తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఏం తిండి తింటున్నాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోయినవారం తెలుగు విశ్వవిద్యాలయం వారి జానపద గిరిజన అధ్యయన పీఠం వారు జానపద విజ్ఞానం అంశంపై జాతీయ సదస్సు జరిపారు. అక్కడ తిన్న ఆహారం రుచులు రెండు వారాలైనా వెంటాడుతునే ఉన్నాయి. అరవై ఏళ్ళ కింద బాల్యంలో తిన్న కొన్ని అలాంటి రుచులు గుర్తొచ్చాయి. ఒక్కసారి ‘ఆహారం- సమాజం’ గురించి ఆలోచనలు ముసురుకున్నాయి. ప్రస్తుతం మనం తినే తిండి ఎలా ఉందో ఆలోచిస్తే ఆశ్చర్యం వేసింది. కారులో గాని, బస్సులో గాని ఎక్కడికైనా ప్రయాణించినప్పుడు మనం తినే తిండి గుర్తొస్తే ఇలాంటి తిండి తిన్నామా! అని అనిపించక మానదు. ఒక్కచోట కూడా మనకి ఆరోగ్యకరమైన పదార్థాలు లభించవు. ప్రతి చిన్నాచితక హోటల్‌లో ఒకే రకమైన రుచిగల ఆహారం. ఒకే తీరైన టీ రుచి. దానిలో కలిపే కల్తీపాలు, కల్తీ టీపొడిని బట్టి మాత్రమే టీ రుచి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ సైతం దిగజారిన రుచి. ఆ రవ్వలో ఇతర పదార్థాలు కలసిన యాంత్రిక రవ్వ. అథమ రకం, మామూలు రకం రవ్వల మధ్య రుచీ పచీ లేని ఇడ్లీలు. సాంబారులో ఉనుక పొడి, కల్తీ పప్పు కలసిన రుచి. వందలాది ‘దర్శన్’ హోటళ్ళలో ఒకే తీరు రుచి ఉండడానికి ఈ పదార్థాల ఉపయోగమే కారణం. పూరీలకు ఏ హోటల్ వాడూ గోధుమ పిండి వాడడం లేదు. అంతా మైదా పిండే. మైదా పిండికి, శ్రేష్టమైన గోధుమ పిండికి గల తేడా కూడా తెలుసుకోలేనంతగా మన నాలికలు మారిపోయాయి.
ఆహార వైవిధ్యతని, అవసరాన్ని గుర్తించలేక పోవడం అపాయం వంటిదే. రసాయన ఫలాలు, ఆకుకూరలు, కూరగాయలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఆసుపత్రులపాలు చే స్తుంటే చూస్తుండిపోతున్నాం. అన్ని పత్రికలలో ఆరోగ్యం- ఆహారం అంశాల గురించి రాస్తున్నా పాటించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. కల్తీలేని ఆ పదార్థాలు లభ్యం కావడం లేదు. కల్తీని అరికట్టే చట్టాలను పనిచేయించడానికైనా పౌర సమాజానికి శక్తికావాలి. ఇందుకోసం రూపొందిన శాఖలను పటిష్టం చేయలేకపోవడం ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధలేదనడానికి నిదర్శనం. అనారోగ్యగ్రస్తులైతే ఆస్పత్రులలో మరింత అస్వస్థ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇన్ని సమస్యలతో మనిషి ఆరోగ్యంగా ఎలా ఉండగలడు? జీవించే హక్కుకి అన్నీ తూట్లే.
మొన్నటి సదస్సులో ఖర్చులేని, అనారోగ్యం కాని, సులభ రీతిలో పక్వం చేసుకునే ఆహార ప్రదర్శన చూశాక, మనం ఎన్నిరకాల తిండిని మరిచిపోయామో తెలిసివచ్చింది. ఎంత బలవర్థకమైన ధాన్యాలను విస్మరించామో అవగతమైంది. విచిత్రం ఏమంటే ఈ వంటకాలలో శరీరానికి వెగటు పుట్టించే ఎటువంటి పదార్థాలను ఉపయోగించరు. ఒక రకంగా చెప్పాలంటే అవి సింపుల్ అండ్ హెల్తీ. దాదాపు అన్నిరకాల రుతువులకి సరిపడే ఆహారం అది. ఎండాకాలంలో శరీరానికి కావలసిన ద్రవ పదార్థాల వినియోగం ఉంటుంది. సులభంగా జీర్ణమై, ఆరోగ్య హేతువైన పదార్థాల సేవనం చూస్తే ప్రకృతిలోని పదార్థ వనరులను మనిషి తనకి సరిపడా ఎంత సులభంగా తయారుచేసుకున్నాడా? అని అనిపించక మానదు.
తొందరపడి వేసవి ముందే కాలిడిన సందర్భంలో పెద్దపెద్ద కంపెనీలు తమ పానీయాలనే తాగాలని ప్రకటనలు గుప్పిస్తాయి. అన్నిరకాల శీతోష్ణస్థితులకు, కాలాలకు ఒకే రకమైన పానీయాలను వాడమని చెప్పడం అశాస్ర్తియం. ఐనా ఎవరూ వాటిలోని సామంజస్యాన్ని ప్రశ్నించరు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా వేసవి ఉదయం సత్తు పిండి తిని, ఇంత రాగి జావ తాగితే ఉదయమంతా శరీరానికి కావలసిన శక్తి ఉంటుంది. అంబటేళకి పజ్జొన్న, జొన్న గటుకలో మజ్జిగపోసి తాగితే హుషారుగా పొలం పనులు, కాయకష్టం చేసే వృత్తిపనులు సజావుగా జరిగిపోతాయి. ఇష్టం ఉన్నవారు పనినుండి ఇంటికిపోతూ సహజాతి సహజంగా లభించే కల్తీలేని తాటి కల్లు కాసింత తాగి ఇంటికెళ్ళి బువ్వ తిని హాయిగా నిద్రపోవడం కన్నా సుఖం వేరే ఏమైనా ఉందా?
పొలం పనులకు, ఇంటి బయట పనులకు వెళ్ళని రోజు పల్లి పిండి, నువ్వు పిండి, పెసర పిండి, మలీద ముద్దలు చేసి పిల్లలకి పెట్టి తమింత తినడంలో ఆనందం చాలానే ఉంటుంది. ఇప్పుడు సీసం కలసిన నూడుల్స్ వండి పెట్టే తల్లులు తమ బిడ్డల అనారోగ్యానికి తామే శత్రువులమని తెలుసుకోలేని అమాయకులు. రుతువుల వారి పండ్లూ, ఫలాలు, ధాన్యం, గింజలు వంటి వాటిని మరిచిపోయాం. మొన్నటివరకు గోధుమలు రాని వేలాది ఊళ్ళల్లో జొన్న, సజ్జ, బియ్యం, రాగి రొట్టెలతో అన్నిరకాల ఆకుకూరలు వేసి వండిన కూరని నంజుకు తింటుంటే ఉండే మజా మైదా రొట్టెలు, మైదా బ్రెడ్డు, మైదా నూడిల్స్ తినడంలో ఉంటుందా?ఎప్పటికప్పుడు తాజాగా తినడం ఆరోగ్యం అని తెలసిన అమ్మలు ఎక్స్‌పైరీ తేదీ గుర్తించ వీలులేని పాకెట్ల పదార్థం చిన్నారులకి తినిపించి అనారోగ్యగ్రస్తులుగా తయారుచేస్తున్నారు. ఆ తర్వాత దవాఖానాల చుట్టూ తిరగడం ఎంత అవివేకం. సాయంకాలంలో పెసర, శనగ, ఉలవ, బబ్బెర, మక్కజొన్న గింజలు వంటి వాటిని ఉడకేసి తయారుచేసిన గింజలు ఆరోగ్యకరమైన సహజ రుచుల్ని పిల్లలకు చూపాల్సిన తల్లులు డబ్బులు పోసి కొన్న చాక్లెట్లు, క్రీం బిస్కెట్లు, కుర్‌కురేల వంటి చెత్తను చేతికిచ్చి చేతులు దులుపేసుకోవడం సరైనదేనా? అన్నిరకాల గింజలు ఉడకేసి పెడితే రేసుగుర్రాల్లా పరిగెట్టే పిల్లల్ని చూసి ఏ తల్లి సంబురపడదు?
మొలక బియ్యంలో ఇంత శక్కర వేసి దవడ కింద కరకరలాడిస్తే పళ్ళు గట్టిపడతాయి. పైగా ఆరోగ్యం. రసాయనాల ఊసులేని దేశీపళ్ళను రైతుబజార్లనుండి తెచ్చి తినిపించాలి. అంతేకాని శీతల ఫలరసాల పేరుతో రంగుల రసాయనాలను తాగించేవారు తల్లులా? పిల్లల అనారోగ్యాలకి పురుటిగుడ్డలా? లాభాల కోసం ఆహార ప్రకటనల వలలువేసే వారికన్నా తల్లులే మొదటి అపరాధులు. ప్రతి చదువుకున్న తల్లి అయినా వినియోగదారే. వినియోగదారుల హక్కుల దృక్కోణం లోంచి పిల్లల ఆరోగ్యం కోసం కేసులు వేయకపోవడం తల్లుల ప్రేమని శంకించవలసి వస్తోంది. పిల్లలకి ఎంత ఆహారం ఇస్తున్నాం, ఆటలవల్ల, వ్యాయామం వల్ల, ఇతర కారణాలవల్ల ఎంత శారీరక శ్రమ కలుగుతుందనే బేరీజు పల్లెటూరి తల్లులు వేసినట్లు మన పిల్లల్ని మనం చూస్తున్నామా. పల్లెటూళ్ళలో లేని ఊబకాయ సమస్య మన పిల్లలకి, ముఖ్యంగా పట్నాల్లోనే ఎందుకు? మనం ఏ ఆహారం అందిస్తున్నాం. అది ఎంత సహజమైనది. శరీరానికి ఎంత నప్పుతుందన్న కనీస అంచనా లేకపోతోంది. పిల్లల ఎదుగుదలకీ, వారు తీసుకునే ఆహారానికీ సంబంధం ఉంటుందనే మామూలు విషయంమీద ఆలోచన లేకపోవడం శోచనీయం. భద్రాచలానికి పోతే ఇప్ప పూలు తీసుకోవాలనీ, వాటిని జొన్న పిండిలో కలిపి తయారుచేసిన కుడుములు ఆరోగ్యకరమని తెలియదా? స్టీం చేసిన బియ్యం రకరకాల కడుపు నొప్పులకు కారణం. దంపుడు బియ్యమో, ముడి బియ్యమో కొనాలనే, తినాలనే ఇంగితం ఏమైంది? బియ్యం అన్నమే కాదు. రాగన్నం, జొన్నన్నం, కొర్రన్నం వారానికి కనీసం మూడురోజుల తినిపించినా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కదా.
ప్రపంచవ్యాప్తంగా తృణధాన్యాల విలువ తెలిసింది. అన్ని పత్రికలలో వాటి గురించి ప్రచారం జరుగుతోంది. అలాంటి వాటిని పక్కనపెట్టి జంక్‌ఫుడ్, కోసం అర్రులు చాచడం అవివేకం. అమెరికా నుండి సరఫరా అవుతున్న పురుగులు పడిన కోడి కాళ్ళని తినడానికి పరుగులు తీసేవారిని ఏమనాలి. ఆహార హక్కు మన జన్మహక్కని నినదించే కాలంలో ప్రజలు మిన్నకుండిపోయి ఏదిపడితే, ఏది పెడితే అదే తినే నిస్సత్తువ, అవిద్య, అజ్ఞానంనుండి బయటపడాలి. మన దేశంలో వివిధ ప్రాంతాలలో వాడిన ఆహార సరుకులని తిరిగి వాడకం ప్రారంభించాలి. అట్లని దేశీ పెట్టుబడి ఉన్నంత మాత్రాన దేశీ కంపెనీల లాభార్జన పరులు ఇచ్చే ప్రకటనలు చూసి సరుకులను గుడ్డిగా నమ్మకుండా ‘చెక్’ చేసుకుని కొనాలి. నిజానికి విదేశీ నమూనా ఆహార పదార్థాలనే తయారుచేసి వాటికి పోటీగా మార్కెట్లుకి పంపడం పిచ్చితనం. లోగడ ఇక్కడి వాతావరణ పరిస్థితులకు, ఆరోగ్యకరమైన వాటినే పండించి, ఆనాటి సులభతరమైన తయారీ విధానాలనే పాటించడం వల్ల దుబారాకి ‘చెక్’ పెట్టవచ్చు. ఆరోగ్యమైన ఆహారం పదార్థాల వినియోగంవల్ల ఆర్థికంగా కూడా ఖర్చు తగ్గించవచ్చు అనే దిశగా ఆలోచించాలి.
వరంగల్ సదస్సులో ప్రదర్శనకి ఉంచిన జానపద గిరిజన, ఆహార పదార్థాలతో ‘ఎత్నిక్ హోటళ్ళ’ని కూడా నడపగలిగితే బాగుండును అనిపించింది. కల్తీ ఆహార పదార్థాలపై ప్రజలు యుద్ధం ప్రకటించాలి. దేశీయ ఆహార పదార్థాలను బతికించడం కోసం సామ్రాజ్యవాద పెట్టుబడులని నిరసించాలి.
*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242