తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

పౌర సమాజం తలదించుకునే సమయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు వారాల క్రితం జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలోని ఏటూరు నాగారం ఐటిడిఏ కార్యాలయంలో ఆదివాసీ భూ సమస్యలపై బహిరంగ విచారణ (ఇండియన్ పీపుల్స్ ట్రిబ్యునల్) జరిగింది. దీనిని ‘హ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్’ (హెచ్‌ఆర్‌ఎల్‌ఎన్), ఆదివాసీ సంఘాల జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆనాడు విన్న, కన్న విషయాలే ఈవారం ము చ్చట్లు.. ఆదివాసీలు తమ భూములను కాపాడుకునేందుకు ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నారు. ఆంగ్లేయ పాలకులు ఆదివాసీల భూహక్కుని అర్థం చేసుకోలేదు. అనాదిగా దట్టమైన అడవిని మైదానంగా మార్చుతున్నప్పుడల్లా భూమి పరాస్తమై పోయింది. గిరిజనేతరుల ఆక్రమణ పెరిగినప్పుడల్లా పోరాటం జరిగింది. ప్రతిసారీ ఆదివాసీలకే అన్యాయం జరిగింది. అన్నిరకాల మోసాలతో వారి అటవీ సంపద, అటవీ భూమి బలవంతంగా లాక్కోబడింది. ఐతే ప్రతిసారి వారు చేసిన ప్రతిఘటనల వల్ల బలవంతులు కూడా వెనకడుగు వేయక తప్పలేదు. ఈనాటికీ పాలకులు వారిని ‘ముసుగులో’ మోసం చేస్తూనే ఉన్నారు. అటవీశాఖ, పోలీసు, న్యాయ వ్యవస్థలు వారిని సర్వనాశనం చేసాయి. చట్టాలు నామమాత్రమే అని ఆదివాసీ సమాజం తేటతెల్లం చేసినంతగా- ఏ చదువుకున్న మేధావి, ప్రజారాజకీయ రంగంలో నిలిచిన అన్నిరకాల పార్టీలు, ఆలోచనా విధానాలు వాస్తవాన్ని చూపలేకపోయాయి. వీరు చేసే పోరాటాలకు ఆదివాసీలు సమిధల్లా ఆహుతైపోవడం తప్ప- ఆ సమాజానికి పెద్దగా ఒరిగిందేమీ లేదనే వాదన ఒకటి ప్రబలంగా ఉంది. ఏ నిర్మాణమైనా, ఏ నాయకత్వమైనా, తమని తాము రక్షించుకోవడానికి, వెలుగు వెలగడానికే ఎక్కువగా ప్రయత్నించడం సహజం.
ఇవ్వాళ తమ పేరిట వెలసిన సంస్థలు, బయటి సంస్థలు కూడా తమ బతుకు కోసం చేయగలిగినంత చేశాయా? అని ఆదివాసులు నినదిస్తున్నారు. ‘సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు’ (ఐటిడిఎలు) ఏర్పాటు కావడం వల్ల, వీటికి కొందరు యువ ఐఎఎస్‌లు అధికారులుగా రావడం వల్ల- ‘ఆదివాసులను అణగారుస్తూ, బలవంతంగా భూములు అన్యాక్రాంతం చేస్తున్న సమయంలో’ ఎంతో కొంత న్యాయం జరిగింది. ఆ సందర్భంలో జరిగిన ఆదివాసీ పోరాటాల వల్ల ఒనగూడిన ప్రయోజనం విస్మరించలేం. ఆదివాసీ ప్రాంతాలలో జరిగిన పోరాటాల కాలంలో ఆగిన భూ ఆక్రమణ, ఆ తరువాత ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందనేది వాస్తవం. దానిని ఆపగలిగే పౌర యంత్రాంగం లేకపోవడం గమనార్హం.
ఈ దేశంలో న్యాయబద్ధమైన భూ పరిరక్షణ కోసం బాధితుడే ఒంటరిగా పోరాడాలి. చేయూత లేని కాలాలే ఎక్కువ. అప్పుడు వారు ఓడిపోయి భూమిని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడప్పుడు పోరాడడం కూడా తప్పేనేమో అని అనిపించేతగా ఓటమి పాలయ్యే పరిస్థితి. సాధారణ రెవెన్యూ చట్టాలతో అటవీ భూముల చట్టాలను ముడిపెట్టి చూసే పరిస్థితి అధికం. అటవీ శాఖ ఎప్పుడూ ఆదివాసీని ముంచడమే కర్తవ్యంగా మార్చుకుంది.
యువ ఐఎఎస్ అధికారులు కొంతమంది ఆదివాసీలకు అనుకూలంగా ఆలోచించారు. ఆచరణలో చట్టాలకు సవరింపులు చేశారు. కొందరికి న్యాయం జరిగిందని చెప్పుకోవడం చూస్తాం. కాని ఎందువల్లో ‘ఆల్ ఇండియా సర్వీసు’ అయినా ఐఎఫ్‌ఎస్ అధికారుల్ని ఆదివాసీలు తమ మిత్రులుగా చె ప్పుకోవడం చాలా త క్కువ. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే- పరిపాలనా శా ఖలు చాలావరకు ఆదివాసీ వ్యతిరేకతని తమ మూలాలలో పొదువుకుని ఉన్నాయి. అందుకే వారికి న్యాయం జరగవలసిన ప్రతి సందర్భంలో ఏదో ఒక శాఖ అనవగాహనతోనో, స్వార్థంతోనో, ఆశ్రీత పక్షపాతంతోనో, లంచగొండితనం వల్లనో, పరిపాలనా సామర్థ్యలేమితోనో.. కారణం ఏదైతేనేం ఆదివాసీలకు తరతరాలుగా న్యాయం దూరమైంది.
ఇదే విషయం ఆనాటి బహిరంగ విచారణలో ఆదివాసీలు క్లుప్తంగా, స్పష్టంగా, అత్యంత శక్తిమంతంగా వ్యక్తం చేశారు. అది వారికే సాధ్యం. సుమారు ముప్ఫై మంది మహిళలు, పురుషులు ఎనె్నన్ని కష్టాలు పడ్డారో వివరిస్తుంటే కళ్ళనీళ్ళ పర్యంతమైనాం. ఈ విచారణ కమిటీకి పూర్వ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం న్యా యాధీశులు జస్టిస్ బి. చంద్రకుమార్ అధ్యక్షుడి గా, పూర్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.విద్యాసాగర్, నేను, పూర్వ లేబర్ కమిషనర్ డా.హెచ్.కె.నాగు సభ్యులుగా జరిగిన విచారణలో అనేక అంశాలు ప్రస్తావనకి వచ్చాయి. అప్పుడు అనిపించింది. నిజానికి ఇది కేవలం ఆదివాసీ భూ సమస్య కాదు. ఇది మొత్తం సమాజానికి వర్తించే సమస్య అని.
గ్రామాలు, పట్టణాలు, నగరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన చట్టాలు- అంటరాని వాళ్ళకి, ఆదివాసీలకి, సంచార జాతుల వారికి న్యాయం చేయడంలో విఫలమయ్యాయి. ఐతే ఈ జాతుల కోసం చేసిన కొన్ని ప్రత్యేక చట్టాలలో భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఆదివాసీలకు సంక్షేమకరమైన చట్టాలు పొందుపరచబడి ఉన్నాయి. కాని వీటి అమలులో ఎన్నో లొసుగులు ఉన్నాయి. బలవంతుల పక్షంలో వీటిని వారికి బానిసలు చేశాయి. చట్టాల ప్రసక్తే చాలామందికి తెలియదు. వాటి ఆచరణలో కొనసాగే అక్రమాలు, ఎనె్నన్నో. వాటిని విని, చూసిన ఆదివాసీలు హడలిపోయే పరిస్థితి ఉంది.
చట్టాలన్నీ ఆంగ్లభాషలో ఉంటాయి. తెలుగులోనైనా లేవు. పైగా కోయ, గోండి, చెంచు, బంజార వంటి అనేక కోయ భాషీయులకు అవి అర్థం కావు. తమ భౌగోళికతకి, పర్యావరణానికి, సాంప్రదాయిక హక్కులకి సంబంధం లేని చట్టాల గురించి ఎంత చెప్పినా వారికి అవి అర్థం కావు. వారికి భాష కూడా ఒక పెద్ద అవరోధమే. న్యాయాధీశుల తీర్పులను అర్థం చేసుకోలేని వింత పరిస్థితి. భాషకీ, న్యాయానికి చాలా దగ్గరి సంబంధం. కాని తీర్పులు ఇవ్వడంలో, ఇచ్చిన తదనంతరం సైతం అందులో వాడబడిన భాష వారికి ప్రయోజనం చేకూర్చడంలో విఫలం అవుతున్నది. ఈ విషయం న్యాయవ్యవస్థ ఏనాడూ ఆలోచించలేదు. హైకోర్టు, గ్రామీణ, ఆదివాసీ ప్రాంతపు కలెక్టర్ కార్యాలయం, డెప్యూటీ, సబ్ కలెక్టర్, ఫారెస్ట్, రెవెన్యూ కార్యాలయాలలో వాడే ఆంగ్ల భాష వారిని మొ దట భయపెడుతుంది. వా రి తరఫున వాదించే చిన్నాచితకా లాయర్లు కూడా భాషా సమస్యని ఎదుర్కొంటారని చెబితే నమ్మాలి. కోర్టు వ్యవహారాలన్నీ ఆంగ్లంలో జరగడం ఒక శాపం. కనీసం తెలుగు భాషలో కూడా చెప్పలేని, రాయలేని ఆదివాసీలు పడే క్షోభకి అంతులేదు. అందుకే ముప్పాతిక వంతు న్యాయబద్ధమైన కేసులు కోర్టు ప్రాంగణం వరకు చేరవు. చేరినా వాటిని మాయచేయడం మా మూలే. ఇన్ని సుడిగుండాలు దాటి న్యాయం వరించినా, దానిని అమలు పరచడంలో అన్ని శాఖల వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. గెలిచిన కేసులపై కోర్టు ‘స్టే’లు, అమలులో జాప్యం, పోలీసుల భయభ్రాంత చర్యలు- ఒక్కొక్కటీ వింటుంటే కళ్ళు చెమర్చి, గుండె ద్రవించడం తప్ప ఏం చేయగలం? అనిపించింది.
ఓవైపు తమ హక్కు భుక్తమైన కొద్ది ఎకరాల కోసం జీవితాలను పణంగా పెట్టి పోరాడుతుంటే, మరోవైపు వారి ఆవాస అరణ్య భూభాగాలను ఎత్తివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అభయారణ్యాల పేర, భారీ నీటిప్రాజెక్టుల పేర, ఖనిజ సంపద తవ్వకాల పేర వెరసి- అభివృద్ధి మంత్రం జపిస్తూ ఆదివాసీ హననం సాగిస్తున్న వేళ ఇది. తెలంగాణలో 1959లో షెడ్యూలు ప్రాంతాల భూ బదలాయింపు చట్టానికి అనేక తూట్లు పొడిచి దానిని పనికిరాని కాగితం ముక్కని చేశారు. రెవెన్యూ కార్యాలయాలలోని క్లర్కు మొదలు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి వరకు దీనిని పరాజయం పాలు చేశారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఆదివాసీలకు భూన్యాయం చేయడంలో విఫలమైంది. కేసుల పరిష్కారం, న్యాయం అమలులో జాప్యం చూస్తుంటే మనం అసలు మానవీయ సమాజంలో బతుకుతున్నామా? అనిపిస్తుంది. కళ్ళముందు వరసగా శతాబ్దాలు, దశాబ్దాలుగా బాధిత ఆదివాసీ ప్రజల ప్రయోజనాలు పక్కన పడ్డాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే తంతు.
భూ బదలాయింపు చట్టం (ఎల్‌టిఆర్) ప్రకారం ఇచ్చిన తీర్పులు అమలుకు ఆమడ దూరంలో ఉన్నాయి. డబ్బున్నవారికి అన్ని చట్టాలను, ఎల్‌టిఆర్ చట్టం ప్రకారం ఇచ్చిన తీర్పులను వక్రీకరించడంలో మొత్తం వ్యవస్థ పనిచేస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. ఏ ఒక్క మంచి అధికారో, ఉద్యోగో, న్యాయవాదో, న్యాయతీర్పరో సరిపోడు. ఎలాంటివారైనా కూడా ఓడిపోయి ముక్కూ మూతీ మూసుకుని కూర్చోవలసిందే. ఇలాంటి న్యాయబద్ధమైన కేసులను త్వరితగతిన అమలు చేయాలని కలెక్టరునో, ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసరునో కోరితే కూడా తాము ఏమీ చేయలేకపోతున్నామని వారు బహిరంగంగానే అంటున్నారు. అంటే- పరిస్థితి ఎలా విషమించిపోయిందో చెప్పకనే తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆదివాసీలకే కాదు. అక్కడ నివసించే ఇతర ప్రజలకు, ఈ విషయం తెలిసిన పౌరులకు ప్రభుత్వం మీద, చట్టం మీద గౌరవం ఉంటుందా? వాటిని ధిక్కరిస్తే అది వారి తప్పెలా అవుతుంది?
కొత్త రాష్ట్రం ఏర్పడినాక ఇలాంటి విషయాలలో ప్రత్యేక దృష్టిపెట్టి ప్రభుత్వం ఆదివాసీలకు న్యాయం చేస్తుందని ఆశించడం కూడా తప్పైపోయిందని అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఆదివాసీ భూములు ఆదివాసీయేతరులకే కాదు, సుదూరాల నుండి వలస వచ్చిన డబ్బున్న వర్గాల వారికి చెందే పరిస్థితి. దీనిని చూసి చట్టాలే ఫక్కున నవ్వుతున్నాయి. పాలన నుదురు పది ముక్కలవుతున్నది. ఈ సందర్భంలో ‘హ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్’ జరిపిన సమీక్ష ఒక రకంగా మంచికే జరిగింది. ఒక రోజు ఓవైపు కన్నీళ్ళు తుడుచుకుంటూ, విద్యార్థిలా ఆ మనుషులు చెబుతున్న అసామాన్య అనుభవ పాఠాలు వింటూ, మరోసారి వాళ్ళకోసం ఏంచేయాలని ఆలోచించడానికి, పునరంకితం కావడానికి లభించిన అవకాశంగా భావించాను.
ఏటూరు నాగారం అటవీ ప్రాంతంనుండి బయలుదేరాం. తిరుగు ప్రయాణంలో అంతా నిశ్శబ్దం. నిశ్శబ్దాన్ని మించిన ఆందోళన. ఆవేశం. సమావేశం ముగిసింది. కాని ఆలోచనల దాడి ఆగడం లేదు.. *

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242