తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

పెళ్లి వేడుక.. మానవీయ అనుభూతుల వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్న ఒంగోలు లో పెళ్లి, నిన్న రాత్రి హైదరాబాద్‌లో ఒక విందుకి హాజరయ్యా ను. అంతకు ముందు టీ వీల్లో రెండు పెళ్లి ఫంక్షన్‌లు ‘లైవ్’ చూ శాను. వాటి గురించి ఈ వారం నా అభిప్రాయం చెప్పడం అవసరం అని భావించాను.
పెళ్లి క్రతువు. అదిప్పుడు వేడుకగా మారింది. ఆ వేడుక ఇప్పుడు వినోదంగా కుదించుకుపోయింది. ఈ మార్పులలో హోదాలు చూపుకోవడం కోసం మాత్రమే పెళ్లిళ్లు జరుగుతున్నాయా అనిపిస్తుంది. పెళ్లి కార్డులకి ఒక్కొక్కదానికి వెయ్యి రూపాయలుపైగా ఖర్చుపెట్టి పంచిపెడుతున్నారు. ఇక్కడ నుండి దుబారా ఖర్చు మొదలవుతుంది. వాటి పంపిణీ కోసం కార్లు, బైకులు, స్పీడు పోస్టులు పరుగెత్తాలి. కార్డులమీద పిలిచేవారి పేర్లు ప్రింట్ అయ్యేవి. కాని ఇప్పుడు పెళ్లికి ఆహ్వానించే అతిథుల పేర్లు కూడా అచ్చేస్తున్నారు. లోగడ పెళ్లి కార్డుకి నాలుగు వైపులా పసుపు, కుంకుమలు, ఇంత సెంటు పూసి అంటించేవారు. అది ఒక పరిమళం మోసుకొచ్చేది. ఇప్పుడు కార్డులు బరువుని మోసుకొస్తున్నాయి. ఒక అచ్చయిన వంద పేజీల పుస్తకంలా, కేటలాగుగానో పెళ్లికార్డు డిజైన్ చేస్తున్నారు. రకరకాల రంగురంగుల పేపర్ల, కార్డుల, ప్రింటింగు కళకళలు, చక్కని రిబ్బన్లతో ముడివేయబడుతున్నాయి... ఎనె్నన్నో రకాలు. ఒకాయన ఏమన్నాడంటే- ఒకరి భోజనానికి ఎంత ఖర్చు పెడితే అంతే ఖర్చుతో పెళ్లి కార్డు వేయించాలట. ఇది ఇప్పటి పెళ్లికార్డుల సూత్రం.
నిన్నటి పెళ్లిలో మరో మిత్రుడు చెప్పింది వింటే ఆశ్చర్యపోయాను. ఇలాంటి వేలాది రూపాయలు ఖర్చుపెట్టి తయారుచేసిన కార్డులు ఒక్కరికే రెండు మూడు పోతున్నాయి. పెళ్లి కుమారుడి లిస్టులో, ఆయన తండ్రిగారి లిస్టులో, ఆ పెద్దాయన ప్రభుత్వ హోదాకి మరొకటి. ఇలా మూడు కార్డులు ఒక్కరికే. ఇన్ని కార్డులు వచ్చాయని, పోకపోతే బాగుండదేమో అని, వెళితే అక్కడ పడిన నానా కష్టాలు వినిపిస్తుంటే పెళ్లి జరిపేవారికే కాదు, పెళ్లికి వెళ్లినవారి బాధలు వింటే లోతుగా కడుపు పీల్ చేసినట్లున్నది.
పెళ్లికి పోవాలంటే మనం వున్న చోటునుండి దూరంగా వున్న ఫంక్షన్ హాలుకి రెండు గంటల ముందు ప్రయాణం కావాలి. చచ్చీ చెడి పోతే అక్కడ అక్షింతలు వేయడానికి పెద్ద క్యూలో నిలబడాలి. ముందున్నవారు ‘పెద్దలు’ అయితే వారితో ఆత్మీయ ఆలింగనాలు, పలకరింపులు. ఆపై ఫొటోసెషన్. ఎవరు ఎక్కడ నిలబడాలో అక్కడే తర్జనబర్జన చేస్తూ మారుతూ ఫొటో దిగాలి. ఆ తరువాత అక్షింతలు వేస్తూ మిత్రులైతే మళ్లీ పెళ్లి కొడుకుతో ఆలింగనాలు. పెళ్లి కూతురుతో షేకాండులు. విడిపోతూ పోతూ చివరి ఓదార్పులు. వెనకవైపువున్నవారు అలా నిలబడి అలసి సొలసి పోవడం తరచూ చూస్తున్నాం.
పాపం! ఒకాయన సీనియర్ సిటిజన్, ఆపై చక్కెర వ్యాధి పీడితుడు. కొంత అనారోగ్యంతో బాధపడుతున్నాడు కూడా. నిలబడి నిలబడి ఇక పడిపోతానని తలంచి వెనక్కి తిరుగుతుంటే, అదేంటండీ వెళ్లిపోతున్నారు మర్యాద లేకుండా. రండి, అని క్యూలో నిలబెట్టారు మళ్లీ. సిగ్గుపడకుండా జేబులోని బిస్కట్ పొట్లం తీసి తిన్నాక ప్రాణం తిరిగి వచ్చింది. ఆ తరువాత ఆగమేఘాలపై తీరా భోజనశాలకి వెళితే అక్కడా ‘క్యూ’. తీరా ప్లేట్ల దగ్గరకు చేరగానే ఇప్పుడే వస్తాయి వుండండి అని చెప్పి వెళ్లినాయన పత్తాలేడు. మరో పది నిముషాలయ్యాక తెచ్చిన ప్లేట్లు గాల్లోనే ఎగిరిపోయాయి. సిగ్గుశరం విడిచి మరో విడత ప్లేట్ల కోసం పడిగాపులు. ఎలాగో అలా ప్లేటు సంపాదించి వంటకాలు ఉంచిన బల్లల దగ్గరకు చేరడానికి మరో క్యూ. బలవంతులు, యువకులు ఖాళీ ప్లేట్లతో మధ్యలో దూరి వడ్డించుకున్నారు. పాపం. అలా చేయలేనివాళ్లకు ఎవరు దిక్కు? దొరికినకాడికి ఇంత తిని బయటపడ్డం ఈనాటి పెళ్లిళ్ల విందులోని సగటు దృశ్యం. తీరా అంత సమయం వెచ్చించి కడుపులో ఇంత పడేసి పోతూ వేదికవైపు చూడగానే చక్కర్ వచ్చినట్లయ్యింది. క్యూ అలాగే వుంది. క్యూని పక్కనపెట్టి విఐపిల పేరుతో ఈ వైపు నుండి ఎవరికి తెలిసినవారు, వారిని తీసుకెళ్లి అక్షింతలు వేయిస్తున్నారు. ఈ విఐపీలు చాలామంది భోజనాల దగ్గర కనుపించినవారే. అంటే ముందు తిండి ముగించి ఆ తరువాత అక్షింతలు వేస్తారు. ఇది కొత్త పద్ధతి. మరి చేంతాడు క్యూలో నిలబడిన పిల్లలు, వృద్ధులు, అనారోగ్యగ్రస్తులూ, మోకాళ్ల నొప్పితో బాధపడేవారు ఏం కావాలి.
ఐదుగురు ఫొటోగ్రాఫర్లు, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డ్రోన్ కెమెరా ఇంకా ఏమేమిటో. వేదికకు రెండు వైపులా అక్షింతలు వేస్తున్న విఐపీల విడియోల దృశ్యం. అలాంటి స్క్రీనే్ల పెళ్లి పందిట్లో అనేకచోట్ల. అప్పుడప్పుడు వీరిని చూపిస్తున్నప్పుడు ఈసురోమని క్యూలో నిలబడిన బక్క మనుషులు, కావలసినవారు కొందరు. వారే మంచి మనుషులు. మిగిలినవారంతా మనుషులు కాదు. హోదాలు, పదవులు తళతళలాడే కోట్లు. ఐశ్వర్యం మదించిన గుమ్ములు.
లోగడ ఒక పెళ్లి కొడుకు కూతురే బంగారం ధరించేవారు. ఇప్పడు పెళ్లికి వచ్చిన అతిథులే ఎక్కువ అలంకరించుకుంటున్నారు. బంగారు నగల డబ్బాల్లా కదులుతున్నారు. ఎంత పిచ్చి పెరిగిందంటే వీపు వెనుక మొత్తం ఖాళీ బ్లౌజులు తొడిగే స్ర్తిలు బంగారు నగలతో దాన్ని కప్పుకునేన్ని నగలు. ఇలాంటి కులవర్గాలవారిని, పెద్దలుగా భావించి పెళ్లికి పిలిచినవాళ్లు, వారికన్నా తాము చిన్నవాళ్లమని ఇట్టే తెలిసిపోతుంది. ఐనా పెళ్లికి అలాంటివారు రాకపోతే సందడే లేనట్టుగా భావించేవారు కోకొల్లలు. మరోవైపు కోలాటాలు. డిజె వెక్కిరింతల శబ్దాలు. పక్కవాడితో మాట్లాడిన మాటలు కూడా వినలేనంత శబ్దాలు. మన సంస్కృతి, పెళ్లి పవిత్రత ఎక్కడికిపోయింది. అంత శబ్దాలను మానవమాత్రులు భరించలేరు. మరి ఎందుకు పెడుతున్నారు? ఎవరు డిజైన్ చేశారీ పద్ధతులు.. సినిమా హాళ్లలో హీరోహీరోయిన్‌ల చౌకబారు పాటలు ఈ పవిత్ర ప్రాంగణంలో అవసరమా?
ప్రతివాడి చేతిలో సెల్. పెళ్లికి వచ్చినట్లు లేదు. వ్యాపారం చేసేవాళ్లు ఇతరులను దగా చేయడానికి చేసే సంభాషణలు. సెల్‌ఫోనులో సెల్ఫీలు, ఫొటోల సందడి. విచిత్రం ఏమంటే, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మిత్రులు అందరూ సెల్లు సంభాషణలే. లోపలవైపు చూస్తే మరో విశాలమైన డైనింగ్ హాల్ వుంది. అందులో ఒక టేబుల్ చుట్టూ పది కుర్చీలు. ఒక్కో టేబుల్‌కు ముగ్గురేసి సర్వర్లు. అక్కడ డైనింగ్ హాలులోని వారితో సమానంగా డ్రింకు పార్టీ. అక్కడ దొరకని మద్యం లేబుల్ లేదు. మాంసాహారం లేదు. ఒక్కో ప్లేటులో తిని పారేయగా వదిలింది ఇద్దరు ముగ్గురు తినవచ్చు. ఈమధ్య ఐదేసి రోజుల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పాత పద్ధతి వేడుకలు వచ్చాయి. కానీ అప్పుడున్న ప్రేమలు, ఆప్యాయతలు మాత్రం ఏకోశాన కనుపించవు. డబ్బున్నవాళ్లు సంపాదించిన ఈజీమనీ, నల్లధనం విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారు. సరే. కానీ, కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ గడిపే మధ్యతరగతివాళ్లు ఈ వలలో పడడడు దురదృష్టం. డబ్బున్న వర్గాలవారి పెళ్లిలో, పెళ్లికి వచ్చినవారి క్యూ, శబ్దం, భోజనం ప్లేటు వద్ద పడే బాధలు ఈ పెళ్లిళ్లలో కూడా మామూలే. పెళ్లికి వచ్చినవారిని ఇంత లోకువ చేయడం ఏం మర్యాద. పెళ్లి ఇప్పుడు హోదా ప్రకటన మాత్రమే అయ్యింది. ఇది విచారకరం.
ఇద్దరు మనుషులు, రెండు హృదయాల కలయిక కాకుండా, రెండు కుటుంబాల మధ్య సయోధ్యలా లేదు పెళ్లి వేడుక. రెండు ఆర్థిక శక్తుల ‘్ఢ’ అంటే ఎలా వుంటుందో అలాంటి కృత్రిమ సంరంభం కనిపిస్తోంది. అతిథులు పెళ్లికి రావడం మానేసే పరిస్థితులు వస్తున్నాయని గమనించాలి. తినడం కోసమే వస్తారన్న ఆలోచన నుండి బయట పడాలి. పైపై మెరుపులకి పరిమితం కావడం పెళ్లి పరమార్థానికి విఘాతం. మానవీయత, మనుషుల కలయిక, హృదయాల స్పందనల గౌరవం ముఖ్యం. టీవీ లైవ్ షోలలో పెళ్లి ఘట్టాలను చూపడం పెళ్లి తంతుకి విరుద్ధం. ఎవరెవరు వచ్చారు, ఎలా వచ్చారని తెలియజేయడం కోసం పెళ్లి వేడుకే వేదిక కానవసరం లేదు. ఆత్మీయానురాగాల వేదికని అట్టహాసాల పరిధికి కుదించడం అమానవీయం. పెళ్లి సందర్భంలో రెండు మంచిపనులు చేయడం నలుగురికి ఉపయోగపడేవిధంగా ఆలోచించడం అవసరం. ఆ దిశగా ఆలోచిస్తారని ఆశించడం తప్పుకాదు.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242