తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

వరంగల్ సభ ఏం చెబుతున్నది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్న మే 24న వరంగల్‌లో జరిగిన సభ గురించి మాట్లాడాలనిపిస్తోంది. అది వరంగల్‌లో జరిగినా దేశం మొత్తం మీద అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి దానిని గురించి ముచ్చటించాలి.
మానవుడికి సంక్రమించిన స్వేచ్ఛకి అడ్డంకులు ఎదురు అవుతున్న కాలమిది. సహజ న్యాయానికి సైతం ముప్పు వాటిల్లుతున్నది. ఆహారం, ఆహార్యం, సద్యోజనిత వాక్కులను సిసి కెమేరాలలో బంధిస్తున్న వేళ. ఒకరకంగా కాలాన్ని వెనక్కి నడిపిస్తున్నట్లుగా తోచకమానదు. బట్ట,పొట్టల మీద గతంలో ఎవరూ జోక్యం కలుగజేసుకునే సాహసం చేయలేదు. అందుకే సమాజంలో ఎంతో వైవిధ్యం అలరారింది. మనిషి వికసిస్తూ సమాజాన్ని అర్థవంతంగా నడిపాడు.
ప్రకృతితో సంబంధం కలిగిన మనిషి వాటిని గౌరవించాడు. లభ్యమైన పదార్థాల్ని, ప్రకృతి ఇచ్చిన ఆకులు అలమలు, కాయలు, కందలు, దుంపలు వంటి వాటిని ఆహారంగా మలచుకున్నాడు.వరసగా వర్షాలు పడని కాలంలో జంతువుల్ని భుజించి బట్టకట్టాడు. ప్రకృతి ధర్మాన్ని ఆకళింపు చేసుకున్న మనిషి భూగోళం మీద ఎక్కడైనా ఒకలాగే బతుకు ఈడ్చాడు. మన అలవాట్లకి వేలాది ఏళ్ల చరిత్ర ఉంది. శీతోష్ణ పరిస్థితులకు అనుగుణగా ఆకు, బెరడు, చర్మం, వస్త్రం, వంటి వాటిని ఉపయోగించుకున్నాడు. వాటిని ఒంటికి, వాతావరణానికి అనువుగా ధరించాడు. ఇవ్వాళ అలాంటి ఆహార్యం మనుషుల మధ్య ఉపద్రంవంగా మారింది. నెత్తిమీద టోపీ ఒక జాతికి, మతానికి, ప్రాంతానికి, మానవ ప్రత్యేక సమూహానికి సంకేతం అయ్యింది. ఎండవేడి నుండి తట్టుకునే శ్రమజీవి తలపాగా పేదరికానికి గుర్తయ్యింది. గాందీ టోపీ, పార్టీల తలపాగాలు, గోండు ఆదివాసీ పాగాకట్టు, ముస్లింల గుండ్రని టోపీ, ఒకనాటి షేర్వాని, కుచ్చుటోపీ, మనుషులని మానవ సమూహాలకు దూరం చేశాయి. మత విశ్వాసాలు వేరు అయినా మనుషులు కలిసి బతికే అవకాశాలున్నా, వాటిని ఏకోశాన నిలుపుకోలేకపోయాం. మనిషి ఇప్పుడు తనదైన సహజ వస్తధ్రారణని కోల్పోతున్నాడు. పరాయి వస్తధ్రారణలో కూరుకుపోతున్నాడు. ఇక ముందు దుస్తులు సైతం వస్త్ర ప్రజాస్వామ్యం కోసం ఉద్యమాలు చేయక తప్పదేమో? బలవంతంగా రుద్దబడే ప్రమాదం ఉందేమో అనిపిస్తుంది.
ఇలాంటి పరిస్థితులలో...
రాజకీయ విశ్వాసాలను కలిగి ఉండడం కూడా నేరంగా భావిస్తున్నారు. ఓవైపు ప్రతిపక్షాలను నిర్మూలించే కార్యక్రమం కొనసాగుతోంది. ఎన్నికల పార్టీల రాజకీయాలలో ప్రతిపక్షాలు అధికారపార్టీ పక్షంలో విలీనం కావడం కొత్త్ధోరణి. ఇవ్వాళటి ప్రతిపక్షం రేపటి అధికారపక్షం అయ్యే వీలుంటుంది. ఈ చిన్న విషయం తెలియని పిగ్మీలు రాజకీయ నాయకులుగా ఉన్నారు. దశాబ్దాల తరబడి అన్నంపెట్టిన పార్టీ రొమ్ము గుద్ది చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోతున్నవారు, తమ స్వేచ్ఛనే కాదు, ఇతరుల స్వేచ్ఛని కూడా నిర్లజ్జగా పెకిలించి వేస్తున్నారు. ఈ చర్యలవల్ల అంతిమంగా దెబ్బతింటున్నది ప్రజల స్వేచ్ఛ. దీనికోసం కూడా ఇవ్వాళ ప్రజా ఉద్యమం రావలసి ఉంది. రాజ్యాంగపరంగా, న్యాయపరంగా, నైతికపరంగా చర్చకావాల్సిన సమయం ఇది. కాని ఏ పక్షంవారు ఈ విషాల్ని ఖండించడానికి సిద్ధంగా లేరు. అసలు మాట్లాడరు. ఎన్నికల పార్టీలలో గల వామపక్షాలు కూడా నోరుమెదపకపోవడం విచిత్రం,
ప్రజలు వేసిన ఓట్లు నాయకుల ఫిరాయింపుతో దగాపడుతున్నాయి. ఇది దివాళాకోరు రాజకీయాల యుగం. పెద్దచేప చిన్న చేపను మింగును అనే సామెత ఉంది. అక్కడ వైఎస్సార్‌సీపీని ముక్కలు ముక్కలుగా తెలుగుదేశం పార్టీ లాక్కుంటున్నది. ఇక్కడ తెరాసా పార్టీ, తెదేపాని ఛాయలు లేకుండా దురాక్రమిస్తుంటుంది. చివరకు ప్రజలకున్న ఓటు అనే హక్కు, శక్తి రాజకీయ నాయకుల పాదాల వద్ద బూట్లు తుడిచే పనికిరాని గుడ్డ పేలిక అవుతుంది.
ఓవైపు ఈ ప్రాసెస్ బహిరంగంగా చెలామణి అవుతుంది. ఈవైపుగా మేధావులు కనె్నత్తి చూడరు. ఈ ప్రాసెస్ వల్ల రాబోయే కాలంలో ప్రజాస్వామిక ఉద్యమాలు తలెత్తలేవని గుర్తించరు. ఇక్కడ నిలబడి ఉద్యమం చేయాలని, ప్రజలను జాగరూకులను చేయాలని భావించరు.
మరోవైపు-
ఎన్నికలపై ఎలాంటి విశ్వాసం లేకుండా ఆ వ్యవస్థలో, భాగం కాకుండా, ఆ మకిలికి అత్యంత దూరంగా ఉంటూ త్యాగాల బాటలో, ఆరాటమే ఊపిరిగా ఆదివాసీ క్షేత్రమే కార్యస్థానంగా, హెడ్‌క్వార్టర్‌గా పనిచేసే విప్లవ పార్టీ బరిలో నిలిచిపోరాడున్నది. ప్రకృతి ప్రసాదించిన నీరు, భూమి, ఖనిజాలకు ఆలవాలమైన అటవీ క్షేత్రాల్ని కాపాడాలనే అకుంఠిత దీక్షతో, ప్రాణాలను త్యజించే నిశ్చయంతో పోరాటం సలుపుతున్నది. దీనికి వ్యతిరేకంగా 3‘మిషన్ 2016’2 మేరుతో మూడోదశ గ్రీన్‌హంట్ సాగుతోంది. పాశవికమైన చర్యలతో ప్రాంతీయ పోలీసు, పారామిలటరీ కలిసి ఆదివాసులను వేటాడుతున్నారు. వీరి భూమిని, అడవిని ఆక్రమించడానికి కొత్త ఎత్తులు వేస్తున్న వారికి అండగా నిలుస్తున్నారు.
ఎనె్నన్ని విభేదాలు ఉన్నా ఒడిషా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, తెలంగాణ, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఒకటవుతాయి. ఆనాడు ఏలిన యుపిఎ, ప్రస్తుతం పరిపాలిస్తున్న ఎన్‌డియే కూటమి ఆదివాసీల సామూహిక సహజవనరులను బహుళజాతి వ్యాపార వర్గాలకు కట్టబెట్టడానికే నిర్ణయించుకున్నాయి. ఏడేళ్ల గ్రీన్‌హంట్ ఈ విషయాన్ని బట్టబయలు చేస్తున్నది. ఏమాత్రం చైతన్యం కలిగిన ఆదివాసీలను, వారికి సహకరించే శక్తులను అణచివేయడమే లక్ష్యంగా పాలకవర్గాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. చంపడం, హత్య చేయించడం, అరెస్టులు చేసి చెరసాలలో ఉంచడం, చిత్రవధలకు గురిచేయడం లేదా ఎదురుకాల్పుల కథలు చెప్పడం పరిపాటైంది.
ఆదివాసీ ప్రజల తరపున నిలిచి, ఈ విషయాలను ప్రజలకు తెలియజేయడానికి, ప్రతిఘటించడానికి, 3‘తెలంగాణ ప్రజాస్వామిక వేదిక’ మే 24న వరంగల్‌లో ఎంజిఎం దవాఖాన ఎదురుగా ఉన్న ఇస్లామియా కాలేజి మైదానంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ప్రజలతో కలిసి ఒక ఊరేగింపు తీయాలని భావించారు.
మొదట పోలీసులు ఈ సభకు అనుమతి ఇచ్చారు. కాని విప్లవకారులు వస్తారన్న కారణగా సభ అనుమతిని ఉన్న ఫళంగా రద్దు చేశారు. దీన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయమని అభ్యర్థించారు నిర్వాహకులు. అప్పుడు న్యాయస్థానం ఏం చేసింది?
23న తీర్పు చెప్పవలసి ఉండగా ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకొని, 24వ తేదీ ఉదయం పదకొండు గంటలకు న్యాయస్థానానికి తెలుపవలసిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.
మే 24 సాయంత్రం 4 గంటలకు సభ ఉంటుదనగా ఒంటిగంట ప్రాంతం తీర్పు వెలువరించారు. ఈ సభలో ఎంతోమంది వక్తలు ప్రసంగించవలసి ఉండగా, ఐదుగురిని మాత్రమే ఎంపిక చేసి, రెండుగంటల వ్యవధిలోనే సభ ముగించాలని తీర్పునిచ్చారు. ఆ ఐదుగురు తప్ప వేరేవారు ఎవరూ ప్రసంగించరాదని ఆంక్షలు విధించారు. ఐనా వరంగల్ సభ విజయవంతమైంది. మండుటెండల్లో ఎన్నో ఊళ్లనుండి ప్రయాణం చేసి విష్ణుప్రియ గార్డెన్స్ చేరుకున్నారు. కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వవచ్చు. కాని పెట్టిన షరతులతోనే పేచి. ముఖ్య వక్తలను కాదని కోర్టు తాము ఎంపిక చేసిన వారే మాట్లాడాలని చెప్పడం విచిత్రం! ఈ షరతు పోలీసులు పెడితే న్యాయస్థానాన్ని ఆశ్రయించే వెసులుబాటు ఉండాల్సి ఉండగా, కోర్టే పోలీసు పాత్ర వహించినట్లు ఆ సభకు హాజరయిన సామాన్య ప్రజలు భావించారు. నిజానికి పోలీసులకు కూడా కొన్ని షరతులు పెట్టవలసిన న్యాయమూర్తి ఆ దిశగా ఆలోచించలేదు. ముందు సభకి ఎందుకు అనుమతించారు. ఏ కారణాలవల్ల రద్దు చేశారు. వక్తలు ఎవరైనా అప్రజాస్వామికరీతిలో మాట్లాడితే ఆ తరువాత వీరిపై కేసులు పెట్టవచ్చు. కాని వారు ఈ సభలో మాట్లాడ కూడదనే పోలీసుల వాదనని కోర్టు అంగీకరించడం న్యాయపరంగా సరైనదేనా? రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు విఘాతం కాదా? ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు తెలంగాణ పోలీసులకు, ప్రభుత్వానికి వత్తాసుగా ఉంది. తెలంగాణ హైకోర్టు ఏర్పడి ఉంటే ఇలాంటి తీర్పే వచ్చేదా? లేదా తెలంగాణ ప్రజల స్వేచ్ఛను గౌరవించేదా? అలా గౌరవించే న్యాయమూర్తుల ఎంపిక జరుగుతుందా? ప్రభుత్వాలు, సంపన్న వర్గాలకు అనుగుణమైన తీర్పులు వెలువడుతున్నాయన్న ప్రజల వాదనకి ఈ తీర్పు పరోక్షంగా అవుననే అనిపిస్తోంది. ఈ తీర్పు వంటి తీర్పులు, ఇకముందు వెలువడకూడదు. ఈ తీర్పు నమూనా చెరిగిపోవాలని జనం ఆశిస్తున్నారు. అంతకంటే ప్రజలు ఏం చేయగలరు?
ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పు వెలువరించినా, కోర్టు తీర్పులను వారు ప్రభావితం చేయలేరు. మరి న్యాయవ్యవస్థకి ప్రజాస్వామ్యం రంగు రుచి వాసనలు ఎవరు అద్దగలరు? కొత్త రాష్ట్రంలో రెండేళ్ల పాలనకి వరంగల్ సభ అద్దం పడుతున్నదా. రేపు పొరుగు రాష్ట్రాలలో మాత్రం ఇలాంటి పరిస్థితి ఎదురు కావద్దని ఆశిద్దాం. చేతిలో త్రాసు, నల్లకోటు ఇప్పుడు ఎంయన్‌సిల సూటులోకి మారినట్లు అనిపిస్తుందెందుకో. అందుకే ఈ నాలుగు మాటలు మీతో!