తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

జన వసంతం పులకించే వేళ రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేమ ఉండాల్సిన గాలిలో తాపం పెరిగింది. ఉష్ణం తాకాల్సిన కాలంలో శీతలం వీస్తోంది. ఎడారిలో మంచు. మంచు పొరలు కమ్మాల్సిన పైన్ వృక్షాల పరిసరాల్లో కమురు వాసన.
నీరు నాటాల్సిన మేఘంలో శూన్యం. శూన్యంలో నీటి భగభగ. రుతువులు తారుమారయ్యాయి. ఖండాలు దాటి, ధృవాలు దాటి బదిలీ అయ్యాయి.
కాలవల్లో నీటికి బదులు వర్షం కార్చిన కన్నీరు. చెరువులో వికసించాల్సిన తామరలు అడుగంటిన నెర్రెల ఇసుక పొరల కింద.. కంటికి కనబడని తామరలకోసం తుమ్మెదల ఉద్రిక్త ఊరేగింపు.
సాగర తీరంలో కదం తొక్కిన శబ్దం, ధ్వని రహితంగా నిస్తేజితం.
కుడి ఎడమలు రెండూ తెగిపడిన మొండేల చివరి కదలికలు.
ప్రారంభించిన పని ప్రయోజనం, భవిష్యత్ పాస్‌బుక్‌లో నమోదై ఉంది. పాస్‌వర్డ్‌లే కాదు అత్యంత రహస్యమైన జీవకణజాలం జాడలూ బహిర్గతం. ఇప్పుడు శరీరాలే కాదు ప్రాక్తన ఆత్మల ఘోషలు సైతం డిఎన్‌ఎలై పలకరిస్తున్నాయి. మనకి మాత్రం మనం అంతా రహస్యం.
మేఘాలు వచ్చి నేలమీది గడ్డికి నిప్పంటిస్తున్నాయి. ఉరుములు, మెరుపులు ఆకాశంలో తమలో తాము అమీతుమీగా కలహించుకుంటున్నాయి. ఆగ్రహావేశాలతో రాపిడి రవ్వలై నేల రాలుతున్నాయి. రాదు వర్షం. పైన భూమి, కాళ్ళకింద మబ్బుల లోకం. అసలు ఉండాల్సిన చోట ఆకాశం ఉందా? నీరిప్పుడు ఎటు పారుతుందో తెలియదు. పల్లం లేని లోకం. అంతా ఎత్తులే. నీళ్ళకి రాకాసి కాళ్లు మొలిచి పైపైకి ఎగదోసుకువెళతాయి. పంటలు డాబా ఇంటిమీద వాలతాయి. గాలిని మధించి తీసిన నీటి చుక్కల్ని ఇనప్పెట్టెలో దాచుకోవచ్చు. బ్యాంకు లాకర్లని పగలగొట్టడానికి అంతర్జాతీయ కుట్రలకు తెరతీయవచ్చు.
నీటి ప్రాజెక్టులన్నీ మనిషి అనాలోచిత అసమర్థ నిర్ణయాలని సైన్ బోర్డులమీద రాసిపెడతారు. అపుడు ఆ భారీ నీటి పథకాల నిండా ఖర్చయిన కరెన్సీ విలవిల. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇస్తే చెరువెడు నీళ్ళు, పోస్తే ప్రాజెక్టులలో కనబడని జలం. ఇవ్వలేకపోతే యుగాలు బానిసలుగా మారాలని ఒప్పందం. పథకాల నిండా భారీ జలగలు. తమకి అన్యాయం చేసిన ఇంజనీర్లని, అధికార్లని, పైపులైన్ల నిపుణులను, కాంట్రాక్టర్లనీ వదలకుండా వాటేసుకున్నాయి. ఇది జలగల కాలం. అవి పెరిగి పెరిగి విస్తరిస్తాయి. సెక్రటేరియట్లలోకి, విధాన, చట్టసభల్లోకి ప్రవేశిస్తాయి. జలగలు బతకాలంటే నీళ్ళు కాదు రక్తం కావాలి. వాటికి రక్తకాసారం కావాలి.
చైనా గోడ ఇవ్వాళ అవసరం లేదు. కోటలూ, కందకాలు నిన్నటి అవసరం. పాలకుల సంక్షేమం వేరు. అందుకోసమే నిర్మాణాలు. ఏది కట్టినా, ఏది కూల్చినా అవి రేపటికి జోకుల్లా మారతాయి. చెరువులు నిర్మించడం వేరు. పూడికల పేర నిలువు తవ్వకాలు వేరు. మొదటిది ప్రకృతి. రెండోది వికృతి. ఇది వికృతి విలయతాండవం చేసే సమయం.
***
ప్రతి నిర్మాణం అమేయం, స్థిరం అని పాలకులు అనుకుంటారు. కాని అదెంత తప్పో, రేపు నుదుటిమీద రాయబడిన దానిని చూడలేరు. ఇప్పుడు మరేమీ లేదట. జలయజ్ఞాలే తప్ప. ప్రజల బతుక్కీ భరోసా లేనిచోట ఒకే రంగంమీద ఇంత మక్కువ ఏలనో ఎవరికైనా అర్థం అవుతున్నదా. ప్రజలు ఆలోచిస్తారు. కాని వారి తరఫున స్వరం కావాల్సిన కలం గళాలు ఎక్కడున్నాయి. రాజకీయ ప్రతినిధులు తమ కేంద్రకంలోంచి ఆలోచిస్తారు. ఉద్యమం చేస్తారు. అలసిపోయి ఆలోచిస్తే తాము మరెక్కడో తేలామని తెలుసుకోరు. అందుకే రాజకీయ దృక్కోణాలు కాదిప్పుడు సామాజిక వాస్తవికతలోంచి మాట్లాడగలగాలి. ఇపుడు ఎన్నికల ప్రయోజనం కోసం మాత్రమే రాజకీయ పార్టీలు మాట్లాడతాయి. తమ గెలుపుకోసమే కూటములు. ప్రజల్ని గెలిపించేవాడే గెలుస్తాడని విశ్వసించడు. ఇదే వ్యక్తివాదం. పార్టీల నిండా వ్యాపించిన జాడ్యం. అందుకే నిర్మాణాల వల్ల వ్యక్తులకు ఎంత లాభం ఉందో, ప్రజలకు అంత అన్యాయం జరిగే వీలుంది. అందుకే ప్రతి చిన్న నిర్మాణం వెనుక దాగిన అలసత్వం, తెలీని స్వార్థం పిడికిట్లో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఇందుకు విప్లవ ప్రజా సంఘాలు, పోరాటపార్టీల నిర్మాణాలు అన్నీ బలహీనపడుతున్న విషయం వాస్తవం. ఐనా వాళ్ళు అందుకు ఒప్పుకోరు. పైగా స్వరం పెంచి వాదులాటకు దిగుతారు. శత్రువుతో చేయాల్సిన కుస్తీ మిత్రులతో చేస్తారు.
పాలకులు తమ నిజాయితీ కోల్పోయినప్పుడు ప్రచార సాధనాలను ప్రయోగిస్తాడు. తన పథకాలకు చట్టపరమైన కోటను నిర్మిస్తాడు. అంతేకాని ప్రజలకు వాటి గురించి విప్పిచెప్పడు. ఆ చెప్పలేనితనంలోంచి అసమానత, అసమంజసత్వం జనిస్తాయి. ఇవి ఉన్నచోట న్యాయం జరగదు. తనవైపే న్యాయం ఉందని నిరూపించడానికి నిరంతరం న్యాయపోరాటం చేస్తాడు. న్యాయవ్యవస్థ ఎప్పుడూ పాలకుల కొమ్ముకాస్తుంది. అప్పుడప్పుడు అక్కడక్కడ ఓసారి, ఓ న్యాయాధీశుడు తన తీరును ప్రజలకి అంకితం చేస్తాడు. మరో పైస్థాయిలో అదే న్యాయస్థానం తిరిగి ప్రజలకు శాపం అవుతుంది. న్యాయం జరగని చోట రాజ్యాంగం తలదించుకుంటుంది. తనని తాను విస్మృతం చేసుకుంటుంది. అశాంతికి గురవుతుంది. పోలీసు శాఖ శాంతి భద్రతల పేరుతో, రంగప్రవేశం చేస్తుంది. నిజంగానే అప్పుడు శాంతిలో అలజడి మొదలవుతుంది. అక్కడే ‘ప్రేమ’, ‘అనురాగం’ దూరం అవుతాయి. బలిదానాలు చేసి సాధించుకున్న విజయాలే తమకు అపజయం భావనని ప్రోదిచేస్తుంది. ప్రతిపక్షం లేదు. ప్రజల హేతుబద్ధ ఆందోళనా రూపాల్ని కూడా ప్రతిపక్షం చేయడం విచారకరం.
***
కేంద్రం, రాష్ట్రం కలసికట్టుగా ప్రజల స్వేచ్ఛని అరికట్టాలని చూస్తున్నపుడు ఐక్యత లేని అన్ని రకాల నిర్మాణాలు, సంఘాలు చరిత్రలో మరోసారి పాలకుల ప్రయోజనాలకే పని చేసినట్లే కదా!
హరిత విప్లవం పేరుతో రసాయన, విదేశీ ఎరువులు, విత్తన ప్రాబల్యంలోకి దిగబడిపోయాం. ఆనాడు రష్యాతో దౌత్య సంబంధాల పేరుతో పొరుగు దేశాలతో శత్రుత్వం వహించాం. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఒక్కటయ్యాం. మరిప్పుడు వేరు పడ్డాం. ఒకే భాష అన్నాం. మరో భాషని చిన్నచూపు చూశాం. పాలకులు సంస్కృతమే వాడారు. ప్రజలు తెలుగే పోషించారు. పాలకులు, ప్రజలు భిన్న ధ్రువాలని నిత్యం నిరూపింపబడుతున్న సత్యం.
మంచివాడి పాలనలో -
మేధావులు నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. సంపద, మంచితనం న్యాయబద్ధంగా ఉండాలి. నిజాయితీగల ప్రజల ఆశీస్సు అందాలి. ప్రజలు ధైర్యవంతులై సాహస ప్రియులుగా ఉండాలి. అలాంటి ‘రాజ్యం’లో సరైన పాలన అందించేవాడే గొప్పవాడు. వీటిని దక్షతతో నిలుపుకోవాలి. పాలన కళ తెలియని వాడికి ఇవన్నీ అప్రస్తుతాలే. అంతేకాదు, తనకి వ్యతిరేకం అనుకుంటాడు. అందుకే వాటిపై నిరంతర నిఘా. అలాంటి లక్షణాలను తుంచేయడమే పాలన అనుకుంటాడు. అతని పాలనా స్వభావం తెలిసి కూడా ప్రశ్నించని నిశ్శబ్ద విప్లవకారులు ఉన్న రాజ్యంలో ఎలాంటి మార్పు రాదు. నినాదాలు తప్పు.
ఇలాంటి ఒక దశలో ‘ని చిళ్ఘూ జ్ఘూఒ, ఘశజూ ని చిళ్ఘూ ఆజషరీఒఆ్యఒ, ఘశజూ త్యీఒఆ ని చిళ్ఘూ ఒజళశఆ ఒఖఔఔ్యఆ‘ అంటాడు ఒక పాలకుడు.
పాలకులకు ఉన్న నిజాయితీ ఇపుడు ప్రగతిశీలవాదులకు లేకపోవడం విచిత్రం. తమ వ్యక్తిగత స్వార్థం కోసం మొత్తం సమాజంలోని ప్రశ్నించే తత్వానికి గండికొడతారు. విచక్షణ శక్తిని తారుస్తారు. పైకి అన్నీ డాంబిక ప్రవచనాలే. ఈ తంతు ఉన్నత వర్గ కుల శ్రేణుల ఆచరణ. అందుకే వారు యుద్ధరథానికి సిద్ధాంతాన్ని ముందు పెట్టి ఆ వెనుక ఆచరణని కట్టిపడేస్తారు. ప్రజలు, కింది వర్గాలను ఆచరణలో పెట్టి పాలకులలాగా తాము గుర్రంపై హాయిగా స్వారీ చేస్తుంటారు. ‘రాజ్యం’ ఇక్కడ కూడా అనువుగా రాజ్యం చేస్తుంది. అందుకే భారతీయ సమాజంలో మార్పులు తక్కువ. ఆర్భాటాలే అధికం. ఈ లక్షణం పాలకులకి తెలుసు. అందుకే వారు ఆడింది ఆట పాడింది పాట.
పాలకులకి ప్రతిపక్షాలు శత్రువులు కాదు. చిన్న చిన్న సర్దుబాట్లు మాత్రమే అసలు భయం విప్లవాలు. కాని వాటిని హాయిగా విప్లవ శ్రేణులలోని పై కుల వర్గాలవారు కరస్పర్శలతో క్యాష్ చేసుకుంటారు. ఇలా పాలకులు స్వీయ నిర్ణయాలతో ప్రజలకు భవిష్యత్తులో ఉపయోగపడని పథకాలే చేపడతారు. తమకు ఆనందం కలిగించే విధానాలుగా, విజయాలుగా ప్రచారం చేస్తుంటారు.
ఇపుడు పాలక వర్గాల ప్రయోజనాలలో కొంతమంది విప్లవ అగ్ర సామాజిక వర్గాలకి చెందినవారి పాత్ర మిళితమై ఉందనేది కనుపిస్తున్న వాస్తవం.
మరి, ప్రజలకు ఇప్పుడు ఆసరా ఎవరు?
ఎవరూ ఉండరు!
తమకు తామే ముందుకు రావాలి. అలా వచ్చిన తరుణంలో పాలకుల స్వభావమే కాదు, ప్రతిపక్షాల, ప్రగతి నినాదాల బండారం బట్టబయలు అవుతుంది. అప్పుడే నిజమైన ప్రజా రాజకీయాలు ప్రారంభం అవుతాయి. ప్రకృతి తిరిగి తన స్థానం ఆక్రమిస్తుంది. వసంతం పులకించే వేళ అందరం ఒక్కటవుదాం! ‘ భారీ’ భావనని తెగనరుకుదాం.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242