తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

హాస్య కార్యక్రమంలో జీవ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య పనిపై ఒక ఊరు వెళ్లాను. ఆ పని ఆ మరుసటి రోజుకి గానీ మొదలు కాదు. తెలిసిన మిత్రులు కూడా ఆవూళ్లో లేరు. అందుకే టీవీ చూస్తూ గడిపాను. కొన్ని కొత్త చానెళ్లు. అందులో కొత్త కొత్త ప్రోగ్రాంలు చూసాను. కాస్త సరదాగా వుండే కార్యక్రమాలు చూడడానికి ఎక్కువ సమయం కేటాయించాను. వాటిల్లో జి కెఫె చానల్‌లో జస్ట్ ఫర్ లాఫ్స్-గాగ్స్, అమెరికా ఫన్నీ హోమ్ వీడియోస్. ఈ రెండు కార్యక్రమాలు నవ్వు తెప్పించేవే.
2000లో మొదలైన గాగ్స్ ప్రోగ్రాం చాలావరకు సహజ ప్రదేశాలలోనే చిత్రీకరిస్తారు. సహజ వ్యక్తులతో నటింపచేస్తారు. గాగ్స్ షో సహజత్వానికి పీట వేస్తుంది. కాని ఆ ప్రోగ్రాం సగం కల్పితం. సగం వాస్తవం. కెమెరాని దాచి నిజమైన మనుషులని పాత్రధారులుగా చేస్తారు. మాటలు, డైలాగులు ఉండవు. అంతా దృశ్య ప్రధానం. దృశ్యం చూడగానే ప్రేక్షకుడికి అర్ధం అయిపోతుంది. ప్రోగ్రాం తరఫు పాత్రలు మాత్రం అవసరానుగుణంగా నటిస్తాయి. ఇతర పాత్రలని సహజంగా వారిచేత నటింపచేస్తారు. ఐతే కెమెరాని మాత్రం రహస్యంగా వుంచుతారు. ఇట్లా మాటలు లేకుండా నిశ్శబ్దంగా వుంటాయ. దీనిని సగం రియాల్టీ షోగా పిలుస్తారు. దానికి కొంత నేపధ్య సంగీతం ఏర్పాటు చేస్తారు.
ఇప్పుడు గాగ్స్ షోని వంద దేశాలు హక్కులు కొని ప్రదర్శిస్తున్నాయి. ప్రపంచంలోని చాలా విమానాశ్రయాలలో ఈ షోని టీవీల్లో ప్రదర్శిస్తున్నారు.
ఒకటీ అర నిముషంలో ఒక హాస్యపు తునక పూర్తవుతుంది. అప్పుడప్పుడు రెండు మూడు నిముషాలు వుంటుంది. ప్రతి ఎపిసోడ్‌కి ముందు ఒక అతి చిన్న పరిచయం ఉంటుంది. అది మొత్తం హాస్యపు తునకని పరిచయం చేస్తుంది. దానిని ప్రాంక్ అంటారు. ఇది ఆ ప్రోగ్రాంకి నాడి వంటిది. చిత్రం చివర ఆ హాస్యపు తునకలో పాల్గొన్న వారిని, వారు అప్పటికప్పుడు చూపిన సహజ హాస్య హావభావాలను చూపిస్తారు. అంతటితో అది ముగుస్తుంది. ఆ వెంటనే మరొకటి ఉంటుంది. ఈ షో మొన్న చూసినప్పుడు నాకు కలిగిన కొన్ని అభిప్రాయలను మీతో పంచుకుంటాను.
హాస్యంలో వర్గ స్వభావం ఉంటుంది. తెలిసో తెలియకో అది ప్రతిబింబించి ఒక వర్గానికి చెందిన వారి ప్రయోజనాలను, గొప్పతనాలను కాపాడుతుంది. తెలుగు సినిమాలో అన్ని హాస్య పాత్రలు ఇప్పుడు చెంప దెబ్బలు తింటాయి. చెంప చెణేల్‌మనకుండా ఏ సినిమా ఉండదేమో. హీరోలు హాస్య పాత్రల్ని నిరంతరం కొడుతుంటారు. వారు చేసేది లేక బిక్క మొకం వేసుకుంటారు. లేదా బిక్క చచ్చిపోతారు. అది సగటు ప్రేక్షకులకి హాస్యం కలిగిస్తుంది. ఒక్కో హాస్య పాత్రధారి ఎన్ని దెబ్బలు, చెంపదెబ్బలు తింటాడో లెక్క గట్టగలిగితే మన హాస్యం ఏ స్థాయిలో, ఏ రీతిలో వుందో తెలిసిపోతుంది.
హాస్యపాత్ర పై సామాజిక వర్గాలకి చెందినవాడు అయ్యుండడు. అతను పాత్రరీత్యా తెలివి తక్కువవాడు లేదా దద్దమ్మ అయ్యుంటాడు. సినిమా మొత్తంలో అతను అనేకసార్లు కించపరచబడుతూ ఉంటాడు. ప్రేక్షకులకు అతనిపై ఏ మాత్రం సానుభూతి ఉండదు. ఎదుటి పాత్ర గొప్పదిగా కనిపించాలంటే హాస్యపాత్రఒకటినుంఢి పది దాకా లెంపకాయలు తింటుండాలి. మన సినిమాల్లో హాస్యానికి ఇది పరాకాష్ట.
చార్లీ చాప్లిన్ గురించి తెలియనివారు ఉండరు. అతని చిత్రాలలో ఎంత హాస్యం ఉంటుందో అంతర్లీనంగా నియంతల, పెట్టుబడిదారుల, పెద్దలపై విమర్శ, సునిశిత వ్యంగ్యం అంతగా ఉంటుంది. సామాన్య మానవుడిలా కనిపించే నియంత అయన చాప్లిన్ హిట్లర్ వంటి పాత్రధారుల స్వభావాన్ని, ఆధిపత్యాన్ని ‘దిగ్రేట్ డిక్టేటర్’ వంటి పలు చిత్రాల్లో బట్టబయలు చేశాడు. మోడరన్ టైమ్స్ వంటి చిత్రాలలో ఆధునికత, యాంత్రికత మనిషిని ఎలా పీల్చి పిప్పి చేస్తుందో హాస్యం ఆధారంగానే కళ్లకు కట్టినట్లు చూపాడు.
తెలుగు సినిమాలలో జోకర్లు సన్నగానో, లావుగానో ఉంటారు. వారిని చూడగానే గిలిగింతలు కలగాలి. వారు ఎంతమంచి నటులైనా వారి హావభావాలలో చౌకబారుతనం చిప్పిల్లుతుండాలి. వారు తప్పక కిందివర్గాలకి చెందిన పాత్రలే కావాలి. ఒకప్పుడు రాజులకు సచివులు, ఆస్థాన విదూషకులు ఉండేవారు. ఆ తరువాత హీరోల మిత్రులు వంత పాత్రధారులయ్యారు. లేదా పిల్లిగడ్డం ముస్లింలు, విచిత్ర వేషధారకులు, దొంగలు, ప్రజలను మోసగించేవారు జోకర్లు. విలన్లపై ఫైట్స్ చేసినట్టు ఈ మధ్య హీరోలు హాస్యపాత్రలపై పిడిగుద్దులు కొడుతుంటారు. దెబ్బలు తిన్నవాడు విచిత్రంగా కట్లు కట్టుకుని కూడా మరిన్ని దెబ్బలుతింటూ తిరిగి నవ్విస్తుండాలి. బేండేజి కట్లు కట్టుకున్న చోట మళ్లీ దెబ్బలు తగిలి కేకలు వేయాలి.
నిజానికి అలాంటి దృశ్యం చూసి బాధ కలగాలి. శరీరానికి దెబ్బలు తగిలిన చోటే మళ్లీ కొట్టడం, దెబ్బ తగలడం ప్రేక్షకునిలోని మనిషితనాన్ని, సున్నితత్వాన్ని మేల్కొలపాలి. అలా కొట్టడం అమానుషం అని అనిపించాలి. కాని ప్రేక్షకుల మనసులని ఆ కోణంలో ఆలోచించకుండా చేయడమే సినిమా ధ్యేయం. మనిషిని సహజ స్పందనలకు దూరం చేయాలి. చౌకబారుతనానికి అలవాటు చేస్తేనే ప్రశ్నించే తత్వం అడుగంటుతుంది. ‘పాపం’ అనే భావన కలగడంవల్ల మనుషులు ఏకవౌతారు. పదిమంది ఒక తాటిమీదకు వస్తారు. అలా రాకుండా చేసే ప్రయత్నాల్లో హాస్యం, నవ్వులు, సరదాలను ఒక పరికరంగా దృశ్యమాధ్యమ నిర్మాతలు మలచుకుంటారు.
‘గేగ్స్’ ప్రోగ్రాంలో ఇంత చౌకబారుతనం ఉండదు. కాని ఆ అతి చిన్న హాస్యపు తునకలలో అప్పుడప్పుడు మానవత ప్రతిబింబిస్తుంది. ఇందులో ఎక్కువ చిత్రాల్ని కెనడా, మెక్సికో, బ్రిటన్, ఆసియా దేశాలలో చిత్రీకరించారు. అప్పటికప్పుడు లభ్యమైన వ్యక్తులనే పాత్రలుగా మలుస్తారు. కాబట్టి వివిధ దేశాల, మతాల, జాతుల, సమాజాలవారు మనకు అందులో కనిపిస్తారు. ఆ అతి తక్కువ నిడివిలో సైతం ఆ మనుషుల హావ భావాలే కాదు, మనస్తత్వం కూడా వ్యక్తం అవుతుంది. జాలి, దయ, ఆవేదన, కష్టం, సుఖం అనే భావనలు ఆ ఒక్క క్షణంలో మనల్ని కదిలిస్తాయి. అవి అత్యంత సహజంగా బహిరంగమవుతాయి శరీరానికి దెబ్బ తగలగానే ఏ భాషీయుడైనా తన తల్లి భాషలో ‘అమ్మా’ అని మూలిగినంత సహజంగా. ఇలాంటి భావ వ్యక్తీకరణ చేయాలి. ఏవైనా ఉంటే అలాంటివాటిని ఎడిటింగ్‌లో తీసివేయడం మామూలే. ఐనా అసంకల్పితంగా మిగిలిన వాటిలో మానవ సంవేదన కానరావడం ఒక మహత్తర గుణం. ఐతే వాటిని వ్యక్తం చేసినవారు ఎవరు అనేది కోటి రూకల ప్రశ్న.
పార్కులో ఓ మూల ఆ శవపేటిక పడి ఉంది. అది తెరుచుకుని ఒక చేయి బయటకు వస్తుంది. దాన్నిచూసి చాలామంది ఉలిక్కి పడతారు. భయభ్రాంతులవుతారు. విస్మయానికి గురవుతారు. కొందరు నవ్వుతారు. మరికొందరు అదేమీ పట్టనట్టుగా దానిని దాటి పోతారు. మనకెందుకులే అని గమ్మున ఉంటారు. ఒక్కొక్కరిది ఒక సామాజిక అంతస్తు. వీరిలో డబ్బున్నవారు, లేనివారు, ఉద్యోగి, నిరుద్యోగి, స్ర్తి,పురుషుడు, యువకులు, వృద్ధులు ఇలా దేశ లింగ మత వయో వర్గ బేధాలలో కనిపిస్తారు. వారి ఆకారం, దుస్తులు, హావభావాలు, శరీర భాష, చర్మ భాష, నుదురు ప్రేక్షకులకు ఎన్నో భావనలను అందిస్తాయి. షో చివరికి ఆ శవపేటికలో శవం కదిలింది కదా, ఆ శవానికి జీవం వచ్చిందేమో. అయ్యోపాపం! అని చూస్తుంది ఒక నల్లతల్లి. ఆ ఒక్క చూపుతో ఆ నల్లతోలు నీగ్రో మహిళ స్థాణువై నిలబడి చూస్తున్న దృశ్యం చిత్రం చివరలో ఫ్రీజ్ షాట్ అవుతుంది. ఆఫ్రికా ఖండంలోని ఒక పేద నల్లదేశంనుండి బతకడానికి ఒక పట్టణానికి వచ్చిన ఇలాంటి మహిళ మాత్రమే సహజంగా వ్యక్తం చేయగలిగిన హావభావన అది అనిపించింది. ఆ శవపేటికని దాటిపోయిన వారందరూ డబ్బున్న, అధికారం ఉన్న, సమయం లేని తెల్ల మనుషులు.
ఆమె హావభావం ఒక జ్ఞానచ్ఛాయ వెలుతురు. అది గొప్ప మానవస్పర్శ. వేరెవరూ చూపలేని కారుణ్యం.
ఆమె ఒక్కర్తే ఎందుకు చూపగలిగిందని చాలా ఆలోచించాను. ఎందుకంటే ఆమె హృదయం ఇంకా కరప్ట్ కాలేదు. అసహజతకి లొంగలేదు. యాంత్రికతని జయించిన మనిషి. అందుకే ఆమె మరణించిన మనిషి చేతి కదలికలని చూసి చలించింది. అలాంటి మనుషులు కావాలిప్పుడు.
ఆమె చూపిన భావన పునాదిగా వివిధ మనుషులు స్పందించగలిగితే ఆ హాస్యపుతునక ఒక త్రికాల మహత్తర లఘు చిత్రం అవుతుంది. కాని నిర్మాతలు నవ్వుని డబ్బుగా మార్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి అది నవ్వుల గందరగోళంలోనే ఉండిపోతున్నది. మనం అలా తప్ప వేరేలా స్వతంత్రంగా ఆలోచించకూడదు.
మూడువేలకు పైగా ప్రదర్శితమవుతూ ఉన్న ఇలాంటి లఘు చిత్రాలలో ఇలాంటివి కొనే్న ఉంటాయి. వీటినే మానవ సంస్పందనలకు దృశ్యరూప నమోదుగా భావించవచ్చు.

-జయధీర్ తిరుమలరావు jayadhirtr@gmail.com సెల్ : 9951942242