తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

రామప్పలు నేలరాలడం.. అశుభ సూచకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడేళ్ళ తరువాత రామప్ప తప్పక రమ్మని పిలిచింది. తొవ్వ పట్టాను.
ఈసారి మరింత దీనంగా, మరింత ఆగ్రహంగా.
మొదటిసారి పిలిచినప్పుడు రామప్ప ఆలయం చుట్టుప్రక్కల దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన కాలువ తవ్వడానికి శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో సొరంగం పనులు జరుగుతున్నాయ. ఒక కిలోమీటర్ దూరంలో వున్న ఇళ్ల పైకప్పులు పడిపోయాయి. పునాదులలో కదలికలు వినిపించాయి. భూకంపం వచ్చినప్పటి పరిస్థితి ఏర్పడింది. పైగా నిరంతర పేలుళ్ల వల్ల దుమ్మూ ధూళితో వీథులు నిండిపోయాయి. గ్రామంలో వున్న అన్ని వర్గాల ప్రజలు బెంబేలెత్తారు. పునాదులతో కట్టుకున్న ఇటీవలి ఇళ్ళే గడగడలాడుతుంటే, సుమారు 800 ఏళ్ళ క్రితం ఇసుక పునాదులపై కట్టిన రామప్ప నిర్మాణం ఏమవుతుందని ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.
వారికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆనాటి ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో కనిపించిన ప్రతి ప్రాజెక్టును చేపట్టి కాంట్రాక్టర్లకి పనులతోపాటే డబ్బు కట్టబెట్టింది. వారు ఆడింది ఆట పాడింది పాట. ప్రభుత్వ శాఖాధిపతులు చెప్పినట్లు ఆడాల్సిందే. ప్రజలు ఎంత వద్దని మొత్తుకున్నా వినలేదు. కోట్ల రూపాయలు వృధా అవుతాయనే నెపంతో రామప్పలో వున్న అనేక ప్రాచీన కట్టడాలు కళ్లముందే కూలిపోతున్నా లెక్కపెట్టలేదు. నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన దొంగ నివేదికలను జనం బహిర్గతపరిచారు. వారి మోసాన్ని నిజాయితీగా ఎండగట్టారు.
అదో అప్పుడు మమ్మల్ని రామప్ప మళ్లీ పిలిచింది.
హైదరాబాదు నుండి తరలివెళ్లిన రచయితలు, కవులు, కళాకారులు రామప్ప పరిరక్షణ వేదికగా ఒక్కటయ్యారు. ప్రజల సహకారంతో, వారి నేతృత్వంలో వేదిక పనిచేసింది. అనేకమారులు రామప్పని సందర్శించి ఎప్పటికప్పుడు ఆపదని అంచనా వేసి శాస్ర్తియంగా అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది.
ఆ ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక ప్రజలు, నాయకులు, పరిరక్షణ వేదిక అధ్యక్షుడిగా వ్యవహరించిన మా వంటివారిని సైతం బెదిరించారు. నయాన, భయాన, సామదాన భేద దండోపాయాలు ప్రయోగించారు. ఇంటి నుండి బయలుదేరి ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్ మీటింగ్‌కి హాజరై వస్తుంటే మాట్లాడాలని తీసుకెళ్లి ఆకర్షణీయమైన బ్యాగులు చూపించి, మీకెందుకండీ అనవసర శ్రమ! అని ఉపశమన మంత్రం జపించారు. వారి వలలో పడి మహత్తర రామప్ప శిల్పకళాఖండాలను భూస్థాపితం చేయదలచలేదు. ఆ ఆలయ కట్టడం పైన కురిసిన నీరు దాని కంటినుండి కారిన అశ్రువుల్లా కనుపించాయి. మరింత కఠోర నిర్ణయంతో దానిని కాపాడడానికే సిద్ధమైనాం. చివరకు అనేక మీటింగులు పెట్టాం. ధర్నాలు చేశాం. కరపత్రాలు అచ్చేశాం. ‘800 ఏళ్ల రామప్ప’ అనే ఒక పుస్తకం వేసి అనేక ఆవిష్కరణ సభలు జరిపాం. చివరకు ప్రజల విజయం పునాదిపై తాత్కాలికంగా రామప్ప బతికి బట్టకట్టి మీసం మెలేసింది. కాని దాని ఆనందం ఎంతోసేపు లేదు. ఉమ్మడి పాలకుల అశ్రద్ధ అదే విధంగా నేటికీ కొనసాగుతోంది. మూడున్నరేళ్లయినా దానిని పట్టించుకోలేదు. ఆలయం పైకప్పునుండి కారుతున్న నీళ్ళను అరికట్టడానికి ఇచ్చిన పద్దెనిమిది లక్షలు (?) పైపైనే నాకేశారు. మరింత ఉరుపు పెరిగింది. తెలిసినవారు ఆలయంలోకి ప్రవేశించాలంటే భయపడుతున్నారు.
ఈలోగా ఎనిమిది వందల ఏళ్ల క్రితం కట్టిన ఆలయ ప్రాకారం, రాతి గోడలు ఒక్కో వైపునుండి నేలరాలుతున్నాయి. ప్రధాన ఆలయం వెనుకవైపు ఉన్న మరో ఆలయం భాగాలను బలవంతంగా ఊడదీసి పడేశారు. వర్షానికి, బురదలో అవి కూరుకుపోయి చూడడానికి వీలు లేకుండా మట్టిలో దిగబడిపోయాయి. రామప్ప కట్టడం చుట్టూ నిరంతరం నీరు నిలిచి భూమిలోకి ఇంకడంవల్ల ఓవైపు ఏటవాలుగా కుంగిపోవడం గమనించాలి. రామప్ప పరిసర ఆలయాలు కూడా రోజురోజుకు, గంట గంటకు శిథిలమవుతున్నాయి. ఈ ఆలయాలపై వృక్షాలు, గడ్డీ గాదం పేరుకుపోయి బరువుకి కుంగిపోతున్నాయి.
రామప్ప కట్టడాన్ని పట్టించుకోని ఉమ్మడి పాలకుల అశ్రద్ధని సాకుగా చూపి ఎన్నో ఉద్యమాలు చేశాం. రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆనాడు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న 14 మంది ఈనాడు ప్రభుత్వంలో పదవులు అలంకరించి ఉన్నారు. వారు ప్రజాధనంతో జీతభత్యాలు, హంగు ఆర్భాటాలు పొందుతున్నారు. కాని వారిలో ఏ ఒక్కరు కూడా ఒక్కమాట మాట్లాడడంలేదు. వాస్తవ విషయాన్ని చెప్పడానికి జంకుతున్నారు. ఇది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఏమంత మంచి సంకేతం కాదు. వారందరు కలసి అయినా, ఉమ్మడిగా లిఖితపూర్వకంగా అయనా ప్రభుత్వం దృష్టికి వాస్తవ పరిస్థితికి తీసుకుని రావలసి వుంది. లేనిపక్షంలో వారు అధికార పీఠంలో ఉండగానే రామప్పకి జరిగే వినాశానికి జవాబుదారులుగా చరిత్రలో మిగిలిపోక తప్పదు.
చాలామంది పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ, పర్యాటక శాఖల మధ్యగల తేడాలను తెలుసుకోవడంలేదు. పురావస్తు శాఖ మాత్రమే పురా కట్టడాలను కాపాడాలి. వారికే ఆ అనుమతి ఉంటుంది. దేవాదాయ శాఖ ఆలయంలో హుండీని ఏర్పాటు చేస్తుంది. పర్యాటక శాఖ హరిత హోటళ్లు, రెస్టారెంట్‌లు నిర్మించి ఆదాయం, ఆస్థులు సంపాదించుకుంటుంది. పోతే ఈ మూడు శాఖల అధికారుల సమన్వయం ఏనాడూ సరిగా లేదు. నిజానికి ఏదైనా లాభం ఉంటే ఏ శాఖ తన ఖజానాలోనే వేసుకుంటుంది. ఇలాంటి చోట్ల ఆ ఆదాయంతో ప్రత్యేక కేసుగా ప్రకటించి, ఆలయం అభివృద్ధికి ఖర్చు చేయాలి. అందుకు ఒక పథకం రూపొందించాలి. కాని ఆ ఆలోచనే ఉండదు. ఎవరికి పుట్టిన బిడ్డరా అని వదిలేయడం సరికాదు. పాలకుల మధ్య, శాఖలమధ్య సమన్వయ లోపం కూడా శైథిల్యతకు దోహదం చేస్తున్నది.
అంత పెద్ద పర్యాటక, ఆలయ ప్రాంగణంలో స్ర్తి పురుషులు, పిల్లలకు, దివ్యాంగులకు సౌకర్యాలు సరిగా లేకపోవడం కూడా గుర్తించడంలేదు. అంత పెద్ద శిల్ప కళాఖండాలు ఉన్న చోట సెక్యూరిటీ కూడా తగినంతగా లేదు. ఏవైపునుండి ఎంతమంది అయినా వచ్చి శిల్పకళాఖండాలు దోచుకుపోవచ్చు. అందుకే ఒక్కొక్క గోడ కూలిపోతున్నదని ప్రజలకు సందేహం వస్తున్నది. ఈమధ్య గుట్టలు పగులకొట్టి క్వారీలుగా చేసి ఒక్క రోజుకు వందలాది గ్రానైట్ శిలలను లారీలపై ఎగుమతి చేస్తున్నారు. ఈ రాళ్ల మాటున ఎన్ని శిల్పాలు జిల్లా, దేశం సరిహద్దులు దాటుతున్నాయో అనే సందేహం కలుగుతూ ఉంది. చారిత్రక సాక్ష్యాలు, కోటలు, గుడులు, కట్టడాలు ఉన్న విలువైన గుట్టలు, కొండలను తవ్వుకోవడానికి, పర్యావరణ విధ్వంసం చేయడానికి, ప్రకృతిని తుత్తునియలు చేయడానికి ఉమ్మడి పాలనలోని విధానమే ఇప్పుడూ హాయిగా కొనసాగుతున్నది. ఆనాడు కూడా ఇందుకోసం పోరాడినవారు ఇవ్వాళ అధికారంలో ఉండి కిమ్మనకుండా ఉన్నారు. వామపక్ష మేధావులు ఇలాంటి సమస్యలని పట్టించుకోరు. పర్యావరణ ప్రకృతి విధ్వంసాలకు వ్యతిరేకంగా పోరాడడం లేదంటే ఏమని అర్థం చేసుకోవాలి.
పోయిన నెలలో తెలంగాణ ప్రభుత్వం రామప్పపై యునెస్కోకి నివేదిక తయారు చేయడానికి మూడు లక్షలు మంజూరు చేసింది. ఆ నివేదిక తయారుకావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది. దానిని రాష్ట్రప్రభుత్వం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. కేంద్ర ప్రభుత్వం దానిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాఖ వారి పరిశీలనకు పంపిస్తారు. వారి వద్ద గల అనేక నివేదికలలోంచి ఏడాదికి ఒకటీ అరా యునెస్కో వారికి పంపుతారు. ఇందుకు సుమారు నాలుగైదేళ్లయినా పడుతుంది. వందలాది దేశాల నుండి వచ్చిన ఇలాంటి వేలాది నివేదికలనుండి యునెస్కో కొన్నింటిని తన వీలుగా టేకప్ చేస్తుంది. అంటే గింటే అది సాధ్యమైతే ఓ పదేళ్లకి పని మొదలవుతుందేమో! చార్మినార్, గోలకొండ కోట, పైగా టూంబ్స్ వంటి వాటి నివేదికలనే యునెస్కో తన ప్రాధాన్యతా అంశంగా భావించలేదు. రామప్ప ఒక లెక్కా? అప్పటిదాకా సొరంగం కోసం పేల్చిన పేలుళ్లవల్ల, రామప్ప పునాదులలో ప్రకంపనల ప్రభావంవల్ల మెల్లిమెల్లిగా కుంగి కుంగి, వంగి, పడిపోయే అవకాశం వుంది. ఆ ఆపదనుండి తప్పించాలంటే వెంటనే రామప్ప మరమ్మతు పనులు వేగిరవంతం చేయాల్సిందే.
తెలంగాణ వచ్చాక మూడున్నరేళ్ల కాలం తక్కువదేమీ కాదు. పరిరక్షణ రంగంలో ఎంతో కృషి జరగవలసి వుండగా ఎలాంటి స్పందన లేకపోవడం శుభస్కరం కాదు. ప్రభుత్వం లాభసాటి వ్యాపార భావనకు దూరంగా ఉంటుంది. ‘గిరి’పదం తీసి ‘అద్రి’ పదం పెట్టినంత మాత్రాన యాదగిరికి వచ్చేదేమీ లేదు. పోయేదేమీ లేదు. కాని దానికోసం వెచ్చించే వేలాది కోట్ల డబ్బులో రామప్పకీ దాని వంటి కొన్ని శిథిల ఆలయ జీర్ణోద్ధరణకి ఖర్చుపెట్టవచ్చు. కాని పాలకులు ఆ పనికి సిద్ధంగా ఎందుకు లేరో ఆలోచించాలి.
ఈ దేశంలో జైన, బౌద్ధ నిర్మాణాలు భూమిలో కలిసిపోయిన విషయం గుర్తుంచుకోవాలి. వైష్ణవ రాజులు, శైవమత రాజులు తమ రాజ్యపాలనా కాలాలలో తమ తమ మతానికి చెందిన ఆలయాలనే నిర్మించారు, ఉద్ధరించారు. నిలిపారు. ప్రజాస్వామిక దేశాలలో, కాలాలలో అలాంటి భావన ఏ మాత్రం సరికాదు. ఈ విషయంలో అధినాయకులకి, ఆయన చుట్టూ ఉన్న పరివార పెద్దలు ఒక్క మాటైనా విప్పి చెప్పవలసి ఉంది.
మత దృష్టితో రామప్పని చిన్నబుచ్చకండి. శిల్ప దృష్టితో, చారిత్రక దృష్టితో చూడండి. అప్పుడు వేల కోట్లు ఎలా సర్దాలో తెలుస్తుంది. ఒక్క ఆలయాన్ని, ఒక్క దేవుడినే అభివృద్ధి చేస్తే ఎలా? ఈ నేల మీద వేల దేవుళ్లున్నారు. వాళ్లని నమ్మే కోట్లాది ప్రజలు ఉన్నారు. ఈ విషయం మరిచిపోరాదు.
ఎందుకోగాని కాకతీయులు నిర్మించిన శైవాలయాలైన వెయ్యి స్తంభాల గుడి, ఘణపురం గుళ్లు, రామప్ప, జాకారం గుళ్లు ఒక్కొక్కటే క్షీణదశకు చేరుకుంటున్నాయి. ఇది అశుభ సంకేతం.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242