రాష్ట్ర వార్తలు

చిగురించిన రైతుల ఆశలు

  • 23/02/2012

రాజమండ్రి, ఫిబ్రవరి 22: పొగాకు బోర్డు అనుమతించిన పొగాకు పంట పరిమాణం కన్నా అదనంగా దిగుబడి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరికి ముందు వరకు ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి బాగా తగ్గుతుందని భావించినప్పటికీ, తరువాత వాతావరణంలోని మార్పుల కారణంగా దిగుబడి బాగా పెరిగింది. పొగాకు పంటలోని పరిస్థితులు అనుకూలంగా మారటంతో ఎన్‌ఎల్‌ఎస్‌లో ఎకరాకు క్వింటాలు నుండి ఒకటిన్నర క్వింటాలు వరకు దిగుబడి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం దిగుబడి 120మిలియన్ కేజిల నుండి 130మిలియన్ కేజిల వరకు మాత్రమే ఉంటుందని డిసెంబర్ వరకు ఉన్న పరిస్థితులను బట్టి అంచనావేస్తే, తాజా పరిస్థితుల్లో 172మిలియన్ కేజిల వరకు దిగుబడి ఉండవచ్చని అంచనావేస్తున్నారు. తూ.గో. జిల్లా కీసర, తొర్రేడు వేలం కేంద్రాల పరిధిలో మినహా దాదాపు అన్ని రకాల నేలల్లో దిగుబడులు పెరుగుతాయని పొగాకు రంగ నిపుణులు అంచనావేస్తున్నారు. ఈసారి మార్కెట్ కూడా అనుకూలంగానే ఉండేలా కనిపిస్తోంది. బ్రెజిల్‌లో పొగాకు పంట దెబ్బతినటంతో దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌పై ఉండవచ్చని రైతులు ఆశతో ఉన్నారు. గత రెండేళ్ల వరుస నష్టాల కారణంగా ఇప్పటికే పొగాకు బ్యారెన్ లీజు రూ.60వేల నుండి సుమారు రూ.30వేల నుండి రూ.40వేలకు తగ్గింది. భూముల లీజు ఎకరాకు రూ.16వేల నుండి రూ.12వేలకు తగ్గింది. ఈ నేపథ్యంలో పెరిగిన దిగుబడికి అనుగుణంగా ధర కూడా పెరిగితే, మళ్లీ పొగాకు రైతు ఆర్ధిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. ఈ సారి మంచి ధర లభిస్తే మిగులు ఉండకపోయినాగానీ, గత రెండేళ్ల నష్టాలను తగ్గించుకుని, పొగాకు సాగును కొనసాగించే అవకాశాలు ఉంటాయి. వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఈసారి పొగాకు నాణ్యత కూడా మెరుగుపడుతోంది.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading