తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

‘వట్టికోట’ గతం కాదు, వర్తమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఆదివారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని మాధవవరం కలాన్ ఊరికి బస్సులో వెళ్లాం. ఒంటరిగా కాదు, ఇరవై నాలుగు మంది రచయితలతో. మేం అక్కడికి చేరేసరికి మరో ముప్పై మంది రచయితలు, కవులు సిద్ధంగా ఉన్నారు. కొన్ని అక్షరాల్ని బీజాలుగా విత్తాలని మా ఆరాటం. ఎందుకంటే రచయితల వారసత్వంలో పగలు ఉండవు, ప్రేమలు తప్ప. మేం మూకుమ్మడిగా పోయింది అలాంటి ఒక రచయిత జ్ఞాపకాల మననం కోసం. అతని జీవిత ఆచరణని ప్రేరణగా తీసుకోవడం కోసం.
నూట రెండేళ్ల క్రితం ఆ ఊళ్లో 1 నవంబర్ 1915 నాడు ఒక నవ్య సాహిత్య ప్రక్రియ జన్మించింది. దాని పేరు వట్టికోట ఆళ్వారు స్వామి. మనకు గొప్ప రచయితలు ఉండవచ్చు, రచనలు గొప్పగా చేయవచ్చు. కానీ, రచయిత తన జీవిత కార్యాచరణతో సాహిత్యానికి, పుస్తకాలకు సార్ధకత చేకూర్చడం అరుదు. అలాంటి అరుదైన వారిలో వట్టికోట ఒకడు. అందుకే మొన్నటి సాహితీ యాత్ర! దీనిని ‘తెలంగాణ సాహితి’ సంస్థ రూపొందించింది. దానికి తెలుగు సాహిత్యకారులు అనేకులు స్పందించారు. వట్టికోట గతం కాదు. ఆయన మనముందున్న వర్తమానం. నిజానికి భవిష్యత్తు కూడా. ‘ప్రజల మనిషి’, ‘గంగు’ అనే వాస్తవిక నవలలు రాసినంత మాత్రాన, జైలులోపల కథలు రాసినంత మాత్రాన, ‘రామప్ప రభస’ వ్యాస సంపుటి వెలువరించినంత మాత్రాన ఆయన త్రికాల సాహిత్యకారుడు కాలేదు. అతని జీవన ప్రయాణం అనంతమైనది, విలక్షణమైనది. పద్దెనిమిదో ఏట మాధవవరం విడిచి హైదరాబాదు చేరుకున్నాడు. గోలకొండ పత్రికలో ప్రూఫ్ రీడరుగా పనిచేశాడు. తదనంతరం విజయవాడ వెళ్లి హోటల్‌లో సర్వరుగా పనిచేస్తూ ఆంగ్ల భాష నేర్చుకున్నాడు. అక్కడ గ్రంథాలయోద్యమంతో పరిచయం ఏర్పడింది. తన ఇరవై నాలుగో ఏట విజయవాడ నుండి సికింద్రాబాదుకు తిరిగి వచ్చాడు. 1942-క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లాడు. 1947లో ఆంధ్ర మహాసభ సభ్యుడిగా, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా మూడేండ్లు జైలు జీవితం గడిపాడు. ఎన్నో దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. జైల్లో వుండి అక్కడి వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఉద్యమం నడిపాడు. నిజామాబాదు జైలులో దాశరథితో కలిసి జైలు జీవితం గడిపాడు. తెలంగాణ రైతాంగ పోరాటం కాలంలో రచన ప్రారంభించి, ఆ ఉద్యమాన్ని అక్షరాలలో నమోదు చేసాడు. ఓవైపు రాజకీయ జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటునే సాహిత్య రచన కొనసాగించాడు. తన స్వభావం రాజకీయాలు కాదని, అక్షర రంగమే అని తీర్మానించుకున్నాడు. ఎన్నో కొత్త కొత్త ప్రజాసంఘాలు ఏర్పాటు చేశాడు. వివిధ సంఘాల నిర్మాణంలో కీలకపాత్ర వహిస్తూనే నిరంతరం అధ్యయనం చేసేవాడు. సొంత డబ్బులతో పుస్తకాలు, పత్రికలు విరివిగా కొని, తాను చదివి, ఇతరులతో చదివించేవాడు. సమాచారం, అధ్యయనం అనే రెండు క్షేత్రాలను జీవితాంతం మరిచిపోలేదు. రాజకీయ నిర్మాణాలు ఎప్పుడూ చైతన్యం వున్నవారిని తమలో కలుపుకుంటాయి. కాని ప్ర జలను నిత్యం చైతన్యశీలురుగా తయారుచేయడానికి పెద్దగా ఆసక్తిచూపవు. ఈ విషయాన్ని గమనించిన ఆళ్వారు మ రోసారి ప్రజలలో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యాడు.
అవిద్య వల్ల అనర్థా లు అనేకం. లోతుగా వె ళ్లి సమస్యలను అర్థం చేసుకోలేని వారే అ ధికం. అందుకే దేశోద్ధారక గ్రంథమాలను 1938 లో ఏర్పాటు చేసి, ముప్పై మూడు పుస్తకాలు ప్రచురించాడు. వీటి ప్రచురణ కోసం విరాళాలు సేకరించాడు, ప్రతి దాతకు పుస్తకాలు అందించాడు. వారితో చదివించాడు. ఆ పుస్తకాలను బరువు అని చూడకుండా తానే మోసుకునిపోయి ఊరూరా తిరుగుతూ అమ్మేవాడు. ఆ పుస్తకాలకు చందాదారులుగా చేర్పించాడు. రాత్రిళ్లు ఆ పుస్తకాలలోని కొన్ని భాగాలను ప్రజలకు చదివి వినిపించేవాడు. అతను పుస్తక విక్రేత కాదు. లాభాల కోసం పుస్తకాలు అమ్ముకునేవాడు కాదు. పుస్తకం ఒక బహానాగా ప్రజలలో చైతన్యం కలిగించాలని అతని ప్రయత్నం. ఈమధ్య సొంత లాభాల కోసం పుస్తకాలు అమ్ముకునే కొందరు రచయితలు తమని తాము ‘వట్టికోట’లమని గొప్పలు చెప్పుకోవడం చూస్తుంటే నవ్వొస్తుంది.
ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని గ్రామాలకు నడక దారిన వెళ్లి అక్షరాలా అక్షర స్ఫూర్తిని వెదజల్లాడు. అతను ప్రచురించిన పుస్తకాలు అందుకు తగినట్టుగా వుండేవి. అతనొక పుస్తక ఆయుధధారి. తెలంగాణ ప్రజలలో నూతనోత్తేజాన్ని కలిగించాడు. సంస్థానాధీశులను, దొరలను, క్రూర గ్రామాధికారులను, వారి ఆగడాలను ఎదిరించాడు. సాహిత్యం చుట్టూ కాల్పనిక చట్రం ఏర్పడి ఉన్న కాలంలో దానిని బద్దలుకొట్టి వాస్తవ సమజాన్ని చిత్రించడానికి ముందు పడిన సాహసి. ‘ప్రజల మనిషి’ నవలలో సామాన్య జీవిని ప్రధానం చేసిన వైనం గొప్పది. ఒక దగ్గర ఉద్యోగం చేస్తూ సుఖంగా జీవిస్తూ రచనలు చేయలేదు. తన రచనల వల్ల కీర్తి ప్రతిష్టలు ఆశించలేదు. 1952 తరువాత ఏర్పడిన ప్రభుత్వ యంత్రంలో మర కాలేదు. ప్రజాశ్రేణులకు దగ్గరయ్యాడు. అందువల్లే తన నలభై ఆరో ఏట ఆకస్మికంగా మరణించేంత వరకు సచైతన్యంతో ప్రకాశించాడు. సాహిత్య గౌరవాన్ని ఇనుమడించిన సాహిత్య కారులలో అతను అద్వితీయుడు. ఇలాంటివారిని యాది చేసుకోవడం మన విధి.
మాధవవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సభలో ఆళ్వార్ చిత్రపటానికి నివాళులు అర్పించడంతో మొదలైన జ్ఞాపకాలు చివరికంటా ఉద్విగ్న సంరంభంతో ముగిశాయి. ఊరేగింపులో ‘వట్టికోట వారసత్వం కొనసాగిద్దాం.. ఆయన ఆశయాలను కొనసాగిద్దాం..’ అన్న నినాదాలు మారుమోగాయి. నిజానికి ఇవ్వాళ కావలసింది కూడా అదే. రాష్ట్రాలు రెండుగా విడిపోయాక సాహిత్యం జావకారుతూ వస్తున్నది. ప్రభుత్వాల తాయిలాల ఆకర్షణ ఒకవైపు. భయ విభ్రాంతులు సృష్టించడం వల్ల నిశ్శబ్దం చేయడం మరోవైపు. కలాలు ఎందుకో వెనె్నముక లుకలుకలతో బాధపడుతున్నాయి. సాహిత్య గౌరవం తగ్గి ప్రజలలో అపహాస్యం పాలవుతున్నది. అందుకే వట్టికోటల మార్గం కావాలిప్పుడు. ఉద్యమాలు మరిచి, యంత్రాంగంలో ఇమిడిపోయి, హాయిగా ఉన్న రచయితలు కూడా వట్టికోట పాట పాడతారు. కాని అతడు ప్రజల పక్షం వహించిన జీవితాచరణని విస్మరిస్తారు. జయంతులు, వర్ధంతులు క్రమం తప్పక చేసేది యంత్రాంగం. అవి లేకుండా గొప్ప రచయితలను తిరిగి ప్రజల పరం చేయడం ప్రజాపక్షం వహించే రచయితల కర్తవ్యం. మొన్న జరిగిన సాహిత్య యాత్ర అక్కడితో ఆగిపోకూడదు. సొంత పుస్తకాలు అమ్ముకోవడం కొందరికి అవసరం. ప్రజల కోసం రాసిన పుస్తకాలను వారి ముంగిట్లోకి తీసుకుపోవాలి. ఇది ప్రజా రచయితల ధర్మం. ప్రజాకవి సుద్దాల హనుమంతు ఊరికి, కాళోజీ కోటకి, వయ్య రాజారాం వంటి వారి ఇంటి ముంగిటికి విస్తరించాలి. ఇప్పుడు సాహిత్య యాత్రలు ఒక కొత్త ఆయుధంగా రూపొందాలి.
*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242