తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

‘అర్ధాంగి దేవోభవ’ అనే ఆత్మకథాంతరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచన అనేక రూపాలతో వ్యక్తం అవుతుంది. వాటిని ప్రక్రియలు అంటాం. సృజనాత్మక సాహిత్యంలో అవి ఎక్కువగా ఉంటాయి. చరిత్రలు, డైరీలు, జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు అనే ప్రక్రియలు కూడా ఉంటాయి. జీవిత చరిత్రలను ఇతరులు రాస్తారు. స్వీయచరిత్రని తనకు తానే రాసుకుంటాడు.
లోగడ పెద్దవారే స్వీయ చరిత్రలు, డైరీలు రాసుకునేవారు. రాజకీయ, పాలకవర్గ, ధనిక వర్గాలకు చెందినవారే ఇలాంటి రచనలు చేసేవారు. ఆ పుస్తకాలే అచ్చయ్యేవి. వాటికే గుర్తింపు వచ్చేది. అంటే ఈ రెండు ప్రక్రియలు రాయడానికి సామాజిక ఆర్థిక హోదా ఉండాలి. అది తప్పనిసరి అనే భావన ఉండేది. అందుకే చాలావరకు ఈ కోవకి చెందిన వ్యక్తుల స్వీయ చరిత్రలు, దినచర్యలు మాత్రమే ఎక్కువగా కనుపిస్తాయి.
ప్రజాస్వామ్య భావాలు పెరిగి, సామాన్యుడు కూడా మాన్యుడయ్యే పరిస్థితులు పెరగడంవల్ల కొద్ది రచనలు కింది వర్గాల నుండి రాగలిగాయి. కాని వాటికి అంతగా ప్రచారం జరగలేదు. వీటిలో అడుగు వర్గాల ప్రజలు, పైవర్గాల మహిళలకు చెందినవారి రచనలు మరీ తక్కువ. అవి వెలువడినా వాటికి ఆదరణ అంతగా లభించలేదు. సంస్కరణోద్యమాలలో, స్వాతంత్య్రోద్యమంలో, వామపక్ష ఉద్యమాలలో పనిచేసిన కొందరు తాము చేసిన పోరాటాలను అనుభవాలను రాసుకున్నారు. వాటిలో కింది వర్గాలవారివి కూడా ఉన్నాయి. ఐతే ఎక్కువగా నాయకత్వ స్థానంలో ఉన్నవారే రాసుకోవడం గమనించాలి. ఏది ఏమైనా స్వీయ రచనా విధానం చాలావరకు ఒకే పద్ధతిలో, మూసలో నడిచింది. దానిలో మార్పులు ఎక్కువగా లేవు. కొందరు తమ జీవితాన్ని నవలా రూపంలో రాసుకున్నారు. స్వీయ భావ రచనలో ప్రత్యేక శైలిని, నిర్మాణాన్ని ప్రవేశపెట్టలేదు. ఈమధ్య జీవిత కథలు లేదా ఆత్మకథలు అని కూడా వస్తున్నాయి. మహారాష్టల్రో దళిత జీవిత కథలు కొన్ని వచ్చాయి. మన దగ్గర అలాంటివి చాలా తక్కువ. స్వీయ చరిత్రని మనిషి చరిత్ర గమనంలో ఉంటూ రాయలేడు. వయసు రీత్యా, ఉద్యమ తదితర కారణాల రీత్యా విరమణ లేదా స్తబ్దత ఏర్పడినపుడు మాత్రమే ప్రారంభం అవుతుంది. అంటే బాధ్యత, పదవి లేదా బాధ్యతానంతరమో, ఆ తదనంతరమో స్వీయ రచన అంకురమెత్తుతుంది.
చాలామంది పాఠకులు స్వీయచరిత్రల్ని చదవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అందులో అబద్ధాలు ఉండవు. పొగడ్తలు తక్కువ. వాస్తవాలు ఎక్కువ. ఒక మనిషి తన జీవితకాలంలో తన చుట్టూ వున్న అనేకమంది గురించి చెప్పక తప్పదు. కాల్పనిక భావనల కన్నా వాస్తవ ఘటనలే ఎక్కువ. కథా సంవిధానంగా ఆ ఘటనల క్రమం రచనని ఆసక్తికరంగా మారుస్తుంది. అలాంటి ఒక స్వీయ చరిత్ర, జ్ఞాపకాల రచన, జీవిత చరిత్ర వంటి ప్రక్రియల కలనేతగా వెలువడిన ‘అర్థాంగి దేవోభవ’ అనే గ్రంధం చూశాను. దాని గురించి నాలుగు మాటలు ఈ వారం.
ఆరువారాల క్రితం గోండు ప్రజల కోసం గుంజాల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరానికి మందులతో సహా వచ్చి ఎంతో శాంతంగా, పరిశీలనగా రోగులని పరీక్షించి మందులు ఇచ్చిన డా. బి.రాజగోపాలరావు రాసిన గ్రంథం ఇది. డా.కొల్లు రంగారావుగారి ద్వారా పరిచయం అయిన డాక్టర్ గారిని చూడగానే ఆయన ఒక ప్రత్యేక వ్యక్తి అనుకుంటారు. ఆయన మాట తీరు కూడా విలక్షణమే. ఈ పుస్తకం చదివాక ఆయన జీవితం కూడా అలాగే అనిపించింది. అనేక మలుపులు, దశలు, ఆత్మీయతల సమాహారంగా, వృత్తి, ప్రవృత్తుల కలయికగా ఒక మనిషి సంవేదనలు, సంస్పందనలు ఉన్నాయ. మిశ్రమంగా ఈ పుస్తకం రచన కొనసాగింది.
మిత్రులు డాక్టర్‌గారిని స్వీయ చరిత్ర రాయండని కోరారు. కాని ఆ పని చేయలేదు. నిజమే. తాను అంత పెద్దవాడు కాదు. గొప్పవాడు కాదు. కాని విస్తృతమైన జీవితం ఉంది. ఒక జీవితాన్ని మించిన ఘటనలు ఉన్నాయి. అందులో కొన్నింటిని తెలపాలని మనసులో కోరిక ఉంది. సాహిత్య పిపాసవల్ల అబ్బిన పఠనంవల్ల, రచనా విధానం తెలిసింది. ఇంటినిండా చదివిన పుస్తకాల దొంతరల మధ్య ఉండేవాడు. ఏం చేస్తాడు, వాటి గురించే ఆలోచిస్తాడు. వాటినే కలగంటాడు. అక్షరాలు అతనితో సహచర్యం చేస్తుంటాయి.
తన సహచరి డా. బి.కస్తూరి అకాల మరణమే కాదు, ఆమె దొంగల దాడిలో మరణించిన తీరు అతడిని విచలితం చేసింది. ఆ దాడిలో మరణం అంచుల్ని తాకివచ్చినవాడిగా ఒంటరిగా ఆమె లేని బతుకీడ్చడంలోని ఆవేదన రచనా వ్యాసంగానికి దగ్గర చేసింది. తన గత జీవితానుభవం, వర్తమానం రెంటిని కలగలిపి ఆలోచించేలా చేసింది. గతం నాస్తి కాదు. అదొక అనుభవ శిఖరం. వర్తమానం సంక్లిష్టం. దానిని పక్కన పడేసే విషయం కాదు. అందుకే కలం నడిచింది అక్షరాల సాక్షిగా.
గతం ఆలోచనలు దినచర్య శైలిని సమకూర్చింది. తన గురించి, కుటుంబం గురించి, కస్తూరిగారి గురించి పడిన తపన స్వీయ చరిత్ర రీతిని జోడించింది. తనతో పనిచేసిన, తన మిత్రుల ఆప్తుల జ్ఞాపకాల నెమరు జ్ఞాపకాలను చేసింది. వాటి అన్నింటి కలయకే. అదే ఈ రచన.
స్వీయరచన పరిధిని విశాలతరం చేసి ప్రస్తుతంలో గతాన్ని, గతంలోంచి వర్తమానాన్ని చూసే ప్రయత్నంగా ఈ గ్రంథాన్ని భావించవచ్చు. 732 పేజీల గ్రంథంలో సుప్రసిద్ధ వ్యక్తుల పరిచయాలు జ్ఞాపకాలు ఉన్నాయి. చారిత్రక పురుషుల గురించి తన ఆలోచనలు కూడా జత అయ్యాయి. వారిని తన స్థాయి, అభిమానుల రీత్యా జ్ఞాపకం చేసుకోవడం కూడా గమనించాలి. వందేళ్లకాలం నుండి తెలుగు నేలమీద నడయాడిన పెద్దలు, వారి కృషి గురించి రాయడం వెనుక, మన సమాజంలో వారి అడుగుజాడల ప్రేరణని గుర్తుచేయడమే. పెద్దగా పరిచయం లేనివారికి కూడా ఈ పేజీలలో స్థానం కల్పించి వారి కృషిని తెలియజేశారు. అంతేకాదు తనతో పనిచేసిన ఉద్యోగులను, కింది స్థాయి మిత్రుల గురించి రాశారు. వారితో గత అనుబంధాన్ని నమోదు చేశారు. వీరిలో కవులు, రచయితలు, కళాకారులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వంటి వారే కాదు. గ్రంథాలయోద్యమం, గ్రంథ పఠనం, పుస్తకం, గాంధారి గ్రామం వంటి అంశాలపై తన అభిప్రాయాలు ఎన్నో ఉన్నాయి.
కళింగాంధ్రలో పుట్టి, రాజమండ్రి, చీరాల వంటి ప్రాంతాలలో తండ్రితోపాటుగా తిరిగి, 1950లో హైదరాబాదు వచ్చి అక్కడే యంబిబిఎస్ చదివి మొదటగా నిజామాబాద్ జిల్లాలో డాక్టర్‌గా పోస్టింగ్ పొంది, ఉద్యోగం చివరివరకు అక్కడే ఉండి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసించే రాజగోపాలరావు జీవిత పయనం, భావనా ప్రపంచమే ఈ గ్రంథం. ఎక్కడా ఎవరినీ తక్కువ చేయకుండా, ఎక్కువ చేసి చూపకుండా సంయమనంతో తన గురించే కాకుండా తన పరిసరాలను, బతుకు ఎత్తు పల్లాలను, తాను అభిమానించిన వారిని, తనని ఇష్టపడిన వ్యక్తులను గుర్తుచేసుకున్న వైనం ముఖ్యం.
పితృదేవోభవ, మాతృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్న రీతిలో ‘అర్ధాంగి దేవోభవ’ అంటూ తన జీవిత సహచరి పేర పుస్తకాన్ని ప్రచురించడం ప్రత్యేకతగా భావించవచ్చు. ఐతే ఈ పుస్తకంలో ఆమె గురించి కన్నా ఇతర స్నేహితుల గురించి చేసిందే ఎక్కువ. ఐతే ఆయా సందర్భాలలో డా. కస్తూరి గురించి కూడా ప్రసక్తి వస్తుంది. ప్రస్తుతం ఆమె పేరుమీద హైదరాబాద్‌లో ఉచిత ఆరోగ్య కేంద్రం నడుపుతున్నారు. ఎన్నో ఉచిత ఆరోగ్య శిబిరాలకు తన వంతు సహకారం అందిస్తున్నారు.
ఐతే ఈ గ్రంథంలో విషయ విభాగాలు వేరుపరిచి ఉంటే పాఠకుడికి మరింత సౌకర్యంగా ఉండేది. అన్ని రకాల అంశాలు కలగలపడంవల్ల కొంత శ్రమ కలుగుతుంది. నిజానికి నిజామాబాదు జిల్లాలోని అనేక మండలాలోని వ్యక్తులు మనకు ఇక్కడ తారసపడతారు. అంతేకాదు జిల్లా స్థాయి పరిపాలనాధికారులు, పోలీసు అధికారుల స్నేహాలు, వారితో వైరుధ్యాలు కూడా కొన్ని ఉటంకించి సమతౌల్యాన్ని సాధించారు. అంతా బాగుంది అనే రీతిలో కాకుండా, సమస్యలు తలెత్తినపుడు ఎలా వాటిని పరిష్కరించుకున్నారో కూడా చెప్పారు. ఈ ఆత్మకథాత్మక సవివర గ్రంథంలో ఆత్మీయానురాగాలకు, స్నేహభావనలకు ఎక్కువ చోటు ఇవ్వడం ముదావహం. తనతోపాటు పనిచేసినవారు, స్నేహితులు మురళీకృష్ణ, పి.వి.సుందర్, కిషన్‌రావు, యు.వి.నారాయణ, రాజేంద్ర, లక్ష్మారెడ్డి, గురు సత్యనారాయణ వంటి ఎందరి జ్ఞాపకాలో.. ఈ జ్ఞాపకాలు అంతరం లేని సామాజిక తీపి గుర్తులు. నిజంగా ఇటువంటివారిని కూడా గుర్తుంచుకోవచ్చా అనిపించే వ్యక్తుల్ని మరిచిపోకుండా గుర్తుంచుకోవడం మానవ మర్యాద. దానిని పాటించినందుకు రచయిత అభినందనీయుడు. రచనాశక్తి, శైలీ శిల్పాలకు ఈ గ్రంథం ఆమడదూరం. మానవీయ మమతల క్షేత్రంలో సుగంధాలలో హెచ్చుతగ్గులుండవు. తేనెటీగలు గొప్ప పువ్వుల మకరందానే్న కాదు, చిన్నచిన్న పువ్వుల పుప్పొళ్ళని మధురం చేసినట్లే రచయిత అందరిని ఒకే రీతిలో భావించిన తీరు పాఠకుడిని ఆకట్టుకుంటుంది. అలాంటివారి పేజీలను కూడదీసుకుని చదవలసి వుంది. 732 పేజీల గ్రంథాన్ని రచయిత ఉచితంగా పాఠకుడికి ఇవ్వాలనుకోవడం కూడా ఒక ప్రత్యేకతే.
రాజగోపాలరావుగారు తన సతీమణి కస్తూరి భర్తగానే ఎక్కువమందికి తెలుసు అని తానే రాసుకోవడం ఆమెకు ఇచ్చిన గౌరవం. మీసాల డాక్టరుగా కూడా ఆయన అక్కడివారికి చిరపరిచితుడు. ‘కారణజన్మురాలు కస్తూరి’ ‘మీసాలోపాఖ్యనం’ వంటి స్వీయ కథనాలు మనకి రచయిత జీవిత సంవేదనలను పట్టిస్తాయి. తన మీసాల వెనుక ఉన్న ఎన్నో ఉదంతాలను చక్కగా విశదీకరించాడు. హాస్యం, వ్యంగ్యం మిళితం చేసి వాస్తవాన్ని కళ్లకు కడతాడు. సినీ హీరోలు, మిలటరీ వ్యక్తులు, పోలీసులు, పౌరాణిక పురుషులు, చారిత్రక వీరుల మీసాలను పరిచయం చేస్తాడు. ఒక చిన్న పరిశోధన పత్రంలా పాఠకుడు భావించే వీలు ఉంది. ఆ వ్యాసం తరువాతే ఎక్కడా ప్రసక్తించడు కాని కలప దొంగ వీరప్పన్ ఫొటోతో సహా ఒక పేజీ వ్యాసం ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కోసం నందమూరి బాలకృష్ణ పెంచిన మీసాల గురించి ప్రసక్తాను ప్రసక్తం చేస్తాడు. నిజానికి కొన్ని వ్యాసాలు ఆయన జీవితానికి ఏ రూపంలోనూ సంబంధం ఉండదు. కాని అవి ఆనాడు తన మనసులో, తనని తట్టిన జ్ఞాపకాలుగా వాటిని ఉన్నది ఉన్నట్టుగా, తోచిన రీతిలో రాశారు. ఆ విధంగా ఈ పుస్తకం పాఠకులకి మాత్రం ఒక మినీ విజ్ఞాన సర్వస్వంలాగా, జ్ఞాపకాల పెద్ద చెరువులాగా, అనుభవసారాల కాసారంలాగా కనుపిస్తుంది.
ఇది ఆయన రూపొందించుకున్న ప్రక్రియ. ఆత్మకథలకి విస్తారత ఉంటుందని, దానికి ఇతర అంశాలు చేర్చి లోతుని సృష్టించవచ్చని తెలియజేస్తుందీ రచన. ఇది ఒక సహచరికి ఇచ్చిన కానుక! దీనిని అలా చూడాలి. అంతే.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242