తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

దుర్బలత్వ ప్రతీకే.. విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది విగ్రహాల యుగం. మనుషులు, వ్యవస్థలు బిజీ బిజీ. వారు విగ్రహాలను తయారుచేస్తున్నారు. వాటిని ఎలా, ఎక్కడ ప్రతిష్ఠించాలో ఆలోచనలు చేస్తున్నారు. ఎంత పెద్దగా నిలపాలో అని సతమతమవుతున్నారు. మొన్న తూర్పుగోదావరి జిల్లాలో తిరుగుతున్నప్పుడు తాటిచెట్ల పొడవును తలదనే్న ఆంజనేయస్వామి విగ్రహాలు అడుగడుగునా కనుపించాయి. తాగునీరు, సాగునీరు, శుభ్రత లేని మురిగ్గుంటలున్న ఊళ్ళల్లో వాడవాడకో విగ్రహం. బడి, ఆస్పత్రి లేని ఊళ్ళల్లో కూడా విగ్రహాలకు కొదువలేదు. పోటీ మనస్తత్వం పెరిగిపోయింది. చదువుకుని బాగుపడాలని, కష్టపడి సుఖంగా, ఆరోగ్యంగా బతకాలని కాదు. విగ్రహాలు పెట్టాలని కొట్లాడుకుంటున్నారు. ప్రజల ఆలోచనలకు దగ్గరగానే ప్రభుత్వాలు. గాంధీ విగ్రహాలకు పోటీగా అంబేద్కర్ విగ్రహాలు వెలిశాయి. వీటికి పోటీగా కొన్నాళ్ళు జగ్‌జీవన్‌రాం విగ్రహాలు పెట్టారు. ఇప్పుడు వీటికి పోటీగా ఆంజనేయస్వామి విగ్రహాలు...
రాజకీయ విగ్రహాలకు పార్టీలకు చెక్‌గా బూర్జువా, పాలక పార్టీల భావజాలానికి దగ్గరగా. ఈ విగ్రహాలకు అయ్యే ఖర్చు ఈ వర్గాలే భరిస్తాయి. దళిత ప్రజలు ఏర్పాటుచేసుకున్న అంబేద్కర్ విగ్రహాలు ఓ మూల పేదగా, చిన్నగా బిక్కుబిక్కుమంటాయి. వీటిని పరిహసిస్తున్నట్లు ఈ కొత్త విగ్రహాలు. వీటికి నిత్య ధూప దీప నైవేద్యాలు. తూర్పు గోదావరిలో భారీ ఆంజనేయ విగ్రహాలు. కరీంనగర్‌లో కోతుల విగ్రహాలు చిన్నగా. తెలంగాణలో గుట్టల విధ్వంసం అపరిమితంగా జరుగుతున్నది. అందుకే అక్కడ ఆవాసం ఉంటున్న కోతులు పల్లెలకు వలసపోయాయి. అక్కడ ఇతర జాతుల కోతులను తెచ్చి పోటీపెట్టడం వల్ల అవి ఉండలేక తిండికోసం రోడ్డుపైకి చేరాయి. గ్రానైటు బండరాళ్ళని మోసుకుపోతున్న లారీల కింద వేలాది వానరాలు నుజ్జునుజ్జు అవుతుంటే చూసి భరించలేక పాపపరిహారంగా వాటి విగ్రహాలు పెడుతున్నారు. ఇది ఒక కొత్త విగ్రహ స్థాపన ధోరణి.
రాజకీయంగా దేశంలో కొత్త విగ్రహాల కోసం అనే్వషణ మొదలైంది. మహారాష్టల్రో శివాజీ విగ్రహాలు ఊపందుకున్నాయి. బిజెపి పార్టీ, ప్రభుత్వం సర్దార్ పటేల్ అతి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్నది. మహారాష్టల్రో అరేబియా సముద్రం పక్కన కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 309 అడుగుల అతి పెద్ద శివాజీ విగ్రహాన్ని పెడుతున్నారు. అలా పెట్టడాన్ని కుమార్ కేట్కర్ అనే సంపాదకుడు తన పత్రిక సంపాదకీయంలో- అంత ధనంతో పేదలకు అన్నం పెట్టవచ్చు అని రాశాడు. శివ సంగ్రామ్ సంఘటన సంస్థవారు అతని ఇంటిపై దాడిచేసి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఇంతకూ కేట్కర్ రాసిందేమిటి- ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే బాగుండు అని. రోజుకో రైతు చస్తుంటే వారిని విస్మరించి ఈ విగ్రహాల గోలేమిటి? అని రాశాడు. విగ్రహ భక్తులకు అలాంటి ఆలోచన రాదు. వచ్చినా వారికి- బతికి ఉన్న మనుషులు ముఖ్యం కాదు. తమ తమ సరదాలు, విగ్రహాలే ముఖ్యం. ఇతర విగ్రహాల పట్ల అసహనం పెరిగిపోవడం బాధాకరం, భయంకరం. కాన్పూర్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరగడం చూస్తున్నాం. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. రెండు రైళ్ళకు నిప్పు పెట్టారు. అప్పటికి అంతటితో ఆగింది. అది కొనసాగే ప్రమాదం మాత్రం ఎప్పుడైనా ఈ దేశంలో పొంచి ఉందనిపిస్తోంది.
ప్రస్తుతం విగ్రహాలకన్నా కటౌట్ల సంస్కృతి మరీ ప్రమాదకరంగా ముందుకు వస్తోంది. బోనాలు, బతుకమ్మలు, జాతరలు, పండగలు, సంక్రాంతికి కోళ్ళ పందేలు, ఎన్నికలప్పుడు ఊరినిండా బేనర్లే. తమ నాయకుల ఫొటోల కింద డబ్బిచ్చి తమ ఫొటోలు అచ్చొత్తించుకునే ధోరణి పెరిగింది. తమిళనాట యం.జి.ఆర్, జయలలిత, ఈమధ్య శశికళల కటౌట్లు చూస్తే దేశం ఎక్కడికి పోతుందనే అనుమానం రాకమానదు. కటౌట్లు మంచి నాయకుడివే కానక్కరలేదు. ప్రజాభిమానం పొందినవాడివి అయ్యుండక్కరలేదు, గొప్పవాడే కానక్కరలేదు. ఎవరి పెద్ద కటౌట్ పెడితే వారే పెద్ద అనే భావన పెరిగింది. ఇదంతా వ్యక్తివాద ధోరణి కేంద్రంగా పెరిగిన భావన. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల అధినేత, అతని కుటుంబీకుల కటౌట్ల, బేనర్ల కాలం కూడా. పంటలు పండకపోయినా, ప్రతి ఊరిలో చావు డప్పు మోగినా, ప్రతి పండగకి, పబ్బానికి రోడ్లమ్మట బేనర్లు కట్టడం, కట్టించుకోవడం ఒక వ్యాధిగా ముదిరింది.
ప్రభుత్వం ఆలోచన, పథకాల ప్రచారం కోసం అనే సాకు చూపిన పాలకుల విగ్రహాలే ప్రబలిపోతాయి. నిజానికి వారు మరణించిన రోజున ఎవరూ, ఎ క్కడా ఇన్ని కటౌట్లు, బేనర్లు కట్టరేమో. అప్పటికి వారి అవసరం తీరిపోతుంది. అభిమానులు పదవిలో ఉన్నంత మేరకే తమ అభిమానాన్ని చూపడం చారిత్రక వాస్తవికత. నిజానికి ఈ విగ్రహభావన నుండి ఇప్పుడు ప్రగతిశీల రాజకీయాలు, వామపక్ష పార్టీలు, నాయకులు, విప్లవ నేతలూ తప్పించుకోలేకపోతున్నారు. కొత్త ఆలోచనలు, స్వజనాత్మక పోరాట రూపాల ఆచరణకి దూరం కావడంవల్ల పాత నాయకుల ఫొటోలు, విగ్రహాల గిరాకీ పెరుగుతుంది. ఆనాటి రాజకీయ ఎత్తుగడలకి ఈనాడు ఎలాంటి ప్రాసంగికత లేకపోవచ్చు. నాటి సైద్ధాంతిక ఆలోచన ఇప్పుడు పనిచేయకపోవచ్చుగాక. ఐనా వారిని విగ్రహంగా ‘పూజించే స్థాయి’కి తీసుకురావడం జరుగుతున్నది.
శివసేన వారు, శివ సంగ్రామ్ వారు శివాజీ జీవితం, పోరాటం అధ్యయనం చేయాల్సిన అవసరం వారికి ఏ కోశానా కనిపించదు. ఆంజనేయ విగ్రహం పెట్టే భక్తులకు అతని భక్తి, శక్తి గురించి తెలియదు. బ్రహ్మచర్యంపై భక్తి ఉండదు. అంబేద్కర్ విగ్రహాల ఆసక్తిపరులు చాలామంది ఇరవై సంపుటాలలో గల ఆయన రచనలను చదవరు. విగ్రహాలు పెట్టేవారు, వాటిని కూల్చేవారు అనవసరంగా డబ్బు వృధా చేస్తున్నారు. జాతీయ స్థాయిలో విగ్రహ పాలసీ ఏర్పాటుచేసి వాటిని తగ్గిస్తేనే కళ్ళ ముందర జీవిస్తున్న మనుషులు కనుపిస్తారు. విగ్రహాలు వద్దన్న బుద్ధుడు విగ్రహమయ్యాడు. విగ్రహారాధనను వ్యతిరేకించిన అంబేద్కర్ విగ్రహంగానే స్థిరపడ్డాడు. ఇప్పుడు రాజకీయ విగ్రహాలు వర్సెస్ పౌరాణిక పురుషుల విగ్రహాల మధ్య పోటీ తలెత్తింది. రాజకీయ విగ్రహాలను మతంలోకి అనువదించే ప్రక్రియ షురువైంది.
నిజానికి ప్రజలకు జ్ఞానం, చైతన్యం ఇచ్చే ప్రతీకలు విస్మృతికి గురికావడం శోచనీయం. అస్తిత్వ ఉద్యమాల వల్ల జరిగిన ఒక ప్రయోజనం ఏమంటే, అలాంటి ప్రతీకలు కొన్నైనా చరిత్ర పొరలలోంచి బయటకు రావడం. విజ్ఞతగల సమాజం వాటికి విగ్రహాలు కట్టి కదలలేని పరిస్థితి కల్పించకూడదు. అవి ప్రజల రక్తనాళాలలో చలనశక్తులై ప్రవహించేట్లు చేయాలి. ఎక్కడి నుండో తెచ్చిన ఇతర విగ్రహాల్ని మోసే పరిస్థితి తలెత్తకుండా చేయాలి. ఈ నేలమీద ప్రజల కోసం పోరాడిన వ్యక్తుల, శక్తుల సంకేతాలే ఇక్కడ నిరంతరం పునర్జన్మిస్తుండాలి. విగ్రహాలు గతం కాదు. అవి వర్తమానం. మట్టితో కాదు. వాటికి ప్రాణం పోసి నిర్మించాలి. *

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242