం మామూలు మనుషులు కూడా ఊహించగలరు. ముందస్తు చర్యలు తీసుకోకుండా, సమాజంలోని అన్ని రంగాలను సమాయత్తపరచకుండా రద్దు ప్రకటించడం తొందరపాటని అక్కడ పాన్‌షాప్ నడిపే రంగయ్య ఖరాకండిగా చెప్పాడు. పెళ్ళి, చావు, అనారోగ్యం, డెలివరీ వంటి ఆపలేని వాటిని ఎలా ఎదుర్కోవాలో చెప్పకపోతే ప్రభుత్వం, దానిని నడిపే మేధావుల దార్శనికత ఏమైనట్లు?
నిజంగానే అదొక ప్రజావిప్లవం అయితే, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉండేదయితే ఈపాటికి డబ్బు మురిగిపోతున్న కుటుంబాల నుండి, వ్యాపారస్తుల నుండి ఎంతో వ్యతిరేకత వచ్చేది. ఎక్కడా, ఏ కోణం లోంచి కూడా ఎవరూ ఖండించలేదు, వ్యతిరేకించలేదు. పైగా సంతోషిస్తున్నారు. ఎంతోకొంత చెల్లించి మిగతా నలుపుని తెలుపులోకి మార్చుకోవచ్చు. ఈ గొడవలో దొంగనోట్లని సైతం ఆర్బీఐ ప్రచురించిన ఆధికారిక కరెన్సీతో సమం చేసుకోవచ్చు. సామాన్య ప్రజలు చిల్లర కోసం క్యూల్లో కాలం గడుపుతుంటే బ్యాంకు పెద్దలు, వివిధ సంస్థల బడాబాబులు పెద్ద నోట్లు తీసుకుని చిన్న నోట్లు, కొత్త నోట్లలోకి మార్చేసి తమ పారితోషికం తాము తీసుకున్నారు. సంపన్న భక్తులు ప్రజల రక్తం అంటిన పెద్దనోట్లని దేవుడి హుండీలో వేసి పాప ప్రక్షాళన చేసుకున్నారు. దేవుళ్ళు సైతం చాలా ఖుషీగా ఉన్నారు. పాపపు సొమ్ముతో దేవుడికి శఠగోపం పెడుతున్నారు. మరి ఈ సొమ్ము ఏ లెక్కలోకి వస్తుంది? గుజరాత్‌లో మిగిలిన ఆలోచనని ఇప్పుడు దేశం మొత్తం మీద రుద్దాలనే ప్రయత్నాలకు ఇది ప్రతిరూపం.
ఇప్పుడిప్పుడే కొత్తగా చదువుకుని, వ్యాపారం చేసుకుని బాగుపడే మామూలు మనుషులపై తేరుకోని కరెన్సీ బండ పడింది. వేల ఏళ్ళుగా వంశపారంపర్యంగా వచ్చిన బంగారం, వెండి మీద కూడా ఆంక్షలే! ఇవి తమ పూర్వీకులవని రుజువుచేసుకోవలసి రావడం విచిత్రం. అవి కలిగి ఉన్న వ్యక్తి పూర్వీకుల వంశం వాడేనా? అనే ప్రశ్న కూడా వస్తుంది రేపు. అదీ నిరూపించుకోవలసిందే. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రాలు. వీరికి చదువే రాదంటే మొబైల్ బ్యాంకింగ్ ఎలా సాధ్యం? సాంకేతిక నిరక్షరాస్యులు కోట్లాది మంది ఉండగా ఎప్పటికి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సఫలం అవుతుంది. క్యూ లైన్‌లలో ప్రాణాలుపోతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నది. ఆన్‌లైన్ సాంకేతికత కుప్పపడింది. సీనియర్ సిటిజన్లు వెంటనే నెటిజన్లు కాగలరా? సుప్రసిద్ధ కవి విశ్వనాథ సత్యనారాయణ గారి మాటల్లో చెప్పాలంటే ఇది ఒక మాయ.. మాయ అనగా... *

-జయధీర్ తిరుమలరావు jayadhirtr@gmail.com సెల్ : 9951942242