తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఇప్పుడు కావలసింది ఏక వ్యక్తి సైన్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరోసారి ‘ఒంటరి చేతి పోరాటం’ గురించి ముచ్చటించుకుందాం. ఎందుకంటే నిన్న ఒ.ఎల్లారెడ్డి కాస్తంత నీరసంగా, ఒకింత నిర్వేదంగా గత రెండేళ్ళ నుండి తాను చేస్తున్న ఉద్యమం గురించి మరిన్ని వివరాలు చెప్పాడు. తన వద్ద వున్న కోర్టు సంబంధించిన కాగితాలు, పురావస్తు సంపదకు చెందిన ఫొటోలు ఫైళ్లలోంచి తీసి చూపించాడు.
మీరు చెబితే సరిపోతుందండి. ఈ ఫైళ్లు ఎందుకులెండి అన్నాను. ఒకింత నిశ్శబ్దం. ఆ తరువాత ఒక మంచి పని చేయాలంటే ఎంత కష్టమో, ఎన్నిరకాల అడ్డంకులు ఉంటాయో తెలియాలి. కేవలం ఒక నినాదమో, ఉపన్యాసమో ఇస్తే సరిపోదు. ఒక్క పని సాధించి చూపాలనే సందేశం అవసరం. రాబోయే తరం కేవలం మాటలవరకే పరిమితం కారాదన్నది నా కోరిక. అందుకే ఇవి చూపిస్తున్నాను అన్నాడు.
ఆయన పేరు: ఒ. ఎల్లారెడ్డి
వయస్సు: 77 ఏళ్ళు
గతంలో: దేశం కోసం మిలటరీలో చేరాడు.
నేడు: అవినీతిపై జెండా ఎత్తాడు
ఈ రెంటిమధ్యలో ఓ జాతీయ బ్యాంకులో ఉద్యోగం. ఎల్లారెడ్డి కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల గ్రామంలో పుట్టాడు. ఆ తరువాత మిలటరీలో చేరాడు. ఆ తరువాత బ్యాంకులో చేశాడు. ప్రస్తుతం పదవీ విరమణ పొంది మరింత ఎక్కువగా అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు.
ఎల్లారెడ్డి పోరాటం అంతా ‘్భమి’ గురించి. లాలూచి పనులు చేసి అక్రమంగా భూమిని సంపాదించేవారిపై. మరో దిక్కు భూమిలో దాగివున్న పురా సంపదని కాపాడడం కోసం పోరాటం. ఆయనతో మాటలు మొదలు కాగానే అక్రమాల చిట్టా బయటపడుతుంది. అలసట మాటల్లో కనుపించినా చేతల్లో పిడికిలి బిగుసుకునే ఉంటుంది. ఉద్యోగులు, ప్రభుత్వ వ్యవస్థ, న్యాయవ్యవస్థ, రాజకీయ నాయకులు మూకుమ్మడిగా కలిసి చేసే అక్రమాల బండారాన్ని బట్టబయలు చేస్తుంటాడు. పోరాటం ఒకటే కాని నాలుగు దిక్కులా చేస్తూ పోవాలి. ‘ఒక్కడు’ ఎలా తట్టుకుని నిలబడ్డాడో కదా అని అనిపిస్తుంది.
తీరిగ్గా, హాయిగా కేవలం మాటలు మాత్రమే చెప్పే పోరాటవాదులకన్నా ఇలాంటివారి చేతల ఉద్యమం ఎంతో ప్రయోజనకరమైనది. ఇటువంటివారు కొంతమందైనా ఉండబట్టే వ్యవస్థలపై లేనివాడికి కొంత విశ్వాసం.
ఎన్నికల పార్టీల ఊదర ప్రసంగాలకన్నా, ఇలాంటి వారి చేతలే ప్రజలకు ఊరట. సమాజాన్ని పాక్షికంగా చూసే ఏ సిద్ధాంతం సమాజం సమగ్ర మార్పుకి దోహదం చేయలేదు. మొత్తంగా చూడ్డమే కాదు. దాని చలనశీలతని అర్థం చేసుకోకుండా దానిని మార్చే ఏ ప్రయత్నం సఫలం కాదు. అప్పుడప్పుడు స్థల కాల ప్రభావాలు, వాస్తవాలు, ఘటనలను పరిగణించపోవడం పెద్ద లోపం. ఇలాంటి లోపగ్రస్త దృష్టి ఏ మాత్రం సరికాదు. మన ప్రారంభపు అడుగుల్లోనే తప్పటడుగులు పడకూడదు. గతకాలంలో, ఏనాడో స్థిరీకరించిన విధంగా అదే కోణంలోనే సమాజం నడవడంలేదు. గతిశీలమైన మానవ సమూహం మతం కులం వర్గాలవారీగా విభజింపబడింది. అంతేకాదు, సంపద సృష్టికి గత కొలమానాలు ఇప్పుడు ఏ మాత్రం సరిపోవు. ఇపుడు భూస్వామి కాదు, బహుళ పెట్టుబడులు వేలాది ఎకరాల భూమిని, భూసంపదని అలవోకగా సొంతం చేసుకుంటున్నాడు. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వాలు వారికే మద్దతు. వెనకటి కొండలు, గుట్టలు పనికిరాని పాత దిబ్బలు కావు. ఇప్పుడవి ఎగుమతికి బంగారు బాటలు. లాభాల మూటలు. జీవావరణ విధ్వంసం జరపకుండా ప్రభుత్వాలు అభివృద్ధి సాధించలేవని అంటున్నాయి. ఇపుడు ప్రభుత్వమే లాభాల వ్యాపారంలో దిగబడిపోయింది.
‘్భమి’ కేంద్రంగా రాజకీయాలు, లాభాలు సుళ్ళు తిరుగుతున్నకాలం. కనుపించిన ప్రతి ప్రభుత్వ స్థలంలో ప్రజల హక్కుల్ని తొలగించి, పెట్టుబడిదారులకు అంటకడుతున్నది. ఎల్లారెడ్డి పోరాటం అక్కడే.
* * *
‘దునే్నవాడికే భూమి’ పోరాటంలో పనిచేసినా, ఉన్న ఊళ్ళో పదిమంది రైతులకు సహకరించినా అదే లక్ష్యం. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ అనేక అక్రమాలని వెలుగులోకి తెచ్చాడు తాను పనిచేసే చోట జరిగే అన్యాయాలను ఎదిరించి అష్టకష్టాల పాలయ్యాడు.
ప్రభుత్వం సంరక్షించాల్సిన సామూహిక పార్కులు, ఆటస్థలాలు, ఖాళీ ప్రదేశాలు, అటవీ ప్రదేశాలు, చారిత్రక స్థలాలు ఒక్కొక్కటే అప్పనంగా ధనికులకి అప్పగిస్తుంటే కిమ్మనని మేధావులకి ఏ ఇతర విషయాలు ముఖ్యమైనవో ఎల్లారెడ్డిగారికి అర్థం కాలేదు. ఈ విషయాలు ఎవరితో మాట్లాడాలో తెలియదు. రాజకీయ పోరాట నినాదం అయిన భూపోరాటాల్లో ఈ భూములకి ఎలాంటి స్థానం లేదా? వీటికి తగు ప్రాధాన్యత ఇవ్వకపోవడం సరైనదేనా అని అనుమానం వ్యక్తం చేస్తాడు.
భూమిలేనివారికి కూడా భూస్వామ్య సమాజంలో అందరి అవసరాలకు తగినంత భూమి ఉండేది. పశువుల మేతకోసం, మనుషులు మరణిస్తే ఖననం చేయడం కోసం (శ్మశానం), పదుగురు కలిసి కూచోవడం కోసం, పండుగ లు, జాతరలు జరుపుకోవ డం కోసం, ఆలయాలు నిర్వహించుకోవడం కోసం అనేక రకాల భూములు ఉండేవి. వీటి గురించి ఏ రాజకీయ పార్టీ మాట్లాడకపోవడం ఏ మాత్రం సరికాదు. ఆ భూములన్నీ కళ్ళముందే అన్యాక్రాంతం కావడం చూస్తూ మిన్నకుండిపోవడం విషాదం. అందుకే అలాంటి కొన్ని భూములను కాపాడాలని నేను ప్రయత్నించాను. ఇది పౌరుడిగా నా ధర్మం. అంతే.. అంటాడు ఎల్లారెడ్డి.
ఈ మాత్రమే ఒక పనా అని అనుకోకండి. ఇదే ఒక విప్లవం ఈనాడు. అన్ని ప్రజావ్యతిరేక శక్తులు, ప్రభుత్వాలు, పోలీసు, మిలటరీ విభాగాలు ఒక్కటయ్యే విషయం ఇది.
ఇక్కడ ప్రతినిత్యం సామదాన భేద దండోపాయాల వలలు. ప్రతి వల నుండి తప్పించుకొని బయటపడాలి. అందుకు ఎంతో ‘శ్రమ’ని ధారపోయాలి. ఈ ఆచరణాత్మక పోరాటానికి కలసివచ్చేవారు చాలా తక్కువ. ఐనా కొందరు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వారిలో చాలామంది ‘హత్య’లకు గురయ్యారు. వారిని రాజ్యం అండతో ఏదో ఓ విధంగా అణచివేశారు. బలహీనులను చేశారు.
ఒక కేసులో, అన్ని రకాల సాక్ష్యాధారాలు ఉన్నా స్థానికుడివి కాదు అనే కారణంతో ఓ పేరున్న జడ్జి ఆ కేసుని కొట్టివేశాడు. న్యాయ వ్యవస్థలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం-
హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో 160 కోట్ల విలువైన ప్రభుత్వ ఖాళీ భూములు దొంగ లే అవుట్లుగా మారాయి. దీనికి బల్దియా అధికారుల సహాయం ఉంది. ఈ స్థలాలకి రెవెన్యూ శాఖ ఎన్‌ఒసిలు మంజూరు చేసింది. ప్రభుత్వం తన స్థలం తానే అన్యాక్రాంతం చేసింది. ఈ భూములన్నీ ప్రజలకి చెందేవే. ప్రభుత్వాలు శిఖండి పాత్ర వహించి అధికార, ఆర్థిక బలం ఉన్న రాబందులకి కట్టబెట్టడంవల్ల ప్రజలు చూస్తూ ఊర్కుండిపోయారు. ఈ స్కాంలో ముగ్గురు కమిషనర్లు, వందలాదిమంది ఉద్యోగుల పాత్ర ఉంది. ఈ భూములలో దళితుల కోసం నిర్మించతలపెట్టిన కమ్యూనిటీ హాల్ స్థలం కూడా ఉంది. గాంధీ బొమ్మ విగ్రహం ఉన్న స్థలాన్ని కూడా ఆక్రమించారు. అన్ని సాక్ష్యాధారాలున్నా, కేసు నడుస్తున్నా, ఇలాంటి కేసులు కోర్టు టేబుల్ మీదకు దశాబ్దాలుగా రావడం లేదంటే అర్థం ఏమిటి?
ఇకపోతే-
ఫిలింనగర్ కోపరేటివ్ సొసైటీ ఎన్నో అక్రమాలకు నెలవు. ‘పార్కు స్థలంలో క్లబ్బు. మొదట సినియేతర రంగంవారు అర్హులు కాగా, 1985 నుండి అనర్హులైనవారు ప్లాట్లు సొంతం చేసుకున్నారు. దీనిపై అనేక కమిషన్లు ఏర్పాటుచేశారు. అన్నీ నిష్ఫలాలే. కిరణ్మయి నివేదికని కూడా వెలుగుచూడనివ్వలేదు. పైగా ఆమెని కోఆపరేటివ్ శాఖ జాయింట్ కమిషనర్ పోస్టునుండి బదిలీ చేయించారు. ఆ ప్రాంతంలో మందులు, పొందులు జరుగుతుందన్న వాస్తవం గ్రహించి హైకోర్టు కూడా క్లబ్బుని తొలగించాలని తీర్పునిచ్చింది. ఈ మధ్య అక్కడ ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. వారికి సొసైటీ నష్టపరిహారం కూడా న్యాయబద్ధంగా అందించలేదు.
ఐనా కొత్త ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. పైగా సొసైటీ వారితో సన్మానాలు పొందారు పెద్దలు. ఇలాంటి ఎన్నో కేసులు. ఆర్టీఐ చట్టం ప్రకారం సమాచారం తెప్పించడం, కోర్టులలో కేసులు వేయడం, అందుకోసం ఎన్నో అగచాట్లు పడడం, ఆర్థికంగా నష్టపోవడం తంతుగా మారింది ఎల్లారెడ్డిగారికి.
ఇదే వరస కష్టనష్టాలు నేలమట్టమైన వారసత్వ పురా సంపద పరిరక్షణలో సైతం ఎదుర్కొన్నాడు ఎల్లారెడ్డి.
కొలనుపాకలో 8, 9 శతాబ్దుల నాటి ఆలయాలను, చారిత్రక కట్టడాలను వెలికితీశారు. మూడు శాసనాలను బయట పెట్టారు. వాటికి తన డబ్బుతో నీడ కల్పిస్తానని చెప్పినా ఎవరూ సహకరించడంలేదని వాపోయాడు.
అనంతపురంలోని కొనకండ్ల గ్రామంలో అలనాటి జైనమతాచార్యుడు కుందాకుందాచార్యులు చెక్కించిన జంబూద్వీప పటం గుర్తించి, దాని పరిరక్షించాడు. హైకోర్టు దానికి ఆర్థికంగా ఆదుకోవాలని కోరింది. ఒకప్పుడు రాళ్ళు రప్పలమధ్య గల ఆ ప్రదేశం దేశంలోనే అతి ముఖ్యమైన జైన క్షేత్రమైంది. అన్ని రకాల మతాల వారు దానిని యాత్రాస్థలంగా భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోని క్వారీ యజమానులు ఎన్నో చారిత్రక ప్రదేశాలను తవ్వేస్తుంటే వాటిలో కొన్నింటినైనా ఆపగలిగాడు. ఇలాంటి చారిత్రక స్థలాలను కాపాడడం కోసం ఎన్నో వెరుపు లేని మెరుపు పోరాటాలు చేశాడు.
అందుకే అతని గురించి మరోసారి ఈ పరిచయం.
అతను ఏక వ్యక్తి ఒక సైన్యాన్ని నిర్మించగలడు. అంతేకాదు, ఆ సైన్యం అంతా కలిసి చేసేంత పోరాటం కూడా చేయగలడు.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242