తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

సామూహిక బతుకు చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయత దేవులపల్లి కృష్ణమూర్తి తనదైన అనుభవంతో స్వేచ్ఛగా ‘‘ఊరువాడ బతుకు’’ రచించారు. అందుకే అది సామాజిక రచన. ఈ రచన వ్యక్తివాదం ధోరణి నుండి బయటపడింది. మూస రచనలకు భిన్నంగా ఉంది. ‘‘ఊరువాడ బతుకు’’ నవల ‘బతుకు’పైనే కేంద్రీకృతమైంది. అందుకే పుస్తకం నిండా సహజమైన జానపద బాణీలు ఉన్నాయి. అవి ఎంత భావస్ఫోరకంగా ఉన్నాయో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాడుకున్న పాటలు అంతే ప్రేరణగా ఉటంకించబడినాయి. ఐతే ‘బతుకు’ని అధిగమించకుండా గొప్పలకుపోయి రచనని ఎక్కడా అగౌరవపరచలేదీ పుస్తకం. అందుకే ఈవారం ఈ పరిచయం.
గొప్ప జీవిత ఇతివృత్తం గొప్ప నవలని సృష్టిస్తుందని చాలామంది అనుకుంటారు. కాకపోతే ఈ తప్పుడు అవగాహనకి ప్రగతిశీల రచయితలు కూడా జత చేరడం బాధాకరం. ఇరవయ్యో శతాబ్దం కన్నా, ముందరి వరకు ఇలాంటి భావన ఉండవచ్చు. కాని రష్యన్ నవలలు, కథలు ఈ భావం తప్పు అని తేల్చేశాయ. వస్తువు కాదు దాని నిర్వహణలో వాస్తవికత (జీవిత వాస్తవికత, సామాజిక వాస్తవికత) ముఖ్యం అని నిరూపించారు.
జీవితం సమాజంలో ఒక భాగం. అది కుటుంబం వరకే పరిమితం కాదు. అలా అయితే వ్యక్తిగత ధోరణి దగ్గర ఆగిపోతాడు రచయిత. అలాంటి రచయితలు తెలుగులో చాలామంది ఉన్నారు. వీళ్ళని పొగిడే అభ్యుదయవాదులు, విమర్శకులకి కొదువలేదు. వీళ్ళంతా అసలు సమాజాన్ని విస్మరించి లేదా దాచి ఊహా సమాజాన్ని బలపరుస్తారు. ఎందుకంటే ఈ దేశంలోని కులం, కుల సంబంధాలు, శ్రమజీవుల ఉత్పత్తి సంబంధాలే వాస్తవికత. భారతీయ సామాజిక సంబంధాలను ఇవి నిర్దేశిస్తాయనడంలో సందేహం లేదు. సాధారణ మానవ సంబంధాలను సైతం ఇవి ప్రభావితం చేస్తాయి. ఇంతటి ప్రధానమైన విషయాన్ని తడమని తెలుగు నవల ఎంత గొప్పదైనా అది భారతీయ సందర్భంలో అవాస్తవ రచనే అవుతుంది. అవాస్తవ మనుషులు, వారి నడవడి, వాళ్ళ సమాజం అంతా అభూతకల్పనే. ప్రగతిశీల కాల్పనికత కూడా పెద్దగా రాణించదు. చిరునామా లేని మనుషులు పాత్రధారులుగా రాయడం భావదారిద్య్రానికి నిదర్శనం. దానివల్ల పాఠకులు నేర్చుకునేదేదీ లేదు. అలాంటి రచనలని చేసి, కీర్తి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని పబ్బం గడపడం తప్ప ఆ సాహిత్యం ప్రజలను చైతన్యపరచలేదు. పాఠకుడు తనని తాను చూసుకోలేని, పోల్చుకోలేని రచన సామాజికం కాదు. అంటే ఆ రచన స్వాభావికంగా, సహజంగా, పాఠకుడికి దగ్గరగా ఉండదు. రచయితల సంఘాలు భారతదేశంలో ‘వాస్తవికత- రచయిత- రచన- ప్రభావం’ అనే అంశాల గురించి ఎక్కడా చర్చించవు. బాధ్యతతో విశే్లషణ చేయవలసినవారు సైతం అనవసర అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం గమనించాలి. దేశీయ పునాదికి ప్రతిబింబంగా సాహిత్యం ఎలా ఉండాలో రూపంలోనూ చర్చించరు. అందువల్ల ఆ సాహిత్య సంఘాలు కేవలం రాజకీయ భావాలకు ప్రాతినిధ్యం వహించేవిగానే ఉంటాయి. అంతేకాని ప్రజా సాహిత్యం, సంస్కృతులకు, జీవితాలకు ప్రాతినిధ్యం వహించే వాటిగా ఉండవు. ఒకరిద్దరు దబాయింపుదారులు పత్రికా యాజమాన్యంతో సన్నిహిత సంబంధాలు నెరపడంవల్ల పై విషయాన్ని తప్పని చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఐనా వారు, వారి తాబేదారులు సాహిత్యంలో కొత్తదనం తీసుకురాలేరు. స మాజ జీవితాన్ని ప్రతిబింబించలేరు. ఏది ఏమైనా మత కుల శ్రామిక వర్గాల జీవిత కథనం లేదా అలాంటి దృక్పథమే రచనకి కొత్త రూపాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ విషయం ‘‘ఊరువాడ బతుకు’’ నవల మరోసారి స్పష్టం చేసింది. ఇలాంటి రచనలలో ఈమధ్య వచ్చిన ‘కక్క’, ‘అంటరాని వసంతం’, ‘ఊరువాడ బతుకు’ వంటి రచనలు ముఖ్యం. ఇవి నవలలు కాని నవలలు. యాంత్రిక నవలా నిర్మాణానికి దూరం. వీటిలో ముఖ్యం ఊరువాడ బతుకు. దీన్ని ఏ ప్రక్రియగా చూడాలో ఆయా పాఠకులే నిర్ణయించుకుంటారు. విమర్శకులు తమకి నచ్చిన పద్ధతిలో భావించారు. ఈ ప్రక్రియని ఇదీ అని ఇతమిత్థంగా చెప్పడం ఇక్కడ నా ఉద్దేశ్యం కాదు. సమాజ జీవిత వాస్తవికతని లోతుల్లోంచి అనుభవించి చెప్పిన రచన ఏదైనా తన విలక్షణతని కాపాడుకుంటుంది. ఇంకా చెప్పాలంటే తన రచనా రూపాన్ని తాను వెదుక్కుంటుంది. ఫలానా ప్రక్రియలో ఫలానా ఇతివృత్తంతో రచన చేస్తున్నామని ధీమాగా చెప్పుకోవడం ముందే నిర్ణయించడం ఎంతవరకు సబబు? అట్లని ప్రణాళికా రహితంగా రచన చేయాలని అనడం లేదు. ఫలానా విషయం, అంశం చెప్పడానికోసమే రచన చేయడం, కథని అల్లడం, అందుకు అనుగుణంగా పాత్రల్ని సృష్టించడం సరైంది కాదు. దీనివల్ల కృత్రిమత ఎక్కువగా చేరుతుంది. సామాజిక రచనకి ఘ్జష ళ్ఘజఒౄ కన్నా ఢ్యషజ్ఘ ళ్ఘజఒౄ ఎక్కువ పుష్టినిస్తుంది.
దేవులపల్లి కృష్ణమూర్తి శ్రమజీవి వర్గం ప్రతినిధి. అలాంటి జీవితాలను నమోదు చేసే అక్షర శిల్పి. అందుకే అతనికి తెలియకుండానే ఒక రూపాన్ని సాధించాడు. లోగడ ఉన్న నవల ప్రక్రియా రూపాన్ని నిరాకరించి తనదైన ఒక సాహిత్య రూపాన్ని రచనగా పొందుపరిచాడు. మగ్గం నేస్తూ నేస్తూ గొప్ప అందమైన నమూనాలతో, రంగులతో వెలువరించిన అద్భుత సౌందర్యవంతమైన చీరలా ఒక రచనని సృష్టించాడు. అది స్వీయ రచనలకి, స్వీయ నవలా రచనకి నాంది పలికింది. ఏది ఏదైతేనేం అది ఒక ఉదాత్త ప్రక్రియా రూపంగా రూపొందింది. ‘స్వీయ నవల’ అనే కొత్త రూపం ఏర్పడింది.
జీవితం పాతదే కావచ్చు. తన రచనతో ఆ జీవితాన్ని స్వీయ నవలా ప్రక్రియకు నాంది చేశాడు. అది బాగా నప్పిన విధానం. అందుకే సాహిత్యాభిమానులు, పాఠకులు చాలామంది స్పందించారు.
ఈ స్వీయ నవలా ప్రక్రియలో మొత్తం 65 జానపద గీతాలు (చరణాలు) ఉన్నాయి. ఇందులో 20 దాకా పోరాట గీతాలు. ప్రజలు ఉపయోగించే సామెతలు, జాతీయాలకు కొదువ లేదు. ఆలె లక్ష్మణ్ వేసిన పది రేఖాచిత్రాలు అక్షరాలు చెప్పలేని బతుకుల్ని విప్పి చెప్పుతాయి.
వినాయక చవితి, కృష్ణాష్టమి, ముత్యాలమ్మ పండగ, బోనాలు, వన భోజనాల వంటి పండగలు, పండగ సందర్భాలు ప్రజాదృక్పథంతో చూడ్డం రచయిత అవగాహనకి నిదర్శనంగా ఉన్నాయి. ఈ పుస్తకం నిండా ప్రజల జానపద కళారూపాలను ఎన్నింటినో ఉటంకించాడు. కోలాటాలు, చెక్క భజనలు, శ్రామిక గేయాలు, తత్వగీతాలు, రేల పాటలు, చుట్టుకాముడు పాటలు, శారద కథలు, బుర్రకథలు, భాగోతాలు, గంగిరెద్దులు, బుర్రకథల వంటి ఎన్నో కళారూపాలను అవసరానుగుణంగా ప్రస్తావించాడు. ఇలాంటి ప్రస్తావనలు ఈ దశాబ్దకాలంలో ఇంతఎక్కువ రాయబడలేదు. ప్రజల గురించి రాస్తున్నామని ఢంకా బజాయించి చెప్పుకునే రచయితలు ఎవరూ ఇంత మొత్తంలో ప్రజల సంబంధమైన నోటి సాహిత్యాన్ని పేర్కొనలేదు. ఇవన్నీ కోల్పోతున్న కాలంలో అనివార్యంగా వాటిని గుర్తుచేసుకున్నాడేమో రచయిత. అనంతారం, సూర్యాపేట వంటి ఊళ్ళు కూడా పాత్రలుగా కనిపించేట్లు రచించడం ఈ నవల ప్రత్యేకత.
‘ఊరువాడ బతుకు’ రచన పేరులోనే ఉన్నట్లు గ్రామీణ బతుకు చిత్రం కాన్వాసు విశాలమైనది. ఇంత పెద్ద చిత్రాన్ని మలచడానికి కృష్ణమూర్తి ధైర్యంగా ముందుకొచ్చాడు. ఈ రచనలో ‘‘రచయిత’’ కావాలని ఎక్కడా కనుపించడు. అందుకే ఆ రచనకి విలువ ఏర్పడింది. ప్రాధాన్యత సంతరించుకుంది. నలుగురు మాట్లాడ్డానికి వీలు ఏర్పడింది. నిర్దిష్ట స్థల కాలంలో రూపొంది, చీమూ నెత్తురున్న ప్రజల గురించి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది. అందుకే -
ఇది జన జీవన వాస్తవిక కావ్యం.
వ్యక్తిగతం కాని, గతం కాని, ఒక జన తత్వ వచన గీతం ఇది.
పదహారణాల సామూహిక బతుకు చిత్రం ఇది. *

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242