తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

జినేంద్రానే్వషణలో జ్ఞానేంద్రియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగాది వేడుకల్ని వారం రోజుల ముందే హోసూరు ‘బస్తీ యువక బృందం’ ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమాల నిర్వాహకుడు అగరం వసంత్. అతను వృత్తిరీత్యా వైద్యుడు. గోళీలు, సూదులతోనే కాదు, అక్షరాలతో వైద్యం చేస్తాడు. సాహిత్య సేద్యం చేస్తాడు. అక్కడ తెలుగుమీద మక్కువ ఎక్కువ. తెలుగుకోసం ఏమైనా చేస్తారు. తెలుగు బడులు నిలుపుకోవడం కోసం ఉద్యమాలు చేశారు. తమ ప్రాంతీయ తెలుగు భాష (మొరసనాడు భాష) కోసం జైళ్ళకు కూడా వెళ్లి వచ్చారు. నిజానికి వారి తెలుగు - ప్రధాన స్రవంతి తెలుగుకన్నా ఎంతో విలక్షణమైనది. వారి యాస, పలుకుబడి కొత్తది. దానిలో సంస్కృత పదాలు తక్కువ. అక్కడి రచయితలు తమ దేశీ / ప్రాంత తెలుగు నుడికే ప్రాధాన్యతనిస్తారు. అది సజీవ భాష. పాత పుస్తకాలలో కనుపించదు. కాని కొత్త పుస్తకాలలో అక్కడి రచయితలు దాన్ని గ్రంథస్థం చేస్తున్న తీరు గొప్పది. భాషా ప్రజాస్వామ్యం గౌరవంగా తలెత్తుకుని నిలిచింది. అగ్రవర్ణాల, వర్గాల భాష, కింది వర్గాల భాష అని లేదు. అందరిదీ ఒకే భాష. తమ మూల పదాలను కాదని సంస్కృత, ఆంగ్ల పదాలను వారు తిరస్కరిస్తారు. ఎంత సులభంగా తిరస్కరిస్తారంటే, అది తిరస్కారంలాగా అనుపించదు. ఈ పదాలు మావి. ఇవి ఉండగా వేరే పదాలు దండగ అని వారి భావన.
రెండు తెలుగు రాష్ట్రాలలో రచయితలు మరిచిపోతున్న మాండలిక స్పృహ హోసూరు సృజనలో జవజీవాలతో రంకెలేస్తున్నది. సామాజిక వాస్తవికతకు ఆ రచనలు అద్దమయ్యాయి. కాల్పనిక పేరుతో అసమంజసాలను ఇతివృత్తం చేయడం లేదు. ప్రయోగం పేరుతో ప్రయోజనాన్ని ఖూనీ చేయడం లేదు. ప్రధాన స్రవంతి సాహిత్యంతో పోటీపడి బొప్పి కట్టించుకోవడానికి ఇష్టపడ్డంలేదు. దానిని గుర్తించకుండానే తమదైన నేల పరిమళాల్ని అక్షరాల అత్తరు సీసాలు చేస్తున్నారు. ఒక ప్రాంతీయ మాండలిక భాషలో ఇంతమొత్తంగా సమాజాన్ని, సాధారణ ప్రజల జీవితాన్ని చిత్రించిన వైనం మరో భాషలో కనబడదంటే అతిశయోక్తి కాదు. కలం పట్టిన కొత్త రచయిత కూడా సాహిత్య గోదాలో పోటీపడడానికి తయార్ అన్నట్లుంటుంది ధీమా. ఆ కలాల నిజాయితీ అంతటిది. వారికి తమ భాష అలాంటి స్ఫూర్తి ఇస్తుందని భావిస్తారు. ప్రతి రచయిత తనదైన శైలిని సహజంగా సాధిస్తాడు.
ఒక్క అగరం వసంత్‌నే ఉదాహరణకి తీసుకుందాం. అతను తనని తాను తెలుగు భాషోద్యమ సమాఖ్య సభ్యుడిగా చెప్పుకోవడానికే ఇష్టపడుతాడు. నవ్యత సాధించడానికి ప్రయత్నిస్తాడు. తెల్ల కొక్కర్ల తెప్పం, వెండి మొయిళ్ళు, బండ బతుకులు, ఆటాడుకుందాం..రా, దణి, సామెతల సప్పరం అనే ఆరు కథా సంకలనాలు వెలువరించాడు. నిజానికి ఇవి అన్నీ కథలు కావు. ఒక్కొక్క ఆటని ఒక కథగా మలిచాడు. ఒక్కో సామెతని ఒక ‘ఉదంతం’ చేశాడు. ఐతే వీటిలో ఒక సామాజిక కోణం తప్పనిసరి. ఒక్కో సామెతను ఒక కథలో ఇమిడ్చి కథనం చేశాడు. ఈ కథల్లో పాత్రలు ఉండవు. కథేతివృత్తం కానరాదు. ఐనా కులం, మతం పేరుతో సమాజంలోని అరాచకాలపై వేసిన చురకలుగా వీటిని చూడవచ్చు.
గోమాంస నిషేధం పేర జరుగుతున్న హింసాకృత్యాలను చూసి, నిజానికి మాంసం తినడం మనిషి అవసరం. నంజర తిని రుచి పళిగిన నాలిక మనిషిది. నంజర తింటే తప్పేం లేదు. మనిషి సచ్చినంక మన నంజర (మాంసం)ని పురుగులు తిని జీర్ణం చేసుకుంటాయి. ఇది ప్రకృతి ధర్మం. దీన్ని అర్థం చేసుకోని మతవాదులు, మనిషివాదాన్ని విస్మరిస్తారని అంటాడు. మతం మనిషిని రాక్షసునిగా మార్చిందని, ఈ వాదంలో ప్రకృతి మరణించిందనే భావన సామెతల కథల్లో కనుపిస్తాయి. ‘ఆటాడుకుందాం.. రా’ కథలు ఆడియో సీడీగా విడుదలైంది.
హోసూరు సాహిత్య నక్షత్రం కెం.మునిరాజు ‘చిలకలు వాలిన చిక్కుడు చెట్టు’ పాటల పుస్తకం దళిత స్ర్తిలు పాడే పాటలు సంకలనం. స.రఘునాథ సేకరించిన ‘అలసంది పూసింది’ పాటల సంకలనం ప్రజలు పాడుకునే పాటల కూర్పు.
ఇలా నోటి సాహిత్యం, రాత సాహిత్యానికి సమస్థాయి ఇచ్చిన హోసూరు తెలుగు రచయితల్ని అభినందించక తప్పదు. ‘అనప పువ్వులు’ వచన కవితా సంకలనాన్ని అగరం వసంత్ సంపాదకత్వంలో వెలువడింది. తెలుగు రాష్ట్రాల కవులు, పొరుగు రాష్ట్రాలలోని తెలుగు కవుల కవితల గంప. ఉగాది ఒక బహానా. తెలుగులో నూతన సాహిత్య వేడుకలుగా సాగింది సభ.
***
అదే రోజు సాయంకాలం పంపన రాశారని భావిస్తున్న పదో శతాబ్దపు తెలుగు గ్రంథం జినేంద్ర విజయం లేదా పురాణం రాతప్రతి కోసం మా బృందం శ్రావణబెళగోళలోని ప్రాచీన రాతప్రతుల భాండాగారం, మేల్కోటేలోని రాతప్రతుల విభాగం పరిశీలించాలనే ఆశతో బయలుదేరాం.
బెంగళూరులోని తెలుగు రచయిత ఘట్టమనేని అశ్వత్థ నారాయణగారు, ప్రొ. జి.ఎస్.మోహన్‌లని సంప్రదిస్తూ మార్గం సుగమం చేసుకున్నాం. ఘట్టమనేనిగారు మాటల్లో బెంగళూరు రైల్వే స్టేషన్ దగ్గర వున్న తోటదప్ప సత్రంలో ప్రాచీన రాత ప్రతులు ఉన్నాయని సమాచారం ఇచ్చారు. అక్కడా వెదికాం. లాభం లేదు. చాలాకాలం కిందే పురుగుపట్టి పాడయిన రాతప్రతులను పడవేశారని తెలిసింది. ఇపుడు వాటి గురించి చెప్పేవారెవరూ అక్కడలేరు.
పనె్నండేళ్ళ కింద, 2007లోనే హోసూరులోని ఆంధ్ర సాంస్కృతిక సమితి భవనంలోని గ్రంథాలయంలో ఉన్న పాడయిన కొన్ని ప్రాచీన తాళపత్ర గ్రంథాలను హైదరాబాద్‌లోని ప్రాచీన రాతప్రతుల గ్రంథాలయానికి తరలించాం. కాని అవి చాలావరకు దెబ్బతిన్నాయి. అలా మన కళ్ళముందే రాతప్రతులు క్రిమికీటకాలవల్ల ధ్వంసం అయ్యాయి. ఈ విషయం ఎన్నోచోట్ల కళ్లతో చూసిన అనుభవం వుంది. ఐనా మానవ ప్రయత్నం తప్పదు. ఎందుకోగాని జైన కవులు రాసిన గొప్ప గ్రంథాలు, వారు తెలుగులో రాసిన కావ్యరచనలు చాలావరకు పోయాయి.
పంప మహాకవి తెలంగాణాలో కరీంనగర్ జిల్లాలోని కురిక్యాల శాసనం రాశాడు. అందులో తెలుగులో కందాలు, సంస్కృత శ్లోకాలు, కన్నడ పద్యాలు చెక్కి ఉన్నాయి. ఇవి నన్నయ కంటే చాలా ముందరివి. వేములవాడ రాజధానిగా చేసుకుని పాలించిన జినవల్లభుని పాలనాకాలంలో విజయ పేరుతో కవిరాజమార్గం, రేచన ఛందోగ్రంథం, కవిజనాశ్రయం వంటి ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి. పంపన జినవల్లభుడి ఆస్థాన కవి. కన్నడ ఆదికవి. తెలుగు-కన్నడలు రెండు కళ్ళు. పంపన సమాధి కూడా బోధన్‌లో ఉన్నది. ఈ ప్రాంతంలో ఆనాడు కన్నడం, తెలుగు భాషలు చెట్టాపట్టాలు వేసుకుని పెరిగాయి. ఒకే లిపిగా ప్రచారం పొందాయి. పంపన రాసినదిగా చెప్పుకునే జినేంద్ర పురాణం కర్నాటకలోని ఒక జైన మఠంలోనో, ఆలయంలోని రాతప్రతుల గదిలో చూశానని నేలటూరి వెంకట రమణయ్య ఒక వ్యాసంలో పేర్కొన్నారని వైద్యం వెంకటేశ్వరాచార్యగారు చెబుతున్నారు. ఈ ప్రతి లభిస్తే తెలుగు సాహిత్య ప్రాచీనతే కాదు, దక్షిణ భారత సాహిత్య చరిత్ర కూడా జిగేలుమంటుంది. ఐతే ఈ గ్రంథాలు తదనంతర బ్రాహ్మణాధిపత్య రాజుల కాలంలో పాడుచేసి ఉంటారని కొందరి వాదన. లేదా కాలక్రమంలో అవి ప్రచారంలో లేకుండా శిథిలమైపోవచ్చును. ఐతే వాటికోసం అనే్వషించడం తప్పుకాదు. మనిషి ఆశాజీవికదా. పంపన ఆదిపురాణాన్ని కన్నడంలో రాశాడు. జినేంద్రుడు తెలుగు నేలమీద ఉన్నాడు. కాబట్టి తెలుగులోనే రాసి ఉంటాడేమో. తెలుగు లిపి కన్నడం అయ్యుంటుందా?
పంప మహాకవి మీద పరిశోధించిన కన్నడ భాషా సాహిత్యాల కురువృద్ధుడు, గొప్ప పండితుడు డా యం. చిదానందమూర్తిగారిని బెంగళూరులో కలిసి మాట్లాడాం. వారు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇద్దరం చాలాసేపు చర్చించుకున్నాం. వారు వెంటనే కన్నడ పరిశోధకులకి ఫోను చేశారు. వారితో మాట్లాడించారు. మైసూరులో ఉన్న డా శుభచంద్రగారు మరోసారి మైసూరులోని ప్రాచ్యలిఖిత భాండాగారాన్ని ఈ దృష్టితో పరిశీలించి ఏ విషయం తెలియజేస్తానని మాటిచ్చారు. మాతో కలిసి వచ్చిన తెలుగు-కన్నడ అనువాదకులు వెంకటాపు సత్యం గారు కూడా రెండు భాషల్లో నిష్ణాతులు. ప్రాచీన కవుల సంప్రదాయం ఇది.
ఏది ఏమైనా తెలుగు-కన్నడల అనుబంధం గొప్పది. లిపిని పంచుకున్నాం. భాషా పరిమళంలో సగం సగం భాగాలమయ్యాం. ఐతే ఇప్పుడు రెండు భాషలకి ఒక ‘లిపి’ చేసుకోగలిగితే ఒక పెద్ద రాజకీయ, భాషా సాహిత్యాల విభాగంగా ఎదుగుతాం. ఉత్తరాది పెత్తనాన్ని నిలువరించగలుగుతాం. ఈ విషయాలను కూడా మరోసారి చిదానందమూర్తిగారితో చర్చించాం.
జినేంద్ర పురాణం ఈసారికి లభించలేదు. ఎప్పుడో ఓసారి నేలమాళిగలు చీల్చుకుని బయటపడుతుంది. రెండు రాష్ట్రాలమధ్య సాహిత్య వారధి అవుతుందని నమ్మిక. కర్నాటక క్షేత్ర పర్యటనకి వెళుతున్నపుడు ఉన్న ఉత్సాహం వచ్చేటపుడు లేదు. కాని మరోసారి మరిన్ని కన్నడ నేలమాళిగలు తవ్వి తీయాలనే సంకల్పం పెరిగింది. రైలు వేగం హెచ్చింది. మనసులో పథక రచన జరుగుతోంది.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242