తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఒక నినాదం రూపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర తి ఏడాదికి కొన్ని పండగలు, ఉత్సవాలు, జాతరలు, దినోత్సవాలు, విజయోత్సవాలు ఉంటాయి. విషాదోత్సవాలు మాత్రం ఉండవు. మరపురాని విషాద సంఘటనలు ప్రతి ఏడాది మానవ సమాజాన్ని వెంటాడుతుంటాయి. కాని పాలకవర్గాలు వాటిని ప్రజలకు గుర్తు రానివ్వకుండా చేస్తారు. వాటి వెనక గల అన్యాయాలు గుర్తుకువస్తాయని వారి భావన.
రాజులకి, జమిందార్లకి వ్యతిరేకంగా న్యాయంకోసం పోరాడితే వారిని హతమార్చిన రోజులు మనని తట్టిలేపుతుంటాయి. అల్లూరి సీతారామరాజుని బంధించి, చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. భగత్‌సింగ్ వంటి ఎందరో దేశంకోసం పోరాడిన వీరులను ఉరితీశారు. ఆదిలాబాదులోని నిర్మల్ పట్టణంలో నైజాంకి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన రాంజీ గోండుని, 350 మంది అనుచరులను ఒకే మర్రిచెట్టుకి ఉరితీసిన రోజును గుర్తుంచుకోం. అమరత్వాన్ని మరచిపోతాం. సమరత్వాన్ని విస్మరిస్తాం. విషాదంలో దాగిన చైతన్యాన్ని పొందం.
ఒక చౌకబారు సంస్కృతి చాలాకాలంగా మనలను ఆక్రమించింది. మన మనసులను ఆ వేపే చూసేలా, మనల్ని ప్రభావితం చేస్తున్నది. జాతికి ఉపయోగపడని అనవసరమైన వాళ్ల జయంతులు, వర్థంతులు, శతజయంతులు పెచ్చుపెరిగిపోతున్నాయి. టీవీల పుణ్యమాని ప్రతి సినీరంగ సంబంధీకునికి చానెళ్లు తమ విలువైన సమయాన్ని అంకితం చేస్తున్నాయి. సమాజాన్ని ముందుకు నడిపిన మహనీయుల గురించి అవి ఆలోచించవు. విలువలు ప్రాతిపదికన చూడడం గతం అయ్యింది. ప్రజాదరణ అనే సూత్రం ప్రధానమైపోయింది. ప్రజాదరణ చౌకబారుతనానికి అంతిమ దశ. మనం సమాజం వికాసాన్ని గురించి ఆలోచించడం లేదు.
చానెళ్లకు రేటింగ్ ముఖ్యం అనే ధోరణి ప్రబలింది. ఒకరిని చూసి మరొకరు. ఒక బేండు మేళం ధోరణి. గొప్ప మహనీయుని మీద ప్రోగ్రాం చేయాలంటే శ్రమ. ఖర్చు బయటివారి సహకారం తీసుకోవడానకి చానెళ్ల నిర్వాహకులు ససేమిరా. ఎందుకంటె వారివద్ద సరైన ఆర్కైవ్స్ ఉండదు. వారి చరిత్రలను తవ్వి తీయలేనితనం లోకానికి తెలిసిపోతుంది. అందుకే చర్చలకు మీడియాకర్ మేధావులకే తప్ప ఆర్గానిక్ మేధావులకు ఎలాంటి చోటు లేదు. అలాగే సీరియస్ రచయితలను, సామాజిక చింతనా పరులను కూడా చానెళ్ల వారు పిలవరు. ఎందుకంటె రేటింగ్‌కు వీరు పనికిరారు.
శరీరానికి అవసరపడే పోషక పదార్థం కాదు. కంటికి ఇంపైన రంగులు, శరీరానికి హాని కలిగించే పదార్థాల్ని తినే అలవాటు చేస్తుంది మార్కెట్. వాటి గురించే ప్రచారం అధికం. వీటికి వారి చానెళ్ల సహకారం ఎంత బలంగా ఉందో తెలియనిది కాదు. అసలైన ఫ్రెష్ నిమ్మ హెర్బల్ కాదు. రసాయనాలు కలసిన రంగునీళ్లు తాగాల్సిందే. ఎక్కువ డబ్బు గుమ్మరించాల్సిందే. ఇదే ప్రకటనల సారాంశం.
హమ్మయ్య!
రెండు రాష్ట్రాల్లో ఉత్సవాలు, దీక్షలు ముగిసాయి. ఓచోట నవనిర్మాణ దీక్షా దినోత్సవం, మరోచోట రాష్ట్ర అవతరణ రెండో వార్షికోత్సవ ఘట్టం ముగిసిపోయింది. ఇప్పుడిక మళ్లీ ప్రతిపక్షాలతో పోరాటం ప్రారంభం. తాము అనుకున్నది చేయాలని ప్రభుత్వం అంటే దాని వెనుక గల రాజకీయ పార్టీ అభిమతం, ఆ పార్టీలోని డబ్బున్నవాళ్ల ప్రయోజనం ముఖ్యం. దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లల్లా తప్పుడు మనుషులే. ప్రతిపక్షీయులు పోకిరి రాయుళ్లే. నిజానికి ప్రతిపక్షం ఎక్కడ ఉంటుందో రాజకీయ నాయకుల మేధావిత్వానికి తెలియడంలేదు. అది ప్రజల అసంతృప్తిలో దాగి ఉంటుంది. దాన్ని పసికట్టగలగాలి. కాని పాలక మేధావులకు తమ కళ్లముందు కనుపించే అధికారం లేని రాజకీయ నాయకులని చూస్తే ముక్కు పనిచేయడం లేదు. పసిగట్టే శక్తి ఉడిగిపోతున్నది. అందుకే రెండు రాష్ట్రాల్లో ఒకే తీరు వ్యవహారం. ప్రతిపక్షాలను కొనేస్తే అడిగేవాడు ఉండడని భావన. కాని స్వపక్షంలోంచే ప్రతిపక్షం ఉద్భవిస్తుందని ప్రస్తుత అధినాయకులు మరిచిపోతారు. తెలుగుదేశం లోంచే తెరాస ఉద్భవించిందని గుర్తించ నిరాకరిస్తారు. మొదటిసారి తెరాస గెలిచి పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ వారు కొందరు ఎమ్మెల్యేలను, రాజకీయ నాయకులను మాట్లాడనివ్వలేదన్న సంగతి మరచిపోయి, ఇప్పుడు అదే పని చేస్తుంటారు.
ఒక్కటే గుర్తు. తన పార్టీలోంచి వచ్చేవాడు ఎందుకు మరో పార్టీలో చేరతాడు? అక్కడ తనకు ఎదిగే పరిస్థితి లేనినాడు, ఇక్కడ పదవి వస్తుందని ఆశించేవాడు, పాలకపక్షంలో ఉంటే తాను, తనవర్గం వారి పనులు చేయించుకునేవాడు ఒక అందమైన ముసుగు పేరు పెడతాడు. అదే ‘నియోజకవర్గం శ్రేయస్సుకోసం’. ‘అభివృద్ధిని చూసి ఆకర్షితుడై పోవడం’ ఇవే నినాదాలు రేపు కాకపోయినా, నాయకులు ఉక్కపోసిన్నాడు, మరో ద్వారం వైపు కదలడం తథ్యం. బూర్జువా రాజకీయాలలో ఇది మామూలు విషయం అయిపోయింది. అది ప్రజలకు ఎన్నికలంటేనే జగుప్స కలిగిస్తోంది.
ఈ ఫిరాయింపుల్ని ప్రజలు ఎలా చూస్తున్నారన్నది ఏ సర్వే కూడా చెప్పలేదు. సర్వేలకు, ఇంటలిజెన్స్ వర్గాలకి అంతుపట్టని విషయం ఇదొక్కటే. ఈ విషయానే్న అధికార, ప్రతిపక్ష నాయకులు గుర్తించరు.
రెండు రాష్ట్రాలలో కొత్త కాంతులు ఏం వెలిగాయో, ఎంత వెలిగాయో ప్రజలు చెప్పాలి. ఆ కాంతులు ఎవరి గుమ్మాల ముందు తచ్చాడుతున్నాయో గుట్టు విప్పాలి. కాంతుల వెలిగిన చోటులను దాచలేం. అవి అబద్ధం చెప్పవు. అబద్ధపు అద్దాలను తయారు చేయవచ్చుగాక. కాంతుల ప్రసరణను వక్రీకరించడం సదా సాధ్యంకాదు.
ఆత్మగౌరవం పెంచమంటారు. ఎవరి ఆత్మగౌరవం? తెలంగాణలో తెరాసా పార్టీదా? ప్రభుత్వానిదా? ఐతే గీతే ప్రజలదీ. ప్రైవేటు పెట్టుబడి దారుల ఆత్మగౌరవం క్షీణించి జపాన్, సింగపూర్, మలేషియా వంటి ఎన్నో దేశాల పెట్టుబడిదారుల ఆత్మగౌరవం పెచ్చుపెరిగిపోతోంది. ప్రతిదీ విదేశీయమే.
అక్కడ కొత్త రాజధానికోసం ఇక్కడ మల్లన్న సాగర్ వంటి రిజర్వాయర్లకోసం ప్రజలను నిర్వాసితులను చేసే ప్రణాళికలు. ఒకే తీరు పాలన-ప్రయోజనాలు అక్కడా, ఇక్కడా రైతులకే అభివృద్ధి ఉరిలా మారింది. విముక్తి దొరకని శాపాల కౌగిట్లో విలవిలలు. నిబంధనల ప్రకారం నష్ట పరిహారం ఇస్తారట. అది ఇచ్చేదెప్పుడో? రైతు చచ్చినాక కూడా దొరకదని గత అనుభావాలు చెబుతూనే ఉన్నాయి.
సరే నష్టపరిహారానికి ఏ మూలా చాలని ఒక రేటు ఉంటుంది. నివాసం-ఉన్నచోట గల జీవికని ఏ లెక్క ప్రకారం అందిస్తారు? భూమికో, ఇల్లుకో ఇస్తావు పరిహారం. మరి రాబోయే దశాబ్దాల జీవికకు హామీ ఎలా ఇవ్వగలవు? జీవనాధారమైన కొండ, అడవి, ఆరుగాలం, వ్యవసాయంపని, పశువులమేత, పెంపకం, వివిధ వృత్తుల వల్ల జీవిస్తారు ప్రజలు. ఆ వాతావరణలోంచి లేపేస్తే ఎక్కడికి పోవాలి? కొంతమందికి ఇల్లిస్తానంటారు. మరి ఆ ఇంట్లో ఏం తినాలి? ఊళ్లో తనదైన సంస్కృతిలో, గౌరవంగా బతికే మనిషి ఇప్పుడు ఏ హోటళ్లలో గ్లాసులు కడగాలో చెప్పగలరా? వారికి ఏ లెక్కన జీవితాంతం జీతం ఇప్పించగలరో జీవో తీయగలరా?
కొత్త రాజధానికోసం, కొత్త రాష్ట్రంలో అభివృద్ధి కోసం, పేరు ఏదైతేనేం, స్థలం ఏదైతేనేం. రాష్ట్రం ఏదైతేనేం. స్వభావం ఒక్కటే. స్వరం లేని రైతాంగాన్ని వెక్కివెక్కి ఏడ్పించడమే. గుక్క తిప్పుకోకుండా కన్నీళ్లు కార్పించడమే.
ఫాం హౌజుల్ని నిర్మించడంకోసం గట్లన్నింటిని నిర్మూలించాలని పెద్దన్న హుకుం. పాలకులు వాస్తవాల్ని కాదని అబద్ధాలు చెలామణి చేయాల్సిందే. అదే పెదాల, నినాదాల అభివృద్ధి ఇలాకికి అభివృద్ధికోసం ఎమ్మెల్యేలు అమ్ముడు పోతున్నారు.
ఆ ప్రాంతంలో ఇదేమని ప్రశ్నించిన వాళ్లని, ఇక్కడ ఇదెలా? అని అడిగే వాళ్లని ప్రతిపక్షం అని అంటారు. సామ్రాజ్యవాదంలోని ధనిక వాదం ఈ దేశంలోని పాలకవర్గాలకి ధరపెట్టి కొంటున్నట్లే ప్రతిపక్షాల నాయకులకి కూడా ఈ పాలకులు ధర నిర్ణయించారు. ఇప్పుడు మామూలు మనుషులు, రైతులు కలిసి ఈ కింది నుండి ఆ పైవరకు తీగలాగాలి. ప్రతిపక్షాలను లేకుండా చేస్తున్నట్లే పాలక వర్గాలని లేకుండా చేయవలసిన బాధ్యత ప్రజలపై ఉన్నది. ఇది కేవలం ఎన్నికల పోటీవల్ల సాధ్యం కాదని వాళ్లకు ఏనాడో తెలిసిపోయింది. ఎన్నికల గుర్తులు తమకి పంగనామాలే అని తేలిపోయింది.
దేశదేశాల ప్రజలు ఇలాంటి అనుభవాలను అర్థం చేసుకుంటున్నారు. తాము ఏం కోల్పోతున్నామని బేరీజు వేసుకుని కాలంకోసం వేచి చూస్తున్నారు.
దీక్షలు, ఉత్సవాల సౌరభం తాత్కాలికం. మళ్లీ అధికార శక్తులు విచ్చలవిడిగా తెగతినడానికే ప్రయత్నిస్తాయి. ఒక్కోసారి కనబడక పోవచ్చు. చాలాసార్లు పట్టుబడి పోవచ్చు.
మరో ఐదేళ్లు జరిగిపోయినా బాధలేదు. ఒక కొత్త ప్రణాళిక రూపొందాలి. సమూల ప్రక్షాళన జరగాలి.
దేశవ్యాపితంగా ప్రజలకి అంకితమైన చిన్నా చితకా పార్టీలన్నీ ఓచోట కలిసి కూచోవాలి. ఓట్ల కోసం కాదు. ఒక్క నినాదం రూపొందించడం కోసం!