తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

బతుకు పునాదిగా ఆలోచిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీద కప్పిన బట్ట మిత్తిబేగరిపాలు / తాళి కట్టిన భార్య శత్రువులపాలు
ఇల్లు, సంసారమంత ఇతర లోకుల పాలు / ఆస్తిపాస్తులన్ని మనిషి కొక్కొక్కపాలు
తూర్పాటి రాములు అతని భార్య మల్లమ్మ తంబూర వాయిస్తుండగా ఫలక్‌నుమా రైలుపట్టాల వెంబడి రాగం తీస్తున్నాడు. జీవితానుభావపు గాన సారాన్ని పాడుతూ పోతున్నాడు. అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ నడుస్తున్న రాములులో భావ సంచలనం. అతను స్వచ్ఛందంగా పాడుతున్నాడు. అతని కంఠంలో మానవ జీవితానుభావం ధార. అతను పాడిన దానిలో కొన్ని చరణాలే నాకు జ్ఞాపకం. ఎనె్నన్నో వాస్తవాలు. ఆ అనుభవం, వ్యక్తీకరణ, వాస్తవికత విచలితుణ్ణి చేసింది. ఇదేమిటి? ఇది కవిత్వమేనా? కాకపోతే మరేమిటి? అని నాలోని నేను ఆగ్రహానికి వచ్చాను. రైలు పట్టాలెమ్మట చెమట కారుస్తూ చెప్పులు లేని, గోచీ మనిషి తీసే కూని రాగం సాహిత్యమా? దానిని తత్వగీత సాహిత్యం అంటారు. తాత్వికత జీవితానుభవం, భౌతిక వాస్తవికతల సమాహారం. ఒక దశలో వాటిని అనుభవించి సారం తీసి తన చుట్టూ ఉన్న సమాజానికి అందించడమే కవి బాధ్యత. దాని కర్త తానే అని చెప్పుకోకపోయినా, దానిని సామాజిక స్వరం, సృజనగా సమాజం గుర్తిస్తుంది. ఎవరు రాశారని కాదు. ఎవరు పాడారని కాదు. ఎప్పుడు వినిపించాలో ఆ సామాజికులకి, ఆ పాటని అప్పుడు వినిపిస్తుంటారు. ‘సందర్భం’ లేకుండా గానం వెలువడదు. ఆ సందర్భాన్నిబట్టి ఏ పాట, ఏ రాగం, ఏ భాషా పటిమ వ్యక్తీకరించాలో అలాగే వెలువడుతుంది.
మరి రాములు ఇప్పుడు ఎందుకు ఆ పాట పాడుతున్నాడు. అతడిని అడగాలని ఉత్సుకత. కాని నేను స్టేషన్‌కి ఈవైపు బస్తీకి వెళ్ళి అక్కడ చావుని పలకరించాలి. అందుకే ఫలక్‌నుమాకి వచ్చాను. స్టేషన్‌లో వాకబు చేశాను ఎలా వెళ్ళాలో. నా కళ్ళలో మరణించిన ఫారుఖ్ తెల్లని నిండైన విగ్రహం. అతని వదనంలో మిరుమిట్లు గొలిపే మందహాసం. కష్టాలలో, నష్టాలలో ఎప్పుడు, ఎక్కడ కనుపించినా అదే నవ్వు కళ. నిజానికి చాలామంది మా మిత్రగణంలోని వారికన్నా ఫారుఖ్ తెలివైనవాడు. బిఎస్సీలో టాప్‌లో వస్తాడనుకున్నాం. కాని చివరి పరీక్ష నాడు తండ్రి మరణం అతడిని డిగ్రీ పూర్తిచేయనివ్వలేదు. సైన్‌బోర్డు పెయంటర్‌గా జీవితం ప్రారంభమై దాంతోనే జీ వితం ముగిసింది. అందరితో కలివిడిగా మాట్లాడేవాడు. ఏనాడూ తన సం సారం గురించి, బాధల గురించి మాట్లాడేవాడు కా దు. ఒక కొడుకు హిందూ అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు. చిన్న కూతురు క్రిస్టియన్‌ని పెళ్ళాడింది. బంధువులు, చుట్టుపక్కల వారి సూటిపోటు మాటలకు నవ్వుతూ జవాబిచ్చేవాడు. నా భార్య ఎవరో నీకు తెలుసా? అనేవాడు. అసలు నేనెవరో నాకు తెలుసా? అన్న ప్రశ్నతో వారి నోరు మూయించేవాడు. రంజాన్‌కి ఒకసారి, పెద్దపిల్ల పెళ్ళికి మరోసారి పిలిచాడు. వెళ్ళడం సాధ్యం కాలేదు.
పాత అలవాటు త్వరగా మానలేం కదా. జానపద వజ్రం రాములుతో కలసి కాసేపు మాట్లాడాలనుంది. అప్పుడున్న మానసిక పరిస్థితిలో అది అవసరం అనిపించింది. నాలుగడుగులు వేగంగావేసి రాముల్ని సమీపించాను. మీదే ఊరని అడిగాను. రాములు నావేపు చూసి, పోనీలే అన్నట్లుగా ఆగాడు. నువ్వు వెళ్ళాల్సింది ఆవేపు బస్తీకి కదా? అన్నాడు. నీకెలా తెలుసు అన్నట్లు చూశా. స్టేషన్‌లో వాకబు చేస్తుంటే విన్నాను అన్నాడు. పొద్దుగాల ఆ తురకాయన సచ్చిపోయిండు. కొడుకు, బిడ్డ వేరే మతం వాళ్ళను పెండ్లి చేసుకున్నారట. వాళ్ళు వస్తే ఇంట్లోకి రానీయం అని కొందరు పట్టుదలగా ఉన్నారు. తల్లి మాత్రం వాళ్ళు ఆయన బిడ్డలు కాదా? అని అన్నదట. ఏదో గొడవ గొడవగా ఉన్నదక్కడ అని చెప్పాడు. నాలో ఏదో నిర్వేదం. ఎటో చూస్తున్నట్టుగా నన్ను గమనిస్తున్నాడు రాములు. మనసు విప్పి మాట్లాడలేక పోతున్నాను. ఎదుటివాడు సరిగా లేనప్పుడు ఎవరైనా ఏమి మాట్లాడగలరు. నేను అడగకముందే రాగం అందుకున్నాడు. ఓ రాయి మీద కూచుని తంబుర స్వరం సాఫుచేశాడు. ‘‘నీరు లోపల నారు పుట్టును.. నీరుని గుంజి పెరిగే రీతిని.. బతుకు సారము తెలుసుకో’’ అని పాడుతున్నాడు. నీరంటే బతుకు. దానినుండే నారు వంటి జీవితం పెరుగుతుంది. బతుకు మూడునాళ్ళ ముచ్చట. ఆ విషయం తెలుసుకోవాలని సూచిస్తున్నాడా? లోకాన్ని అర్థం చేసుకుంటే సగం సమస్యలకి బదులు దొరుకుతుంది. శరీరాన్ని అర్థం చేసుకుంటే బతుకు విలువ పెరుగుతుంది. నరుల మధ్య జీవిస్తే ఆత్మ తృప్తి పడుతుంది. ఒంటరిగా, తుంటరిగా బతికితే మన్ను కూడా శపిస్తుందనే అర్థంలో పాడిన పాటలు సాహిత్యానికి కొత్త అర్థం చెప్పాయి. బతుకు వాస్తవికత అర్థం చేసుకోలేని విప్లవవాదులు, ప్రగతిశీలురు, విభిన్న మనిన వాదులు చిన్నపరిధిలో తచ్చాడుతున్నారా? వారు మొత్తం జీవితం, సంసారం, మరణం అనే విస్తృతిని కోల్పోతున్నారా? ఈ రెంటిమధ్యా సయోధ్య మార్గం ఏదైనా ఉందా? ఎ న్నో పొంతన లేని ఆలోచనలు. ఇలాంటి బతుకుతత్వం మనిషికి ఉంటే తప్పా? వద్దని ఎవరైనా హద్దులు గీయగలరా? ఆ తరువాత మధ్యయుగాల ప్రజావీరులు, వారిపై కట్టుకున్న గేయగాధలలోని కొన్ని చరణాలు పాడాడు రాములు. ఈ పాటలు నాలోని ఉదాసీనతను తుంచి చేతనని పెంచాయి.
బానిసగా ఉండి పాశం (తీపి) తాగుట మేలు గాదురన్నా / పక్షుల లాగా బతికితె రెండే గింజలు చాలన్నా / భయపడి బతుకుట కంటే చావే మేలన్నా/ వీరుడు చచ్చి కూడా జగతిలో బతికే ఉండునురా ... రాములు పాటకి మల్లవ్వ వంత వింటుంటే ఒళ్ళు పులకరించింది. బతుకు తత్వం, మనిషి పోరాటం రెండూ మనిషి జీవితం అనే నాణేనికి విడదీయరాని రెండు పార్శ్వాలు.
రైలు దిగి పట్టాల పక్కన నడుస్తూ ఎందుకు పాట అందుకున్నానని అడిగాను. అతడి గుబురు మీసాలలో చిరునవ్వు కదలాడింది. నువ్వు నా వెనుక వస్తున్నావని తెలుసు. అదీగాక సంజేళ సూర్యుడు కూడా దిగాలుపడుతున్నాడు. తెలియకుండానే నా పాట వినిపించాలని అనిపించింది అన్నాడు. మల్లవ్వ ఎందుకో తొందరపడుతున్నది. చాచనట్లుగానే చేయి చూపించిందామె. నా చేతిని జేబులోంచి తీసి ఆమె చేతిలో పెట్టి ముడిచాను. దూరంగా లోకల్ రైలు కూత పెట్టింది. తిరిగి ఇహంలోకి అడుగుపెట్టాను. మల్లమ్మ పోతూపోతూ- భూమిమీద చావు లేకుండా బతికేటోడు ఇందనుక ఎవడూ పుట్టలేదు కొడుకా అంది. నేను విన్నాను. ఏదో అర్ధమైంది.
ఆర్టీసీలో పనిచేసేప్పుడు ఫారుఖ్ వివిధ ఉద్యమకారులకు పోస్టర్లు, బేనర్లు తన ఖర్చుతో రాసి ఇచ్చేవాడని మా మిత్రులు చెప్పేవారు. రాములు అతని భార్యని ఫారుఖ్‌కి పరిచయం చేస్తే ఆ రాత్రంతా వాళ్ళతో పాడించుకునేవాడు. నిజానికి ఫారుఖ్ నామమాత్రంగా, జన్మవశాత్తు ముస్లిం కాకపోతే మా శారద గాయకులతో అతని మరణం సందర్భంగా రాత్రంతా పండుగ సాయన్న వీరగాథ పాడించేవాడిని. శారద గాయకులు ఎవరైనా మరణిస్తే ఆ రాత్రంతా శవాగారం చేస్తూ వీర గాథలు పాడే సంప్రదాయం పాటిస్తారు. మరణించిన వారి గురించి చెప్పిన మాటలు విని అతని గుణగణాలను కీర్తిస్తారు. ఎందుకో నాకు వారి మధ్య గల మతం తేడాలు బాధించాయి. లోకంలో మనం ఉంటే చాలదు. మనలో లోకం జీర్ణం కావాలి. అది తెలియని తత్వవేత్తలు, మేధావులు, విప్లవ నేతలు తమతమ గిరుల్లోనే ఉండిపోతారు. వారిది సంకుచిత తత్వం. లక్ష్యం ఎంత గొప్పదైనా అది వ్యక్తినిష్టం. అదే మనిషితత్వానికి విరుద్ధం, వైరుధ్యం. జీవిత సారాన్ని అర్థం చేసుకోలేని విద్యావంతులు ఎన్ని సిద్ధాంతాలు వల్లెవేసినా లాభం లేదు. బతుకు పునాది నుంచి ఆలోచనలు మొలిస్తేనే గెలుపు. *

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242