తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఇవాంకోపాఖ్యానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గోలకొండ కోటలో యువరాణి’ ఇవాంకా ట్రంప్ అలా మెరసి ఇలా అమెరికా విమానం ఎక్కేశారు.
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు 28 నవంబర్‌న ప్రారంభమైంది. ఆ సభలో ఆమె మొదటి ఆకర్షణ. హైదరాబాద్ అధికారిక అతిథిగా ఇవాంకా పేరు రాష్టమ్రంతా మారుమోగింది. రెండోరోజు ఉదయం జిఈఎస్ సమావేశం, పగలు గోలకొండ సందర్శన, రాత్రి విందు తదుపరి విమానాశ్రయం.
గోలకొండ కోటలో కొందరికి యువరాణిగా, ఆ కోటలో అ‘మెరిక’గా, మరికొందరికి చిమ్మచీకటి ఆవరించిన భారతదేశపు ఆకాశంలో ‘నెలవంక’లా, భాగ్యనగరపు ‘్భగ్యం’గా కనుపించింది. ఆమె ధరించిన దుస్తుల రూపు రంగుల సమ్మేళనం గురించి రాయనివారు లేరు తీయని ఫోటో లేదు. తీరొక్క ముద్దులొలుకుతూ ఫోజులిచ్చే ఇవాంకాలా మహిళలు ఉండాలని చెప్పకనే చెప్పింది మీడియా. ఆమెని ఒక దివి నుండి దిగిన దేవతలా ప్రొజెక్ట్ చేశాయి పత్రికలన్నీ కలిసి.
ఆమెకోసం, ఆమె ప్రయాణించే రహదారుల్ని పెళ్లివేడుక వేదికల్లా సింగారించారు. పెచ్చులూడి గుంతలు పడిన రోడ్లకి మెరుపుల మరమ్మతులు చేశారు. ప్రజల ధనం రంగులపాలు చేయడం ధర్మమా అన్నవారికి, ఇదంతా ప్రజలకోసమే చేస్తున్నాం అని చెప్పారు పెద్దలు. లాభాలు తీసే మహిళా పారిశ్రామికవేత్తకి ఒక వైట్ హౌజ్ సలహాదారుకి, ఇంత అత్యున్నత మర్యాద చేస్తే అమెరికాలో ఇలాంటి స్థాయి కలిగినవారు ఓ రెండు వేల దాకా ఉంటారు. మరి వారొస్తే ఇలాగే చేస్తామా? కేవలం ఆమె అమెరికా అధ్యక్షుని కూతురు కావడమే టన్నుల ఎర్రతివాచీల స్వాగతం. తన దేశంలోనే తనకు ఇంత ఘనస్వాగతం ఎక్కడా లభించదు. ఆమెకు ఆ విషయం తెలుసు. అదే మాట చెప్పింది కూడా.
ముఖ్యంగా అమెరికా అధ్యక్షుని పాలనా విధానం అంతా ఒడిదుడుకులమయం. యుద్ధకాంక్షతో సతమతమవుతున్న వ్యక్తి. ఆసియాలో పాకిస్తాన్ తరువాత తనకు ఒక ‘అడ్డా’కావాలి. అందుకోసం పడే ఆరాటం అంతా ఇంతా కాదు. ఈ రోజు ఎవరు, ఏ పార్టీ అధికారంలో వుందని కాదు. ఎవరు వున్నా అగ్రరాజ్యం వారితో మిలాఖత్ అయ్యే పరిస్థితి. దీనిని అర్థం చేసుకోని పాలకులు అమెరికా కనుసైగల్ని మరోలా అర్థం చేసుకుని ‘్ఫదా’ ఐపోతున్నారు. ఇవాంకాలో అణువణువు ట్రంప్‌ని చూసుకుని భక్తి పారవశ్యంతో ఉప్పొంగిపోతున్నారు చేతులు మోడ్చి.
ఇవాంకా ఒక మహిళ కావడంవల్ల ప్రధాని కూడా మహిళని ‘శక్తి’గా చూస్తే సంప్రదాయం మా భారతీయులది చెప్పక తప్పలేదు. ఒక్క మహిళా లేని పురుష మంత్రివర్గం గురించి చర్చ వస్తే తెలంగాణ ప్రభుత్వం కిమ్మనలేదు. పైగా తెలంగాణలో ఎవరైనా మహిళ ఉంటే ఆమె కెసిఆర్ కూతురే కావడం విచిత్రం. కాని ఒకే కుటుంబం అనే అపవాదులు ఎందుకని ఆమెనీ దూరంగానే పెట్టారు కాబోలు. తెలంగాణ మంత్రివర్గంలో అంతా పురుషులే.
నిన్ననే జిల్లాలవారీగా లెక్కలు తీస్తే పురుషులకన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఒక నివేదిక విప్పి చెప్పింది. మహిళలే మహనీయులని వేదికలపై నుండి అభిభాషించే మగమహారాజులు తమ ఇంట్లోని ఆడవారిని తమ వెంట తీసుకురాగలరా? నిజానికి ఇవాంకా సారథ్యం వహించారు కాబట్టి పారిశ్రామికవేత్తలలో మహిళ సంఖ్య లెక్కలకోసం అయినా పెరిగింది. మహిళ గురించి, వారి సాధికారిత గురించి మాట్లాడక తప్పలేదు. అలాంటి మాటలే బాక్సు ఐటెమ్‌లు అయ్యాయి. అంతేకాని నిజంగా సమాజానికి మహిళల అవసరం ఎలాంటిదన్న వైపుగా చర్చ జరగలేదు.
మహిళా సాధికారత, కృషి, శ్రమ, కుటుంబ నిర్వహణ, వ్యవసాయ రంగంలో వారి పాత్ర బేరీజు వేయాలి. ఈ రంగాలలో, గణనీయంగా కృషి చేసిన మహిళల్ని గుర్తుచేసుకోవలసిన పురుషుల నాలికలపై ఒక్కసారి, ఒక్క పేరు కూడా పెగలలేదు. ఈ రంగాల గురించి ఏ మాత్రం తెలియని ఆసియాయేతర మహిళ పాపం ఏం మాట్లాడుతుంది? క్రీడల్లో రాణించిన సింధు, సానియాల వంటి వారి గురించైనా ప్రసక్తి చేయకపోతే ఇండియా గురించి తనకు ఏమీ తెలియదని అనుకుంటారని అన్న మాటలుగానే వీటిని చూడాలి. అంతేగాని భారతీయ మహిళలపట్ల, సమాజం పట్ల లోతైన అభిమానం ఎక్కడా ప్రస్ఫుటం కాలేదు. సదస్సు మహిళల ప్రగతి గురించి పైపైమాటలకే పరిమితం కావడం బాధాకరం. ఈ విషయం గురించి ఆత్మపరిశీలన చేసుకుంటానని, అందరూ చేసుకోవాలని అన్న కెటిఆర్ ఇకముందు పారిశ్రామిక రంగం గురించే కాకుండా ఆసియాటిక్ ఉత్పత్తి రంగంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం గురించి, దాని అభివృద్ధి గురించి ఆలోచిస్తారని ఆశిద్దాం.
ఆంధ్రప్రదేశ్‌నుండి హాజరైన హెరిటేజ్ ఇండస్ట్రీస్ ఈడీ బ్రాహ్మణీ, అపోలో ఆస్పత్రి డైరెక్టర్ ఉపాసన వంటివారు పెట్టుబడిదారుల పుత్రికలు అయినందునే స్థానం సంపాదించగలిగారని అందరూ అనుకునే మాట! అంటే ధనిక పెత్తందారీ వ్యాపార వర్గాలకు చెందిన మహిళలకే ఈ సదస్సులో ఎక్కువ స్థానం లభించింది. నిజానికి ఏ సాధారణ మనిషి చేసిన ఆవిష్కరణ అయినా అంతిమంగా పెట్టుబడిదారుల చేతిలో ‘లాభం’ అవుతుందే తప్ప ఈ ప్రక్రియకి మరో ప్రయోజనం లేదు. ఈ ఆవిష్కరణలు, సదస్సుల కలయికలు వారిలో నూతనోత్సాహాన్ని కలిగించి విశ్వవ్యాప్త మార్కెట్ అవకాశాల కోసం పడే తాపత్రయంగా ఈ కార్యక్రమాన్ని చూడక తప్పదు. నిజానికి ఈ సదస్సులో యం.పి కలువకుంట్ల కవిత ప్రముఖంగా కనిపించాలి. కాని ఆమెని పక్కనపెట్టడంలో పురుష ప్రధాన దృక్పథం పనిచేసిందని ఎవరైనా అనుకుంటే తప్పులేదు కదా. ఒక మహిళా సర్పంచ్, ఎమ్మెల్యే మహిళా కోటాలో ఎన్నికైతే, వారి భర్తల, సోదరుల అజమాయిషీలోనే పనిచేయక తప్పని పరిస్థితి. అలాగే వ్యాపార, రాజకీయరంగంలో కూడా అదే పరిస్థితి.
కెసిఆర్‌గారు గత కొద్ది రోజుల కింద అసెంబ్లీలో నిజాం రాజుని పొగిడాడు. ఈ సదస్సుకు వచ్చిన ప్రధాని మోదీ హైదరాబాద్ అంటే సర్దార్ అనీ, హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన ఆ మహనీయుడిని ఈ వీరభూమి నుండి ప్రణమిల్లుతున్నాను అన్నాడు. నైజాం రాజులకి చెందిన ఫలక్‌నుమా ప్యాలెజ్‌లో విందు ఏర్పాటు, గోలకొండ కోట సందర్శన సంకేతాలు మామూలువి కావు. రాచరిక చిహ్నాలపై మోజుకి అర్థం వేరే ఉంటుంది. కానీ ప్రజల గోళ్లూడగొట్టి వసూలు చేసిన పన్నులతో జల్సాలకోసం కట్టుకున్న రాజ ప్రాసాదాలు ప్రజల క్రోధాగ్నికి ఏమైనాయో కొత్త దొరలకి గుర్తురాకపోవచ్చు. ఒక్క సర్దార్ పటేలే విలీనానికి కారణం కాదని చరిత్రతో ఏ మాత్రం సంబంధం ఉన్నవారికెవరికైనా తెలుస్తుంది. ఎంతోమంది వీరులు చేసిన బలిదానాలవల్లే నైజాం తోకముడిచాడని గుర్తుంచుకోవాలి. రాజకీయ నాయకులకి చరిత్ర జ్ఞానం సరిపడా లేకపోవచ్చు. కాని వారికి ఆశ్రీతులుగా ఉండే పక్కవాద్యపు మేధావులు, నాయకులకి క్లోనింగ్ బ్రెయిన్స్‌గా మారిపోవడం ఈ కాలపు వింత.
గోలకొండ నవాబుల నియంతృత్వంపై పోరాడిన సర్వాయి పాపన్నల తలలు వేలాడదీసిన గోలకొండ కోట ప్రధాన ద్వారం ప్రాభవం అప్పటినుండే అవనతమైందని తెలుసుకోవాలి. ఆ గోడల కంటిన వీరుల రక్తపు మరకలను గుర్తించగలిగితే బాగుండు. ఇవాంకాకు డెబ్బయి వేల రూపాయల విలువగల చేనేత దుస్తులు బహూకరిస్తారని విన్నాం. పత్రికల నిండా వార్తలే. ఒకవేళ బహూకరిస్తే ఆ వస్త్రాలకి అంటిన ఆత్మహత్యల విషాదం రంగుల్ని కూడా చూడాలని ఇవాంకాని కోరక తప్పదు. ఆమె రాక కోసం ఖర్చుచేసిన వ్యయం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కర్మకాండలకి సహాయంగా ఇస్తే బాగుండేదనిపించక మానదు. చేనేతన్నలు బతకలేక కొత్తరాష్ట్రం వచ్చాక కూడా సుమారు తొంభై నాలుగుమంది ఉరి పోగులకి బతుకుల్ని అర్పించారని పత్రికల కథనం. ఇంత పేదరికం తాండవిస్తున్నా, అప్పుల్లో కూరుకుపోయినా, పప్పన్నం విందుల ఖర్చు వెరసి విరిగిన సామాన్యుని బతుకు వెనె్నముక అయ్యింది.
వచ్చిన అతిథిని గౌరవించాలి. మన స్థాయిని బట్టి చూసుకోవాలి కాని వారి స్థాయిని బట్టి భేషజాలకి పోకూడదు. గోడలకి రంగులు, ఆకాశంలో వెలుగుల పొంగులు నిలిచేవి కావు. ప్రజలు కూడా అతిథుల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించేట్లు చేయగలగాలి. పైన ఉన్న ఓ నలుగురు మాత్రమే ఆలింగనం చేసుకుంటే ఇంటిల్లిపాది ఆదరణ లభించదు. ఇకముందు అమెరికా నుండి అతిథులు వస్తుంటారు, పోతుంటారు. ఆత్మీయతలు ముఖ్యం కాని అట్టహాసాలు కాదు. ఎంతమందికని ఎన్ని అట్టహాసాలు చేస్తాం.
మార్కెట్లకోసం, దేశాలు పట్టుకుని తిరిగేవారిని అతిథులుగానే జమ వేయాలి. ఇది ఇంగితజ్ఞానానికి సంబంధించిన విషయం. ప్రభుత్వం, అధికారులు, పత్రికలు చేసిన కట్టలు తెగిన విపరీత అట్టహాసం సరైనదేనా? ఆలోచించుకోవాల్సిన సమయం ఇది.
ఇంతకీ ఇవాంకా జీఈఎస్ సదస్సులో చేసిన ప్రసంగం గతంలో టోక్యోలో జరిగిన సదస్సులో చదివిందేనట! దాని కోసమే మన మేధావులు పడిన ఆరాటం చూస్తే మతిపోక తప్పదు.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242