తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

వేసవి బడులలో బాల్యం వికసించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది వేసవి బడుల రుతువు
ప్రతి చిన్నబడి ఎండాకాలం సెలవుల్లో 3సమ్మర్ స్కూల్2గా అవతారం ఎత్తుతోంది.
బడిలోని పిల్లల్నే కాదు, ఆ చుట్టుపక్కల ఉండే పిల్లలకోసం వీటిని తెరుస్తారు. నిజానికి అది స్కూలా? కాకూడదు. పిల్లల సరదా విడిదా? అదీ సరికాదు. మరి కొత్తగా వెలసిన ఆ స్కూల్లో ఏం చేస్తారు? ఏం చెబుతారు? వీటిని గురించి ఎవరైనా ఆలోచించారా? పిల్లలకు వీటి అవసరం ఏమైనా ఉందా? ఉంటే ఏ మేరకు? ఆలోచించారా ఎవరైనా?అవసరం పిల్లలకా. తల్లిదండ్రులకా. బడి నిర్వాహకులకా.
తామరతంపరగా కానె్వంట్లు మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా వాటి బాగోగులపై ఎలాంటి నిఘా లేదు. అనుమతుల పేర డబ్బులు చేతులు మారాయే తప్ప ఆ బడులలోసౌకర్యాలు, శాస్ర్తియ బోధన, ఉపాధ్యాయుల అర్హతల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. కొన్ని పాఠశాలలో వేసవి పాఠశాల పేర తెరుస్తారు. ఇందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఎంత డబ్బు వసూలు చేస్తున్నారనే ఆలోచన ఉండదు. బేనర్లు, రంగుల కరపత్రాలు, డాబుసరి ప్రకటనలు ఇస్తే సరి. తల్లి దండ్రులు వాటిని చూసి తమ పిల్లల్ని ముక్కులకి తాడేసి లాక్కొచ్చి చేర్పిస్తున్నారు. ఇదీ తంతు. నిజానికి తల్లిదండ్రుల ఆలోచన ఏమిటో స్పష్టంగా తెలియదు. వీరు పాఠశాల తరగతి గదికి ఈ వేసవి బడులు ప్రతిరూపం అనుకొంటారేమో? సెలవుల్లో ట్యూషన్ అని అనుకుంటారా? రాబోయే తరగతిలో చక్కగా చదువుకుంటారని భావిస్తారా? లేదా వారిని ఇంట్లో ఉంచకుండా ఆడుకోకుండా తల్లిదండ్రులు ఇలా పంపిస్తారా? పాఠశాలకు అలవాటు పడతాడని భావించి మరో రూపంలో 3స్కూలుకి పంపిస్తారా? ఇంట్లో ఉంటే 3తల్లి2ప్రేమ వల్ల చెడిపోతాడని తండ్రి పిల్లవాడిని దాదాపు బలవంతంగా స్కూలు నాలుగు గోడల మధ్య బందీ చేస్తాడా? సెలవుల్లో కూడా చదువుకోకపోతే, చదవడానికి మధ్య అవరోధం కలిగి చదువురాదనే భావన తల్లిదండ్రులకు, టీచర్లకు ఉండడం వల్ల వేసవి బడులు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే భావం మనసులో ఉన్నట్టు కనిపిస్తుంది. దీనికి ఎన్నో రంగులు అద్ది, ఆటపాటల సందడి అన్న బేనరు కింద పిల్లల్ని తిరిగి పాఠశాల క్రమశిక్షణ నియమాల ఫ్రేముల మధ్య మళ్లీ బందీ చేయడమే అని కొంతమంది విద్యావేత్తల భావన.
ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులకోసం ఈ స్కూళ్లు నడుపుతున్నాం. ఇంట్లో పిల్లలకు చదువు, నడవడిక, మన్నన నేర్పలేని వారు ఇలాంటి బడులపై ఆధారపడతారు. పిల్లవాణ్ణి వినయవంతునిగా, బుద్ధిమంతునిగా మార్చడం కోసం ఈ పాఠశాలలకి పంపుతున్నారు. తమ మనసులో దాగిన క్రమశిక్షణకి ప్రతిరూపంగా పిల్లవాడిని తయారు చేయాలనే కోర్కెను తీర్చేలా స్కూలు ఉండాలని ఆశిస్తారు. పురుష ప్రధానమైన ఆలోచనా దృక్పథం వల్లే క్రమశిక్షణకి వివిధ రూపాలు ఏర్పడతాయి అంటారు యాజమాన్యాలవారు.
యూనిఫాం, బూట్లు, సాక్సులు, పుస్తకాల సంచీ, టై, స్కూలు బేడ్జి వంటి వాటిని చూస్తే మనకు పోలీసులు గుర్తొస్తారు. ఇంకాస్త పరికించి చూస్తే విద్యార్థులుసైనికులు కనిపిస్తారు. స్కూలు ఓ పటాలంలా స్కూలు గుర్తుకువస్తుంది. మన పిల్లల్లి అలా తయారు చేయాలని ఆశిస్తాం. వాళ్లు వాళ్ల బుర్రలతో ఆలోచించాలని, ఆ ఆలోచనల వికాసంతో జీవించాలని అనుకోం. సొంతంగా ఆలోచించేవాడు ఆనందంగా ఉంటాడని భావించం. ఇలాంటి వారు చెడిపోతారని అనుకుంటాం. ఈ ఆలోచనకు ప్రాతిపదిక ఏమిటో ఎవరూ చెప్పలేరు. కాని ఆ ఆలోచనే మనల్ని ఎన్నో రకాల స్కూళ్లని నిర్మింపచేస్తున్నది. ఏసీలతో సహా అన్ని వసతులు కలిగించినా పాఠశాల అసలు స్వభావం మారదు. పోలీసు స్టేషన్, మిలటరీ కేంపులాగే, స్కూళ్లకి ఎతె్తైన, బలమైన గోడలు, ప్రవేశ ద్వారం, లోనికి అనుమతి. వెలుపలకు అనుమతులు, పాసులు. అన్నీ వెరసి పసివారిని భయభ్రాంతులను కలుగజేస్తాయి. భయపెట్టకపోతే చదువు రాదనే పాత మూర్ఖత్వం, ఆలోచన జిడ్డు ఎన్ని ఆధునికతల సబ్బులు రుద్దినా వదలడం లేదు. బూట్లకు పాలిష్ వేసుకోకపోతే విద్యార్థికి 3శిక్ష2 ఇవ్వడం అనేక బడుల్లో కనుపిస్తుంది. బడిని స్వేచ్చా క్షేత్రంగా కాకుండా ఆంక్షలతో ప్రతిచోట నియమ నిబంధనలతో 3గుడి2లోలాగా ఆచారాలు, నిషేధాలతో భయంభయంగా మసలాలి. అందుకే గుడిలో బడిలో గంటలు మోగుతాయ. సమయపాలన చెడ్డదేం కాదు. కాని సమయానికి ఇచ్చిన ప్రాధాన్యత మనోవికాసానికి ఇవ్వలేకపోవడం తప్పు. సమయం పిల్లవాడిని తప్పు పట్టే ఒక అంశం. యూనిఫాం దానికదే కనబడని ఊచలు. ఒక మిలటరీ కమాండర్, గుడిలోని పూజారి, బడిలోని పంతులు అందరూ ఆర్డర్లిచ్చేవారే. ఎలాంటి లోపం లేనివారే. పైగా వాళ్లు పవిత్రులు. వారు నేర్పేవాళ్లు. మిలటరీలో సైనికులు, గుడిలోని భక్తులు, బడిలో విద్యార్థులు క్రమశిక్షణలేని బడుద్ధాయిలు. శిక్షార్హులు. నేర్చుకోవలసినవారు. మరోమాటలో చెప్పాలంటే ఈ మూర్ఖులను నిరంతరం బెత్తంతో, బెత్తం వంటి సూక్తులతో, నీతులతో పొడుస్తుండాలి. ఎప్పుడూ శిక్షిస్తూ ఉండాలి. టీచర్ అనే వాడిని అందుకే నియమించాలి. ఎంత కఠినంగా అంటే అంత మంచి టీచర్. ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటే అంత మంచి బడి. ఎంత కఠినగొట్టుగా ఉంటే అంత మంచి పాఠ్య ప్రణాళిక. అందుకే పాఠశాల సమయంలో ఆ పాఠాలే చెప్పాలి. అనంతరం ట్యూషన్ల పేర అవే పాఠాలు చదవాలి. సెలవుల్లో అవే పాఠాలు చదవాలి. అలా చదివీ చదివీ మరింకేమీ ఆలోచించవద్దు. అలా చదివే విధానం నుండి పక్కకు తొలగరాదు. అందుకే వేసవి సెలవులలో కూడ ప్రత్యేక బడుల పేర ఎన్‌రోల్‌మెంట్. పిల్లవాడు స్వేచ్ఛగా ఆలోచించే అవకాశం ఇస్తే చెడిపోతాడని, వాడి మనసు ఎప్పుడూ దుష్టబుద్ది కేంద్రమని భావిస్తారు తల్లిదండ్రులు. అది నిజమే అయితే తాము అలాంటి పిల్లవాడిని కన్నందుకు సిగ్గుపడాలి. కాని అది నిజం అని నమ్మి మొత్తం ఒక కృత్రిమ వ్యవస్థని తయారు చేసి వాటిని ఆ బోనులోకి తోసివేసి, తమని తాము రక్షించుకుంటారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు.
పిల్లల ఆలోచనలపై నిఘా వేసి వారిని జడులుగా మార్చాలని చూస్తారు. వారు ఆనందాల్ని సృష్టిచుకోవడం చూసి ఆంక్షలు పెడతారు. పెద్దలకు ఇష్టమైన ఆటలే పిల్లలు ఆడాలి. రైతులు వ్యాపార పంటలే పండించాలన్నట్టుగా కాసుల వర్షం కురిపించే క్రికెట్, టెన్నీస్ ఆటలే ఆడాలని తెలియని వత్తిడి తెస్తారు పెద్దలు. పిల్లవాడి ఆసక్తి, ఆట ఆడే శరీర దార్ఢ్యత ఏదీ ముఖ్యం కాదు. ఆట మైదానానికి ఫీజు కడుతున్నాను కదా అనేది ముఖ్యం. అదే తన బాధ్యత.
అలాగే వేసవి బడిలో వేస్తాం అనేది తల్లిదండ్రుల నిర్ణయం. అభిలాష పిల్లవాడిది కాదు. ఆ కాసిన్ని సెలవు రోజులైనా తల్లిదండ్రులతో కలసి మెలసి హాయిగా గడపాలన్న చిరు కోర్కెకు ఏ రూపంలోనూ గుర్తింపు ఉండదు.
చాలా వేసవి బడులలో పేరుకి కళలు, ఆటలు, కంప్యూటర్ నేర్పిస్తామని చెబుతారు. కాని అంతిమంగా విద్యాత్మక విషయాలను, పాత రొడ్డకొట్టుడు విధానాల ద్వారా క్రమశిక్షణ నేర్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ముప్పై లేదా నలబై రోజుల్లో పిల్లవాడు లోగడ నేర్చుకోని అంశాలు కొత్తగా ఇప్పుడు ఏం నేర్చుకోగలడు? ఈ విషయంలో శాస్ర్తియమైన విధానం ఏదీ పాటింబడటం లేదు. బాలిక లేదా బాలుడికి గల ఆసక్తులు, ఏమిటి? ఎంతవరకు అందులో ప్రవేశం ఉంది? దానికి మరింత నైపుణ్యం జోడించి ఎలా నేర్పాలన్న విషయం చాలా జటిలమైనది. అంత ఓపిక, తీరిక వేసవి బడిలోని శిక్షణ పొందని తాత్కాలిక ఉద్యోగులకు ఉంటుందని అనుకోలేం.
నిజానికి రకరకాల వేసవి బడులు వివిధ వయస్సులు గలవారికి ప్రత్యేకంగా ఉండాలి. కాని అవి లాభసాటి కాదని యాజమాన్యాలు వాటిని ఏర్పాటు చేయడం లేదు. పైగా ఒకే గొడుగు కింద నెలరోజుల్లో పది పదిహేను రకాల అంశాలు బోధిస్తామని చెప్పే బడులు పిల్లవాడికి ఒక కొత్త అంశంలో తర్ఫీదు ఇచ్చి అందులో కొంత పరిజ్ఞానం, నైపుణ్యం కల్పించినట్లయితే ఎంతో మేలు. అంతేకాని 3మాస్టర్ ఆఫ్ ఆల్2 చందంగా తయారు చేయడం సరికాదు. పిల్లవాడిలోని టేలెంట్‌ను గుర్తించకపోవడం నేరం. గుర్తించి దానిని అభివృద్ధి చేయకపోవడం కూడా అందులో భాగమే. పిల్లవాడిలోని నైపుణ్యం సరైన మార్గంలో లేక, పాఠశాల చదువుల చట్రంలో నలిగిపోతుంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలోనే అది గుర్తింపబడి రాణించాలి. కాని ఇక్కడ కూడా అది వెలగని మతాబా అవుతే పిల్లవాడు ఇక ఎదగడు.
ప్రస్తుతం ముఖ్యంగా బాలికలలోని నైపుణ్యాలు వెలికి రావాలి. వాటిని వారి జీవితాంతం మెరుగుపరచుకునే పరిస్థితులన్ని కల్పించాలి. బాలికలకు చాలా అంశాలు సాధారణ పాఠశాల విద్యావిధానంలో నేర్పరు. పైగా చైతన్యం కలిగించదు. వారికి కలిగిన అనేక అనుమానాలను తరగతి గది నివృత్తి చేయదు. పైగా చాలా సందేహాల గురించి మాట్లాడనివ్వదు. వాటి గురించి మాట్లాడడమే తప్పు అని అంటుంది. బాలికల శరీర శుభ్రత, ఆరోగ్యం, రుతు పరిజ్ఞానం వంటి అంశాలు సరైన వయస్సులో నేర్చుకోవడం అవసరం.
సాధారణ విద్యావిధానంలో న్యాయపరమైన అంశాలు, వివిధ రంగాలకి చెందిన హక్కుల వంటి విషయాలు బోధింపబడవు. వాటిని ఇలాంటి వేసవి బడులలో ప్రత్యేకంగా నేర్పించడం సముచితం. కేవలం లలిత కళలే కాదు, ప్రజా కళల పరిచయం, ప్రజాకళాకారులతో కరచాలనం చేయించాలి. ఆదివాసీ సమాజాలను ప్రత్యక్షంగా చూపాలి. భారతీయ శ్రమజీవన సౌందర్యాన్ని, సామాజిక వాస్తవ స్థితిగతుల్ని పరిచయం చేయాలి. విద్య వినోదాల మేళవింపులు ప్రత్యే బడుల కర్తవ్యం కావాలి. ఇంటికి దూరమైన పిల్లల్ని, సమాజానికి దగ్గర చేయడమే వేసవి బడుల లక్ష్యం కావాలి.
వేసవి బడి నడిపించినందుకు యాజమాన్యానికి ఎంతో కొంత గిట్టుబాటు ఉంటుంది. నిజమే. కాని విద్యార్థికి ఎక్కువ లాభం చేకూరాలి. కొత్త కొత్త విషయాలు పరిచయం కావాలి. తద్వారా సమాజానికి మంచి జరిగే వీలు ఏర్పడుతుంది.
సంప్రదాయ చట్రంలోంచి బయపడినప్పుడు మాత్రమే కొంత మేలు జరిగే వీలుంటుంది.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242 jayadhirtr@gmail.com