తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

తెలుగు భాషా కేంద్రం... మేలట్టూర్ భాగవత దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోయినవారం కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో తిరుగులాట. నీలగిరి జిల్లాలోని కూనూరులో ఓ సదస్సు. మూడు రోజుల తరువాత చెన్నైలో మార్కండేయ పురాణం గ్రంథావిష్కరణ ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా నాగసూరి వేణుగోపాల్ ఆహ్వానం. ఈ రెండు పనుల మధ్య మూడు రోజుల తీరిక. ఏంచేయాలో పాలుపోని సమయంలో పాత జానపద పరిశోధక మిత్రులు కొండ కోనల కళారూపాలు చూడాలని పిలుపు.
తమిళనాడు పట్టణ ప్రాంతాల మాటేమిటో గాని గ్రామీణ ప్రాంతాలలో తెలుగువారిని యాసని బట్టి ఇట్టే గుర్తిస్తారు. తెలుగులో పదాలు కలిపి మాట్లాడ్డానికి ప్రయత్నిస్తారు. తమిళ యాసలో తెలుగు పదాలు వినడానికి చాలా బాగుంటాయి. అలాంటివారిలో కొంతమందిని మాటల్లోకి దించితే వారి తెలుగు మూలాలు కానవస్తాయి. కొంతమంది తమ విలక్షణ తెలుగు కులాల పేర్లని కూడా మరిచిపోలేదు.
ఆ ప్రాంతంలోని ప్రతి తమిళ, కేరళ గ్రామాలకి చివరన ‘ఊరు’ ఎక్కువగా ఉంటుంది. మారుమూలల తెలుగునేలపై తమిళ, కన్నడ, మలయాళీల పరిచయం లేదు. ఆ మనుషులు ఇక్కడ సంచరించలేదు. కాబట్టి అలాంటివారు ఎవరైనా వస్తే సాంస్కృతికపరమైన బాంధవ్యం ఏ రూపంలోనూ వ్యక్తంకాదు. కాని తెలుగువారు అక్కడకు వెళితే మాత్రం తెలుగు సంస్కృతి ఏదో ఒక రీతిలో వారికి చిరపరిచితమే. ఒక ఆత్మీయత వారి తదుపరి మాటల్లో వినిపిస్తుంది. ఐతే తెలుగు మూలాలు ఉన్నవారు తాము తెలుగువారమని తక్షణం చెప్పుకొనే పరిస్థితి లేదు. కాసేపు వారితో గడిపితేనే గాని అది సాధ్యంకాదు. ఒక అంచనా ప్రకారం ఇరవై ఐదు తెలుగు కులాలవారు ఆ ప్రాంతంలో ఉన్నారని తెలుస్తుంది. కోయంబత్తూరు జిల్లా కిందివైపు కొంతమంది వారికి కొన్ని తెలుగు అక్షరాలు నేర్పిస్తున్నారు. కేవలం కొన్ని అక్షరాలు వారిలో చైతన్యాన్ని నింపగలవా? కొద్దిగా తెలుగు లిపి నేర్చుకోగలరు. కాని చదువగలరా? చదవుకోవడానికి వారికి పుస్తకాలు అందించగలమా? కంటిన్యుయింగ్ ఎడ్యుకేషన్ సాధ్యపడుతుందా? అది సాధ్యంకాకపోతే లాభం ఏమిటి?
తెలుగు భాష అందరికీ ఒకటే రకంగా ఉండదు. వృత్తిని బట్టి, స్థానికతను బట్టి తెలుగు భాష, పదాలు, వ్యక్తీకరణలు ఉంటాయి. వారికి వాటిలో రచనలు అందించగలమా? తెలుగు అక్షరాలు నేర్పేవారికి సంస్కరణ ఉద్దేశ్యం ఎంతమాత్రం ఉండకూడదు. అక్షర పరిచయం, పరిధి దాటిన వాక్యం మాత్రమే నిరక్షర తెలుగు ప్రజల మధ్య ఐక్యతకి దారివేస్తుంది. మానవ హక్కులు, రాజకీయ హక్కులు, సాంస్కృతిక హక్కులు సాధనోద్దేశ్యమే అక్షరం ధ్యేయం కావాలి. నిజానికి రెండు రాష్ట్రాల తెలుగు నేలమీద తెలుగు అక్షరాలవల్ల తెలుగు చదువుకుంటున్న పిల్లలకు ఏం ఒరుగుతోంది? జాతి గౌరవమా? తెలుగు ఆత్మగౌరవమా? ఆ రెండూ అల్లంత దూరమే. నిజానికి విద్య విద్యే. ఏ లిపిలో అయితేనేం? తలెత్తుకుని నిలబడగలిగే స్థైర్యం ఇవ్వాలి. అదే అక్షరం బాధ్యత.
తమిళనాడులోనే కాదు మరాఠా దేశంలో, దక్షిణాది ఇతర రాష్ట్రాలలో తెలుగుని నిలిపినవారు శ్రామిక కులాలవారే. మరోసారి వారికి పరీక్షలు పెట్టడం గురించి ఆలోచించాలి. నలుగురైదుగురిని కలాలు పట్టించినంతమాత్రాన తరతరాలు వారిని బాగుపరిచినట్లు కాదు. ఇది వర్తమానాన్ని ప్రశ్నించి తెలుగువారి బతుకులకు జీవన మార్గం, ఔన్నత్యం చూపగలగాలి.
రెండు మూడు వందల ఏళ్ళ క్రితం అలాంటి ప్రయత్నం అక్కడి తెలుగు ప్రజలు చేశారు. తమ అస్తిత్వాన్ని భాష, సంస్కృతులను కళ ద్వారా ప్రపంచానికి చాటుకున్నారు. ఆనాటి తెలుగు దార్శనికులు ఆ పని సజావుగా చేశారు. తెలుగు భాగవత ప్రదర్శనలు ఇచ్చేవారు, మేళాలు కలిగిన కుటుంబాలవారు నివసించే గ్రామాన్ని ‘మేలట్టూరు’ అని పిలుచుకున్నారు. ఇది తంజావూరుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈనాటికీ వారు తెలుగు భాగోతాలు ప్రదర్శిస్తారు. ఆ భాగోతం రచించిన మేలట్టూరు వెంకటరామశాస్ర్తీ రచించిన రచనలను, ఒక్కొక్కటే తెలుగులో ప్రచురిస్తున్నారు. మొన్న ‘మార్కండేయ చరిత్ర’ పుస్తకం విడుదల చేశారు. ఆ తరువాత అదే పేరుతో మేలట్టూరు భాగోతం ప్రదర్శించారు.
భాగవతులు ప్రదర్శించేది భాగవత ప్రదర్శన. జానపదులు ప్రదర్శించేది భాగోతం ప్రదర్శన. చిందు భాగోతం అని ఒకటి ఉంది. అది గొప్ప కళారూపం. కుప్పం తరహా ప్రదర్శనలకు వీధి నాటకాలు అంటారు. వీటిని పలానా కులంవారే వేయాలని నిబంధన లేదు. చిందు భాగోతాలు మాత్రం ‘చిందు’ అనే మాదిగ ఉపకులంవారు మాత్రమే ఆడాలి. నిజానికి వీధి భాగోతానికి, యక్షగానానికి తేడాలను చెప్పడం కష్టం. కాని పై కులాలవారు, ముఖ్యంగా ఉన్నత బ్రాహ్మణ కులాలవారు ఆడే భాగోత ప్రదర్శనలకు, కింది వర్గాలవారు ప్రదర్శించే భాగోతాలకు తేడా కనిపెట్టవచ్చు. మొదటిది సంస్కృతీకరించిన జానపద కళారూపం. రెండోది తెలుగీకరించిన కళారూపం. ఇది ఫక్తు జానపదం.
విచిత్రం ఏమంటే, జానపద రీతిలో రచింపబడిన భాగవత ప్రదర్శనలు, పుస్తకంగా అచ్చయినప్పటికీ వాటిని సంస్కృతీకరించి ఆడడం అలవాటైంది. మేలట్టూరు నాటకాలు సిసలు తెలుగు జానపద ప్రదర్శనలు. పాత్రల హావభావాలు, భాష, ప్రదర్శన రీతి అంతా సామూహికం. తంజావూరు తెలుగు రాజులు తమ జానపద సంస్కృతికి దూరం అయ్యాక దానికి దూరంగా ఉండడంవల్ల వాటిని తిరిగి వీక్షించాలనే కోరిక కలిగింది. అందువల్లే వాటిని ప్రోత్సహించారు కాని రాను రాను వారి ప్రాపకం తగ్గిపోయి కొత్త పరిస్థితులు ఏర్పడిన తరువాత, తమిళ ప్రధాన స్రవంతిలోకి నెట్టివేయబడిన తరువాత సంస్కృతీకరించడం మొదలుపెట్టారు. దీంతో అసలు సామూహిక, జానపద స్వభావం తగ్గిపోయింది.
నిజానికి తంజావూరు భాగవత ప్రదర్శనలో చాలావరకు సమాంతర పురాణాలు, కథలు కనుపిస్తాయి. ఆ మేళాలతో తమ భాషను ఆనాడే కాదు ఈనాటికీ కాపాడుతున్నారు. తెలుగు అర్థంకానివారు కూడా అవే రగడలు, పద్యాలు పాడుతూ హావభావ విలాసాలతో పాత్రోచిత నటనలతో భాగోతాలాడుతారు. కాని దేశంలో వందల ఏళ్ళు వారు తమ మాతృభాష అయిన తెలుగును నిలిపారు. నాటక ప్రదర్శనలో, సంగీతంలో ఒక భాషను మార్చకుండా శతాబ్దాలుగా నిలపడం భాషాప్రపంచంలోనే ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు.
వచ్చే నెలలో మేలట్టూరు ఊరిలోనే జరిగే ప్రదర్శనలు చూడాలనుకునేవారికి స్వాగతం చెబుతున్నారు. అదొక కొత్త కళామేళ. భాషాయాత్ర! జానపద, భాగవత మేళ నాట్య నాటకాల జమిలి కళాజాతర!
*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242