తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

తెలుగు సాహిత్య చరిత్ర రచనలో విస్మృతాంశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్య చరిత్ర రచన చాలావరకు సంప్రదాయ పద్ధతిలోనే కొనసాగింది. అందువల్ల కవిత్వ విమర్శకో, సాహిత్య విలువల నిర్థారణకో- కవి జీవిత చిత్రణకో- కుదించుకుపోవడంవల్ల దానికి ఎన్నో పరిమతులు ఏర్పడ్డాయి. విశాల సమాజానికీ, విస్తృత జ్ఞానానికీ సంబంధించిన చాలా అంశాలు సాహిత్య చరిత్రకి దూరంగానే ఉండిపోయాయి. శాస్త్ర విజ్ఞానం సాధించిన ప్రగతి, దాని ద్వారా ప్రజల భౌతిక జీవితాల్లో వచ్చిన మార్పులు, మారిన పరిస్థితుల్లో ఏర్పడే జీవన తాత్త్వికత వంటివి సాహిత్య చరిత్రకారులకి పట్టలేదు. దానివలన శాస్త్ర దృష్టి పెరగలేదు. సరికదా అశాస్ర్తియ భావజాలం ఇష్టారాజ్యంగా పెరిగింది. వామపక్ష, ప్రగతిశీల సాహిత్య సంస్థలు కూడా ఈ కోణంలో ఆలోచించకపోవడంవల్ల వ్యక్తులలో, సంస్థలలో అశాస్ర్తియత పేరుకుపోయింది.
సామాజిక శాస్త్రాల అధ్యయనాన్ని సాహిత్య చరిత్రకి అనువర్తింపజేయడానిక్కూడా పూనుకోలేదు. ఆయా కాలాల్లో కొన్ని ప్రక్రియలు విస్తృతంగా వెలువడడానికి, సాహిత్య భాషా రూపాల్లో మార్పులు చోటుచేసుకోవడానికీ కారణమైన సమాజ చలన సూత్రాల్ని చూడటానికి నిరాకరించారు. విస్తృత ప్రజాశ్రేణులల్లో ప్రచారంలో వున్న వౌఖిక సాహిత్య ధోరణులను చరిత్ర రచనకి ఆకరాలుగా తీసుకోవచ్చనే కనీస స్పృహ కూడా చాలాకాలంవరకూ ఏర్పడలేదు. ఈ ధోరణులలో దాగివున్న భౌతిక భావాల అధ్యయనం కూడా సరిగ్గా జరగలేదు. ఒకవేళ ఒకటి, అరా వాళ్ళ దృష్టికి వచ్చినా వాటిని ద్వితీయ శ్రేణి ఆధారాలుగానే పరిగణించారు.
చాలామంది వ్యక్తివాద, నాయక నేతాగణం సాహిత్యాన్ని సామాజిక సంపదగా గాక వైయక్తిక ‘ప్రతిభ’గా గుర్తించారు. ఆ కారణంగా సామూహిక కర్తృత్వంలో తయారయ్యే సాహిత్యం పనికిరానిదయిపోయింది. నన్నయ నుంచి వీరేశలింగం వరకూ సాహిత్య విగ్రహారాధన చరిత్రగా తయారయ్యింది. ఆదికవి ఎవరు? తెలుగులో తొలి నవల ఏది వంటి చర్చలు ఆ క్రమంలోనే సాహిత్య చరిత్రలో ప్రధాన స్థానం ఆక్రమించుకొన్నాయి. అడపా దడపా మార్గ సాహిత్యానికి సమాంతరంగా దేశీ సాహిత్యానికి- సాహిత్య చరిత్రలో స్థానం కల్పించారు. అయితే అటువంటి ప్రయత్నాలు సహకార చరిత్ర (కాంట్రిబ్యూటరీ హిస్టరీ) నిర్మాణానికి దోహదపడ్డాయి గానీ పరిపూర్ణతని సాధించే దిశగా నడవడంలేదు. సాహిత్యాధినాయక ధోరణివల్లే గురజాడ, వీరేశలింగం వంటివారి ‘ఆరాధన’ వెలుగులో గరిమెళ్ళ, జాషువా, జాలా రంగస్వామి మొదలైన వారిని దివిటీల కింద నేతలుగా చేయడం జరిగింది. సాహిత్య చరిత్రలో కొందరు ప్రాతఃస్మరణీయులయ్యారు. మరికొందరు విస్మృతులయ్యారు.
సాహిత్యంలోకి సాహిత్యేతర అంశాలని తీసుకురాకూడదనే శుద్ధ కళావాదానికి ఒక తాత్త్వికత వుంటుంది. సాహిత్యానికి సాహిత్యేతర అనుబంధాల్ని దూరం చేయడం అంటే సాహిత్యానికి ప్రజల్ని దూరం చేయడమే. అన్ని ఆధిపత్యాలనీ యథాతథంగా అంగీకరించి కావచ్చు, తమ చేతిలోని అధికారం ద్వారా విశాల ప్రజానీక చైతన్యాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు. తమకు అనుకూలంగా లేని దాన్నల్లా ‘అదుపు’ చేయాలని ఆరాటంలోంచే రాజకీయాల్లో, సాహిత్యంలో, చరిత్రలో నిషేధాలు పుడతాయి. ఆంక్షలు రెండు రకాలు. ఒకటి రాజ్యం విధించేది. రెండోది ప్రగతిశీల రంగంలో బ్రాహ్మణ ఆధిపత్య వర్గాలు కింది వర్గాల మీద ప్రకటించేది.
అన్నిరకాల నిర్బంధాల్ని ఛేదించుకోవడం ద్వారానే కొత్త చరిత్ర పురుడు పోసుకుంటుంది. సాహిత్యేతిహాసపు చీకటి కోణాల అట్టడుగున పడి కనిపించని అంశాలను తవ్వి తీసే క్రమంలో మన చరిత్రకారులు పూర్తిగా విస్మరించిన శాస్త్ర గ్రంథాలను పరిశీలించాల్సిన అవసరం వుంది. కొత్త వైజ్ఞానిక ఆవిష్కరణల నేపథ్యంలో సాహిత్య స్వభావం, స్వరూపం మారే అవకాశం వుంటుంది. వైజ్ఞానిక దృష్టి కొరవడిన సాహిత్య చరిత్రకారుడు చరిత్రకీ, సాహిత్యానికీ న్యాయం చేయలేడు.
సాహిత్య చరిత్రలో చేరవలసిన కొన్ని అంశాలు
1.స్ర్తిల దోహదం
భాషా సాహిత్యంలో స్ర్తిల స్థానం గుర్తింపబడలేదు. అటు పండిత కుటుంబాలలో వారి ప్రమేయాన్ని ఎక్కడా గుర్తించలేదు. రాజస్థానాలలో ఎక్కడ వెదికినా వారి జాడ అసలే ఉండదు. మార్గ కవిత్వపాయలో అక్కడక్కడ కనుపించినా సాహిత్య చరిత్ర రచనలో వారికి అన్యాయమే జరిగింది.
వౌఖిక, జానపద సాహిత్యాలలో, ప్రదర్శన కళారంగాలలో, సాంస్కృతిక క్షేత్రం అధ్యయనాలలో సైతం స్ర్తి కోణంలో అధ్యయనాలు చాలా తక్కువ. అసలు స్ర్తిలకి సృజన, నైపుణ్యాలు ఉంటాయనే స్పృహ లేని చరిత్ర మనది. సాహిత్య చరిత్ర రచన కూడా పురుష ప్రధానమే.
2.ఉపకులాల పాత్ర
ఉపకులాల సంస్కృతి ఒకటి ఉందని, దానిలో స్ర్తిల పాత్ర అమోఘంగా ఉంటుందని తెలిసిన దాఖలాలు లేవు. ప్రజా దృక్పథంలో, అభ్యుదయ దృష్టిలో కూడా వీరికి న్యాయం జరుగలేదు. వీరి తరఫున సమగ్రంగా మాట్లాడే వ్యక్తులు, పార్టీలు లేకపోయాయని అంటే తప్పు అవుతుందా?
ఉపకులాలలో చాలావరకు ఆధిపత్య మతాన్ని నిరసిస్తాయని, ఖండిస్తాయని చాలా వద్ద లిఖిత సాహిత్య రచనలు, రాతప్రతులు ఉన్నాయని గుర్తించలేదు. ఇది ఈ దేశంలో కేవలం బ్రాహ్మణీయ భాషజాలం ఫలితమే. దీనిని గుర్తించనివ్వకుండా ఈ శక్తులు ప్రజలను చాలాకాలం ప్రయత్న పూర్వకంగా వారి ఆలోచలను పరిపరివిధాల మరలింపజేశారు.
నిజానికి జాంబపురాణం, విశ్వకర్మ పురాణం, కాటమరాజు కథలు, అద్దం కథలు అన్నీ రాతప్రతులలో మూలిగిపోయాయి. ఆ ప్రతులను, ఆ కథలను అనేక శతాబ్దాలుగా బ్రాహ్మణ శక్తులు అగౌరవపరిచాయి. నిజానికి ఈ రాత ప్రతులలోని ‘ప్రక్రియలు’ వౌఖికంగా పాడతారు. వచనంలో చెబుతారు. కాబట్టి అవి ఇప్పుడు కొంతవరకు నోటి సాహిత్యంగా లభిస్తుంది. కాని ఈ సాహిత్యాన్ని ప్రగతిశీల రంగం గుర్తించడానికి ఇష్టపడలేదు. పైగా దీనికి ‘్భస్వామ్య సాహిత్యం’ అని పేరు పెట్టి దాని అంతానికే సహకరించారు. నిజానికి వీరు తాళపత్రాలలో తమ సాహిత్యాన్ని వ్రాసుకున్నారు. రాగి శాసనాలలో విధి విధానాలు, చరిత్ర చెక్కుకున్నారు. వీటి ఆవిర్భావ వికాసాలను చరిత్రలో భాగం చేయలేకపోయాం.
ఈ ప్రజారాశుల వైజ్ఞానికాంశాలపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రజల తరఫున నిలవడం అంటే శిష్టకులాల, నేతల కోసం వారు నిరంతరం పోరాడాలనే మనం అనుకున్నాం. వాళ్ళని అలా తయారుచేశాం. ఆ ప్రజలను గౌరవ మర్యాదలతో చూసే దృక్పథం ఉంటే ఇలాంటి అంశాలను ఆదరంతో చూసేవాళ్ళం. కాని అది మన ఎజెండాలో లేదు. జానపద లిఖిత సాహిత్య భండాగారాన్ని గుర్తించలేదు. తద్వారా వారి లేఖన సంప్రదాయాలను, వాటిలోని జ్ఞానాంశాలను కూడా చరిత్రగా మలచుకోలేదు.
3.తత్వగీతాలు
తత్వగీత సాహిత్యం తెలుగులో ఒక ప్రత్యేక పాయగా, సాహిత్య విశిష్టతగా గుర్తించాలి. మత సామరస్యతకి ఉదాహరణగా పేర్కొని సాహిత్య వ్యవస్థలో భాగం చేయడం అవసరం. లౌకిక భావాలు, బతుకు భారాలను వ్యక్తీకరించే సాహిత్యం కేవలం అడుగు వర్గాలనుండే రావడం అత్యంత ముదావహం. పై వర్గాల సాహిత్యం అంతా కుల మత ఆధిపత్యమయం. భోగలాలస జీవితాన్ని నిరాకరించింది. వృత్తి జీవనం దెబ్బతినడాన్ని నమోదు చేసిన వాస్తవిక సాహిత్యం గురించి ఏ సాహిత్య చరిత్ర పట్టించుకోలేదు.
4.లేఖన, లిపి, వౌఖిక సాహిత్యాల గురించిన సమాచారం, సృజనాత్మక వ్యక్తీకరణ సామర్థ్యాలు, భాషా పాటవం వంటి వాటిని వెంటనే గుర్తించాలి.
ప్రజల వద్దగల అమోఘమైన కళాసాహిత్య సంపద గనులను తవ్వితీయవలసి వుంది. వీరి సృజన సామాజికమైనది. నిజమైన అట్టడుగు పొరలకు సంబంధించినది. కాని ఈ సాహిత్యం పాయని గుర్తించ నిరాకరించారు.
అంటరానితనం భావన వల్ల సాహిత్యం ఎంత కోల్పోయామో చెప్పలేం. ప్రగతిశీల రంగంలో ప్రజల పేరుతో పనిచేసేవారు కూడా ఈ ప్రభావానికి లోనుకావడం, విశ్వవిద్యాలయాలలో ఇలాంటి అంశాలపై పరిశోధించక పోవడం, మార్గదర్శకులు అందుకు అంగీకరించకపోవడం వంటి అనేక కారణాలవల్ల ఇలాంటి ఎన్నో అంశాలు గ్రంథస్థం కాలేదు. అందువల్ల సాహిత్య చరిత్రలో వాటికి స్థానం లేకుండా పోయంది.
అందుకే సమాంతర, మూల, పునాదుల సాహిత్యంగా గుర్తింపబడలేదు. దీని పక్కన ఎంతో తక్కువ శాతం జనాభా కలిగిన శిష్ట వర్గాల సాహిత్యమే గొప్పదై పోయంది.
ఇంకా ఇలాగే కొనసాగే ప్రవాహానికి అడ్డు వేసేదెవరు? ఎప్పుడు?

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242