తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

రసవాద రచనావేత్త.. వెంకట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటి నుండో కలవాలని అ నుకున్నాం. కాలం కలిసిరాలేదు. అతనే మొన్న హైదరాబాదు వచ్చాడు. వచ్చినవాడు ఊరికే రాలేదు. తన కవితా సంపుటాలతో వచ్చాడు. ‘ఈ పుస్తకాలు చూడొద్దు. చదవండి. కాస్త కష్టమే.ఐనా చదవాలి’ అన్నాడు. అంత అవసరమా? అన్నాను. ఈ కవిత్వం చదవకపోతే ఏ కవిత్వం చదువుతారు? కాస్తంత గట్టిగా అన్నాడు. కవిత్వం ‘అంతరించిపోయే వనరుల్లో’ చేరిందన్నాను.
‘అందుకే చదవండి. అలాంటి కవిత్వానికి పుష్టి కలిగించే కవిత్వం ఇది. అది గుర్తించాలి. నా కవిత్వం అని కాదు. ఇది మా కవిత్వం. ఇది గోసల కవిత. గోసంగి కవిత్వం. గుండెకొసలలో పూసిన గోసల కవిత్వం. అంతకు మునుపు లేని కొత్త భాషల కొలువు కవిత్వం’ అన్నాడు. అంటే ఏమిటి? అన్నాను. అందుకే చదవండి అన్నాడు.
చదవలేదని ఎలా అనుకుంటావు? గమనించడం నా లక్షణం అన్నాను. ఇంతకీ ఎన, మొగి పదాలకి అర్థం ఏమిటి? అన్నాను. శ్రీశ్రీ కవిత్వంలో బేకం బాకా బాకం బేకా వంటి పదాలకు అర్థం ఏమిటని నేను అడగలేదు. కవిత్వంలో పదాలను మీరే అర్థం చేసుకోవాలి. ఈ పదాలు గల నిఘంటువులు లేవు, ఎలా అర్థం చేసుకోవాలి. అది మీ బాధ. మాలాంటి ఉత్పత్తి కులాల నుండి మా బతుకులు గురించి మేం రాసుకుంటే అర్థం కాదనడం భావ్యమా? నిఘంటువులు మా నాలికల మీద ఉన్నాయి. లగ్జరీ కవిత్వం రాసే పెద్దల కవిత్వాన్ని మీరు ఇలా ప్రశ్నించగలరా? లేదు. మాలాంటి వాళ్లు.. మేం అంటే లోకువ.
కాదయ్యా బాబూ.. ఈ పదాలు అర్థం కాకపోతే ఎలా ఆస్వాదించాలి. కవిత్వంలో మమేకం కావడానికి ఇది అడ్డంకి కాదా? శ్రీశ్రీ వంటి కవులు రాసిన కొన్ని సంస్కృత పదాలకు నిఘంటువులలో అర్థాలున్నాయి. వాటిని చూసుకునైనా చదువుకోగలరు. మరి.. ఎలా? అడిగాను. అది మీ సమస్య. ఏమైనా చేయండి. చదవండి. ఇందులో తాజాదనం ఉంది. కొత్త బతుకు ఉంది. వర్తమానంలో గురి తప్పిన జీవితాల చిత్రణ ఉంది. మీ ఇష్టం అన్నాడు. మా తెలంగాణ పదాలు నిఘంటువుల్లోకి ఎందుకు ఎక్కలేదు? అని ప్రశ్నించాడు.
అలా ప్రశ్నించినతని పేరు మునాస వెంకట్. 1997 ప్రాంతంలో గోసంగి, నీలి సాహితి అనే సంస్థను మిత్రులతో కలసి నల్లగొండలో ఏర్పాటు చేసారు. తొమ్మిది మంది కవులతో మొగి వంటి కవితా సంకలనం తెచ్చారు. ఎందుకోగానీ ఆ తరువాత విడిపోయి ఎవరికి వారు విడివిడిగా పుస్తకాలు అచ్చేసుకున్నారు. గోసంగి కవుల్లో ఒకడైన వెంకట్‌తో జరిగిన సంభాషణ ఈ వారం మీ ముందుంచుతున్నాను.
* * *
జిల్లా నల్లగొండ. మండలం కేతేపల్లి. ఊరు బండపాలెం. పుటుక 1964లో. బడిలో ఉన్నప్పటినుండి తన అన్న ప్రగతి శీల భావాలు కలిగిన మునాస పెద్దులు కోసం కొందరు రచయితలు వచ్చేవారు. వారు చదివిన పుస్తకాల గురించి చర్చించేవారు. అలా తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుండి సాహిత్యం పట్ల మక్కువ పెరిగింది. అప్పట్లో ‘యువరచయితల సమితి’ ఉండేది. వాటి సభలకి వెళ్లేవాడు. వెంకట్ ఇంటికి ఎదురుగా సాహితీమేఖల అంబడిపూడి వెంకటరత్నం ఉండేవారు. ఆట పాటలతో పాటుగా సాహిత్య వాతావరణాన్ని ఆస్వాదించేవాడు. అలా అతనికి పుస్తకాలు చదవడం, కవితలు రాయడం పట్ల ఆసక్తి పెరిగింది. నీలగిరి సాహితిలో కొనసాగుతున్న క్రమంలో అధ్యయనం, చర్చలు, వివాదాలు జరిగేవి. వాటి అనుభవాలు మరింత ఆలోచింపచేస్తాయి. సమాజంలో అభివృద్ధి పక్కనే వున్న యదార్ధ దృశ్యాలను ఎజెండాపైకి తేవాలనిపించింది. తనకు తెలిసిన క విత్వం అందుకు తగిన రూపం అని భావించాడు. అలా పట్టిన కలం ఇప్పటిదాకా వదల్లేదు.
ఒక ప్రాంతం, ఒక జిల్లా, వృత్తి కుటుంబాల గోసలు పట్టించుకోకుండా సాధారణీకరించిన కవిత్వం వెల్లువెత్తిన కాలం. చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట, బహువచనం, బీసీ కవిత్వం, కవితా సంకలనాలు విజృంభిస్తున్న సమయం. గోసంగి కవుల చుట్టూ విద్యుత్ ప్రసారాలు. వాటిమధ్య తమ అస్తిత్వపోరాట రూపంగా కవిత్వాన్ని మలచుకోవాలని సంసిద్ధులయ్యారు. వెంకట్ అప్పటికే ‘హేతువాద నాస్తిక సమాజం’ చేపట్టిన ఉద్యమాల్లో పాల్గొన్నాడు. గోరా, హేమలతా లవణం, లవణం, కత్తిపద్మారావు వంటి వారితో పరిచయం కొంత విశ్వాసాన్ని కలిగించింది. 1983లో తన ఇరవై ఏళ్ల వయసులో నల్లగొండలో జరిగిన మహాసభలకి వచ్చిన శ్రీశ్రీ, రావిశాస్ర్తీ, ఆవంత్స, ఆరుద్ర, దిగంబర తదితర కవులతో పరిచయం సాహిత్యానికి కట్టిపడేసింది. ‘వాస్తవి’ కలం పేరుతో వ్యాకరణం ప్రభాకర్, విష్ణ్భురద్వాజ్‌లతో కలిసి ‘రేపటి కవితలు’ సంకలనం తెచ్చారు. చాలా కవితలు రాసినా 1996లో అచ్చయిన ‘బహ్మముఖం లోంచి పాదాలు’ అనే కవిత తన గుర్తించదగిన కవిత అంటాడు.
నీలగిరి సాహితీ తరఫున ‘బహువచనం’ కవితా సంకలనం వెలువడింది. ఆ సందర్భంలో కొంత వివాదం ఏర్పడింది. ఆ తరువాత ఎనిమిది మంది కవులు కలిసి ‘గోసంగి’ సాహితీ సంస్థను ఏర్పాటుచేసి దళిత బహుజన కవిత్వాన్ని జెండాగా ఎగరేశారు.
వ్యక్తికోణం లోంచి సమాజాన్ని చూడడం, వ్యక్తిగత అనుభవాలని సామాజిక విస్తృతితో రాయడం, ఉత్పత్తి కులాల భాషకి పెద్దపీట వేయడం గమనించవలసిన విషయం. ఈ కోణాలను బలంగా, స్పష్టంగా, విలక్షణంగా వినిపించడం గోసంగి కవుల ప్రత్యేకత. అందుకే కవిత్వాభిమానుల దృష్టి అటుపడింది. ఒక కొత్త కవిత్వ శక్తి జిగేలుమని ప్రకాశించింది. సామాజిక దృక్పథం లోంచి వెలువడిన ‘కవిత్వ ఘాడత’ ఒక గుణంగా చేరి అదనపు శక్తిని సమకూర్చింది. అంతకు ముందు లేని భాష ఇందులో సహజంగా వచ్చి చేరింది. విచిత్రం పదాన్ని ఇసిత్రంగా, నారికేళాలు పదాన్ని నార్కేలాలు అని మాండలీకరించిన వైఖరి కన్నా భిన్నంగా చెవులు విన్న వ్యవహారిక, శ్రామిక పదాలను తీసుకుని కవిత్వీకరించిన రీతి బాగుంది. తద్వారా తెలంగాణ అసలు మాండలిక భా షకు కొంత గౌరవం దక్కింది. కవిత్వంలో మాండలిక భాషపై మరోసారి చర్చ జరిగింది.
ఏది ఏమైనా ఇంతటి నవ్యత, వాస్తవికతల, నేర్పులతో కూడిన సామూహిక కృషి మూడు పుస్తకాలతో ముగిసింది. వేముల ఎల్లయ్య ‘గుంపు’ సాహితి ఏర్పాటు చేయగా ‘గోసంగి’ ద్వారా వెంకట్ ఎన, వర్జి తదితర పుస్తకాలు వెలువరించాడు. ‘మెద’ త్వరలో రాబోతున్నది. తెలంగాణ అస్తిత్వం అంతర్ధారగా వెంకట్ కవిత్వంలో ప్రవహిస్తున్నది. జీవద్భాషలో రచన సాగిస్తున్న కొద్ది మందిలో అతనొకడు. ఇలాంటి కవిత్వాన్ని సమాజం మొత్తం ఒకేలా చూడలేదు. ఆవంత్స సోమసుందర్ ఈ కవితని చదివి ‘ఒక్క ముక్క అర్థం కాలేదు’ అని కొట్టిపారేశాడు. అప్పుడు లేఖల యుద్ధం జరిగింది. ఇది రెండు తెలుగుల మధ్య భావ ఘర్షణ అన్నాడు వెంకట్. కోస్తాంధ్ర భాషకన్నా భిన్నమైన భాష కాబట్టి మీకు అర్థం కాలేదు. శిష్ట వర్గాల వారికి అక్కడి ప్రజల మాండలిక భాష, ఉత్పత్తి వర్గాల భాష కూడా అర్థం కాదు. అందుకే భయపడిపోయి కవులు ఎవరూ ఆ ప్రాంతం నుండి ఇలా పూర్తి మాండలిక భాషలో రాయడం లేదు.
నా కవితా వస్తువు-మా బతుకు చుట్టూ ఆవరించిన వ్యధ. దానిని నేను ముందు రాస్తాను. ఆ తరువాత ఏం చేయాలని ఆలోచిస్తాను. ‘ప్రత్యేక తెలంగాణ’ రాజకీయ పరిష్కారం అని అనుకున్నాను. దానినీ సాధించుకున్నాం. ఐతే అది నిజమైన పరిష్కారమా? అంటే కాలేదు అంటాడు. అది నిజాయితీ. నిజానికి కవి క్రాంతదర్శి. ముందుచూపు ఉండాలి. తన ప్రాపంచిక దృక్పథాన్ని ప్రతిసారీ పరీక్షకు నిలిపి, దానినుండి గుణపాఠం తీసుకోవాలి. ఆ పనిలో ఆలోచిస్తున్న తాత్విక చింతన అతని స్వరంలో సన్నగా వినిపించింది.
అలుపులేకుండా అనేక సామెతలు, నుడికారాలతో తన కవిత్వపు గుమ్మిని నింపేశాడు. గ్రామీణ జీవితం, అమ్మల విషాదం, ప్రకృతి విలయం, ఫ్లోరైడ్ వాస్తవం అన్నీ కలిపిన గరళ ద్రావకంతో విషాద ఉన్మత్తకి గురి చేసి పాఠకుడిని విచలితం చేశాడు. అది అతని కవిత్వం. అదే అతని ప్రత్యేకత. వందమంది కవులనుండి వేరుగా ఎత్తి చూపే దివిటీ అతని అక్షరం. ఉద్యమాలలో ఎప్పుడూ ప్రజలే నష్టజాతకులు. ప్రభుత్వం ఏర్పాటు వేళల్లో వారే అనామక శక్తులు. సిగ్గుతో అడిగి లేదనిపించుకునే దౌర్భాగ్యులు. వేలాది మంది అమరుల బతుకులను అనారోగ్యంతో మంచంలో పడి కదలకుండా మెదలని నోటితో అమ్మ అన్న వాక్యాలను వెంకట్ కవితను చేశాడు.
కరువెనుక కరువు వచ్చినా
ఊళ్లె మెకం సొరబారినా
గత్తర వచ్చినా
రజాకార్లు దండెత్తి వచ్చినా
గడీల మీద దొర హూంకరించినా భయపడలేదురా
ఒక్కొక్క పిల్లడు
జీవి తీసుకుంటున్నడు
ఎందుకో కొడకా గిప్పుడు భయమేస్తున్నది
నా సావు గురించి కాదురా వెంకన్న!
ఇదీ మునాస వెంకన్న కవిత! ఇది కవిత్వమా? అంటే కవిత్వాలకి పాఠం చెప్పే కవిత. కవి సృష్టికర్త కాదు. సృష్టికర్తల భావాలను విని, వాటికి ఒక తాత్విక రూపం సంతరింపచేసే రసవాద రచనావేత్త! ఆ కోవలోకి చెందిన కవి సమాజ శరీరంలో ఒక భాగం. అంతకంటే కవి నిర్వహించగల అత్యున్నతమైన పాత్ర ఏమైనా ప్రత్యేకంగా ఉంటుందా? నిశ్శబ్దంగా ఆ పని చేస్తున్నాడు. ఇవాళ అదే కవిత్వం!
*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242