తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

అంతరించడం వికృతి, చిగురించడం ప్రకృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకో ముచ్చట్లు చెప్పాలనిపించడం లేదు.
గత కొద్ది నెలలుగా మనసు గాయపడినట్లున్నది. అది గాయమా. కాదు.కాని సున్నితమైన ఆయువుపట్లలో నొప్పి. అక్షరాల మీద నీడలు ఎవరివో పాకుతున్నట్లున్నవి. రాయబడకముందే ఎవరో వీటిని చదువవుతూ తప్పు పడుతున్నట్లున్నది. గీతలు లేని తెల్లకాగితం మీద రూళ్లకర్రతో ఎర్రగీతలు గీసిన జాడలు.
చూసిన వాటి గురించి కాదు. చూడలేని వాటి గురించి ముచ్చటించాలని ఉంది. చూచిన వాటిలోని వాస్తవాల్ని నొక్కిచెప్పాలని అనిపిస్తున్నది. నిజం చెప్పాలంటే కళ్లముందు జరిగే సంఘటనలను కలాల రిఫిళ్ల కాళ్లకింద తొక్కి పెట్టాలని అనిపిస్తున్నది.
ఈ గొంతు స్వేచ్ఛ కావాలని మూలుగుతున్నది. ఈ స్వరం సమాజహితం కోరాలని ఆశిస్తున్నది. ఈ గళం అనాది జానపద సంప్రదాయ శ్రమ బాణీలోంచి నేటి గద్గత గీతం పాడాలని ప్రయత్నిస్తున్నది. పక్కన వంతలు వేరు. జోడుపాటల పల్లవి ఒంటరి అయిపోయింది. మోడు పాటల ఒంటరితనం వృక్షం ఎండిన కొమ్మలకి వేలాడుతున్నది. భవిష్యత్తులో సమతుల్యత అనే పదం నిఘంటువులలోంచి తుడిచిపెట్టుకుపోతుందా అని అనిపిస్తున్నది.
నిన్న ఉగాది గీతాలు ప్రవాసంలో తలదాచుకుని, సిగ్గిల్లినట్లనిపించింది. విద్వత్ విరాడ్రూపాలు కావలసిన కవితలు ఎందుకనో గుండెవిప్పి పాడలేకపోయిన వాతావరణం.
రేడియోలో, రాజ్యం చానళ్లలో స్వరాలు ప్రజలకు సందేశాలు అందించలేకపోయాయి. చిన్న రాజ్యంపై బహు జనసంఖ్య ప్రజాతంత్రం పైచేయి సాధించగలదన్న ఆశ వమ్మైపోయింది. రాజ్యం ప్రాదేశికంగా చిన్నదైన కొద్దీ తన రాబందు హస్తాల్ని అపరిమితంగా పదునార బెట్టుకుంటున్నది. విచక్షణ కోల్పోయిన ప్రజా రాజకీయాలు రెండేళ్లకు పైగా కాలయాపన చేస్తోంది. నిర్వీర్య మేధస్సులతో మూల స్వభావ రహిత కార్యక్రమ పట్టిక. ఎందుకిలా జరుగుతోంది? నెపం ప్రజలమీద తోసేస్తున్నారు.
ప్రజలు స్వార్థపరులయ్యారట. పాలక శక్తుల నినాదాన్ని ఎడమ కుడి ప్రగతిశీల పార్టీల బాకాల నుండి ఒకటే ప్రచారం. వారు స్వార్థపరులే అయితే రాష్ట్ర యాగంలో వేయిమంది బలి పశువులయ్యేవారా? రైతులు నిత్యం శ్రమ క్షేత్రాలలో కరెంటు తీగలకి, మందుల డబ్బాలకి, ఉరితాళ్లకి వేలాడేవారా? వేసవి రాకముందే పిట్టల్లా రాలిపోతుంటే, గుక్కెడు నీళ్లివ్వాలని పాలక వర్గాల మాటల్ని నమ్ముతున్న మేధావుల్ని ఏమనాలి? ఇవ్వాళ ప్రజల్ని నడిపించే చోదక ఇంధనం ఏమిటో గుర్తించలేకపోతోంది. అక్షరం, కళ కల్తీకాటుకు గురైంది. రేషన్‌కార్డుపై దొరకనిది. వేల ఏళ్ల నుండి సమాజం సమ్మతించిన ఒక మాంసం ముక్క తిన్నందుకు ప్రాణాలు పణంగా పెట్టవలసిన స్థితి గురించి కూడా చెప్పాలని ఉంది. మనుషులకే కాదు, జీవ జంతువులకి కూడా ఆహారం కరువైపోతుంటే, చూసీ చూడని యంత్రాంగం కళ్లకు గంతలు కట్టుకున్నట్లు నటన.
అందరం నటిద్దాం. ఈ దేశం అనే కళారంగ వేదికపై ఎవరికి వారం నటిద్దాం. అంతం లేని నాటకంలో, అంతులేకుండా నటిస్తూ పోదాం. అంతిమ అంకం ఏదీ రూపొందించలేని నిస్సహాయతలోంచి పులిస్టాపు లేని డైలాగులు వల్లిస్తూ పోదాం. చెరగని మేకప్ కింద మాత్రం మన చర్మం చివరి దశ చేరినా నటిస్తూ పోదాం.
ఉత్తమ నటనాగ్రేసర పురస్కారాల కోసం నటిద్దాం. ఉత్తమ నాటక రచయిత నగదు బహుమతి కోసం వేదికపై రచన సాగిస్తూ పోదాం. ఉత్తమ విప్లవ మేధావి ‘గుర్తింపు’ కోసం ద్వంద్వ నీతిని పోషిస్తూ బతుకుదాం. ప్రపంచ ఉత్తమ మత విజేత పదవికోసం అనేక రంగాల్ని , నిర్మాణాలను, వ్యవస్థలను హననం చేస్తూ పోదాం. ప్రపంచ విపణి పోటీలో దేశం ఏమైతేనేం. దాన్ని రెండుగ చీల్చి ఒకదానిని నిర్వీర్యం, నిర్జీవం చేసి దానిని పాలిస్తూ, రెండోదానిపై సింహాసనం ఏర్పరచుకుందాం. సగం చచ్చిన దేశంపై ఎవరి కిరీటం పనిచేయదు కాని నిర్జీవ కళేబరాల కబేళాని తన రాజ్యంగా ప్రకటించుకోవాలనుకునే కొంగొత్త పాలకజాడ్యం భవితవ్యం చూడనేర్వని చాణక్యం.
సరిహద్దుల్లో దేశం ఏమంత క్షేమంగా లేదు. రాజ్యాంగం పద్దుల్లో సంక్షేమం, ఏమంత ముద్దుగా లేదు. ప్రతిమనిషి వేరొడికి ఒక నిచ్చెనలా కానవస్తున్నాడు. నిచ్చెనమెట్లు పడిపోతున్నాయి. కొన్ని ఫెళఫెళ విరిగిపోతున్నాయి. మరికొన్ని పుచ్చిపోయి రాలిపోతున్నాయి. నిచ్చెనలు లేకుండా పోతున్నాయి. కంటికి మాత్రం కానరాకుండా ఉన్నాయి. కాని, అవి మనిషి వెన్నముకలోకి పోయి చేరాయి. మనుషుల నుంచి దూరమై సమాజం వీపులపై తేలాయి. రాష్ట్రాలే ఒక్కో నిచ్చెనలా మారుతూ మెరుస్తూ పెరిగిపోతున్నాయి. ఈ నిచ్చెనలన్నీ ఒక పెద్ద నిచ్చెనలా దేశం కన్నా పెద్దగా మారిపోయింది. దేశానికి నాలుగు వైపుల సరిహద్దులు. ఓ వైపు నుండి ప్రపంచీకరణ. మరోవైపు నుండి బహుళ పెట్టుబడిదారీ మార్కెట్ శక్తులు. ఇంకోవైపు బయట నుండి, లోలోపల నుండి ఉగ్రవాద ముసుగుల పరుగులు. ముఖ్యమైన నాలుగోవైపు నుండి అన్ని శక్తులను నిలువరించే రాజ్యం అసలు విషయాన్ని మరిచి బాధ్యతని విస్మరించి, ఎందుకో స్పష్టంగా ప్రజలకు తెలియదు గాని, నిచ్చెననీ, నిచ్చెన నిలిచిన దేశ భూభాగం అదిరిపోయేట్లు పైకి ఎక్కాలని తాపత్రయపడుతోంది. ఇది అక్షర కల్పిత ఊహాగానం అయితే బాగుండు. ఊకదంపుడు ఊహ అయినా బాగుండు. ఏ ఆధారం లేని ఆవాస్తవం అయినా బాగుండు.
తప్పు రాసినందుకు-
కళ్లకు ఎలాంటి గంతలు కట్టుకోకుండా మోటారు సైకిళ్లపై వచ్చిన దుండగులు కాల్చి చంపినా బాగుండు. రాజ్యాంగ సాక్షిగా అసత్య నేరారోపణ చేస్తున్నందుకు ఆ త్రాసు పట్టిన న్యాయ దేవత తానే అమాంతంగా కళ్లు తెరచి బూడిదయ్యేలా శపించినా బాగుండును.
సరిహద్దుల్లో రేపు కాల్పులు వద్దని-దేశంలో లోపల అకలి చావులు ఉండవద్దని-మానవ జ్ఞానం పాడిన సమాతాగాన గేయ పల్లవులు నిరంతరం ప్రవహించాలని- ఆకలిని తీర్చలేని వాళ్లు కడుపు మీద ఆంక్షలు విధించరాదని-
బహుళత్వం వైరుధ్యం కాదు.ఉరితాడు ముందు మనిషి చిట్ట చివరి కోర్కెను తీర్చడానికి ఏం కోరుకుంటానని అడిగిన క్షణాన, చిరునవ్వుతో ఇలా చెప్పాలని ఉంది.
దేశమంటే అరూప భావన కాదు. అనేక అంచనాలు. భాషలు. భావనలు. యదార్ధాలు. నాగరికతలు. వీటి అన్నింటిని గౌరవించడమే ఈ దేశ పౌరుడి కర్తవ్యం. అది పౌర భావన గల దేహాలకు దేశ ఔన్నత్యం పలు రూపాలలో ఉంటుందని తెలియకపోవచ్చు.
దేశం అంటే-
అది ప్రవహించే నది కావచ్చు. పారటం ఆగిన అజ్ఞాతనది కావచ్చు. నేల కావచ్చు. మనిషి కావచ్చు. మానవీయ భావన కావచ్చు. రాజ్యాంగం కావచ్చు. నాలుగు దిక్కులలోంచి ఇక్కడి మనిషిని కాపాడే పాంచ భౌతిక ప్రాకృతిక శక్తి కావచ్చు.
నిజానికి అంతరించిపోవడమే వికృతి.
వికృత శక్తులకు అడ్డుకట్ట వేయడమే ‘్ధర్మం’.