తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ప్రజాస్వామ్యాన్ని నిషేధిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ స్వరం వినిపించడానికి పాలకులకు అనేక మార్గాలు, స్థలాలు ఉం టాయి. ప్రత్యేక శాఖలు, అనేకమంది వ్యక్తులు ఉంటారు. సచివాలయాలు, ప్రగతి భవన్‌లే గాక ప్రత్యేకంగా సమాచార శాఖ ఉంటుంది. మం త్రుల పేషీలు ఈ పట్టికలో చేరాయి. ఆయా శాఖలకు ప్రత్యేక పత్రికలు కూడా కొన్ని ఉన్నాయి. అంతెందుకు.. కొన్నిసార్లు ప్రధాన స్రవంతి పత్రికలు కూడా ప్రభుత్వ పత్రికల వలెనే పనిచేస్తుంటాయి. నయానో, భయాన్నో, తాయిలాలు అందుకుని ప్రభుత్వ వర్గాలకి సేవ చేస్తుంటాయి. కొన్ని బహిరంగంగా, మరికొన్ని అంతర్లీనంగా మద్దతునిస్తాయి. ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు వేరు వేరు పత్రికలు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు తొంభై శాతం ఒకే వైపు మోహరించుకుపోయాయి. ఇది పూర్వం ఎప్పుడూ లేని ఒక విచిత్ర పరిస్థితి. ప్రతిపక్షాలకు ఒక పెద్ద దినపత్రిక లేకపోవడం మరీ విచిత్రం. దేశాన్ని ఏలిన ప్రతిపక్షాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను శాసించిన ప్రతిపక్షాలు ఇవ్వాళ నివ్వెరపోయే దీనస్థితి. నాటి అధికార, ప్రతిపక్షాలకే ఈ గతి పట్టిందంటే ప్రజల పరిస్థితి ఏమిటి?
ప్రజల కోసం, వారి స్వరం వినిపించేందుకు పత్రికలు సిద్ధంగా లేవు. ఇ లాంటి స్థితి పాత్రికేయ రంగానికి వస్తుందని ఎవరైనా ఊహించారా? దీని తదనంతర పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పగలిగితే బాగుంటుంది. ఇది పాత్రికేయ విలువలకి, స్వేచ్ఛకి సంబంధించినది ఎంతమాత్రం కాదు. విలువల పరిధి మించిపోయిన పరిస్థితి. స్వేచ్ఛ పరిమితి దాటిపోయిన ఒక అతి నవీన దశ. ఒకనాడు స్వాతంత్య్ర ఆకాంక్షకు అనుగుణంగా తమ వ్యక్తిగత సంక్షేమం, స్వేచ్ఛలను కాదని పత్రికలు పెట్టి ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్న కాలం. ప్రగతిశీల భావాలతో ప్రజల పక్షం నిలిచి కష్టాల పాలయ్యాయి పత్రికలు. సంపాదకులు, పాత్రికేయులు ఊచలు లెక్కించి తమ త్యాగనిరతిని పత్రికలకి ఊపిరిగా అందించిన ఘన చరిత్ర. ఎమర్జెన్సీలో తమ నిరసన గళాన్ని దేశ వ్యాప్తంగా వినిపించిన దినపత్రికల చరిత్ర ఇంకా మన నరనరాలలో పాకుతున్నది. ఇపుడు అన్ని పత్రికలూ అధికార పార్టీ పత్రికల్లా తోస్తున్నాయి. ఒక్క మాస్ట్ హెడ్‌లో తేడా తప్ప.
ఒక్క పత్రికారంగం ప్రజల తరఫున ఉన్నంతకాలం అన్నీ సమస్థితి లోనే ఉండేవి అన్నంత భరోసా. ఈ దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఏదో జరుగుతోంది. భయమా? కానే కాదు, నిన్నటిదాకా కనబడని సంకెళ్ళని ప్రశ్నించి అధినాయకత్వ పాలనలో అలజడి తుపానుని రేపాయి. నియంతృత్వం నిమిత్తకాలం. జన హృదయం అక్షరాలలో జవసత్వాలు ఇంధనమై పరుగెత్తుతుంది. పత్రికలు కూడా కాలానుగుణంగా పాఠం నేర్వడం సముచితం. సమైక్య పె ట్టుబడి, పాలన, అణచివేతల ఉద్యమ దశాబ్దంలో పత్రికలు తమకు ఇష్టం ఉన్నా లేకున్నా జనాకాంక్షను గౌరవించక తప్పలేదు. ఓ జాతీయ పార్టీ పాలనలోని అవకతవకలను ప్ర జలకు విడమరిచి చెప్పి, మార్పులు తెచ్చినవీ పత్రికలే. అప్పుడు ఏళ్ళతరబడి ప్రజలను విస్మరించనితనం ఏదో పత్రికల బాటమ్ లైన్లలోనైనా దిలాసాగా కనుపించేది. అప్పుడు మాస్ట్ హెడ్‌లన్నీ తమ తమ డిజైన్లలో విడివిడిగా కాంతులు విరజిల్లాయి. ఇప్పుడు రెండు రాష్ట్రాలలోగల ఒకే పత్రికలో రెండు ప్రాంతీయ ప్రభుత్వాలు, ఓ కేంద్ర ప్రభుత్వమే తొంభై శాతం జాగా ఆక్రమించాయి. రెండు రాష్ట్రాలలోని ప్రజలు టాబ్లాయిడ్‌లో ఏరియా వార్తలై కుదించుకుపోయారు. వార్తలు వేయడం, వేయకపోవడం యాజమాన్యాల ఇష్టం కిందకు చేరాయి. పత్రికలకి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. వాటిని కాదనలేని పరిస్థితి. కాసేపు అంగీకరిద్దాం. ప్రజల పక్షంగా కొన్ని అంశాలను తప్పక మాడ్లాడాలి. అది సమతౌల్య విధానం. ఇప్పుడు ఇది కనుపించడం లేదని ప్రజలు గాఢంగా భావిస్తున్నారు. దీనిని గుర్తించవలసిందిగా ఎవరు చెప్పాలి యాజమాన్యాలకి. పార్టీల పరంగా పత్రికలు మొండిగా నిలబడిన సమయమిది. పెట్టుబడుల పక్షంగా నడుస్తున్న పాత్రికేయ సందర్భం ఇది.
ప్రజలు నిర్ణాయక శక్తిగా ఉన్నప్పుడు ఒక బార్గెయిన్ ఉండేది. వారు ఇప్పుడు ఆ పరిస్థితిలో లేరా? దీనికి కారణాలు ఏమిటి? ప్రజా ఉద్యమాలు విజయవంతం అయ్యే రోజుల్లో పత్రికా స్వేచ్ఛకి కూడా ప్రజాచైతన్యం వత్తాసు పలికేది. ఇప్పుడున్న పరిస్థితులలో అది సాధ్యమా? పత్రికలు పెట్టడం పాత పద్ధతి. పత్రికల్ని మేనేజ్ చేయడం కొత్త విధానం. అన్నిసార్లు రాజకీయ పరిస్థితులు ఒకేలా ఉండవు. ప్రజాచైతన్యం మాత్రం నివురుగప్పిన నిప్పు. రాజకీయ పార్టీలలోని నాయకులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పత్రిక కొమ్ముకాస్తున్నది. ప్రజల స్థానంలో ఒక వ్యక్తి ఆక్రమించడం మునె్నన్నడూ లేని సరికొత్త అంశం. ఇది నిరంతరం కొనసాగ రాదు. ఆ గమనింపునైనా గుర్తించగలగాలి. పట్టాలు తప్పడం సహజం. మళ్లీ విలువల గట్టుపైకెక్కి పరుగెత్తడం శ్రేయస్కరం.
ప్రజలకు కూడా తమ స్వరం వినిపించే వేదికలు కావాలి. అలా వినడం వల్ల పాలకులకే ఎక్కువ ప్రయోజనం. అధికారం తలకెక్కిన క్షణాన ప్రజల స్వరం వినిపించే వేదికల, స్థలాల ఆక్రమణకు సిద్ధమవుతారు. ప్రతిపక్షాలను మాట్లాడకుండా చేయడం పాలక పక్షం చేసే పని. చాలాసార్లు ప్రతిపక్షాలు ప్రజల తరఫున నిలబడడానికి, వారి పేరిట నిరసన తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటాయి. అప్పుడప్పుడు ఆ సమస్యలు తమ వర్గ, కుల స్వభావానికి వ్యతిరేకమైనా వాటి గురించి మాట్లాడక తప్పదు. అలా మాట్లాడిన సందర్భాలలో వారి మాట ఆలకించి, ప్రజల స్వరాన్ని గమనించి నిర్ణయాలను పునఃపరిశీలించాలి. అదే పరిపాలన. అంతకన్నా ఎక్కువ చేయకపోయినా ఆ సమయానికి ఫరవాలేని చర్య.
కోటరీ ఎప్పుడూ అధినాయకునికి బలపరీక్ష పెట్టి తమ పబ్బం గడుపుకుంటుంది. అలాంటి సందర్భాలే ఇప్పుడు ఎక్కువ కనుపిస్తున్నాయి. ఒకప్పుడు తన అభిప్రాయాలను స్వేచ్ఛాయుతంగా వ్యక్తం చేయగలిగిన ధర్నాచౌక్‌లను అధికారంలోకి రాగానే నిషిద్ధ ప్రదేశాలుగా ప్రకటించడం సరికాదు. నిషేధాలతో కూడుకున్న పాలన ఎన్నడూ సరికాదు. ప్రజల మనోభావాలను వినలేని బధిరత్వం వల్ల చేటు ఎవరికి? ప్రతిపక్షాలకు మాత్రం కాదు. ఎందుకంటే అవి రాజకీయ క్రీడా ప్రణాళికలో భాగం కాబట్టి. ప్రజాస్వామ్య భావాల కోసం ప్రజల స్వరం వినిపించాలనే ప్రజాస్వామ్య గొంతుకల ఆకాంక్ష పెడచెవిన పెట్టడం వల్ల చరిత్రలో తాము ఏ విధంగా నిలవాలని భావిస్తున్నారో దానికి పది రెట్ల పాపం మూట కట్టుకోక తప్పదు.
అంతిమంగా ప్రజల గొంతుకకు బేడీలు వేసే ప్రక్రియ మొత్తం సమాజానికి కీడు కలిగిస్తుంది. సురక్షితం అనుకునే ఏసీ గదులకే మొదటి కాక తగులుతుంది. ఏ నియంతృత్వ భావన అయినా తన ఓటమికి తానే వేసుకునే ఉచ్చు. ప్రజల స్వేచ్ఛా వేదికని కాపాడితే తిరిగి అదే వేదిక ఒకనాడు తనకి ఆశ్రయం ఇస్తుందనే ఆలోచన చరిత్ర తెలిసిన వాడికే తెలుస్తుంది. *

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242