తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

విశ్వనాథ సృజనకి బొడ్రాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక రచయిత ఎలా ప్రభావితుడవుతాడనే విషయంపై అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అభిప్రాయాలను రచయిత కూడా చెబుతాడు. లేదా అతని అభిమానులు, సమీక్షకులు, విమర్శకులు, పరిశోధకులు వ్యక్తం చేస్తారు. సాంప్రదాయ వర్గాలకు, కులాలకు చెం దిన వారు సరస్వతీదేవి కటాక్ష వీక్షణాల వల్లే రచనలు చేయగలిగారని చెప్పడం ఆనవాయితీ. ఇలాంటి కల్పనలు ఆపాదించడానికి చాలామంది వెనుకాడరు. సాహిత్య సామాజిక ఆర్థిక ఔన్నత్యం రచయితకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. వీరికి తీరిక, అధ్యయనం, రచనా భావుకత వంటి సౌలభ్యాలుంటాయి. సరస్వతి భాషా సాహిత్యాల దేవత. ఆమె అనుగ్రహం వల్లే రచన చేస్తారని విశ్వాసం. వాస్తవిక ఫ్రభావాలను విస్మరించగలిగి కవిత్వం రాయగలగడానికి సరస్వతీ కటాక్షం అనే భావనకి అధిక ప్రాధాన్యతనివ్వడం పండిత సాంప్రదాయిక భావన. దీనిని గురించిన చర్చ సాహిత్య వ్యవస్థలో జరగలేదు. కాల్పనిక భావనా తీవ్రతని విప్లవ వాదులు కూడా ఏ రూపంలోనూ శాస్ర్తియంగా ఆలోచించలేదు. భౌతిక ప్రభావాలు ఉంటాయని విప్లవ రచయితలు చెప్పలేదు. పైగా పండిత వర్గాల భావాలను నిశ్శబ్దంగా ఆమోదించారు. దానికి కారణం వర్గకుల ఆధిపత్యాల పట్ల చూసీ చూడనితనం. వారితో పేచీ ఎందుకనే ఆలోచన. పండితవర్గ కవులతో అక్షర నేతల సత్‌బంధాలూ ఒక కారణమే. అందుకే జీవితంలో ఎన్ని అవలక్షణాలున్నా, క్షీణ సినీ సంస్కృతి అనే మలినంలో జీవించిన శ్రీశ్రీ కొందరికి ఆరాధనీయుడే. కొన్ని తరాలు సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోని విశ్వనాథ సత్యనారాయణ వంటి కవులనూ నిర్మాణాత్మకంగా ఎవరూ విమర్శించలేదు. ఇది ఒక పార్శ్వం.
ఐతే రచయిత తన రచనని ఎలా తీర్చి దిద్దుతాడనేది ప్రశ్న. ఒక చిత్రకారుడు అజంతా, ఎల్లోరా గుహ చిత్రాలలో చిత్రించిన అలంకరణలు, వృత్తి పరకరాలు, మనుషులు ఊహ కాదు. ఆనాడు తన కళ్లతో తన పరిసరాలలో చూసినవే. ప్రస్తుతం ఎంతటి ఛాయాచిత్రకారుడైనా సమాజంలో, ప్రకృతిలో కానవచ్చే వాస్తవిక దృశ్యాలనే ఫొటోలుగా తీస్తాడు. ఫోటో కోణం, వెలుగు నీడల సమ్మేళనం, కన్ను చూసే అతి పెద్ద దృశ్యాన్ని తన సూక్ష్మదృష్టితో చూసే తీరు ఫొటోలను కళాఖండాలు చేస్తాయి. అలాగే రచయిత కూడా, కాకపోతే కాల్పనిక అనుభవ శక్తిని అక్షరాలలో పొందుపరుస్తాడు. దానివల్ల చాలాసార్లు అది అవాస్తవికతగా మారుతుంది. ఈ అవాస్తవికతని కూడా కవి ప్రతిభ అని భావించిన సందర్భాలున్నాయి. నిజానికి కవిపై అతని జీవితంలోని ఎలాంటి శక్తులు ప్రభావితం చేస్తాయనడానికి ఏ రచయితా, కవి ఎక్కడా వివరంగా చెప్పలేదు. కాని ‘కవిసమ్రాట్’ విశ్వనాథ చెప్పుకున్నారు. అదీ ఆయన గొప్పతనం. అది ఎలా ఉందో చూద్దాం.
***
విశ్వనాథ ఆత్మకథ 1979లో అచ్చయ్యింది. దీనిని వారు 1971-72లో రాసి ఉంటారు. మొదటి పేజీలలో ‘నా రచన ప్రధాన ఉద్దేశ్యమేనగా నా వైరాగ్యము, నా భగవద్భక్తి, నా సంప్రదాయ బుద్ధి లక్షణము...’’ ఇవీ ప్రధానంగా రాస్తున్నాను అని రాశాడు. ఆయన కృష్ణా జిల్లా నందమూరులో పుట్టి పెరిగారు. ఆ ఊరిని వీరి పూర్వులే పొందించారు. అక్కడ అనారోగ్యంతో, అహంకారాదులు హెచ్చు. శరీర దృష్టి తక్కువ. గిల్లికజ్జాలు, గొడవలు, పరులను రెచ్చగొట్టడం, మాటలు సూదుల వలె గుచ్చడం ఇలాంటి బాల్యం అతనిది. ఆస్తి ఉంది కాబట్టి వ్యవసాయం చేసుకుని బతకవచ్చనే ధీమా ఉంది. అందుకే స్కూలు చదువు కాకుండా ‘పెద్ద పుస్తకం’ చదివాడు. భారతం, భాగవతం, భాస్కర రామాయణం ఈ మూడింటిని ‘పెద్ద పుస్తకం’ అనేవారు. కాని సైన్సు, సృష్టి పరిణామక్రమం, విద్యలు, పిండోత్పత్తి, జీవశాస్త్రం వంటివి పెద్దపుస్తకంలో లేవు. మరి వీటి గురించి ప్రజలకు ఎలా తెలిసేది?
జన్మ ఎత్తినందుకు అ న్నోదకాలు ముఖ్యం. ఆ తరువాత జ్ఞాన సం పాదనం, ధన సంపాదన కావాలి. అవి రెండు రకాలుగా తెలుస్తాయి. చదవడం, వినడం ద్వారా కలుగుతాయి. అక్షరాస్యులు చదివి సంపాదించేవారు. నిరక్షరాస్యులు విని సంపాదించేవారు. వినడానికి పురాణాలు, హరికథలు, వీధి నాటకాలు, తోలుబొమ్మలు, పలు మంది బిచ్చగాండ్రు, సాతానులు, సర్వవైష్ణవ సంప్రదాయం తెలియజెప్పుటకు, జంగములు, సర్వశైవ సంప్రదాయములు చెప్పుటకు- వీరందరు సర్వప్రజలకు జ్ఞానోపదేశము చేసెడివారు (పేజీ 10) అని విశ్వనాథ రాశారు. అలా రాత, నోటి సాహిత్యాల స్వరూప స్వభావాల గురిచి స్పష్టంగాను, గొప్పగాను రాసినవాడు విశ్వనాథే. ప్రజల గురించి అభ్యుదయ ప్రగతిశీల, విప్లవ సాహిత్యకారులకి ఈ స్పృహ లేకపోవడం విచారకరం. ఇలాంటి ఎన్నో విషయాలను ఆత్మకథలో గ్రంథస్తం చేయడమే కాదు అవి తన రచనలో ఎలా ప్రతిబింబించాయో కూడా రాశాడు.
‘నేను వ్రాసిన నవలల నిండా, పద్య గ్రంథముల నిండా, నాటకముల నిండా తెలుగు నుడికారములు, తెలుగు పలుకుబళ్ళు, తెలుగు సామెతలు తెలుగు వాక్యములు నిర్మించెడి చిత్ర చిత్రములైన వైఖరులు వందలువందలుగా కుప్పలు కుప్పలుగా నుండును. నా కావ్యముల యందు సంస్కృత భాష యెక్కువగా నుండునన్న వారికి తెలిసిన తెలుగు పేలవమైనది. అది నిఖారసు తెలుగు కాదు. గడుసు తెలుగు కాదు,నా ఆంధ్ర భాషా పాండిత్యమునకు ప్రధాన గురువు మా తండ్రి, నా కుటుంబము, మా యూరు, ఆనాటి బిచ్చగాండ్రు, మా పాలేళ్లు.’’
అలాంటి నన్ను అక్షరాస్యునిగా చేయాలని శతకాలు, గుణింతాలు నేర్పించాలనుకోవడం వింతే. తన ఊరిలో ప్రదర్శించే నాటకాలు, వీధి భాగోతాలు వల్లే గొప్ప కవిత్వము రాయగలిగానని బల్లగుద్ది ఇలా చెప్పాడు.
‘నాకు ప్రధానముగా కవిత్వము వచ్చుటకు, కవినగుటకు అనంతకల్పనలు చేయగలుగుటకు, నిరాఘాటముగా వర్ణనలు సాగించుటకు పలుచోట్ల యథాతథముగా వర్ణించునట్లు కన్పించుటకు నాకిది యంతయు పునాదియైనది’’ అని ప్రకటించాడు. విశ్వనాథ వారు పెద్ద సోమరి. చూస్తే నాటకాలు, ఆడితే చీట్ల పేకాట, శరీర కష్టపు ఆటలు లేవు. అక్కగారలతో పచ్చీసు ఆట, ఆడేవాడుంటే జూదం. ఐనా తానే ఆటలో గెలవనని కూడా చెప్పుకున్నాడు.
ఒకసారి మదరాసులో చిలుకూరి నారాయణరావు, వేటూరి ప్రభాకర శాస్ర్తీ, త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి పెద్దలకు ‘రుతుసంహారం’ పద్యాలు వినిపించాడు. ఇంత గొప్పగా ఎలా రాశారని మెచ్చుకోలుగా వారు అడిగారట. వెంటనే విశ్వనాథ తమ ఊరిలోని వేమండ కాలువ, తుమ్మలారి చెరువు, కొండయ్య కాలువ పక్కన మండ్రగబ్బలు, తేళ్ళు, ఎండ్రకాయల వంటి ఎన్నో జీవ జంతువులు ఉండేవి. అప్పుడు చూసిన జ్ఞాపకాలను రుణ సంహార పద్యాలు చేశాను అంతేకదా అని చెప్పారు. ‘నా చిన్ననాటి మా ఊరిలోని ప్రకృతి శోభ నేను నా గ్రంథముల నిండ వ్రాసితిననుట. ఆ అనుభూతి... ఊరు దయతో చూపించిన శోభ నా గ్రంథముల యందంతట ఉండును (పే.25)’ అని చెప్పాడు.
‘బందరులో రామన్నపేట కంపెనీ నాటక సమాజం ఉంది. పెడన సుబ్బయ్యగారు భీముని వేషం వేసేవారు. అప్పుడు విన్న పద్యాలు నాకు రాత భారత భాగవతముల కంటే వేరు సాహిత్యమున్నదని దానియందు ఎక్కువ సౌందర్యమున్నదని తెలిసినది’’ (పే.29) సమాంతర వౌఖిక, పౌరాణిక, కథలు, ప్రదర్శనలు తనని ఎంత ప్రభావితం చేసిందో రాశాడు.
విశ్వనాథ రచనలకు మొదటి శ్రోత ఆయన తమ్ముడు వెంకటేశ్వర్లే. ‘ఇందులో నీ గొప్పయేమున్నది. అన్నియు (చిన్నతనంలో) నీవు చూచినవే. ఎరిగినవే. అన్ని పాత్రలు మన బంధువులలో, మన స్నేహితులలో నున్నవారే’’ అని అన్నాడు. చూడ్డానికి ఈ విషయం చిన్నదే. కాని విశ్వనాథ పౌరాణిక కల్పనలలో కూడా తన కాలము నాటి ఆరి అనుభవాలే అంతటా. తన పనె్నండేళ్ల వయసులో గొల్ల భాగవతులు, వీధి నాటకాల గురించి రాస్తూ- ‘ఆ నాటకము నాలో క్రొత్తక్రొత్త భావములను రేకెత్తించెను. లీలావతికి నారదుడు నారాయణ మహాత్మ్యము నేర్పి తాను మింట వెడలిపోయెను. ఆయన యాకాశమున నెగిరిపోవుటకు సూచించుటకు వారొక కీర్తన పాడిరి. ఆ కీర్తనలోని మాటలు, రాగము, తాళము నారదుడు మింట నెగిరిపోవుచున్నట్లనిపించెను. అది నాకు కలిగిన ప్రథమ జ్ఞానోదయ చిహ్నము. రాగతాళముల తత్త్వము నాకు తెలిసినట్లుండెను. అవి యన్నియు భావ పరిపూర్ణములన్నమాట.
రెండవది- హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పాముల చేత కఱపించును. పాముల వాండ్ర వేషములు వచ్చెను. వారు చెప్పిన విషముల పేర్లు, వారు చెప్పిన సర్పముల పేర్లు నాకాశ్చర్యము గల్పినవి. నేను తరువాత పెద్దవాడనయి మదరాసు మొదలగు చోట్ల సర్పములను లాటిన్ భాషలో వ్రాసిన వాటి పేర్లను చదివి పలుసార్లనుకొంటిని. ‘‘అయ్యో! ఈ విద్యయంతయు కూచిపూడి వారు నేర్పెడివారు కదా! అందరునింగ్లీషు చదువున కెగబడి దేశమున నీ విద్యలన్నియు జంతు ప్రదర్శనశాలల కెక్కినవి. నాడిట్టి విద్యలు సర్వజనులకు కరతలామలకముగా నుండెడివి’’ అని వాపోయారు. ఈ భావన ఎంతో సరైనది. దేశీయ జ్ఞానాన్ని మరవడం అభ్యుదయ వాదులు చేసిన తప్పేకదా. విశ్వనాథ వారి ఈ పుస్తకం వల్ల చ్యిర్యీళకి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ‘పరకల వారు’ అనే ఉపకులం వారు ప్రత్యేక నాటకాలు ఆడేవారట. ఇవి కూచిపూడి నాటకాల వలనే ఉండేవి. సాతానుల వైష్ణవ గానాలు, రాగాలు తీసిన తీరు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవవలసిందే.
విశ్వనాథ ఎంత సంప్రదాయవాదో అంత ఆధునికతను వంటబట్టించుకున్నాడు. అట్లని ఈ ఆధునికత తన రచనలలోకి రాలేదని, రాకూడదని తెలుసు. పుట్టుక, పుట్టిన కాలపుప్రభావాల నుండి ఆయన శరీరం దూరం పోలేదు. ఇతివృత్తానికి తన బాల్యపు అనుభవాలను రంగరించినాడు కనుకే సంప్రదాయంలో సైతం పూచిన నవ్యత తన రచనలకి సుగంధమై ఒప్పింది. పేకాట, ఇంగ్లీషు సినిమాలు చూడడం వంటి అలవాట్లని ఆయన ఏనాడూ దాచుకోలేదు. ‘వీరవల్లడు’ వంటి నవలలు రాసి, రామాయణాది రచనలు చేసి మెప్పు పొందాడు. వచనంలో దిట్టతనం, కవిత్వపు పెద్దపీట దక్కించుకున్న వారిలో అగ్రజుడు. ఆయన తన నిజ జీవితంలో మాత్రం సంప్రదాయాన్ని పక్కనపెట్టి నలుగురితో జీవించాడు. ముప్పై ఏళ్లు పూటకూళ్లింట్లో, వసతిగృహాల్లో తిన్నాడు. అన్ని రకాల మిత్రులు ఆయనకి ఉన్నారు. ఆయన చివరి పేజీలో రాసుకున్న విషయాన్ని బట్టి అన్ని కులాల స్నేహితులు ఉన్నారు. నేటి బ్రాహ్మణులు.. బ్రాహ్మణులే కారని, వీరు అష్టాదశ మహాపావులని పెద్దపెద్ద గ్రంథములు రాసి ప్రచారము చేసిన దుగ్గిరాల రామచంద్రయ్య చౌదరి మేమిద్దరము ఇప్పుడున్ను స్నేహితులమే’’ అని మిత్రులకు చెప్పుకున్నాడు.
విశ్వనాథ విశాల హృదయం గాంచని విశ్వనాథ శిష్యుల పరిమితులు విశ్వనాథకి ఏమైనా మేలు చేశాయా? అనే సందేహం వస్తున్నది. అందుకే రచయిత జీవితం రచన కన్నా ఎక్కువ సృజనాత్మకమైనది. అదే అతని రచనల పునాది! దాన్ని అర్థం చేసుకోవడం విమర్శకులకు అవసరం. అప్పుడు విశ్వనాథ కనిపించే దృశ్యం వేరే.
*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242