తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ప్రజలతో మమేకం.. ఏకైక ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య వామపక్ష పార్టీలు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల కోసం ప్రయత్నాలు జరుపుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో ప్రయోజనం కోసం ఆలోచనలు చేస్తున్నారు. తమ తమ అనువైన పద్ధతులలో వాటికి రూపకల్పన చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల పార్టీలు పొత్తుల గురించి ప్రయత్నాలు ప్రారంభించాయ.
బిజెపి, టిడిపి రెండు జాతీయ పార్టీల మధ్య అవగాహన ఒకవైపు. ఒక్కోసారి విడిపోయేంత వింత ప్రకటనలు. మరోసారి మేం కవలలం అన్నంత ఆత్మీయ బంధాలు.
యంఐయం, టిఆర్‌ఎస్‌ల ‘కట్‌బంధన్’ జన్మజన్మల అనుబంధం అన్నంతగా నిన్న అసెంబ్లీ సాక్షిగా గాఢానుబంధ ప్రదర్శన. మరోవైపు అతి విచిత్రంగా సీమాంధ్ర ప్రాంతం నేతల ప్రయోజనాల కోసం ఒక సామాజిక వర్గం పెత్తనం కోసం పురుడు పోయించిన పార్టీ తెలంగాణలో సింహగర్జనలు చేసింది. ఆ తరువాత తోకముడిచి, ఇప్పుడు టిఅర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తామని, చేస్తే తప్పేముందని, ముందస్తుగా స్నేహహస్తం చాచింది. ఈ విషయం గురించి కాదు, కూడదని ఆ పార్టీ హైకమాండ్ ఒక్కమాట ఏదీ పలకలేదు. అది గమనించవలసిన ప్రాధాన్యమైన అంశం.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి దిన దిన గండంగా ఉంది. జగన్‌బాబు చేసే కొన్ని ప్రయత్నాలు ఫలితం పాలు ఇవ్వని స్తన్యాల్లా ఉన్నాయి. ఐతే ఆ ప్రయత్నాలు ప్రజలలోని అసంతృప్త వర్గాలని అలాగే ఉంచగలుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ పార్టీ ఎవరితోనూ చేతులు కలపకపోతే చేతులు ముడుచుకుని కూర్చోవలసిందే. ఆ రకంగా చంద్రబాబుది ఒకడుగు ముందు. ఇలాంటి అడుగే ఆనాడు శత్రు పార్టీగా, పార్టీగానే తాను గుర్తించని బిజెపితో కలయికకు పచ్చజెండా ఊపాడు. అదే బంధాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కొనసాగిస్తున్నాడు. జగన్‌బాబుకి మాత్రం తనకు తానే ముందు కనుపిస్తాడు. మరెవరూ కానరారు. ఈ తత్వమే ‘ఒంటరి’గా చేస్తున్నది. రాజకీయాలలో ఒంటరితనం ఓటమికి దారి.
ఇక్కడ తమిళనాడు రాజకీయాలు ఓసారి గమనించాలి. సినిమా నాయకులే కావచ్చు, నటులకి ఇంత స్పష్టమైన రాజకీయ భావాలు ఉంటాయా అని విస్తుపోయేంతగా తమ భావాలను ప్రకటిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో తనకు సాటి మరోటి లేదని నిరూపిస్తున్న అధికార పార్టీని వీళ్లు ఎదుర్కొంటున్న తీరు ప్రజలను ఆలోచింపజేస్తున్నది. పవనిజం ప్రవేశపెట్టిన పవన్‌కి ఇంకా ఒక ప్రత్యేక ఇజం, ఇమేజి లేకుండా ఏవేవో ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. తన మద్దతు... ధరకా, తనకోసమా, ప్రజల కోసమా ఏదీ ఎక్కడా తెలుపలేదు. ఇంకా తేలలేదు. ప్రతిదీ బాహాటంగా ప్రకటించే కమల్‌హాసన్, ప్రతి అంశాన్ని ఆలోచనని రహస్యం చేసే పవన్‌కి మధ్య తేడా బోలెడు. కమల్ దెబ్బకి మోడీ కరుణానిధిని విశ్రాంతి కోసం ఢిల్లీలోని తన ఇంటికి ఆహ్వానించడంలో అర్థం ఏమంటే రాజకీయాలలో రాబోయే ఎన్నికల కలయిక గురించి మాట్లాడుకుందామనే.
తెలంగాణలో కాంగ్రెస్‌కి బలం ఉంది, కాని నాయకుడు లేడు. చాలామంది నాయకులు ఉండడం దాని బలహీనత. వీళ్లకు ఒక ‘చుక్కాని’ కావాలి. రథసారధి కూడా అవసరం. కాని ఆ పార్టీలో ముఖ్యమంత్రులు ఎక్కువ. బలాన్ని బలహీనతలోకి మార్చుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. తమతో టిఆర్‌ఎస్ కలిసివస్తే బాగుండునని ఆ పార్టీ భావిస్తుంటుంది. అసమ్మతి ఓట్ల మీదే ఆశ. అదే దాని అదృష్టరేఖ.
ఇప్పుడు, ఇక్కడ, కాంగ్రెస్, బిజెపియేతర రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎక్కువ ఆలోచనలు జరుగుతాయి. సభలు, సమావేశాలు మొదలయ్యాయి. ఏదీ కొలిక్కిరాదు. వచ్చినట్లు అనిపిస్తుంటుంది. కాని ఆ ఎఫెక్టు ఎక్కడా కనిపించదు. ఐనా నిర్విరామంగా కృషి జరుగుతుంటుంది.
* * *
ఇంతకీ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అంటే ఏమిటి?
విప్లవ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు ఒక చోట, ఒక వేదికపై కలవగలగడమే ప్రత్యామ్నాయం. సైద్ధాంతికత హెచ్చి, సమాజానికి, ఆచరణకి దూరం కావడం గత మూడు దశాబ్దుల అనుభవం. తమలో తామే చీలక కాదు. ఈ పార్టీలు ప్రజలను కూడా చీల్చక తప్పదు. అది అనివార్యం. కాని ప్రజలు అలా చీలిపోవడానికి ఎంతవరకు అంగీకరిస్తారన్న చిన్న అనుమానం ఆ మేధావుల బుర్రకి తట్టదు. ఈ చీలిక భావన బూర్జువా పార్టీలకు, పాలక వర్గాలకి, కులాలకి ‘శ్రీరామరక్ష’. కమ్మ పార్టీ, రెడ్డిపార్టీ, బ్రాహ్మణ పార్టీ, వెలమ పార్టీలే ఈ చీలికల అసలు లబ్ధిదారులు. సకల శ్రామిక ప్రజల ఐక్యత కోసం పోరాడాల్సినవారు అంతిమంగా వారిని చీల్చుకుంటారు. మిత అతివాదం అనే ఒక ‘ఎత్తుగడ’ కోసం మొదట సైద్ధాంతిక చీలిక తెచ్చి, అంతకుముందెన్నడూ లేని అప్రధాన సమస్యని ప్రధానం చేసి కలుసుకోలేనంతగా విడిపోయి, విడివిడి కోటలు నిర్మించుకుంటారు. అన్ని కోటలు ప్రభుత్వాల అణచివేతకి బావురుమంటుంటాయి. ప్రతి దాడిని నిరసిస్తూ అస్తిత్వ ప్రకటన గావిస్తుంటాయి. కాని తిరిగి కలుసుకుందాం అనుకోవు. మనసులో ఉంటుందేమో తెలియదు. కాని అవి చారిత్రక అవసరాన్ని, ఒత్తిడిని సైతం గమనించడం లేదు.
ఈ నేపథ్యంలో ‘సెట్ బ్యాక్’ అయిన ప్రతిసారి ప్రజాస్వామ్యవాదులు కలసి రావాలని అందరూ డిమాండ్ చేస్తారు. తత్కాల ఉపశమన చర్య తీసుకుంటారు. దీర్ఘకాలిక ఆలోచనలు ఉంటే ఎంత బాగుండునని ప్రజలు అనుకోని దినం ఉండదు.
ఏ పార్టీది సరైన పంథా అనేది ఆచరణలో తేలుతుంది. ఐతే ఎవరి ఆచరణ వారిదే. మరొకరు ప్రశ్నించవద్దు అని అనుకోవడం వ్యక్తివాదం. మన ఆచరణలో ప్రజలు స్వేచ్ఛాయుత శక్తులుగా ఉండాలి. వారిని ఆలోచింపజేస్తూ, వారి ఆలోచనలను స్వీకరించి చర్చించగలగాలి. ఈ చర్చలకు రాజకీయ సైద్ధాంతికత ప్రధానమా? సమాజ వాస్తవికత ముఖ్యమా అని తేల్చుకోవాలి. కేవలం సిద్ధాంతాలతో మాత్రమే సమాజాన్ని నిర్మించడం కష్టం. సమాజాన్ని మార్చాలంటే అది ఉన్న వాస్తవ పునాదులను మొదట గుర్తించాలి. పునాది శక్తినీ, బలహీనతని అర్థం చేసుకోవడమే నేటి అవసరం.
ఎన్నికల పేరుతో అధికార కైవసం కోసం శత్రు పార్టీలు ఏకం అవుతున్నాయి. ప్రజల బతుకు కోసం, వారి బాగుకోసం ప్రత్యామ్నాయ శక్తులు ఒక గొడుగు క్రిందకు రావడం లేదు. ఈ గొడుగు ఒకటి రూపొందాల్సిన అవసరం ఉంది. వర్షం, పిడుగులు పడుతున్నప్పుడు పులులూ, జింకలూ ఒకేచోట రక్షణ తీసుకుంటాయి. అట్లాంటిది వివిధ అభ్యుదయ, విప్లవ, వామపక్ష శక్తులు, ప్రజలు ఒక నీడన కలుసుకోవాలి. వర్షం అనే కల్లోల కాలం ఏర్పడే లోపల మరింత సురక్షిత శిబిరంలోకి మరలగలగాలి. అదీ సైద్ధాంతిక శక్తి. ప్రజాస్వామిక లక్షణం.
ప్రత్యామ్నాయ శక్తుల అనైక్యత ప్రజలలో చీలికలనే కాదు, వారిని శత్రు శిబిరానికి తరిమేట్లు చేస్తున్నదని గ్రహించాలి. శకల వాదం నుంచి విముక్తి కలిగితేనే ప్రత్యామ్నాయ ఏకైక శక్తికి స్థానం లభిస్తుంది.
ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రత్యామ్నాయం ఏర్పడకపోతే రాజకీయ ప్రత్యామ్నాయం రూపొందజాలదు అని తెలుసుకోవాలి. భావ సారూప్యత, సాంస్కృతిక ఏకీకరణ సాధన దిశగా ముందుకు అడుగులు పడాలి. అనేక చీలికలుగా ఉన్న సమాజంలో రాజకీయ ఆలోచనలు, పార్టీలుగా విడగొట్టబడడం సరికాదు. ఐక్యత సాధ్యం కాకపోతే సమాజం యథాతథంగా ఉండిపోతుంది. యథాతథ స్థితిలో బలం ఎప్పుడూ బూర్జువా శక్తులదే. విడగొట్టబడిన ఓటు బ్యాంకు అధికారం బదలాయింపుకే పనికి వస్తుంది. పోటీ అంతా ఈసారి నువ్వా నేనా అని. నీవుకాకపోతే నేనే. మరొకరు కాదు అనీ అర్థం.
ప్రస్తుతం ప్రజాశక్తులు విడివిడిగా ఉండటం వల్ల ఏమీ సాధించలేవు. నిరంతరాయంగా బలహీనపడడం తప్ప. పార్టీలు, నిర్మాణాలు డీలాపడడం ప్రజలు ముందే పసిగట్టగలరు. చేతులు కాలాక మొదలుపెట్టే ప్రయత్నాలు ఏవీ సఫలం కానేరవు.
సామాజిక అంతరాలు, సాంస్కృతిక వైరుధ్యాలను పెంచుతూ వాటివల్లే బలపడాలని చూసే పాలక వర్గాల కబంధ హస్తాలనుండి ప్రజలను ఎలా విముక్తం చేయాలి. ముందు మన బలహీనతల నుండి, అహంభావాలనుండి, సైద్ధాంతిక పునరేకీకరణ దిశగా విముక్తం కావాలి. సమాజం పునాదిలో ‘సమభావన’ పెంచే దిశగా ఐక్య ప్రయత్నం మొదలుపెట్టడానికి ‘ముహూర్తం’ ఎప్పుడో వచ్చింది. దానిని గుర్తించే వాస్తవిక దృష్టికి ఏ మాత్రం దగ్గరగా ఉన్నాం అని ఆలోచించుకోవాలి.
ఇది తుఫానుల కాలం. చెట్టు నీడలు సరిపోవు. పేలికలు వున్న గొడుగు పనిచేయదు. నాలుగు కాదు పది ద్వారాలున్న శిబిరం క్షేమకరం కాదు. భావసమత్వం ఎలా సాధించాలన్న ఆలోచనతో పునఃప్రారంభం కావలసి ఉంది.
ఎక్కువ శాతం ఉన్న ప్రజారాశులు ఒక్కటైతే ఎన్నికల్లో కాదు ప్రజారాజ్యాధికారం దిశగా అడుగులు పడతాయి. ఆ క్రమంలోనే పాత సమాజాన్ని మార్చే వీలుంటుంది. అప్పుడు జరిగేదే ప్రజాపోరాటం. ఆ ముందు జరిగేవి తాత్కాలిక పోరాటాలు అని చరిత్ర చెబుతున్న వాస్తవం.
కేవలం వామపక్షాల ఐక్యత సరిపోదు, అశేష ప్రజారాశుల పాత్ర లేకుండా అది సాధ్యం కాదు.
అందుకే ఆలోచనలు ఆగిపోవద్దు.
నిరంతరం కొనసాగాలి. ప్రయత్నాలు కూడా.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242