తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

‘పాకుడురాళ్లు’ సంధిస్తున్న ప్రశ్నలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దాల సమస్య, ఆధిపత్యం ఒక్క ప్రశ్నతో దోషిగా నిలబడక తప్పదు. ఐతే ప్రశ్నించే వారిని చూసి, అసలు ప్రశ్నని దాటవేసేదే నిజమైన ఆధిపత్యం. ప్రశ్న కిందివర్గాల నుండి వస్తే దానిని ప్రశ్నకాకుండా చేస్తారు. ఆ ప్రశ్నని నొక్కిపెట్టడానికి, పక్కదారి పట్టించడానికి నిస్సిగ్గుగా ప్రయత్నాలు మొదలవుతాయి. అలాంటి ఒక ప్రశ్న గురించి మనమైనా మాట్లాడుకుందాం. మాట్లాడేవారు తగ్గిపోతున్నకాలం ఇది. కాబట్టి మాట్లాడక తప్పదు. మాట్లాడవలసిన బాధ్యత ప్రసార మాధ్యమాలది. విచిత్రం ఏమంటే ఎలక్ట్రానిక్, ప్రింట్ మాధ్యమాల అభిరుచులు వేరు. ప్రయోజనాలు వేరు. ఒకటి దృశ్య ప్రధానం. మరోటి అక్షర ప్రధానం రెంటిలో కూడా ‘వార్త’, ‘విషయం’ ముఖ్యం. కాని ఎందుకో వీటి ప్రాధాన్యతాక్రమాలలో చాలా తేడా ఉంటున్నది. మళ్ళీ అన్ని చానళ్ళూ, అన్ని పత్రికలూ ఒకేలా ఉండవు. వీటిలో కూడా చాలా తేడాలు ఉంటాయి. ఎవరికి కావలసిన విషయం వారికి ముద్దు. ఏ విషయాన్ని ముట్టద్దో, దేనిని హైలైట్ చేయాలో వాళ్ళ హద్దుల్లోనే వుండాలి.
ఈ విషయం ‘శ్రీరెడ్డి ఉదంతం’ మరింత స్పష్టం చేసిం ది. ఆమె లేవనెత్తిన ప్రశ్నలు ముఖ్యం. కేవలం తీరు గురించే మాట్లాడేవారు ప్రశ్నని ప్రధానం చేసేవారు కాదు. ఆమె ప్రశ్నించింది సినీ పరిశ్రమలోని లొసుగుల గురించి. దానికి సినిమా రంగం పెద్దలు వారి అండదండలున్న ఉత్సవ విగ్రహాలు, పెద్దలు నేరుగా మాట్లాడాలి. కాని వారు ఎవరితోనో మాట్లాడిస్తారు. ఆ పెద్దలు పెద్ద పెద్ద హోదాల్లో ఉండి కూడా తాము మాట్లాడవలసి వస్తుందని రహస్యమైపోతారు. అది బాధ్యతా రాహత్యం. అల్ప విషయాల పట్ల స్పందించడం నామోషి అనుకుంటారు. ఇలాంటివి వ స్తాయి, పోతాయి. అది మామూలే అని తేలిక అభిప్రా యం. రివాల్వర్లతో షూట్ చేసినా, వాచ్‌మెన్లను చంపినా, ఆడవాళ్ళని చెరచినా అవి ‘విషయాలు’ కావు. ప్రభుత్వం, పోలీసుశాఖ, రాజకీయ పార్టీలు వీళ్ళకి దాసోహం. వారికి వీరే క్రౌడ్ పుల్లర్స్. అంతేకాదు. తమ పార్టీ ఫండ్ ప్రదాతలు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వారే. రాజకీయాలకి వీళ్ళు కావాలి. వీళ్ళకి తమ తప్పులు కాయడానికి రాజకీయ పార్టీలు కావాలి. సినీ పరిశ్రమలో కొద్దిమంది మంచివారు ఉంటారు. ఎంత మంచివారంటే వారు ఉలకరు. పలకరు. స్పందించరు. నిజానికి చాలామంది చౌకబారు మనుషులు ఉన్న రంగం ఇదే.
ముఖం మీద కోటింగ్ పడినప్పుడే చాలామంది అసలు స్వభావం మసకబారుతుంది. షూటింగ్‌ల సమయంలో అక్కడ జరిగే తంతు తమకు తెలియదని ఎంత బుకాయించడం అంటే నీళ్ళలో నేను లేనని చేప చెప్పడంలా ఉంటుంది. ఏ పరిశ్రమ అయినా లాభం కోసమే. శ్రమని దోపిడి చేసి ఉత్పత్తిని అమ్ముకోవడమే యజమాని లక్షణం. తమ ఉత్పత్తులను మార్కెట్ చేయడంకోసం ఎన్ని కాని పనులైనా చేయడానికి వెనకాడక పోవడమే పెట్టుబడి నీతి. ఎందుకన్నారోగాని సినీ రంగాన్ని పరిశ్రమ అని. సరైన పేరే పెట్టారు. ఇక్కడ కార్మికులు- జూనియర్ ఆర్టిస్టులు, ఎక్స్‌స్ట్రాలు. ఇండస్ట్రీ లాభాలు తీయాలంటే శ్రమదోపిడీ తప్పదు. ఇక్కడ దానికి అదనంగా లైంగిక దోపిడీ కూడా జరుగుతున్నది. బలహీనులని దోపిడీ చేయడం సులభం. ఎవరూ అడ్డురారు. వారికి ఐక్యత లేకుండా చేయడం పెద్ద పనికాదు. అందులో స్ర్తిలు సినీ రంగంలో మరింత శక్తిహీనులు. వారిని పైనుండి కిందివరకు సామదాన బేధ దండోపాయాలతో లోబరుచుకుంటారు. ఆ విష వలయంలో పడిన వారిని ఆదుకోవడం బయటి వారికి సాధ్యంకాదు. కేవలం బతకడానికి తిండి, మెరుగుల బట్టకే వారి బతుకు బందీ.
సినీ పరిశ్రమ కులం, ప్రాంతం, ఆర్థికం వంటి ఆధిపత్యాలతో నిండిపోయింది. కేవలం ఒకే ప్రాంతం నుండి వచ్చి, ఒకే కులం చేతిలో కేంద్రీకృతమై, వారి పెట్టుబడులతో నడిచే రంగం ఇతర రంగాల మాదిరే కేంద్రీకృతమైంది. ఆ నాడు జాతీయ బూర్జువాలలోగ ల కాసింత మంచి ఆనాటి సినిమాలలో అతి కొంచెం కనిపించేది. పెట్టుబడి విశృంఖలమైన ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో విలువల పతనం మొదలైంది. ఆరంభ కాలంలో సినిమా రంగంలో విలన్ హీరో అయ్యాడు. హీరో జీరోగా మారిపోయాడు. కథానాయకి ఆధునిక వలువలలోకి మారాక అంగాంగ ప్రదర్శన తప్పుకాకుండా పోయింది. సినిమా రంగంలో లైంగికత పెచ్చుపెరిగిన సమయంలో దానిని తెరకెక్కించడం అలవాటయ్యింది. తాగడం, బార్ నృత్యాలు, సెక్స్ దృశ్యాలు, చుంబనాలు పెరిగిపోయాక సినిమాల్లో విలువలకి స్థానం లేకుండా పోయింది. మాదక ద్రవ్యాలు, అశ్లీల చిత్రాల నిర్మాణం అదుపులో లేవు.
స్ర్తి శరీరం తెర మార్కెట్ అయ్యాక దానితోపాటే ‘హింస’ కూడా అదే పాళ్ళలో పెరిగిపోయింది. పెద్ద హీరో, హీరోయిన్లకే పారితోషికం పెరిగింది. వారితోపాటుగా జూనియర్ ఆర్టిస్టులకి జీతం, విలువ తరిగిపోయింది. వారి నటనా కళతో పనిలేకుండా పోయింది. కేవలం వారి శరీరాలే కావలసి వచ్చాయి. వారికి ఇవ్వవలసిన దినసరి పారితోషికానికి దేబిరించే పరిస్థితి వచ్చిందని సినిమా పెద్దలకి తెలియదా? కళామతల్లి పద ఘట్టనల కింద వారి ఆక్రందనలు వినిపించలేదా? ఇవ్వవలసిన పారితోషికం సమయానికి ఇవ్వకుండా వారి శరీరాలను వాడుకునే వ్య వస్థ గురించి తెలియదని బుకాయిస్తే ఎవరు వింటారు?
శ్రీరెడ్డి బాధితురాలు. బాధితురాలు ప్రశ్నించిన రీతిని రోజుల తరబడి చర్చించిన చానెళ్ళు, పురుష పుంగవులు తమ స్వభావాన్ని ప్రజల ముందు మరోసారి దిగంబరం చేసుకున్నారు. బాధిత ప్రశ్నని సాంకేతికం చేసిన సినీ నిర్మాతలు, హీరోలు, వారి తాబేదారుల విలువలు ఏమిటో తమకై తాము చిన్నతెరపై ప్రదర్శించారు. ఈ దెబ్బతో సినీ మహిళల లైంగిక దోపిడీతో సంబంధం గల యువ రాజకీయనేతల అసలు రంగు కూడా బయటపడే పరిస్థితి రాకమానదు. బాధిత స్ర్తి కోపంతో తిడుతుంది. అది ఆమె హక్కు. సహకరించని దైవాన్ని కూడా తిట్టిపోసే సంప్రదాయం అంతటా ఉంటుంది. భూస్వామ్యం నేర్పిన తిట్టుని అలవోకగా అన్నందుకు దోషిగా నిలబెట్టడం పురుషలోకపు పురుగులకే చెల్లు. బలమైన, కర్కశమైన, హంతక స్వభావపు ఆధిపత్య రంగం గురించి కేసుపెట్టాలని, పోలీసుల దగ్గరకు పోవాలట. కోర్టుల గడపలకెక్కాలట. అంతేగాని ప్రశ్నించరాదట. అది వారికి వర్తించదా?
ఇదీ అందరి సినీ పెద్దల మాట. మరి నువ్వేం చేస్తావురా బ్రదర్? నీవు కూడా ఒక తల్లి బిడ్డవే కదా, ఒక కూతురు తండ్రివే కదా. ఆలస్యంగా స్పందిస్తే అది మహాజుగుప్సాకరమైన స్పందన అని అనుకుంటావా? నిర్మాతల, హీరోల, సినీ పెద్దల ఇంట్లో తల్లులు, భార్యలు, అక్కాచెల్లెళ్లు, కోడళ్లు, మనుమరాళ్ళు ఒ క్కరంటే ఒక్కరు స్పందించక పోవడానికి కారణం? ఈ మన మగరాయళ్ళు సినీ సంస్కృతిని వారి హృదయాలలోకి ఎక్కించినట్లే కదా. అభిమాన సం ఘాలంటే మగవారేనా? మహిళా అభిమానులు ఉండరా. ఈ అభిమానుల వ్యక్తిపూజవల్ల సమాజంలో విలువల వలువలు ఊడిపోతున్నాయి.
మీడియా మీద దాడిగా, సంకెళ్ళుగా భావించే ఎలక్ట్రానిక్ మీడియా స్ర్తిలకి జరిగే లైంగిక దోపిడి గురించి పట్టించుకుని పెద్దలకి బుద్ధి వచ్చేట్లు చేయరేం? అవన్నీ ‘పెద్దల’ సంబంధీకులవే కాబట్టా! ఇవ్వాళ ఈ ప్రశ్న- సినిమా పెట్టుబడి విష సంస్కృతి మీద. దానిని కొమ్ముకాసే మీడియా మీదే అని గ్రహించాలి. ఇంత జరుగుతున్నా ప్రింట్ మీడియా ఈ అంశాల్ని ‘వార్త’ చేయడంలో విఫలం అయ్యిందని అనుకోవద్దు. ప్రయత్న పూర్వకంగా కావాలనే చేసిన పని. సినిమా ప్రకటనలు, బంధుత్వాలు, స్నేహాలు, అండదండలు- అన్నీ అక్కడనుండే సరఫరా! అది ఆక్సిజన్ సిలిండర్. ఎంతమంది స్ర్తిలు అన్యాయం అని ఆక్రోషిస్తేనేం? మెయిన్ పేజీలో, మెయిన్ వార్త కావలసిన విషయం మన కళ్ళముందే ‘అనామకం’ కావడం జర్నలిజం చరిత్రలో నమోదు కావలసిన విషయం. తమ పత్రికలలో ఎందుకు రాయరో చెప్పమని మనం అడగాలి కదా!
ప్రభుత్వాల తాయిలాలతో ప్రజల సమస్యలను దారిమళ్ళించడంలో తల మునకలయ్యే కొన్ని పత్రికలు, బహిరంగ విషయాల పట్ల వార్తలు, విశే్లషణలు అన్నీ నిశ్శబ్దం పాటించడం గమనించాలి. ఒకటి రెండు మెత్తని వార్తలను సినిమా పేజీలో రాశారు. అసలు విషయాలను రానివ్వకుండా జాగ్రత్తపడ్డారు. నిజానికి సామాజిక మాధ్యమాల్లో లేవనెత్తబడే విషయాలు రేపటి ప్రశ్నలు కాక తప్పదు. ఈ సందర్భంలో ఒక విషయం పదే పదే గుర్తొస్తున్నది.
స్వీడిష్ నోబెల్ బహుమతి గ్రహీత గున్నార్ మిర్డాల్ కొడుకు మేధావి, రచయిత జాన్‌మిర్డాల్‌తో మేము ముప్ఫై ఐదేళ్ళ క్రితం హైదరాబాదులో ఉదయం తొమ్మిది గంటలకు అలా నడుచుకుంటూ పోతున్నాం. ఒకదగ్గర పెద్ద క్యూలైనులో తోపులాట జరుగుతోంది. ఇది రేషన్ లైనా అన్నాడు. కాదు. సినిమా క్యూ అన్నాం. అంత గొప్ప చిత్రమా? అని అన్నాడు. కాదు అన్నాం. మరి మీరు చూశారా? ఆ సినిమాని అడిగాడు. లేదు అని చెప్పాం. భారతీయ మేధావులు చేసే తప్పే అది. మీరు మీ సమాజంలో దేశంలోని విషయాలకు స్పందించరు. ఇతర దేశాల సమస్యల పట్ల స్పందిస్తారు. అది అనవసరం. ఆ సినిమా ఎంత ప్రజావ్యతిరేకమో, అశ్లీలమో, చౌకబారో మీరు ప్రజలకి తెలియజేయాలి కదా అని అన్నాడు.
ఇవ్వాళటికీ ఎక్కడెక్కడో విప్లవాలని, పోరాటాలని ఉత్తుత్తిగా గావుకేకలేసే వారు, మాది ప్రజాపంథా అని, ప్రజాశక్తి, జనశక్తి, ప్రజాతంత్ర సంస్థలని రకరకాలుగా చెప్పుకునే నిర్మాణాలు ఇలాంటి విషయాల పట్ల సరైన సమయంలో, సరైన రీతిలో స్పందించటంలేదు. అంటే ఒక పెద్ద సామాజిక సమస్యని చూసీ చూడనట్లు నటించడం అభ్యుదయ మేధావులకి మాత్రమే చెల్లు. ఇందువల్లే భావస్ఫూర్తి కలిగించే రచన, విమర్శనారంగాలు నిర్వీర్యమైపోయాయా అనిపిస్తోంది. శ్రీరెడ్డి లేవనెత్తిన స్ర్తిల సమస్యలు పక్కదారి పట్టించడానికి ముఖ్యంగా ఓ నాలుగు కుటుంబాలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాయి. కొత్త పార్టీనేత, బొంబాయి కేంద్రంగా ట్వీట్ల పరిశ్రమకర్త బహిరంగ ప్రదర్శనకి పూనుకున్నారు. భూమి గుండ్రంగా ఉందన్న వాస్తవమే గెలిచింది. సినీ రంగంలో జూనియర్ ఆర్టిస్టు స్ర్తిల శరీరాలు గాయాల మయమే అన్న వాదన నిజం కాక తప్పదు.
ఒక స్ర్తి పెనుకేక సినీ వ్యాపార పెద్దల నూలుపోగుల్ని లేకుండా చేయగలదని అనిపిస్తున్నది. సినిమా పరిశ్రమలో జరుగుతున్న అక్రమాలు మంత్రిగారికి దృష్టికి తెస్తేనే తెలుస్తుంది. రోజుకో సినీ శరీరం తాకే రాజకీయ యువనేత, జరుగుతున్నది అన్యాయం అని ఆక్రందించే కేకలని వింటాడా? సూమోటోగా స్వీకరించి ఆ బాధాస్వరాలకి ఆలంబనగా న్యాయవ్యవస్థ నిలబడగలదా? నడిబజారులో కూర్చుని తన శరీరానే్న ప్రతిఘటన ఆయుధం చేసిన మహిళలకి పోలీసుశాఖ అండగా నిలబడగలదా? తమ స్వార్థ రాజకీయాలే తప్ప బాధిత మహిళల గురించి మాట్లాడే హక్కు పార్టీలు కోల్పోయాయా?
ఇవన్నీ ఆమె వేసిన ప్రశ్నలనుండి జనించిన ఉప ప్రశ్నలు. సినీ పెద్దలు, ఫిలిం చాంబర్లూ, ‘మా’లు తమ ఇంట్లో తమ స్ర్తిలు చూసే చూపులకు తట్టుకుని మొండిగా నిలబడగలరు. కాని తమ లోలోని ఒక తడి చూపు కన్ను తెరచుకుంటే క్షంతవ్యులుగా మిగలక తప్పదు. ఒక స్ర్తి వేసిన ప్రశ్న ప్రభావం ఏమిటంటే- తమలోతాము సినీ కుటుంబాలు తన్నుకు చావడమే. మాట్లాడవలసిన కొన్ని పెద్ద పత్రికల నిశ్శబ్దం జాతికి పట్టిన చీడ. ప్రత్యేక హోదాకి మద్దతు కాదు. ఇప్పుడు స్ర్తిల ఆర్తనాదాలకు స్పందించాలి! కొందరు తమిళ హీరోలని చూసైనా ధైర్యంగా మాట్లాడగలగాలి. కమిటీలు ఏర్పాటుచేస్తే ఆధిపత్యం మరింత పెరుగుతుంది. ఇప్పుడు కావలసింది లోలోకి, తమలోకి తాము చూసుకోవడం.
(తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం రాజుకున్న వివాదాలకు స్పందనగా..)

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242