తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఇప్పచెట్ల కింద ఆకాశం మూలిగె...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనివాసులు దాసరి సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈమధ్యే పదవీ విరమణ పొందారు. ఒక వారపత్రికలో ఆయన తన తొలి పోస్టింగులలో ఆదివాసీ ప్రాంతాలలో పనిచేసిన అనభవాలను సంవేదానాత్మకంగా వరస కథనాలు రాశారు.
సీనియర్ పాత్రికేయులు చెన్నమనేని రాజేశ్వరరావుగారితో వాటి అచ్చు గురించి చర్చించినప్పుడు నాకు వాటిని ఓసారి చూపించాలని అనుకున్నారు. ఆ పుస్తకానికి ‘‘ఇప్ప చెట్టు నీడలో..’’ అని పేరు సూచించాను. ఒక్కొక్కటే ఆ కథనాలని చదివాను. ఆ ముచ్చట్లు ఈ వారం మీతో పంచుకుందామని ఈ నాలుగు మాటలు."Although we are in a different boats you are in one boat. And we share the same river of life''- ఒక ఆదివాసీ కొటేషన్. ఈ కథనాలు- రెండు ప్రపంచాల మధ్య అవగాహన. పరస్పరం అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం. ఒక ‘వీసా’ మాత్రమే అవసరం లేని దూర ధ్రువాలు. ఒక ప్రపంచం నుండి బయలుదేరి కొన్ని కారణాలవల్ల యాదృచ్ఛికంగా మరో ప్రపంచ భూభాగంమీద కాలుమోపిన అనుభవం. మన ప్రపంచంకన్నా భిన్నమైనది గిరిజన లోకం.
అంతకుముందు అలాంటి ఒక భూఖండం ఈ నేలమీదే వుందని తెలియకుండానే అక్కడికి పంపబడిన వ్యక్తి సంవేదన. ఇది వేరు వేరు పడవల వంటి ప్రపంచాలైనా, విభిన్న ధ్రువాల జీవితాలైనా పుట్టుక, చావు, జీవన పోరాటం, సంఘర్షణ ఒకటే. మనుషులమీద దాష్టీకాలు నెరపడమే అమానవీయం. దేశాలను, ప్రపంచాలను తుడిచిపెట్టడానికే మనిషి జ్ఞానం ఉపయోగపడుతున్న క్రమంలో దానిని తగ్గించడానికి మానవుల ప్రయత్నం నిరంతర లోలకం. ఒక అలారం మోత.
జీవిత సహజతలనుండి, మనిషి సహజాతాలు కన్నీళ్లవలె ఉబికి వచ్చే నిర్మలమైన ప్రశ్నలను వినేవారు అతి తక్కువ. వాటికి జవాబులు ఇవ్వలేని అశక్తులే అధికం. వీరు తమ ఈ బలహీనతని దాచిపెట్టుకోవడానికి కృత్రిమ భేషజాలు పోవడమే అమానవీయత. వేల ఏళ్లుగా ఇదే తంతు కొనసాగింది. అధికార మదాంధత, రాజ్యక్రూరత అదేపనిగా ఒక ప్రపంచాన్ని నిరంతరం కుదుపులకి గురిచేస్తూ మనుషుల్ని, జీవజాలాన్ని పర్యావరణాన్ని, మానవ మూల నాగరికతని మనిషి పరిణామక్రమంలో సాధించుకున్న సంస్కృతిని, అనేక విలక్షణ వ్యక్తీకరణలని హరింపచేస్తున్నది. రాజ్య యంత్రంలో శిక్షణ పొంది, కొద్దికాలంలో అందులో ఉన్నంత అలాగే ఆలోచించాలని లేదు. అంత మాత్రాన దాన్ని సవరించుకో ప్రయత్నం చేయడం తప్పుకాదు, అసాధ్యం కాదు.
నిష్కల్మషమైన ఆదివాసీ నికాలస్ మనస్తత్వం చాలు ప్రశ్నించడానికి. తనని తాను జవాబు వెదికే ఆలోచనలో పడేయడానికి. లేదా ఒక సాదాసీదా మనిషి, ప్రేమా ఆత్మీయతల మధ్య పెరిగిన అడుగు వర్గాల వారు ఎదుర్కొన్న, అలాంటివారు వేసిన ప్రశ్నల నేపథ్యంలోంచి నడిచివచ్చిన ‘మనిషి’ వాటిని విని, ఆ ప్రశ్నలకు స్పందించగలడు. అలాంటి మనిషే శ్రీనివాసులు. నిజానికి అధికార ధర్మం అందుకు భిన్నంగా స్పందించమంటుంది. తనదైన బిగింపుల చట్రంలోంచి చూడమంటుంది. ఈ రెంటిమధ్య వైరుధ్యమే అధికం.
ఒక ఐఏఎస్ అధికారి తానొక్కడే కాదు, తనమీద అంతకుముందున్న బిగింపులు, యంత్రాంగ వ్యవస్థ, పనితీరు నమూనా, తన కిందా, తన పైనా అధికారులు, వారు నిర్మించిన నిర్మాణంలోంచి అంత సులభంగా మానవ ధర్మాన్ని కొనసాగించలేడు. జీవితానికి కావలసిన అతి చిన్న వెసులుబాట్ల కోసం, కళ్లతో చూసిన వాళ్ల బాధ, పలికే పలుకులు తట్టిలేపుతాయి. మనిషిని మహాయంత్రం, భూకంపం ఆత్మనీ దేహాన్నీ ఎన్నో కుదుపులకి గురిచేస్తుంది. అలా గురైన అనుభవాలు, సంవేదనలు జ్ఞాపకాల రూపమే శ్రీనివాస్‌గారి ‘ఇప్పచెట్టు నీడలో..’ పుస్తకం.
శ్రీనివాసులుగారి అదృష్టమో, దురదృష్టమో గాని, 1974 ప్రాంతంలో సలసలమంటున్న కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో మొదటి పోస్టింగ్ పొందడం. వందమంది ఐఏఎస్‌లకు ఆప్షన్ ఇస్తే ఎవరూ అక్కడకు వెళ్లడానికి సమ్మతించని వాస్తవం. ఐనా ఈ అధికారి సంతోషంతో పనిచేశాడు. ఐతే అధికార పెత్తనాలకు దూరంగా మనిషిగా ఆలోచించే తత్వం ఉంటుందో అక్కడ రెండు భిన్న ప్రపంచాల మధ్య ఒక అవగాహనకి తెరలేస్తుంది. ఆ తెరని ఆవిష్కరించిన వ్యక్తే శ్రీనివాసులు.
తన మొదటి ఉద్యోగ దశలో తాను ఎదుర్కొన్న అనేక సమస్యలను, ఘటనలను, పరిష్కరించిన తీరుతెన్నులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ జ్ఞాపకాల నెమరువేతలో సైతం రాజకీయం ఉంటుంది. ఆధిపత్య భావజాల భరితంగా ప్రతిబింబిస్తుంది. గతపు గొప్పదనాల ఊయల మత్తు తలకెక్కి అక్షర రూపం దాలుస్తుంది. మనిషి తనలో దాగిన సంస్కరణ భావనల వ్యక్తీకరణ ప్రధానం అవుతుంది. మనిషిగా మరిచి, అధికారిగా మాత్రమే ప్రవర్తించిన వైనం ప్రస్ఫుటం చేస్తారు చాలామంది.
అలా కాకుండా అలనాటి జ్ఞాపకాలని మానవ సంవేదనల వ్యక్తీకరణగా చెప్పినవారిలో శ్రీనివాస్ ఒకరు. సుమారు ఇదేకాలంలో ఆదివాసీ ప్రాంతాలలో పనిచేసిన ఐఏఎస్‌లు సి.సుబ్రహ్మణ్యం, ఫణికుమార్ వంటివారు రాసిన కథనాలు చాలా రోజుల కిందే పుస్తక రూపంలో వెలువడ్డాయి. అదే కోవలో అదే హోదాలో, అదే తరానికి చెందిన శ్రీనివాసులు ఇప్పుడు అలాంటి రూపంలోనే కొన్ని జ్ఞాపకాలను అందిస్తున్నారు.
వీటికి ‘కథనాలు’ (episodes) అని పేరు. కథ అని కొందరు అన్నా, ఆ పదం, ప్రక్రియ వీటికి నప్పదు. కథకు విశ్వవ్యాప్తంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి వీటికి సమానం కావు. ఇతివృత్తంలో కొంత పోలిక కనుపించినా, రూపపరమైన నిర్మాణంలో తేడాలు అనేకం. ఇవి మెమొరీస్‌కీ, డైరీకీ, స్వీయ చరిత్రకీ కొన్ని తేడాలు ఉంటాయి. వీటిని అనుభవ కథనాలు అనడమే సరి. వాస్తవ అనుభవాలు లేకుండా ఇలా రాయడం అసాధ్యం. ఒకరకంగా ఇది నడుస్తున్న వర్తమానం. ఇందులోని పాత్రలన్నీ వాస్తవాలు. అన్నింటికన్నా పెద్ద వాస్తవం రచయిత. అతని స్వీయానుభవం. ఈ రచనలో ఎలాంటి మలుపులు తిప్పే అవకాశం లేదు. కాల్పనికతకి స్థానంలేదు. పాత్ర ప్రధాన వనరుగా ఉండదు. కాని అనేక పాత్రలు వాస్తవక్రమంలో వచ్చిపోతుంటాయి.
అలాంటి వాటిలో రాజేశ్వరి పాత్ర ఒకటి. చలం రాజేశ్వరికి, గోండు ప్రాంతంలోని ఒక బీసీ వర్గానికి చెందిన పదిహేనేళ్ల రాజేశ్వరికి ఎంతో తేడా. అనేక విధాలుగా, అనేక రెట్లుగా ఈ రాజేశ్వరి జవజీవాలున్న పాత్ర. చిన్నతనంలోనే నక్సలైట్లలో కలిసింది. అక్కడ ఆరోగ్యం బాగోలేక తిరిగి పంపితే జనజీవనంలో కలిసిపోవడానికి శ్రీనివాసులు దగ్గరకి వచ్చింది. అది మొదలు ఆమె పాత్ర మనల్ని సినిమా చేసి తిప్పుతుంది. మేనమామతో పెళ్లి జరగడం ఈ కథనంలో చివరి ఘట్టం. నేను ఆ ప్రాంతాలకు వెళ్లినపుడు రాజేశ్వరిని వాళ్ల ఊరికి వెళ్లి ఆమెని చూడాలన్న గాఢమైన కోర్కె కలిగింది. ఇప్పుడు ఆమె చిరునామా ఎక్కడ అని రచయితని అడిగాను. లిఖితపూర్వక కథనానికి వౌఖికంగా చెప్పిన ముగింపు విని ఆశ్చర్యపోయాను. జీవితంలో కూడా ఎంతో రెబెల్ అయిన రాజేశ్వరి తన్ని తాను కాల్చుకుని మరణించిందిట. రాయని కథనంలోని అంతిమ మలుపు నా కళ్ళని చెమర్చివేసింది. ఆమె ఎందుకు అలా దహించుకుందో, ఆమె చివరి క్షణాలలో ఆమె ఆలోచనలు, అనుభవం, వేదన ఏమిటో తెలుసుకోవాలని మరింత పట్టుదల పెరిగింది. ఆమె జీవించిన చివరి ఘట్టం ఎలాంటిది? ఓసారి ఆమె బూడిదైన చోటు చూడాలి. అక్కడికి ప్రయాణించాలి. అలాంటి సజీవ పాత్రలను పరిచయం చేసినందుకు రచయితను అభినందించక తప్పదు.
‘్భమి - భుక్తి’ కథనంలో జంగ్లాత్ డిపార్ట్‌మెంట్ వర్సెస్ ఆదివాసీ హక్కుల సమస్యని విప్పిచెప్పి కళ్లు తెరిపించిన జంగూ పటేల్ మరో మరపురాని పాత్ర. అతని అనుభవం తర్కం అధికారులను విస్మయపరుస్తుంది.
ఆదివాసీ ప్రపంచం విలువలు, విశ్వాసాలు, మానవీయ కోణం అంతా వేరే. మనం కోల్పోయిన మహత్తర గుణాలవి. సీలింగ్ చట్టం రావడంతో మిగులు భూముల్ని ఐదెకరాల చొప్పున గిరిజనులకు పంచి ఇచ్చారు. భూమి ఇస్తే లాభం లేదని ఇరిగేషన్ బావులు తవ్వించి నీళ్లు పారించుకోవడానికి ఆయిల్ ఇంజన్లు ఇచ్చారు. అది ప్రభుత్వం చేసిన పని. తప్పులేదు. గొప్ప పనే. కాని ఆదివాసీ ప్రపంచం కోణంలో అది పిచ్చిపని. అర్థవిహీనమైన చర్య. ఎందుకంటే- తమకు ఇచ్చిన భూములు నిన్నటివరకు వేరేవాళ్లవి. ‘‘వాడి నోట్లో కూడు తీసి మమ్మల్ని తినమంటారేంటి సాబ్! అది రక్తపు కూడు’’ అని నిక్కచ్చిగా చెప్పారు. మళ్లీ మరో చట్టం తెచ్చో, కోర్టు ఆర్డర్ తెచ్చో, లంచాలు తిని గిర్దావర్లో తిరిగి పట్టేదార్‌కి ఎప్పుడు ఇస్తారో మీకే తెలియదు అన్నాడు. ఎంతటి అధికారైనా ఏం చెప్పగలడు.
అందుకే ఆ భూములు దున్నలేదు. ఆయల్ ఇంజన్‌ల బాక్సు విప్పలేదు. ఎందుకొచ్చిన తంట అనుకున్నాం అన్నాడు జంగు. అందుకే మా ప్రపంచంలోని సహజ స్వేచ్ఛ ప్రకారం పొడుగొట్టుకుని వ్యవసాయం చేసుకుంటున్నాం. ఐతే జంగ్లాత్ వాళ్లు అడవిని నరుకుతున్నామని మమ్మల్ని జైల్లో పెడతామంటున్నారు. మావల్ల అడవి పెరుగుతుంది. కొట్టిన చోట మళ్లీ చెట్టు మొలుస్తుంది. అనాదిగా ఇది ఆదివాసీ, ప్రకృతిమధ్య ఒప్పందం. దీన్ని తప్పని అనకండి అన్నాడు. ఈ ప్రశ్న మరో రూపంలో-
"Most governaments in Latin America have failed to recognise the rights of Tribal people and their own traditional Territories''- అంటాడు james saul. అది లాటిన్ అమెరికా కావచ్చు. ఆఫ్రికా ఖండంలోని దేశాలు కావచ్చు. జంగుపటేల్ వారందరి ఆక్రోశాన్ని జమిలిగా ప్రకటించాడు.
గోండు గూడేలు మనలాంటి చదువుకున్న వాళ్ళకి పాఠశాల గదులు. శాస్ర్తియ జ్ఞానాన్ని ఇచ్చే ప్రయోగశాలలు.
గిరిజనులను జ్వరాలు పట్టి పీడిస్తుంటే వైద్యశాఖాధికారులు అక్కడకు వెళ్ళారు. పైగా సరైన మందులను వారికి ఇవ్వరు. నిజానికి అప్పుడు వారికి కావలసింది ఆహారం. సెప్టెంబర్ / అక్టోబర్ మాసాలలో తిండి గింజలు నిండుకుని ఉంటాయి. ఆదివాసులు ఎవరినీ చేయి సాచి అడగరు. పస్తులుంటారు. పైగా జ్వరాలు. అందుకే ఆ సీజన్‌లో వారికి తిండి గింజలు సరఫరా చేయడం తక్షణావసరం. కడుపు మలమల మాడుతుంటే, ఆకలి పుట్టించిన రోగాల్ని ఏ మందులు బాగుచేస్తాయి. రోగనిరోధక శక్తి పెంచే చర్యలు ఓ పక్క సాగాలి అని శ్రీనివాసులుగారు చేసిన పరిశీలన సరైంది.
బ్యాంకుల రుణాల మతలబుని ‘అక్కరకు రాని చుట్టం’ కథనంలో శివయ్య అనే వ్యక్తి, బి.ఎ చదివిన అతని కొడుకు అనుభవంలోంచి స్కాన్ చేశారు. అవసరకాలానికి అందని రుణాలు తలకుమాసిన బరువులే అని రుజువు చేసి చెప్పిన వైనం ఒక చక్కని ఆర్ట్ సినిమా ఇతివృత్తం.
నిజానికి ఒక చిన్న రోడ్డు వేయించడానికి అన్ని అధికారాలు వున్న జిల్లా సహాయ కలెక్టర్ స్థాయి అధికారి మానసికంగా ఎంత నుజ్జునుజ్జు కావాలో తెలుపుతుంది. చేసే పనిలో నిజాయితీ, ప్రజల ప్రయోజనం ముఖ్యం. నిజానికి ఇలాంటి అనుభవాలు ప్రజలకు తెలియడం అవసరం. ఈ పుస్తకం చదివితే ఒక మెట్టు పెరుగుతాం. అదే ప్రయోజనం.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242